బీజేపీ - తృణమూల్ కాంగ్రెస్: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింసకు ఎవరు కారణం...

బెంగాల్లో హింస

ఫొటో సోర్స్, ANI

2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న రాజకీయ హత్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిస్థితికి కారణం మీరంటే, మీరని... అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి.

ఈ పరస్పర ఆరోపణలను పక్కనబెడితే పశ్చిమ బెంగాల్లో వాస్తవ పరిస్థితేంటి? తాజా పరిణామాలు బెంగాల్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? బీబీసీ ప్రతినిధి ఫైసల్ మహమ్మద్ అలీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

బెంగాల్లో కొనసాగుతున్న రాజకీయ హింసలో ఇది మరో ఎపిసోడ్. ఇటీవలే టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సరస్వతి దాస్‌పై పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు.

తాకిపూర్‌కు 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సరస్వతి సొంతూరు రాజ్బరి పూర్వపాడ.

కొద్ది వారాల క్రితం టీఎంసీ కార్యకర్త ఖయ్యుమ్ మొల్లా హత్య కూడా ఈ తరహాలోనే జరిగింది.

వీడియో క్యాప్షన్, బెంగాల్లో రాజకీయ హింసకు కారణాలు ఏమిటి?

‘రెండు వైపుల నుంచి హింస’

ఎన్నికల ఫలితాల తర్వాత సందేశ్ కాలీ నుంచి కూచ్ బీహార్ వరకు జరిగిన రాజకీయ హత్యల విషయంలో ఎలాంటి అధికార గణాంకాలూ లేవు.

సుమారు 15 నుంచి 18 మంది రాజకీయ హింసకు బలై ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.

టీఎంసీ కార్యకర్త హత్యకు కారణం వాళ్లలో వాళ్లకు తలెత్తిన గొడవలేనని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సయానతన్ బసు అంటున్నారు.

బెంగాల్

"ఇప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బీజేపీ ఉనికి లేదు. వాళ్లలో వాళ్లకు పడకపోవడం, వర్గపోరు కారణంగా టీఎంసీ కార్యకర్తలు వాళ్లలో వాళ్లే ప్రాణాలు తీసుకుంటున్నారు" అని ఆయన ఆరోపిస్తున్నారు.

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సుబీర్ భౌమిక్ మాత్రం సయానతన్ బసు వాదనను కొట్టి పారేస్తున్నారు.

"రెండు వైపుల నుంచి హింస జరుగుతోంది. బీజేపీ పైచేయి సాధించాలని చూస్తుంటే, తృణమూల్ తన ఆధిపత్యాన్ని నిలుపుకొనే ప్రయత్నం చేస్తోంది" అని ఆయన పేర్కొంటున్నారు.

బెంగాల్లో కాంగ్రెస్ పాలనలోనూ, ఆపై లెఫ్ట్ పాలనలోనూ, ఇప్పుడు తృణమూల్ పాలనలోనూ రాజకీయ హింస కొనసాగుతూ వస్తోంది. స్వాతంత్ర్య పోరాట సమయంలోనూ బెంగాల్లో రాజకీయ హింస మూలాలు కనిపిస్తాయి.

పశ్చిమ బెంగాల్

ఫొటో సోర్స్, Getty Images

ఈ రాజకీయ హింస బీజేపీ విస్తరణ ప్రణాళికలో భాగమంటూ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల్ని నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రపతి పాలన పేరుతో అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందని కొందరు టీఎంసీ నేతలు భావిస్తున్నారు.

టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియన్ ఈ అంశంపై ట్విటర్‌లో స్పందిస్తూ- "1990లలో నాటి లెఫ్ట్ పాలనలో పంచాయతీ ఎన్నికల్లో తలెత్తిన హింస కారణంగా సుమారు 400 మంది చనిపోయారు. 2003లో 40 మంది ప్రాణాలు పోయాయి. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం జరిగిన హింస ఏ పాటిదో గమనించాలి" అని వ్యాఖ్యానించడం విమర్శలకు తావిస్తోంది.

బెంగాల్ మహిళలు

బెంగాల్లో హింసపై కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజరీ జారీ చేసింది.

గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులున్నాయని స్పష్టంచేయడంతో బీజేపీ, టీఎంసీ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)