బీజేపీలోకి టీడీపీ ఎంపీలు: సుజనా, సీఎం రమేశ్ అప్పుడు ఏమన్నారు?... ఇప్పుడు ఏమన్నారు?

ఫొటో సోర్స్, facebook/cmramesh
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు వైఎస్ చౌదరి (సుజనా చౌదరి), సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావు గురువారం (జూన్ 20న) బీజేపీలో చేరారు.
తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని ఈ నలుగురు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుని కోరారు.
ఈ మేరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వెంకయ్య నాయుడును కలిసి స్వయంగా లేఖ ఇచ్చారు.
ఆ తర్వాత టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకుంటున్నామంటూ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఉపరాష్ట్రపతికి లేఖ పంపారు.
జాతి (దేశ) నిర్మాణంతోపాటు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భాజపాలో చేరినట్లు సుజనా చౌదరి చెప్పారు.
అయితే, సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు గతంలో బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఏమన్నారు? ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత ఏమన్నారో చూద్దాం.

ఫొటో సోర్స్, facebook/yschowdary
మోదీ వల్ల మెకిన్ ఇండియా కాదు.. కేవలం మైక్ ఇన్ ఇండియా మాత్రమే సాధ్యం: సుజనా చౌదరి
2018 నవంబర్‌లో సుజనా చౌదరికి చెందిన సంస్థల కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. ఆ దాడుల తర్వాత సుజనా చౌదరి మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రం తనపై ఐటీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు.
"నేను రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాను కాబట్టే ఈ దాడులు చేయిస్తున్నారు. నన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకే కేంద్రం ఇలా ఈడీతో దాడులు చేయిస్తోంది" అని ఆయన అన్నారు.
ఆ తర్వాత "ఏపీకి నష్టం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాజ్యాంగం ప్రకారం, ప్రభుత్వం స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ, బీజేపీ విధివిధానాలను ప్రభుత్వంలో కలిపేశారు. చైనాలో కమ్యూనిస్టు పార్టీలు అలాగే చేస్తుంటాయి. ఇది చాలా దుర్మార్గం. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన మరుక్షణమే విశాఖ రైల్వో జోన్ ఆపేశారు, ప్రత్యేక హోదా ఊసెత్తడం లేదు. కడప ఉక్కు కర్మాగారం, కాకినాడ రిఫైనరీ ఇవ్వడంలేదు. ఇలా చేయడం ప్రజాస్వామ్యంలో అన్యాయం. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యంలో ఉండటం తగదు" అని 2018 అక్టోబర్‌లో ఎంపీ సుజనా చౌదరి అన్నారు.
"మోడి నాయకత్వంలో మెకిన్ ఇండియా కాదు.. కేవలం మైక్ ఇన్ ఇండియా మాత్రమే సాధ్యం" అని విమర్శించారు.
2019 జూన్ 20: గురువారం నాడు బీజేపీలో చేరిన తర్వాత సుజనా చౌదరి దిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశ నిర్మాణం కోసమే తాను బీజేపీలో చేరానని తెలిపారు.
''తాజా ఎన్నికల ద్వారా దేశం మూడ్ ఎలా ఉందో అంతా చూశారు. దాంతో మేం కూడ దేశ నిర్మాణంలో భాగం కావాలనుకున్నాం. అది ఒక కారణం. నా వరకూ నేను మూడున్నరేళ్ల పాటు కేంద్ర సహాయ మంత్రిగా ప్రధాని నేతృత్వంలో పనిచేశాను. దేశ నిర్మాణం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. పలు కారణాల వల్ల ఏపీ ఇబ్బంది పడింది. ఏపీ అభివృద్ధికి, విభజన చట్టంలో చేసిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ఇదే సరైన వేదిక అని మేం భావించాం. సహకారం, సమన్వయంతోనే పనిచేయాలి తప్ప పోటీ పడి, గొడవలు పడి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాం'' అని సుజనా చౌదరి చెప్పారు.
ప్రత్యేక హోదా విషయంలో అప్పటి పార్టీలో అభిప్రాయం మేరకు పని చేశామని, ఈ రోజు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, facebook/cmramesh
పార్టీ మారాలని ఐటీ అధికారి చెప్పారు: సీఎం రమేష్
2018 అక్టోబర్ 13న ఎంపీ సీఎం రమేష్ నివాసంలో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సాదాలు జరిపారు.
ఆ తర్వాత సీఎం రమేష్ మాట్లాడుతూ... ఐటీ దాడుల్లో పాల్గొన్న ఒక అధికారి కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా వెళ్లాలని తమకు సూచించారని చెప్పారు.
"రాజకీయ కక్షతోనే కేంద్రం తనపై ఐటీ దాడులు చేయిస్తోంది. మదన్ అనే ఐటీ అధికారి మా కార్యాలయానికి వచ్చి మీరు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు? మీరు అలా చేస్తే ఇలాంటి దాడులు ఇంకా ఎక్కువ జరుగుతాయి అని మా సిబ్బందికి చెప్పారు. నేను ఆ అధికారికి ఫోన్ చేసి మీరు సోదాలు చేసుకోండి కానీ, పార్టీలు మారాలని చెప్పే అర్హత మీకు లేదు అని అన్నాను. ఆ ఫోన్ సంభాషణను రికార్డు కూడా చేశాను. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టొద్దు, అక్కడ పెట్టుబడులు పెడితే ఇలాంటి దాడులే జరుగుతాయని భయపెట్టేందుకు కేంద్రం ఈ దాడులు చేయిస్తోంది. కేంద్ర ప్రభత్వానికి వ్యతిరేకంగా దేశంలో ఎవరు మాట్లాడినా... వారిపై ఇలాంటి దాడులు చేయిస్తున్నారు. వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి ఏం చెబితే కేంద్రం అది చేస్తోంది. మేము కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. ప్రధాని మోదీని, అమిత్ షాను నిలదీశాం. ఆ తర్వాత టీడీపీ నాయకుల్ని వారు టార్గెట్ చేశారు. అయినా మేము భయపడం. దేన్నైనా ఎదుర్కొంటాం'' అని సీఎం రమేష్ అన్నారు.

ఫొటో సోర్స్, fb/GVLNRAO
బీజేపీలో చేరినా కేసులు ఎదుర్కోవాల్సిందే: జీవీఎల్
2018 నవంబర్‌లో సుజనా చౌదరి సంస్థల కార్యాలయాలపై ఈడీ దాడులు చేసిన తర్వాత బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సుజనాను విజయ్ మాల్యాతో పోల్చారు.
"రూ.5,700కోట్లు మోసానికి పాల్పడి సుజనా చౌదరి ఆంధ్రా మాల్యాగా మారారు. విజయ్ మాల్యాని దేశం దాటించాల్సిన అవసరం బీజేపీకి లేదు. విజయ్ మాల్యాలాగా సుజనా చౌదరి కూడా దేశం వదిలి వెళ్లిపోతారు. సీఎం రమేష్, సుజనా లాంటి వారిని వెంట పెట్టుకొని తిరుగుతుంటే చంద్రబాబు మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. ఆలీబాబా నలభై దొంగలు తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు" అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
తాజాగా నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరిక నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకే వారు బీజేపీలో చేరుతున్నారని అన్నారు.
టీడీపీకి ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తు లేదని, ఆ పార్టీ త్వరలోనే కనుమరుగవడం ఖాయం. బీజేపీలో చేరే వారికి కేసుల నుంచి రక్షణ లభించదు. ఎవరి కేసులు వారే వ్యక్తిగతంగా ఎదుర్కోక తప్పదన్నారు" అని జీవీఎల్ చెప్పారు.

పార్టీ మారితే అదే రోజు పదవి పోవాలి: వెంకయ్య నాయుడు
పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని, ప్రజాప్రతినిధులు పార్టీలు మారితే ఆ రోజు నుంచే వారి పదవి కూడా పోయేలా చట్టం రావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలుమార్లు అభిప్రాయపడ్డారు.
"ప్రజాప్రతినిధులు పార్టీ మారితే అదే రోజు తమ పదవి కోల్పోయేలా చట్టం తీసుకొస్తేనే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందని 2016 జూన్ 17న ఎం.వెంకయ్యనాయుడు (అప్పుడు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు) అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల కారణంగా దేశంలో రాజకీయ విలువలు పడిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రస్తుతం సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
వెంకయ్య రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్‌లో ఆయనకు ఆత్మీయ అభినందన కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు.
''ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టాయి. ఒక్కొక్కరుగా పార్టీ మారితేనే ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది తప్ప గంపగుత్తగా మారితే వర్తించదనే ఆలోచనతో పార్టీ ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి ఒక గుర్తుపై గెలిచిన వారు పార్టీ మారితే అదే రోజు పదవి కోల్పోయేట్టు చట్టం తీసుకొస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది'' అని వెంకయ్య నాయుడు ఆరోజు వ్యాఖ్యానించారు.
అయితే, సరిగ్గా మూడేళ్ల తర్వాత నలుగురు టీడీపీ ఎంపీలు మూకుమ్మడిగా ఫిరాయిస్తూ.. రాజ్యసభలో టీడీపీ లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలంటూ రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ ఇవ్వడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
- జైళ్లలో యోగా: 'సెక్స్ కోరికలు పెరిగి హోమో సెక్సువల్స్ అవుతారు'
- భారతదేశంలో ఫిరాయింపుల చరిత్ర: నేతలు పార్టీలు మారినా ప్రజలు ఎందుకు పట్టించుకోవట్లేదు?
- వ్యాక్సిన్లు పనిచేస్తాయా.. టీకాలపై భారతీయులకు నమ్మకముందా
- బన్నీ ఛౌ: భారత్‌లో దొరకని భారతీయ వంటకం
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- చెన్నై నగరంలో నీటి కరువు.. నీటి కోసం పోరాడుతున్న నగరవాసులు
- భారత్ బానిసత్వంలో ఉన్నది 150 ఏళ్లా.. 1200 ఏళ్లా?
- ట్విటర్ సీఈఓ: మంచునీటి స్నానం, ఒంటి పూట భోజనం..
- టీకాలు ఎలా పనిచేస్తాయి? టీకాల విజయం ఏమిటి? టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








