గుజరాత్‌లో ఆర్టీఐ హత్యలు: సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చాక 13 మంది ఉద్యమకారులను చంపేశారు

కాజ్లా సోందర్వా

సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా చేసుకొని అవినీతి మీద పోరాడుతున్న ఉద్యమకారులపై కొందరు దాడులకు పాల్పడటంతోపాటు ప్రాణాలు కూడా తీస్తున్నారు. దేశంలో ఈ ఘటనలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. రాజ్‌కోట్‌లో గత ఏడాది ఒక ఆర్టీఐ కార్యకర్తను కొందరు హత్య చేయగా, ఇటీవల ఆయన కొడుకు కూడా హత్యకు గురయ్యారు. ఆ కుటుంబాన్ని కలిసిన బీబీసీ ప్రతినిధి తేజస్ వైద్య అందిస్తున్న కథనం ఇది.

రాజ్‌కోట్ జిల్లా మనేక్వాడాలో కాజ్లా సోందర్వా నివసిస్తున్నారు. ఆమె కొడుకు రాజేశ్‌ను ఇటీవలే కొందరు హత్య చేశారు. 2018లో ఆమె భర్త నాన్జీ భాయిని హత్య చేశారు.

సమాచార హక్కు కార్యకర్త అయిన నాన్జీభాయి, పంచాయతీ నిధుల్లో జరిగిన అవకతవకలను ప్రశ్నించారు. 2018 మార్చి 9న ఆయన హత్యకు గురయ్యారు.

"నన్ను, నాభర్తను డీడీవో అధికారి పిలిపించారు. మేం వెళ్లేసరికి అక్కడ పంచాయితీ జరుగుతోంది. నా భర్తను చంపుతానంటూ ఊరి పెద్ద బెదిరించారు. నేను సాయం కోసం పోలీసుల వద్దకు వెళ్లాను" అని కాజ్లా సోందర్వా బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, సమాచార హక్కు: గుజరాత్‌లో 13 మందిని చంపేశారు

కేసును వెనక్కి తీసుకోవాలంటూ నిందితులు తమను బెదిరించినట్లు సోందర్వా కుటుంబం చెబుతోంది.

కేసు ఉపసంహరణకు వారు ఒప్పుకోలేదు. దీంతో నాన్జీ భాయి కొడుకు రాజేశ్‌ను కూడా చంపేశారు.

ఇప్పుడు ఆ కుటుంబానికి పోలీసు బందోబస్తు ఉంది. కానీ తన రెండో కొడుకును కూడా చంపుతారేమోనని కాజ్లా భయపడుతున్నారు.

"నాకు చాలా ఆందోళనగా ఉంది. నా మీద కూడా దాడి చేసి చంపేస్తారేమోనని భయంగా ఉంది" అని రాజేశ్ సోదరుడు అజయ్ సోందర్వా తెలిపాడు.

2016లో నాన్జీ భాయి ఇంటి మీద దాడి జరిగినప్పుడు, కుటుంబ సభ్యులు భద్రత కోసం ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు.

సీసీటీవీ కెమెరా

"ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చి ఈ ఇంటి తలుపును బద్దలుకొట్టారు. లోపలకు చొరబడి నన్ను, మా ఆడపడుచులను బయటకు లాగారు" అని కాజ్లా తెలిపారు.

సమాచార హక్కు చట్టం 2005లో వచ్చింది. నాటి నుంచి నేటి వరకు గుజరాత్‌లో 13 మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారు. 45 మందిపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో, శాంతిభద్రతల విషయంలో 'గుజరాత్ మోడల్ ఇదేనా' అంటూ సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

పోలీసు భద్రత

అహ్మదాబాద్‌కు చెందిన మహితి అధికార్ గుజరాత్ పహెల్(ఎంఏజీపీ) సంస్థ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పంక్తి జోగ్ మాట్లాడుతూ- "గ్రామాల్లో అభివృద్ధి పథకాల కోసం ఖర్చు చేసే నిధుల్లో అవినీతి చోటు చేసుకుంటోంది. ప్రజలు ప్రశ్నిస్తుండటంతో అవకతవకలు బయటపడుతున్నాయి. దాంతో అవినీతిపరులందరూ ఏకమై కార్యక్తరలపై దాడులు చేస్తున్నారు. గుజరాత్‌లో ఇప్పటివరకు 13 మందిని చంపారు. ఆర్టీఐ కార్యకర్తలను వేధిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్ రెండో స్థానంలో ఉంది" అని తెలిపారు.

దాడులను ఆపడం తమ బాధ్యత కాదని, తమ పరిధి సమాచారం ఇవ్వడం వరకేనని గుజరాత్ సమాచార కమిషన్ చెబుతోంది.

గుజరాత్

"మా పరిధి సమాచారం ఇవ్వడం వరకే. దాడులు శాంతిభద్రతల కిందకు వస్తాయి. అడగక ముందే సాధ్యమైనంత వరకు సమాచారాన్ని మేమే వెల్లడిస్తే దాడులు తగ్గొచ్చని భావిస్తున్నాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం" అని గాంధీనగర్‌లో సమాచార కమిషన్ కార్యదర్శి నరేంద్ర గంధ్వీ చెప్పారు.

సమాచార హక్కు కార్యకర్తలకు భద్రతను కల్పించాల్సిందిగా గత ఏడాది గుజరాత్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. అయినా కూడా దాడులు ఆగడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)