‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కశ్మీర్‌లోని వివాదాస్పద ప్రాంతం కోసం భారత్, పాకిస్తాన్ రెండు సార్లు యుద్ధాలు చేసుకున్నాయి. వాటిలో ఒకటి 1947-48, మరోటి 1965లో జరిగాయి.
1971లో పదమూడు రోజులపాటు సాగిన మరో యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడింది. ఆ దేశ తూర్పు భూభాగం వేరై, బంగ్లాదేశ్‌గా అవతరించింది.
ఈ సమయంలో గల్లంతైన 54 మంది భారత సైనికులు, పాకిస్తాన్ జైళ్లలో బందీలుగా మారినట్లు భారత్ భావిస్తోంది.


ఆ యుద్ధం ముగిసి, ఐదు దశాబ్దాలు దగ్గరపడుతున్నా, ఇంకా వారి గురించి ఆచూకీ లేదు. వాళ్లకేమైందన్నది తెలియదు.
ఈ సైనికులే 'మిస్సింగ్ 54'గా పేరుపొందారు.
వీరితోపాటు మొత్తంగా 83 మంది భారత సైనికులు పాకిస్తాన్ అదుపులో ఉన్నారని గత జులైలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారత పార్లమెంటులో వెల్లడించింది.
ఆ జాబితాలో మిస్సింగ్ 54 కాకుండా మిగిలిన సైనికులు తప్పిపోయి సరిహద్దు దాటినవారు, గూఢచర్యం ఆరోపణలతో పట్టుబడినవారు కూడా ఉండవచ్చు.
పాకిస్తాన్ మాత్రం తమ దగ్గర భారత్‌కు చెందినవారెవరూ యుద్ద ఖైదీలుగా లేరని అంటోంది.

ఫొటో సోర్స్, AFP
సీనియర్ పాత్రికేయురాలు చందర్ సుటా డోగ్రా 'ద మిస్సింగ్ 54' గురించి చాలా ఏళ్లు పరిశోధన చేసి 'మిస్సింగ్ ఇన్ యాక్షన్' పేరుతో ఓ పుస్తకం రాశారు.
విశ్రాంత సైనికాధికారులు, అధికారులు, సైనికుల బంధువులతో ఆమె మాట్లాడారు. ఈ అంశానికి సంబంధించిన లేఖలు, వార్తా కథనాల క్లిప్పింగ్‌లు, డైరీ ఎంట్రీలు, ఫొటోలు, భారత ప్రభుత్వం బయటపెట్టిన రికార్డులను కూడా ఆమె సంపాదించారు.
‘మిస్సింగ్ 54’ సైనికులు యుద్ధ సమయంలోనే చనిపోయారా? పాకిస్తాన్ వాళ్లను బందీలుగా తీసుకొని ఉంటే, ఆ విషయాన్ని నిరూపించే ఆధారాలు భారత్ దగ్గర ఉన్నాయా? అన్నవి అసలు ప్రశ్నలు.
ఒక వేళ వారిని పట్టుకుని, జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ చిత్రహింసలు పెట్టి ఉంటే.. తిరిగి భారత్‌కు వారిని అప్పగించే ప్రక్రియ కూడా పాక్‌కు ఇబ్బందికరమే అవుతుంది.
ఆచూకీ లేని సైనికుల విషయంపై దాఖలైన పిటిషన్‌కు స్పందనగా, 'మిస్సింగ్ 54'లో 15 మంది 'హత్యకు గురైనట్లు ధ్రువీకృతమైంద'ని 1990ల్లో ఓ కోర్టుకు భారత ప్రభుత్వం తెలియజేసింది.
ఒకవేళ అదే నిజమైతే, ఇప్పటికీ 54 మంది ఆచూకీ లేనట్లుగా ప్రభుత్వం ఎందుకు చెబుతూ వస్తోంది.

ఫొటో సోర్స్, AFP
''ఆచూకీ లేని సైనికుల్లో కొందరు చనిపోయినట్లు ప్రభుత్వానికి తెలుసన్నది స్పష్టమైంది. కానీ, వాళ్ల పేర్లను ఆ జాబితాలోనే ఇంకా ఎందుకు చూపిస్తూ వస్తోంది. కావాలనే విషయాన్ని దాస్తున్నారు. బాధిత సైనికుల బంధువులకే కాదు, మొత్తం దేశానికీ ఈ విషయాన్ని పారదర్శకంగా వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది'' అని డోగ్రా అన్నారు.
భారత ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైందని ఓ బాధిత సైనికుడి సోదరుడు అన్నారు.
''యుద్ధ విజయాల ఆనందంలో మనం ఆ సైనికులను మరిచిపోయాం. వరుసగా వచ్చిన ప్రభుత్వాలు, మన రక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం వహించాయి. ఆ సైనికుల గురించి నిజం ఏంటో బయటికి తెచ్చేందుకు మూడో పక్షం మధ్యవర్తిత్వం వహించాలని కూడా మేం కోరాం. భారత ప్రభుత్వం అందుకు నిరాకరించింది'' అని ఆయన చెప్పారు.
యుద్ధాలు ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్ జైళ్లలో 'మిస్సింగ్ 54' సైనికుల్లో కొందరు బతికే ఉన్నట్లు చెబుతున్న కొన్ని కథనాలను కూడా డోగ్రా వెలుగులోకి తీసుకువచ్చారు.
1965 యుద్ధంలో గల్లంతైన ఓ వైర్‌లెస్ ఆపరేటర్ కుటుంబానికి ఆ మరుసటి ఏడాది ఆగస్టులో ఆయన చనిపోయినట్లు భారత సైన్యం సమాచారం అందించింది.
1974 నుంచి 1980ల ఆరంభం వరకూ పాకిస్తాన్ భారత్‌కు ముగ్గురు భారతీయ సైనికులను అప్పగించింది. వాళ్లు ఆ వైర్‌లెస్ ఆపరేటర్ ఇంకా బతికే ఉన్నాడని అప్పుడు చెప్పారు. అయినా, ఆ విషయంలో ఏమీ జరగలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఖైదీల ఆచూకీ కనిపెట్టి, తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలైతే జరిగాయి.
రెండు దేశాల ప్రభుత్వాలు ఈ విషయంలో చర్చలు కూడా జరిపాయి. భారత ప్రధానులు ఒకరి తర్వాత ఒకరు ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించారు.
ఇరు దేశాల నుంచి యుద్ధాల్లో పాల్గొని, రిటైర్ అయిపోయిన సైనికులు కూడా ఖైదీల అప్పగింత జరగాలని డిమాండ్ వినిపించారు.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఖైదీల అప్పగింత కూడా చాలా సార్లు జరిగింది.
1971 యుద్ధం తర్వాత పట్టుబడ్డ 93వేల మంది పాకిస్తాన్ సైనికులను భారత్ ఆ దేశానికి అప్పగించింది. పాకిస్తాన్ 600కుపైగా భారత సైనికులను భారత్‌కు అప్పగించింది.
ఆచూకీ లేని సైనికుల బంధువులు బృందంగా ఏర్పడి.. 1983లో ఓసారి, 2007లో మరోసారి పాకిస్తాన్‌లో పర్యటించారు. సైనికుల ఫొటోలను పట్టుకుని, జైళ్లలోనూ వెతికారు. కానీ, ఏ ప్రయోజనమూ లేకపోయింది.
ఖైదీలను కలిసేందుకు తాము చేసిన ప్రయత్నాలను పాకిస్తాన్ అడ్డుకుందని కొందరు బంధువులు ఆరోపించారు. ఆ దేశం మాత్రం ఈ ఆరోపణను తోసిపుచ్చింది.
‘మిస్సింగ్ 54’ సైనికులు పాకిస్తాన్‌లోనే ఇంకా ప్రాణాలతో ఉండొచ్చని బలమైన ఆధారాలున్నాయని రెండోసారి పర్యటన చేసినప్పుడు వారి బంధువులు చెప్పారు.
పాకిస్తాన్ హోం మంత్రిత్వశాఖ మాత్రం అది నిజం కాదని పేర్కొంది.
''భారత యుద్ద ఖైదీలు ఎవరూ పాకిస్తాన్‌లో లేరని మేం పదపదే చెబుతున్నాం. దీనికే మేం కట్టుబడి ఉన్నాం'' అని 2007లో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతినిధి ఒకరు చెప్పారు.
అయితే, ఎవరూ అడుగుపెట్టాలని కోరుకోని చోట నిజం ఉందని డోగ్రా వ్యాఖ్యానించారు.
'మిస్సింగ్ 54' సైనికుల కుటుంబాల వేదనకు ఓ ముగింపు అయితే లేదు.

ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ మాజీ సైనిక నియంతపై వ్యంగ్య నవల ప్రతులను స్వాధీనం చేసుకున్న 'ఐఎస్ఐ'
- విక్టోరియా మహారాణి, ఆమె భారత గుమస్తా అబ్దుల్ కరీమ్ మధ్య అంతుపట్టని ఆ బంధాన్ని ఏమనాలి
- పాకిస్తాన్‌లో క్షమాభిక్షలు కొనుక్కుంటున్న హంతకులు
- ఉత్తర కొరియా భారీ ఎత్తున రిసార్టులు, స్పాలు ఎందుకు నిర్మిస్తోంది
- గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల ‘సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
- రోడ్డుపై వేగంగా వెళ్లడానికి కారులో అస్థిపంజరాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









