ప్రజావేదిక కూల్చివేత: జగన్ ఆదేశాల ప్రకారం భవనాన్ని నేలమట్టం చేసిన అధికారులు

- రచయిత, శంకర్
- హోదా, బీబీసీ కోసం
"అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రజావేదిక భవనం నుంచే మొదలుపెడుతున్నాం. ప్రజావేదికలో ఇదే కలెక్టర్ల చివరి సమావేశం. బుధవారం ఈ భవనాన్ని కూల్చివేస్తాం" అని సోమవారం ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.
జగన్ ఆదేశాల ప్రకారం అధికారులు ఆ భవనాన్ని కూల్చేశారు. నిజానికి బుధవారం భవనాన్ని కూలుస్తామని జగన్ చెప్పినప్పటికీ, మంగళవారం సాయంత్రం నుంచే అధికారులు ఆ కూల్చివేత పనులు చేపట్టారు.
సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ విజయకృష్ణన్ నేతృత్వంలో అధికారుల బృందం మంగళవారం సాయంత్రం ప్రజావేదిక వద్దకు చేరుకుని కూల్చివేతకు అవసరమైన సూచనలు జారీ చేసింది.
ఈ భవన నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జగన్ చెప్పారు.
అందులో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు, ఎలక్ట్రానిక్ సామగ్రి, పూల కుండీలు సహా అన్నింటి వివరాలు నమోదు చేసుకుని ఆ తర్వాత కూల్చివేత పనులు మొదలు పెట్టారు. మీడియా ప్రతినిధుల్ని లోపలికి అనుమతించకుండా కూల్చివేత ప్రక్రియ కొనసాగించారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాంప్ ఆఫీస్‌గా వినియోగించిన లింగమనేని ఎస్టేట్స్‌ను ఆనుకొని ఈ భవనం నిర్మితమైంది. ఉండవల్లి గ్రామ పరిధిలోని కరకట్ట మీద రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరిగింది.
గత రెండేళ్లు అటు ప్రభుత్వ, ఇటు టీడీపీ పార్టీ కార్యకలాపాలకు ప్రజావేదిక కేంద్రంగా ఉంటూ వచ్చింది.
విజయవాడ చేరుకున్న చంద్రబాబు
విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి 12 గంటల సమయానికి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ప్రజావేదిక చంద్రబాబు ఇంటి పక్కనే ఉండటం, ఒకపక్క కూల్చివేత పనులు జరుగుతుండగా ఆయన వస్తుండటంతో పోలీసులు ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
ప్రజావేదికపై ఆది నుంచి వివాదమే
ఏపీ రాజధానిని ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించిన తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమావేశ మందిరం లేకపోవడంతో ప్రైవేట హోటళ్లలో సమావేశాలు నిర్వహించేవారు. ప్రభుత్వానికి ఒక సమావేశ మందిరం ఉండాలంటూ 2017లో ప్రజావేదిక పేరుతో గ్రీవెన్స్ హాల్ నిర్మించారు.
చంద్రబాబు సీఎంగా ఉండగా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు, ఇతర సమావేశాలు ప్రజావేదికలోనే నిర్వహించారు. టీడీపీ కార్యకలాపాలకు కూడా ప్రజావేదిక కేంద్ర స్థానంగా ఉండేది. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల తర్వాత కూడా టీడీపీ కార్యకలాపాలన్నీ ప్రజావేదిక నుంచే జరిగాయి. టీడీపీ కార్యక్రమాలకు అధికారిక భవనం వినియోగించడంపై వైసీపీ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు సమావేశాలను ప్రజావేదికలో నిర్వహించడాన్ని తప్పుబట్టింది.

ఫొటో సోర్స్, Twitter/N Chandrababu Naidu
ఏపీలో అధికార మార్పిడి తర్వాత పరిస్థితులు మారాయి. మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముందే, చంద్రబాబునాయుడు జూన్ 4న జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తూ- తన అధికార నివాసంగా ప్రజావేదికను కేటాయించాలని కోరారు. చంద్రబాబు లేఖపై ప్రభుత్వం ఏ నిర్ణయాన్నీ ప్రకటించలేదు. అదే సమయంలో టీడీపీ వ్యవహారాలు ప్రజావేదిక నుంచే కొనసాగుతున్నాయి.
ఈలోగా సీఎం హోదాలో జగన్ తొలిసారిగా నిర్వహించ తలపెట్టిన కలెక్టర్ సమీక్ష సమావేశానికి తొలుత సచివాలయం వేదికగా అనుకున్నారు. కలెక్టర్ల సమావేశాన్ని మూడు రోజులు ముందుకు జరిపి, వేదికను ఉండవల్లి ప్రజావేదికకు మార్చారు.
ఈ నిర్ణయంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. తమ లేఖకు సమాధానం ఇవ్వకుండా, కనీసం నోటీసులు కూడా లేకుండా ప్రజావేదికను స్వాధీనం చేసుకోవడమేమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆదేశాలతో సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) అధికారులు, సీఆర్‌డీఏ అధికారులు ప్రజావేదికను స్వాధీనం చేసుకొని జూన్ 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశానికి ఏర్పాట్లు చేశారు.

ఇదే పని సామాన్యుడు చేస్తే ఏం చేస్తాం: జగన్
సోమవారం కలెక్టర్ల సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, "మన వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో చూస్తే బాధేస్తుంది. అంతెందుకు మనమంతా ఇక్కడే సమావేశమయ్యాం. ఇంతమంది కలెక్టర్లు, కార్యదర్శులు, విభాగాధిపతులు, మంత్రులతో పాటు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రినైన నేను ఇక్కడే కూర్చున్నాను. ఇక్కడ మనం కూర్చున్న ఈ భవనం నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా, అవినీతితో కట్టిన భవనం. అక్రమ భవనంలో మనమంతా ఉన్నాం. అక్రమమని తెలిసి సమావేశం పెట్టుకున్నాం.
ఆశ్చర్యమేమంటే వరదస్థాయి 22.6 మీటర్లు ఉంటే, ఈ భవనం 19.5 మీటర్ల స్థాయిలో నిర్మించినట్టు కృష్ణా డెల్టా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇచ్చిన నివేదికలున్నాయి. నదీ పరిరక్షణ చట్టం, లోకాయుక్త సిఫార్సులు, పర్యావరణ చట్టాలు, మాస్టర్ ప్లాన్, బిల్డింగ్ బైలాస్, హరిత ట్రైబ్యునల్ చట్టాలు అన్నీ ప్రభుత్వమే దగ్గరుండి బేఖాతరు చేసింది. నిర్మాణం కోసం వ్యయం కూడా రూ.5 కోట్ల నుంచి రూ.8.9 కోట్లకు పెంచేశారు. అందుకే మన ప్రభుత్వం ఎలా పనిచేయబోతోందో చెప్పడానికే అందరినీ ఇక్కడికి పిలిపించాం. ఎలాంటి పరిస్థితులను మనం చూడాలి, ఎలా మార్చాలి అన్నది తెలుసుకోవడానికే ఇక్కడ సమావేశం పెట్టాం. ఇలాంటిది ఎవరైనా చిన్నోడు కట్టి ఉంటే ఏం చేసి ఉండేవాళ్లం? గొంతులేని వాళ్లయితే అందరికన్నా ముందు వెళ్లి భవనం తొలగిస్తాం. కానీ ప్రభుత్వంలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉంటూ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక మనం ఎవరినైనా అడగగలమా?
రాష్ట్రాన్ని నడపాలనుకునేవాళ్లు ఆదర్శంగా ఉండాలి. ఉదాహరణగా పనిచేయాలి. నువ్వే చేయకుండా మిగిలిన వాళ్లను ఎలా అడుగుతావ్? వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో గమనించడం కోసమే ఇక్కడ సమావేశానికి పిలిచాను. నేను ఇక్కడి నుంచే ఆదేశాలిస్తున్నాను. ఇక్కడ ఇదే చివరి సమావేశం. రేపు ఎస్‌పీలతో సమావేశం అయిపోతుంది. ఎల్లుండి నుంచి అక్రమ భవనాల కూల్చివేత ఇక్కడి నుంచే మొదలుపెడతాం" అని ప్రకటించారు.

ఫొటో సోర్స్, I&PR Dept, Andhra Pradesh
సీఎం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు: సీఆర్‌డీఏ కమిషనర్
ప్రభుత్వాదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని సీఆర్‌డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం బీబీసీతో చెప్పారు. ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నారు.
ప్రజావేదిక నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని, ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని లక్ష్మీనరసింహం తెలిపారు.
అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో నిబంధనలు పాటిస్తామని, చట్టాలకు అనుగుణంగా చర్యలుంటాయని, ఎవరు నిబంధనలు అతిక్రమించినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే అధికారులు భవనాన్ని కూల్చేశారు.

టీడీపీకి కేటాయించాల్సి వస్తుందనే కక్షతోనే కూల్చివేత: జవహర్
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజల వినతులు తీసుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు తనకు ప్రజావేదిక భవనం కేటాయించాలని కోరడంతోనే ముఖ్యమంత్రి జగన్ ప్రజావేదికను కూల్చివేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. కేవలం టీడీపీకి కేటాయించాల్సి వస్తుందనే కక్షతో ప్రజావేదిక కూల్చివేతకు ప్రభుత్వం పూనుకొందని, ఈ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
ప్రజల అవసరం కోసం నిర్మించిన ప్రజావేదికను కూల్చటం తెలుగు ప్రజలను అవమానపరచడమేనని ఆయన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం మంచిదని సీఎం జగన్ భావిస్తే అమరావతి, పోలవరం లాంటి ప్రాజెక్టులకు పూర్తిస్థాయి అనుమతులు లేకపోవటంతో వాటిని కూల్చివేస్తారా అని జవహర్ ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చివేతలో మర్మం ఏమిటో ప్రకటించాలన్నారు.
నిజంగా అక్రమ కట్టడాలు నిర్మించిన జగన్ అనుచరులను ఏంచేస్తారో తెలపాలని ఆయన చెప్పారు.
మరోపక్క పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అక్రమాలకు ప్రజావేదిక ఒక పెద్ద ఉదాహరణని చెప్పారు.
"చట్టాలకు అనుగుణంగా మా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. అక్రమ కట్టడాలను తొలగించి తీరుతాం. హరిత ట్రైబ్యునల్ సిఫార్సులను, నదీపరీవాహక చట్టాలను ఉల్లంఘించిన తీరు క్షమార్హం కాదు. భవనం నిర్మాణం పేరుతో భారీగా అక్రమాలు కూడా జరిగాయి. అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటాం. టీడీపీ నేతల వాదన సిగ్గుచేటు. ఇప్పటికైనా కళ్లు తెరిచి తప్పులు అంగీకరించాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఆలయంలో ఉత్సవాలకు ఏనుగులు.. అడ్డు చెబుతున్న జంతు సంరక్షకులు
- ఇంతమంది చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు...
- అంతులేని ప్రశ్న: రోజుకు ఎన్ని జంతువులు పుడుతున్నాయి?
- ట్రావెల్ ఫొటో పోటీలు 2019: చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు... విజేతలు వీరే
- బ్రిటిష్ కొలంబియా ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నెమళ్లు
- ఈ తిమింగలం రష్యా గూఢచారా
- ‘బంగాళాదుంపలు’ పండించారని రైతులపై వేసిన కేసును వెనక్కి తీసుకుంటున్న పెప్సీకో
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- ఎందుకీ హత్యలు.. ఎవరు ఎవరిని చంపుతున్నారు
- 'ఇరాన్ ఆయుధ వ్యవస్థలపై అమెరికా సైబర్ దాడి'
- మెటికలు విరుచుకుంటే కీళ్లనొప్పులు వస్తాయా..
- మనిషి పాదాల పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది.. ఎందుకో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








