దేశ ఎన్నికల్లో అదానీ ‘బొగ్గు’ కుంపటి.. భారత్‌లో కాదు, ఆస్ట్రేలియాలో ప్రధానాంశమైన మైనింగ్ ప్రాజెక్ట్

- రచయిత, నీనా భండారీ
- హోదా, సిడ్నీ నుంచి బీబీసీ కోసం
ఆస్ట్రేలియాలో భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంస్థ చేపట్టిన బొగ్గు గని ప్రాజెక్టు అక్కడి ఎన్నికల్లో ప్రధానాంశమైపోయింది. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, బొగ్గు, వాతావరణ మార్పులు లాంటి కీలకమైన విషయాల్లో ఈ ప్రాజెక్టు రాజకీయ పార్టీలు, ఓటర్లలో స్పష్టమైన విభజనను తీసుకొస్తోంది.
అదానీకి చెందిన ఈ 'కార్మైకేల్ కోల్ మైన్ అండ్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' ప్రాజెక్ట్ క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రం ఉత్తర ప్రాంతంలో ఉంది. ఈ ప్రాజెక్టులో ఓపెన్-కట్ థర్మల్ బొగ్గు గని ఉంది.
ఆస్ట్రేలియా జాతీయ ప్రభుత్వం లిబరల్-నేషనల్ సంకీర్ణానిది కాగా, క్వీన్స్‌ల్యాండ్‌లో లేబర్ పార్టీ అధికారంలో ఉంది.
ఆస్ట్రేలియా జాతీయ ఎన్నికల పోలింగ్ ఈ నెల 18న శనివారం జరుగనుంది.
ప్రస్తుత లిబరల్-నేషనల్ సంకీర్ణ ప్రభుత్వం బొగ్గుకు, బొగ్గు ఎగుమతులకు స్థూలంగా అనుకూలం. ఈ పాలక పక్షం ఎన్నికల్లో వెనకబడి ఉంది.
ప్రధాని స్కాట్ జాన్ మారిసన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆస్ట్రేలియాలో విదేశీ పెట్టుబడులకు అనుకూలమని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు. అదానీ కార్మైకేల్ మైన్, రైల్ ప్రాజెక్టు క్వీన్స్‌ల్యాండ్‌కు ముఖ్యమైన ప్రాజెక్టు అని, దీనివల్ల ప్రత్యక్షంగా 1500 మందికి పైగా స్థానికులకు, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
తాము ఎంపీలుగా గెలిస్తే వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అదానీ ప్రాజెక్టును అడ్డుకోవడం సహా అనేక చర్యలు చేపడతామంటూ ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు ఒక కీలకమైన ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఆస్ట్రేలియా కన్జర్వేషన్ ఫౌండేషన్(ఏసీఎఫ్) ఈ ఒప్పందం కుదిరేలా సమన్వయం చేసింది.

బొగ్గు పరిశ్రమలో 52900 మందికి ఉపాధి
2019 ఫిబ్రవరి వరకున్న గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియా బొగ్గు పరిశ్రమలో సుమారు 52,900 మంది ఉపాధి పొందుతున్నారు.
2018లో ఆస్ట్రేలియా 440 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ఇందులో మెటలర్జికల్ కోల్ వాటా దాదాపు 40 శాతం కాగా, ఇంచుమించు 60 శాతం థర్మల్ కోల్.
2017-18లో ఆస్ట్రేలియా స్థూల దేశీయోత్పత్తిలో 2.2 శాతం బొగ్గు పరిశ్రమ నుంచి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
బొగ్గుపై ప్రతిపక్ష లేబర్ పార్టీ మద్దతుదారుల్లో రెండు భిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయి.
క్వీన్స్‌ల్యాండ్‌లో లేబర్ పార్టీకి మద్దతుగా నిలిచే సంఘాలు మైనింగ్‌కు అనుకూలం కాగా, న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లో పార్టీ పట్టణ ఓటర్లు గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పునర్వినియోగ ఇంధన వనరుల వినియోగానికి కట్టుబడి ఉండాలని కోరుతున్నారు.
లేబర్ పార్టీ నాయకుడు బిల్ షార్టెన్ ఇటీవల ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(ఏబీసీ)తో మాట్లాడుతూ- అదానీ మైనింగ్ ప్రాజెక్టుపై శాస్త్రీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, ఏకపక్షంగా వ్యవహరించబోమని తెలిపారు.

ఫొటో సోర్స్, ABC NEWS/NICK HAGGARTY
చిన్న పార్టీలైన పాలైన్ హాన్సన్ నాయకత్వంలోని వన్ నేషన్, బిలియనీర్ క్లైవ్ పామర్ సారథ్యంలోని యునైటెడ్ ఆస్ట్రేలియా పార్టీ ఈ ప్రాజెక్టుకు మద్దతు ప్రకటించాయి.
క్లైవ్ పామర్‌కు ఇనుప ఖనిజం, నికెల్, బొగ్గు వ్యాపారాలు ఉన్నాయి.
వేసవిలో కార్చిచ్చు, కరవు, వరదలు
ఆస్ట్రేలియాలో వేసవిలో అంటే డిసెంబరు నుంచి ఫిబ్రవరి మధ్య అసాధారణ ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తడంతో పర్యావరణం ఒక ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. వేసవిలో తీవ్రస్థాయి కార్చిచ్చు, కరవు, వరదలు సంభవించాయి.
ఓటర్ల వైఖరిపై ఆస్ట్రేలియాలో చేపట్టిన అతిపెద్ద సర్వే 'ఏబీసీ ఓట్ కంపాస్'లో 29 శాతం మంది ఓటర్లు పర్యావరణమే తొలి ప్రాధాన్య అంశమని చెప్పారు. 2016లో కేవలం తొమ్మిది శాతం మందే ఈ మాట అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణం, ప్రకృతికి సంబంధించి నాలుగు అంశాల ప్రాతిపదికగా ఆస్ట్రేలియా కన్జర్వేషన్ ఫౌండేషన్(ఏసీఎఫ్) పార్టీలపై ఒక విశ్లేషణ జరిపి, స్కోరు కార్డు రూపొందించింది. ఆ నాలుగు అంశాలు- పునర్వినియోగ ఇంధన వనరుల వాడకాన్ని పెంచడం, బొగ్గు వినియోగాన్ని దశల వారీగా పూర్తిగా ఆపేయడం, అదానీ బొగ్గ గని ప్రాజెక్టును నిలిపివేయడం, పర్యావరణాన్ని కాపాడటం.
ఏసీఎఫ్ స్కోరు కార్డు ప్రకారం పాలక లిబరల్-నేషనల్ సంకీర్ణానికి 100కు కేవలం నాలుగే మార్కులు వచ్చాయి. లేబర్ పార్టీకి 100కి 56 లభించాయి. నాలుగో అతిపెద్ద పార్టీ 'గ్రీన్స్'కు అత్యధికంగా 100కు 99 మార్కులు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
అదానీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియన్ గ్రీన్స్ పార్టీ మాజీ నాయకుడు, పర్యావరణ కార్యకర్త బాబ్ బ్రౌన్ నాయకత్వంలో 'స్టాప్ అదానీ కాన్వాయ్' అనే ఆందోళన జరిగింది.
ఇది ద్వీప రాష్ట్రమైన టాస్మానియాలోని హోబార్ట్ నుంచి తూర్పు తీరం మీదుగా మధ్య క్వీన్స్‌ల్యాండ్ వరకు కొనసాగి దేశ రాజధాని కాన్‌బెర్రాలో ముగిసింది.
ఆందోళన చివర్లో ఈ నెల 5న పర్యావరణ పరిరక్షణ ర్యాలీ జరిగింది.

ఫొటో సోర్స్, AFP
అదానీ మైనింగ్ ప్రాజెక్టు పట్ల సానుకూలత, వ్యతిరేకత గురించి బ్రౌన్ బీబీసీకి వివరించారు. గని ఉన్న ప్రాంతంలో ప్రాజెక్టు పట్ల చాలా సానుకూలత ఉందని, భవిష్యత్తులో ఉద్యోగాలు పుట్టుకొస్తాయనే భావనతో స్థానికులు అనుకూలంగా ఉన్నారని తెలిపారు.
మరోవైపు- బొగ్గును మండించడం వల్ల గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలవుతాయని, 'గ్రేట్ బారియర్ రీఫ్'కు నష్టం వాటిల్లుతుందని, అందువల్ల అదానీ ప్రాజెక్టును నిలిపివేయాలనే బలమైన భావన ఉందని బ్రౌన్ చెప్పారు. గ్రేట్ బారియర్ రీఫ్‌తో 64 వేల మందికి ఉపాధి లభిస్తోందని, ఇది మరింతగా దెబ్బతినకూడదనే భావన ఉందని పేర్కొన్నారు.

జీవ వైవిధ్యానికి దెబ్బ
'గ్రేట్ బారియర్ రీఫ్'ను ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) వారసత్వ సంపదగా గుర్తించింది.
3.48 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రీఫ్ జీవవైవిధ్యానికి ప్రసిద్ధి. ఇక్కడ 400 రకాల పగడపు దిబ్బలు, 1500 రకాల మత్స్యజాతులు, దాదాపు 240 రకాల పక్షి జాతులు, ఇతర జీవజాతులు పెద్దసంఖ్యలో ఉన్నాయి.
సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరగడం, మైనింగ్ ప్రాజెక్టులు, నౌకాశ్రయ అభివృద్ధి, డ్రెడ్జింగ్, నౌకాయానం పెరగడం లాంటి కారణాలతో ఈ రీఫ్‌లోని జీవావరణానికి ముప్పు ఎదురవుతోంది.
అదానీ మైనింగ్ ప్రాజెక్టుతో కొత్త థర్మల్ బొగ్గు బేసిన్ ఏర్పడుతుందని, ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్ ప్రాంతాల్లో ఒకటిగా ఈ ప్రాంతం మారుతుందని, అప్పుడు మరిన్ని వందల కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడుతాయని ఏసీఎఫ్‌కు చెందిన క్రిస్టియన్ స్లాటరీ ఆందోళన వ్యక్తంచేశారు.
అదానీ ప్రాజెక్టుతో ఆస్ట్రేలియాలో నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, ఇతర చోట్ల కూడా జీవావరణానికి, వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని స్లాటరీ హెచ్చరించారు.

ప్రపంచంలోని అతిపెద్ద సహజసిద్ధ భూగర్భ జలాశయాల్లో ఒకటైన 'గ్రేట్ ఆర్టేసియన్ బేసిన్'కు దగ్గర్లోనే అదానీ మైనింగ్ ప్రాజెక్టు ఉంది. ఈ బేసిన్‌లో సుమారు 65 మిలియన్ గిగాలీటర్ల నీరు ఉంది. మెట్టభూములు, అర్ధశుష్క(సెమీ-అరిడ్) భూములు ఉండే క్వీన్స్‌ల్యాండ్, న్యూ సౌత్ వేల్స్, సౌత్ వేల్స్, నార్తర్న్ టెరిటరీ రాష్ట్రాల భూగర్భంలో 17 లక్షలకు పైగా చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
గత నెల్లో ఎన్నికల ప్రకటనకు ముందు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో భాగమైన భూగర్భ జలవనరుల నిర్వహణ ప్రణాళికలకు ఆమోదం తెలిపింది. అయితే ప్రాజెక్టుకు ఇది తుది ఆమోదం కాదని స్పష్టం చేసింది.
గనిపై నిర్మాణ పనులను మొదలుపెట్టడానికి అదానీ సంస్థకు అవసరమైన రెండు పర్యావరణ ప్రణాళికల్లో ఒకదానిని ఈ నెల 2న క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్ర పర్యావరణ, శాస్త్రవిజ్ఞాన శాఖ తిరస్కరించింది.
ఒకవేళ క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా ప్రణాళికలో మార్పులు చేసినా, దానికి ఎప్పట్లోగా ఆమోదం తెలుపుతారనేది చెప్పేందుకు పర్యావరణశాఖ అధికారులు నిరాకరించారని అదానీ మైనింగ్ సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈవో) లుకాస్ డౌ ఒక ప్రకటనలో చెప్పారు.
మైనింగ్ కార్యకలాపాల పురోగతిని బట్టి మరో ఎనిమిది అనుమతులు అదానీ సంస్థకు అవసరం కావొచ్చు. వీటిలో నాలుగింటిని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మూడింటిని జాతీయ ప్రభుత్వం నుంచి, ఒకటి రెండు ప్రభుత్వాల నుంచి పొందాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
చట్టపరమైన సవాళ్లతో ఆలస్యమైన ప్రాజెక్టు
లోగడ వేసుకున్న ప్రణాళికల ప్రకారమైతే నాలుగేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభం కావాల్సి ఉంది.
తొమ్మిదేళ్లుగా అదానీ సంస్థకు పర్యావరణ గ్రూపులు, స్థానిక జాతుల నుంచి అనేక చట్టపరమైన సవాళ్లు ఎదురవుతుండటంతో ఇది సాధ్యం కాలేదు.
ఆస్ట్రేలియాలో అత్యధిక బొగ్గు నిల్వలున్న ప్రాంతాల్లో ఒకటైన గెలీలీ బేసిన్‌లోని కార్మైకేల్ కోల్ మైన్‌ను, క్వీన్స్‌ల్యాండ్‌లోని బోవెన్ సమీపానగల అబోట్ పాయింట్ పోర్ట్‌ను 2010లో అదానీ సంస్థ కొనుగోలు చేసింది.
పునర్వినియోగ ఇంధన వనరులు సహా అన్నింటా కలిపి అదానీ సంస్థ ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 330 కోట్లకు పైగా ఆస్ట్రేలియా డాలర్లు పెట్టుబడులు పెట్టింది. 'అదానీ రిన్యూయబుల్స్ ఆస్ట్రేలియా' సంస్థ అదానీ గ్రూప్‌లో భాగం.

ఫొటో సోర్స్, Getty Images
అదానీ సంస్థ ఏమంటోంది?
భవిష్యత్తులో ఇంధన వనరుల విషయంలో పునర్వినియోగ ఇంధనాలు ముఖ్య భూమిక పోషిస్తాయని, కానీ ఇవొక్కటే ఇంధన అవసరాలను తీర్చలేవని అదానీ ఆస్ట్రేలియా సంస్థ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇంధన వనరులు ఆధారపడిదగినవిగా, ఆర్థికంగా భరించగలిగేవిగా ఉండాలని, ఈ విషయంలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.
కార్మైకేల్ ప్రాజెక్టు నిర్మాణం, కార్యకలాపాలు ఊపందుకొనే సమయంలో 8,250 ఉద్యోగాలు వస్తాయని అదానీ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
ప్రాజెక్టు స్థాయి తగ్గింపు
1650 కోట్ల ఆస్ట్రేలియా డాలర్ల పెట్టుబడితో ఈ మెగా మైన్ ప్రాజెక్టును చేపట్టాలని, ఏడాదికి 60 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని అదానీ సంస్థ లోగడ భావించింది. తర్వాత దీని స్థాయిని తగ్గించింది. ఏడాదికి 10 నుంచి 15 మిలియన్ టన్నులు అవసరమైతే గరిష్ఠంగా 27 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ప్రాజెక్టును చేపట్టింది. అంచనా వ్యయాన్ని 200 కోట్ల ఆస్ట్రేలియా డాలర్లకు తగ్గించింది.
గని ప్రాంతాన్ని అబోట్ పాయింట్ కోల్ టర్మినల్‌తో అనుసంధానించేందుకు 388 కిలోమీటర్ల రైలు మార్గం వేయాలని అదానీ సంస్థ తొలుత భావించింది. తర్వాత దీనిని 200 కిలోమీటర్లకు తగ్గించింది. ఈ నానోగేజ్ రైలు మార్గం ఇప్పటికే ఉన్న రైలు మార్గంతో కలుస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం, బ్యాంకుల నుంచి నిధులు సమీకరించలేకపోయిన అదానీ
అదానీ సంస్థ ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచిగాని ప్రధాన బ్యాంకుల నుంచిగాని నిధులను సమీకరించుకోలేకపోయింది. ప్రాజెక్టు వ్యయాన్ని తాము సొంతంగా భరించగలనని తర్వాత ప్రకటించింది.
2017-18లో ఆస్ట్రేలియా భారత్‌కు 44 మిలియన్ టన్నుల మెటలర్జికల్ కోల్‌ను, 3.8 మిలియన్ టన్నుల థర్మల్ కోల్‌ను ఎగుమతి చేసింది. 2019-20లో ఈ రెండు రకాల బొగ్గు దిగుమతికి భారత్‌లో డిమాండ్ పెరుగుతుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం మార్చిలో వెల్లడించింది.
అదానీ సంస్థ బొగ్గు నాణ్యమైనది కాదని ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనమిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్(ఐఈఈఎఫ్‌ఏ)’ పేర్కొంటోంది.
పర్యావరణ కార్యకర్త బాబ్ బ్రౌన్ అభిప్రాయం ప్రకారం భారత్‌కు ఆస్ట్రేలియా పునర్వినియోగ ఇంధన వనరుల సాంకేతిక పరిజ్ఞానం అవసరంగాని, కార్మైకేల్ గని బొగ్గు కాదు.
రానున్న దశాబ్దాల్లో థర్మల్ కోల్ వాడకాన్ని దశల వారీగా పూర్తిగా ఆపేయాలని అంతర్జాతీయ బొగ్గు పరిశ్రమ చెబుతోందని బ్రౌన్ ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు ప్రాజెక్టు: ‘భారతీయ కంపెనీ కాబట్టే మాపై వివక్ష’
- నీటి చుక్క కోసం అల్లాడిపోతున్న మన్యం.. చెలమలో నీళ్ల కోసం కిలోమీటర్ల నడక
- వాట్సాప్: అప్డేట్, బ్యాకప్, 2FA, ప్రైవసీ ఫీచర్లను వాడుకోవడం ఎలా?
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
- శ్రీలంక పేలుళ్లు: ఆత్మాహుతి దాడుల వెనుక ‘ఫ్యామిలీ నెట్వర్క్’లు.. ‘ఇదో కొత్త తరహా తీవ్రవాదం’
- ‘పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నా మనం ఇంకా కళ్ళు తెరవడం లేదు’
- ముఖంపై ముసుగు ధరించడం ఏయే దేశాల్లో నిషిద్ధం?
- రాత్రిపూట మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా?
- తల్లితండ్రుల వలసలు... దాడులకు బలవుతున్న పిల్లలు
- అత్యంత భారీ ఎయిర్పోర్ట్.. అంతా ఒక్క బిల్డింగ్‌లోనే
- ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని మీరు చాలా రోజులు తింటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








