INDvAFG: అఫ్గానిస్తాన్‌తో చివరిదాకా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ విజయం, షమీ హ్యాట్రిక్

షమీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో చివరిదాకా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో హ్యాట్రిక్ తీసిన మహ్మద్ షమీ భారత్‌కు తిరుగులేని విజయాన్నందించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ చివరిదాకా పోరాడారు. వికెట్లను కాపాడుకుంటూనే లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ, భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విజయానికి 11 పరుగుల దూరంలో ఆగిపోయారు.

అఫ్గాన్ బ్యాట్స్‌మన్ నబీ జట్టును గెలుపు అంచులదాకా తీసుకెళ్లాడు. 55 బంతుల్లో 52 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 16 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతిని నబీ బౌండరీ దాటించాడు. రెండో బంతికి పరుగులేమీ చేయలేదు.

మూడో బంతికి సిక్స్ కొట్టడానికి ప్రయత్నించిన నబీ బౌండరీ లైన్ వద్ద హార్దిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. ఆ తరువాతి రెండు బంతులకు షమీ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు భారత్‌కు ప్రపంచ కప్‌లో మరో విజయాన్ని అందించాడు.

అఫ్గానిస్తాన్ 49.5 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది.

బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

అంతకుముందు...

అఫ్గానిస్తాన్ క్రమంగా పట్టు బిగిస్తోంది. 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

41 ఓవర్లలో ఆ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. విజయానికి అఫ్గాన్‌కు ఇంకా 54 బంతుల్లో 60 పరుగులు కావాలి. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి.

ప్రస్తుతం నబీ, జద్రాన్ బ్యాటింగ్ చేస్తున్నారు.

అఫ్గానిస్తాన్ 38 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.

29 ఓవర్లలో 106 పరుగుల వద్ద ఆ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు.

28వ ఓవర్ దాకా అఫ్గాన్ బ్యాట్స్‌మన్ నిలకడగా ఆడారు. రహ్మత్ షా, హష్మతుల్లా వికెట్లు కాపాడుకుంటూనే స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లారు. కానీ, 29వ ఓవర్లో బుమ్రా కళ్లు చెదిరే బౌలింగ్‌తో వాళ్లిద్దరినీ పెవీలియన్‌కు పంపాడు.

28.4 ఓవర్ల వద్ద రహ్మత్ షా క్యాచ్ ఔట్ అవ్వగా, 28.6 వద్ద హష్మతుల్లా.. బుమ్రాకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అఫ్గానిస్తాన్ 18 ఓవర్లలో 67 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.

గుల్బదిన్ నైబ్ 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. భారత బౌలర్లు షమీ, పాండ్య చెరో వికెట్ తీశారు.

అంతకుముందు ఆ జట్టు 6.3 ఓవర్లలో 20 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.

ఓపెనర్ హజ్రతుల్లా జజయ్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు.

భారత్

ఫొటో సోర్స్, Getty Images

మరోపక్క అఫ్గానిస్తాన్ బౌలింగ్‌కు భారత బ్యాట్స్‌మన్ తడబడ్డారు. 50 ఓవర్లకు 224 పరుగులే చేశారు. కోహ్లి 67, కేదార్ జాదవ్ 52 పరుగులతో రాణించారు.

ధోనీ 28, విజయ్ శంకర్ 29, రాహుల్ 30 పరుగులు చేశారు. రోహిత్(1), పాండ్య(7), షమి(1) తక్కువ పరుగులకే పెవీలియన్ చేరారు.

మొదట్నుంచీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అఫ్గాన్ బౌలర్లలో ఒక్క అఫ్తాబ్ ఆలమ్ మినహా మరే బౌలర్ ఎకానమీ కూడా 6 దాటలేదు.

గుల్దబిన్ నయీబ్, మొహమ్మద్ నబీ చెరో 2 వికెట్లు, ముజీబ్, ఆలమ్, రషీద్ ఖాన్, రహ్మత్ షా తలో వికెట్ పడగొట్టారు.

2010 నుంచి ఇప్పటిదాకా భారత్ మొదట బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో ఇదే అత్యల్ప స్కోరు.

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

భారత ఇన్నింగ్స్ సాగిందిలా..

192 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 52 బంతుల్లో 28 పరుగులు చేసిన ధోనీ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ధోనీ, కేదార్ జాదవ్ నిలకడగా ఆడుతున్నారు. 38 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 163 పరుగులు చేసింది.

ధోనీ 31 బంతుల్లో 15 పరుగులు, జాదవ్ 32 బంతుల్లో 17 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

అఫ్గాన్ బౌలర్లు నబీ 2, రహ్మత్ షా, ముజీబ్ చెరో వికెట్ పడగొట్టారు.

135 పరుగుల వద్ద భారత్ విరాట్ కోహ్లి వికెట్‌ను కోల్పోయింది. 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నబీ బౌలింగ్‌లో రహ్మత్ షా కు క్యాచ్ ఇచ్చి కోహ్లి ఔటయ్యాడు.

భారత్ 122 పరుగులకు మూడో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన విజయ్ శంకర్ రహ్మత్ షా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యు‌గా వెనుదిరిగాడు.

మొదట అంపైర్‌ ఔట్ ఇచ్చినప్పటికీ భారత్ రివ్యూ కోరింది. రివ్యూలో కూడా అది ఔట్ అని తేలడంతో విజయ్ పెవీలియన్‌కు చేరాడు. ధోనీ, కోహ్లి ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.

మరోపక్క ప్రపంచ కప్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తూ విరాట్ కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లి 48 బంతుల్లో నాలుగు ఫోర్లతో 50 పరుగులు చేశాడు. వన్డేల్లో కోహ్లికి ఇది 52వ అర్ధ సెంచరీ.

22.2 ఓవర్లకు భారత్ 2 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.

కోహ్లి

ఫొటో సోర్స్, Getty Images

భారత్ 64 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లనూ కోల్పోయింది.

30 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ నబీ బౌలింగ్‌లో హజ్రతుల్లాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

18 ఓవర్లు ముగిసేసరికి భారత్ 75 పరుగులకు 2 వికెట్లను కోల్పోయింది. విరాట్ కోహ్లి 36 పరుగులతో, విజయ్ శంకర్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

అఫ్గాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ముజీబ్ 6 ఓవర్లలో 18 పరుగులిచ్చి ఒక వికెట్, నబీ 3 ఓవర్లలో 8 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టారు.

15 ఓవర్లు ముగిసేసరికి భారత్ 66 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది.

విరాట్ కోహ్లి, విజయ్ శంకర్ ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.

రాహుల్

ఫొటో సోర్స్, Alex Davidson

10 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.

కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ చెరో 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

7 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి భారత్ 20 పరుగులు చేసింది.

రోహిత్

ఫొటో సోర్స్, Andy Kearns

7 పరుగులకే భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. 10 బంతులు ఎదుర్కొన్న రోహిత్ కేవలం ఒక్క పరుగే చేసి ముజీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

భారత బ్యాటింగ్ మందకోడిగా సాగుతోంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ నష్టపోకుండా 7 పరుగులు చేసింది.

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ నష్టపోకుండా భారత్ 6 పరుగులు చేసింది.

అఫ్గానిస్తాన్‌తో సౌథాంప్టన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

గాయపడిన భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఈ మ్యాచ్‌లో మహమ్మద్ షమి ఆడనున్నాడు.

ప్రపంచకప్ 2019లో శుక్రవారం భారత్, అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. భారత జట్టు ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. అఫ్గాన్ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు.

క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచిన భారత్ 7 పాయింట్లతో కొనసాగుతోంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.

అఫ్గానిస్తాన్ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడి, ఐదింటిలోనూ ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)