అమెరికా, ఇరాన్‌ల మధ్య రాజీ కుదిర్చేంత పలుకుబడి పాకిస్తాన్‌కు ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్, సౌదీ అరేబియా మధ్య రాజీ కుదిరించేందుకు పాకిస్తాన్ సహకరిస్తుందని గురువారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ సభలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇరాన్, సౌదీ అరేబియా, అమెరికాలకు పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేశీ వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ దేశ ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు.
మరి, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంలో పాకిస్తాన్ శాంతి దూతగా మారగలదా? బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తున్న కథనం.
జనవరి 3న ఇరాన్ మిలిటరీ కమాండర్‌ను కాసిం సులేమానీని అమెరికా హతమార్చిన తర్వాత 24 గంటలు గడవక ముందే, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపెయో నుంచి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఖమార్ జావేద్ బజ్వాకు ఫోన్ కాల్ వచ్చింది.
పాకిస్తాన్ సైనిక సమాచార విభాగం ఆ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించింది.
పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతల అనంతరం ఎలాంటి పరిణామాలు తలెల్తే అవకాశం ఉందన్నదానితో సహా ప్రాంతీయ పరిస్థితులపై వారు చర్చించారని సమాచార విభాగం తెలిపింది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌తో మాట్లాడిన విషయాన్ని మైక్ పాంపెయో కూడా ధ్రువీకరించారు.
తమ 'భాగస్వాములు' అందరూ తమవైపే ఉన్నారని, ఎవరూ తప్పుటడుగు వేయరని చెప్పడానికి మైక్ పాంపెయో ఆ ట్వీట్ చేసి ఉంటారన్న భావన ఏర్పడింది. అలాగే, పశ్చిమాసియాలో సంఘర్షణలో పాకిస్తాన్ అమెరికా వైపే నిలబడుతుందని చెప్పడానికి కూడా కావచ్చు అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆ సంభాషణకు పలు రకాలుగా ప్రాముఖ్యత ఏర్పడింది. పాకిస్తాన్ మిలిటరీ నాయకులకు అలాంటి ఫోన్ కాల్స్ రావడం చాలా తక్కువ. మరి, ప్రధానమంత్రికి ఫోన్ చేయకుండా, ఆర్మీ చీఫ్‌కు ఎందుకు చేశారు?
కొన్ని గంటల తర్వాత మరో ట్వీట్ పాకిస్తాన్‌లో పతాక శీర్షికల్లో నిలిచింది. అమెరికా ప్రభుత్వ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా వ్యవహారాల బ్యూరో అధికారిక ఖాతా నుంచి ఆ ట్వీట్ వచ్చింది.
పాకిస్తాన్ కోసం ఇంటర్నేషనల్ మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నామని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నారని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ, పాకిస్తాన్ సైనిక అధికార ప్రతినిధి ఆ ఊహాగానాలను తోసిపుచ్చారు.
పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా వరుసగా ప్రకటనలు జారీ చేసింది. ఆ ప్రకటనల్లో భాషను చాలా జాగ్రత్తగా వాడారు.

ఫొటో సోర్స్, AFP/Getty
పాకిస్తాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశం ఇరాన్. కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసినప్పుడు కశ్మీరీ ముస్లింలకు అనుకూలంగా స్పష్టమైన వైఖరి తీసుకున్న అతికొద్ది దేశాల్లో ఇరాన్ ఒకటి. అయితే, పాకిస్తాన్‌కు అమెరికాతో పాటు, దాని మిత్ర దేశమైన సౌదీ అరేబియాతోనూ సైనిక, ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయి.
ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఆ దేశాల మీద ఆధారపడక తప్పట్లేదు. ఈ పరిస్థితుల వల్ల ... ఇరాక్‌లో అమెరికా చర్యలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ గట్టి వైఖరి తీసుకోలేకపోయింది.
కాబట్టి, ఇరాన్, అమెరికా రెండూ ఉద్రిక్తతలు పెంచకుండా సంయమనం పాటించాలని అనడం తప్పితే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మరేమీ అనలేకపోయింది. సులేమానీ హత్యను ఖండించలేకపోయింది.
కాసిం సులేమానీ హత్యను పాకిస్తాన్ ఖండించకపోవడంపై ఇరాన్ నాయకులు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పాకిస్తాన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్‌లో పరిశోధకురాలు, పశ్చిమాసియా, గల్ఫ్, టర్కీ, ఇరాన్‌లపై అధ్యయనం చేస్తున్న అర్హామా సిద్దికా అన్నారు.
సులేమానీని అమెరికా చంపేసినప్పుడు ఆమె టెహ్రాన్‌లో జరుగుతున్న ఓ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లి అక్కడే ఉన్నారు.
"సులేమానీ హత్యను పాకిస్తాన్ ఎందుకు బహిరంగంగా ఖండించలేకపోతోంది? అని వాళ్లు పదేపదే అడుగుతున్నారు. సౌదీ అరేబియా, అమెరికాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రకటనలు ఎందుకు చేయడంలేదో వారికి అర్థం కావడంలేదు" అని అర్హామా చెప్పారు.
అయితే, ఈ సంక్షోభాన్ని చల్లార్చేందుకు తనకు అవకాశం ఉంటుందని పాకిస్తాన్ భావిస్తోంది.
ఇమ్రాన్‌ఖాన్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఇరాన్, అమెరికా మధ్య దూరాన్ని తగ్గించేందుకు పాకిస్తాన్ వైపు నుంచి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయని పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి సల్మాన్ బషీర్ చెప్పారు.
"అమెరికా విదేశాంగ మంత్రి మా ఆర్మీ చీఫ్‌కు ఫోన్ చేయడం, మా విదేశాంగ మంత్రి ఇరాన్ దౌత్యవేత్తలతో సమావేశం అవ్వడం, వీటన్నింటినీ బట్టి ఉద్రిక్తతలను తగ్గించేందుకు వెనక కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో పాకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తోందని అర్థం చేసుకోవాలి. అయితే, ఇక్కడ ఒక సంక్లిష్టత ఉంది. ఆ సంఘర్షణలో పాకిస్తాన్ పాలుపంచుకోదని తేల్చి చెప్పాం. అలా ఉంటేనే మాకు ఇరాన్, అమెరికా రెండింటితోనూ వైరం రాకుండా ఉంటుంది" అని బషీర్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP PHOTO / PAKISTAN PRESS INFORMATION DEPARTMENT
దేశానికి వ్యతిరేకంగా దాడులు చేసేందుకు తమ భూభాగాన్ని వాడుకోనివ్వబోమని ఇమ్రాన్ ఖాన్ గురువారం వ్యాఖ్యానించారు. "పాకిస్తాన్ ఏ యుద్ధంలోనూ పాల్గొనదు. అందుకు బదులుగా ప్రతికూల పరిస్థితుల్లో శాంతి దూతగా వ్యవహరిస్తుంది. ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య పరిస్థితులు శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు మేము ప్రయత్నిస్తాం" అని ఇమ్రాన్ అన్నారు.
తటస్థ వైఖరి తీసుకోవడం పాకిస్తాన్‌కు తప్పనిసరి అని ఇస్లామాబాద్‌లోని క్వాయిద్-ఈ-అజామ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్ డాక్టర్ నాజిర్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.
"సమస్య ఏంటంటే, పాకిస్తాన్‌కు ఆనుకుని ఇరాన్ ఉంది. కాబట్టి ఇరాన్, అమెరికాల మధ్య ఎలాంటి సైనిక పరమైన ఉద్రిక్తతలు తలెత్తినా పాకిస్తాన్ భరించలేదు. ఇప్పుడు పాకిస్తాన్ చేయగలిగింది పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చకుండా, తదుపరి ప్రతిదాడులకు దిగకుండా ఇరు దేశాలను శాంతింప చేసేందుకు ప్రయత్నించడమే" అని డాక్టర్ నాజిర్ చెప్పారు.
"ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రి పాంపెయో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌తో టచ్‌లో ఉంటుంటున్నారు. మరి, భారత్‌తో ఎందుకు టచ్‌లో ఉండట్లేదు? అంటే... ఈ ఉద్రిక్తతలకు సంబంధించి భౌగోళికంగా చూస్తే పాకిస్తాన్‌కు ఉన్న ప్రాముఖ్యతను అమెరికా అర్థం చేసుకుంది. అయితే ఇరాన్, అమెరికా ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్తాన్‌కు అవకాశం దొరకొచ్చు. కానీ, ప్రచ్చన్న పోరును ఆపడంలో పాకిస్తాన్ హామీ ఇవ్వలేదు" అని నాజిర్ వివరించారు.
అయితే, సౌదీ అరేబియా, ఇరాన్, అమెరికాలను దగ్గరికి చేయడం పాకిస్తాన్‌కు సాధ్యం కాకపోవచ్చునని అర్హామా సిద్దికా అంటున్నారు.
"ఇంకా ఉద్రిక్తతలు పెరగడంలేదు. ఒకవేళ పెరిగితే అప్పుడు పాకిస్తాన్ తటస్థంగా ఉండలేదు. అప్పుడు అది ఏదో ఒక వైపు మొగ్గాల్సి ఉంటుంది. ఇరాన్ తన పొరుగు దేశమైనా, పాకిస్తాన్ మాత్రం అమెరికా, సౌదీ అరేబియాల వైపే ఉండే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే, అమెరికా మీద ఆర్థికంగా పాకిస్తాన్ ఆధారపడుతోంది" అని అర్హామా అభిప్రాయపడ్డారు.
కానీ, ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే పాకిస్తాన్‌కు కూడా ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే పాకిస్తాన్ అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇక అమెరికా, ఇరాన్ పరస్పరం సైనిక చర్యలకు దిగితే దాని ప్రభావం పాకిస్తాన్ మీద తప్పకుండా ఉంటుంది.
అలాంటి పరిస్థితులు వస్తే, పాకిస్తాన్‌కు అదొక పీడకలగా మిగిలిపోక తప్పదని అర్హామా అంటున్నారు.
"పాకిస్తాన్ మద్దతు తీసుకునేందుకు, అది ఇరాన్ వైపు వెళ్లకుండా చూసేందుకే అమెరికా ఉన్నత స్థాయి నాయకులు పాకిస్తాన్‌తో టచ్‌లో ఉంటున్నారు" అని అర్హామా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ప్రపంచంలో న్యూక్లియర్ ఆయుధం ఉన్న ఏకైక ముస్లిం దేశం పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ, ఇతర గల్ఫ్ దేశాలతో కూడా పాక్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంతో కాలంగా అమెరికాకు మిత్రపక్షంగా ఉంటోంది. అయితే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. ఇన్ని అనుకూలతలు ఉన్నా కూడా.. ఇది ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం. ఆ రెండూ తమంతట తాముగా సయోధ్య కుదుర్చుకోవాలనుకుంటే తప్ప పాకిస్తాన్ వాటి మధ్య రాజీ కుదర్చలేదు’’ అని అర్హామా వివరించారు.
కొన్ని నెలల కిందట యూఎన్‌జీఏ సదస్సు జరుగుతున్నప్పుడు ఇరాన్‌తో మధ్యవర్తిత్వం జరపాలని ఇమ్రాన్ ఖాన్‌ను అమెరికా, సౌదీ అరేబియాలు కోరాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ గత అక్టోబర్‌లో టెహ్రాన్ వెళ్లారు. కానీ, ఆ పర్యటన వల్ల వాస్తవంగా ఒరిగిందేమీ లేదు.
ఇరాన్, సౌదీ అరేబియాలు రెండింటితోనూ సమతూకంతో నడుచుకోవడం పాకిస్తాన్‌కు కొంచెం ఇబ్బందే. గత కొన్ని దశాబ్దాల్లో చాలా సార్లు పాకిస్తాన్ తన సైన్యాన్ని సౌదీ అరేబియాకు పంపించింది. అయితే, కేవలం శిక్షణ కోసమే తమ సైన్యాన్ని ఆ దేశానికి పంపించామని చెప్పుకొచ్చింది.
అయితే, 2015లో మాత్రం తమ వ్యూహాత్మక భాగస్వామి సౌదీ అరేబియా చేసిన విజ్ఞప్తిపై పాకిస్తాన్ పార్లమెంటు రోజుల కొద్దీ చర్చలు జరిపి, తమ సైన్యాన్ని సౌదీ అరేబియా ఆధ్వర్యంలో ఇరాన్ మద్దతున్న హూతీ రెబల్స్‌పై యెమెన్‌లో పోరాటానికి పంపించకూడదని నిర్ణయించింది. అలా పంపిస్తే తమ దేశంలోనే రెండు వర్గాల మధ్య ఆందోళనలు తలెత్తుతాయని భావించింది.
కొన్ని నెలల తర్వాత.. సున్నీ ప్రభుత్వాల కోసం సౌదీ అరేబియా ఒక ఉగ్రవాద వ్యతిరేక సైనిక కూటమిని ప్రకటించింది. దీనికి తొలి కమాండర్‌గా పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రషీల్ షరీఫ్‌ను ఎంచుకుంది.
ప్రత్యర్థి ఇరాన్‌తో విబేధాల నేపథ్యంలో గల్ఫ్‌లో పైచేయి సాధించేందుకు సౌదీ అరేబియా చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ కూటమిని ఏర్పాటు చేసిందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
పాకిస్తాన్ సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశం. సౌదీ అరేబియాకు అత్యంత సన్నిహిత మిత్రుల్లో పాక్ ఒకటి.
అయితే, పాకిస్తాన్ జనాభాలో దాదాపు 20 శాతం మంది షియా ముస్లింలు ఉన్నారు. వీరంతా సైద్ధాంతికంగా, ఆధ్యాత్మికంగా ఇరాన్‌తో అనుబంధం ఉన్నవారు.
కాబట్టి, ఇరాన్‌తో ఎలాంటి సంఘర్షణ పడినా.. తమ పునాదులు కదిలిపోతాయని పాక్ ప్రభుత్వాలు భావిస్తుంటాయి.
గతంలో కొందరు పాకిస్తానీయులు ఐఎస్ఐఎస్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా పోరాడేందుకు సిరియాకు వెళ్లారన్న కథనాలను బట్టి చూస్తే.. పాకిస్తాన్ రెండు వర్గాలుగా స్పష్టంగా ఎలా విడిపోయిందో తెలుసుకోవచ్చు.
అయితే, ఇప్పటి వరకూ పాకిస్తాన్ చాలా బాగానే సమతూకంతో వ్యవహరిస్తూ వస్తోందని విదేశీ వ్యవహారాల నిపుణులు అంటుంటారు. ఒకపక్క సౌదీ అరేబియాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే, మరోపక్క ఇరాన్‌తో కూడా ఘర్షణాత్మక వైఖరిని ప్రదర్శించలేదు.
ఇరాన్‌తో గతంలో కొన్నిసార్లు సరిహద్దుకు సంబంధించిన గొడవలు వచ్చినప్పటికీ, వాటిని ఇరు దేశాలూ సామరస్యంగానే పరిష్కరించుకున్నాయి.
కాబట్టి, ఇరాన్, అమెరికా, సౌదీ అరేబియాలను దగ్గర చేర్చగలిగినంత పలుకుబడి పాకిస్తాన్‌కు ఉందని, అయితే ప్రపంచంలోని ఇతర సంఘర్షణల్లాగే, తమ గొడవలను పరిష్కరించుకోవాలని గొడవలు పడుతున్న వారు భావించాలి కదా.. అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.
ఇవి కూడా చదవండి:
- పాక్‌కు దెబ్బ మీద దెబ్బ, ఇమ్రాన్ ఖాన్ చమురు ఆశలు ఆవిరి
- నరేంద్ర మోదీ వర్సెస్ ఇమ్రాన్ ఖాన్: ఇంతకీ ఈ ప్రచార యుద్ధంలో గెలిచిందెవరు...
- కశ్మీర్ కోసం భారత్‌తో యుద్ధం రావచ్చు: ఇమ్రాన్ ఖాన్
- ఇమ్రాన్ ఖాన్ కొండచిలువ చర్మంతో చేసిన చెప్పులు వేసుకుంటారా
- ‘మీకు ఇలాంటి రిపోర్టర్స్ ఎక్కడ దొరుకుతారు...’ మోదీ, ఇమ్రాన్ ఖాన్‌లను ఒకే ప్రశ్న అడిగిన డోనల్డ్ ట్రంప్
- విశాఖపట్నంకు ఆ పేరు ఎలా వచ్చింది? వైజాగ్‌గా ఎలా మారింది? చరిత్ర ఏం చెబుతోంది?
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: నిప్పును నిప్పుతోనే నియంత్రించడం సాధ్యమా...
- ఒమన్ సుల్తాన్: సుదీర్ఘ కాలంపాటు దేశాన్ని ఏలారు.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరు.. సీల్డ్ కవరులోని వారసుడి పేరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








