తెలంగాణ: వైద్యుడిపై ఆరోపణలు, దాడి... సంచలనం రేపిన సీసీటీవీ ఫుటేజ్

ఫొటో సోర్స్, Balaji hospital
ఓ డాక్టర్‌పై మహిళ ఆమె బంధువులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా మట్టెవాడలోని బాలాజీ ఆసుపత్రిలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఆర్థోపెడిక్ డాక్టర్ సుధీర్ కుమార్‌పై ఓ మహిళ ఆమె తరఫు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసేందుకు ప్రయత్నించడం ఆ వీడియోలో కనిపించింది.
ఇంతకీ ఏం జరిగింది
సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే డాక్టర్ సుధీర్ ఓ మహిళను పరీక్షిస్తుండగా ఆమె అతడి చేయిని తోసివేయడం, వాదనకు దిగడం కనిపించింది. ఆ సమయంలో డాక్టర్ టేబుల్ ముందు ఆసుపత్రి సిబ్బంది కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Balaji hospital
'పక్కా ప్రణాళికతోనే'
ఈ ఘటనపై డాక్టర్ సుధీర్ స్పందిస్తూ పక్కా ప్రణాళికతోనే తనపై దాడి జరిగిందని చెప్పారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''సీసీటీవీ ఫుటేజ్ లేకుంటే నేను అసభ్యంగా ప్రవర్తించలేదనే విషయాన్ని రుజువు చేయడం సాధ్యమయ్యేది కాదు. నడుము నొప్పి అంటూ ఓ మహిళ నా దగ్గరకు వచ్చారు. ఆమెను వెనక్కి తిరగమని చెప్పి పరిశీలించడానికి ప్రయత్నించగా నా చేయిని తోసివేశారు. గట్టిగా అరిచారు. దుర్భాషలాడారు. అక్కడే ఉన్న ఆమె తరఫు వ్యక్తులు వెంటనే నాపై మాటలతో దాడి చేశారు. నేను సీసీటీవీ ఫుటేజ్‌ను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాను'' అని డాక్టర్ సుధీర్ చెప్పారు.
2003 నుంచి ఆసుపత్రి నిర్వహిస్తున్నామని, తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన ఎదుర్కోలేదని డాక్టర్ తెలిపారు.
''నేను క్లినిక్‌లో ఉన్నప్పుడు పది మంది వచ్చారు. ఇందులో ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులు. అందరూ వేర్వేరుగా ఆసుపత్రికి వచ్చారు. కొందరు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని, మరికొందరు ఓపీ స్లిప్‌తో ఉన్నారు. వారిలో ఆరోగ్య శ్రీ కార్డుతో వచ్చిన వారు నా దగ్గర చూపించుకున్న తర్వాత ఈ డాక్టర్ మా ఒళ్లంతా తడుపుముతున్నారని అందరి ముందు ఆరోపించారు. మా స్టాఫ్ ఆ విషయం నాకు చెప్పేలోపు ఓపీ స్లిప్‌తో వచ్చిన మహిళ నన్ను దూషించడం మొదలుపెట్టింది. అసభ్యంగా తడిమానని ఆరోపించింది. ఆమెతో వచ్చిన వారు కూడా నన్ను బూతులు తిట్టారు. నా దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌తో పోలీసులకు ఫిర్యాదు చేశాను'' అని చెప్పారు.
డాక్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళ , ఆమె సంబంధీకుల నుంచి వివరాలు తెలుసుకోడానికి బీబీసీ ప్రయత్నించగా వారెవరూ అందుబాటులోకి రాలేదు.
ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. డాక్టర్ తనను అసభ్యంగా తాకాడని మట్టెవాడ పోలీసు స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేయగా. తాను అసభ్యంగా ప్రవర్తించలేదని, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ సుధీర్ ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, Balaji hospital
'విచారణ జరుపుతున్నాం'
బాలాజీ ఆసుపత్రి ఘటనపై విచారణ చేస్తున్నట్లు మట్టెవాడ సీఐ జీవన్ రెడ్డి చెప్పారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించాకే వాస్తవం ఏమిటనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు'' అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- స్పీకర్ల జిల్లా శ్రీకాకుళం: ఆంధ్ర రాష్ట్రం నుంచి నవ్యాంధ్ర వరకు ఎవరెవరంటే...
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- దళితుడి హోటల్లో టీ తాగిన శివాజీ వారసుడు సాహూ మహరాజ్
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









