వడోదర: సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఏడుగురు మృతి

ఫొటో సోర్స్, AFP
గుజరాత్‌లోని ఒక హోటల్ ప్రాంగణంలో ఉన్న సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు.
మృతుల్లో నలుగురు సఫాయి కార్మికులు, ముగ్గురు హోటల్ సిబ్బంది ఉన్నారు. ఏడుగురు సెప్టిక్ ట్యాంకులోకి దిగగానే అందులోని విషవాయువులను పీల్చడంతో ఊపిరాడక వారు మరణించారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన వడోదర జిల్లాలోని దభోయి పట్టణంలో ఉన్న దర్శన్ హోటల్‌లో శుక్రవారం జరిగింది. హోటల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
"ముందుగా ఒక కార్మికుడు సెప్టిక్ ట్యాంకులోకి దిగారు. కానీ, లోపలికి దిగాక అతని నుంచి ఉలుకూ పలుకూ లేదు. బయట ఉన్నవారు పిలిచినా స్పందించడంలేదు. దాంతో, అతన్ని బయటకు తీసుకొచ్చేందుకు మరో ముగ్గురు కార్మికులు కూడా దిగారు. వారు కూడా లోపలికి వెళ్లాక స్పందించలేదు. వారికి సాయం చేసేందుకు ముగ్గురు హోటల్ సిబ్బంది దిగగా వారు కూడా స్పృహ కోల్పోయి చనిపోయారు" అని పోలీసులు తెలిపారు.

ఏడుగురు లోపలికి దిగి స్పృహ కోల్పోయారని గుర్తించిన హోటల్ నిర్వాహకులు అత్యవసర సేవల విభాగానికి సమాచారం అందించారు. దాంతో, సహాయక సిబ్బంది ఏడు మృతదేహాలను బయటకు తీశారు.
"సెప్టిక్ ట్యాంకులో విషవాయువులకు తట్టుకోలేక ఏడుగురు చనిపోయారు" అని అగ్నిమాపక విభాగం అధికారి నికుంజ్ ఆజాద్ చెప్పారు.
గతేడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం, మొరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర హేచరీస్ (కోళ్ల ఫారం)లో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేసే క్రమంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు.
మ్యానువల్ స్కావెంజింగ్ (చేతితో మలాన్ని తొలగించడం)ను నిర్మూలించేందుకు 'సఫాయీ కర్మచారి ఆందోళన్' సంస్థ పోరాడుతోంది. మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తూ ఊపిరాడక గత పదేళ్లలో దాదాపు 1,800 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఈ సంస్థ చెబుతోంది.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ: వైద్యుడిపై ఆరోపణలు, దాడి... సంచలనం రేపిన సీసీటీవీ ఫుటేజ్
- ఏపీలో మద్య నిషేధం సాధ్యమేనా?.. అమెరికా నేర్పిన పాఠాలేంటి?
- "ప్రవాస భారతీయులను భారత్తో మమేకం చేసేది క్రికెటే"
- ఆంధ్రా సరిహద్దులో ‘ప్రపంచంలోనే అరుదైన’ ఆదివాసీ తెగ 'బోండాలు’
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నియామకం ఎందుకంత వైరల్ అయింది
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









