‘రోజుకు 4 గంట‌లే చ‌దువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, క‌మ్యూనిటీ పనులు’ @ జీవన వికాస విద్యావనం

జీవ‌న వికాస విద్యావనం
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

"మేం రోజుకు నాలుగు గంట‌లే చ‌దువుకు కేటాయిస్తాం. మిగిలిన స‌మ‌యమంతా ఆట‌ల్లో, వివిధ వ‌స్తువుల త‌యారీలో, వ్య‌వ‌సాయ ప‌నుల్లో, మా కమ్యూనిటీని ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డంలో గడిపేస్తాం. అయినా మా చ‌దువులకేం ఢోకా లేదు. మేం ఆడుకుంటానే ప‌నులు చేస్తాం. ప‌నులు చేసుకుంటూనే చ‌దువుకుంటాం. చ‌దువుకోవ‌డంతోపాటు స‌మాజంలో ఎలా జీవించాలో తెలుసుకుంటాం" అని సుశాంత్ చెబుతున్నాడు.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సుశాంత్‌, 'జీవన వికాస విద్యావనం' అనే విభిన్నమైన పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.

విజ‌య‌వాడ-నూజివీడు ప్ర‌ధాన రహ‌దారిలో ఉండే అడ‌వి నెక్క‌లం స‌మీపాన ఈ పాఠశాల ఉంది. ఎవ‌రి ప‌ని వారే చేసుకుంటూ, అంద‌రి ప‌నులూ చేస్తూ, అంద‌రూ క‌లిసే సాగే ఇక్కడి విద్యావిధానం వ‌ర్త‌మాన బోధ‌నా విధానానికి పూర్తి భిన్నంగా ఉంది.

దీనిని 'స్కూల్' అన‌డం కంటే 'ఆధునిక ఆశ్ర‌మం' అనడం సరైనదని పూర్వ విద్యార్థులు అంటుంటారు.

line
News image
line
జీవ‌న వికాస విద్యావనం

ప్ర‌ధాన ర‌హ‌దారి నుంచి ఐదు కిలోమీట‌ర్ల దూరంలో కొండ‌వాలు ప్రాంతంలో ఉన్న ఈ ప్రాకృతిక విద్యాకేంద్రాన్ని రిషివాలీ, శాంతినికేత‌న్ లాంటి విద్యాసంస్థల స్ఫూర్తితో న‌డుపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

80 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న జీవన వికాస విద్యావనంలో చ‌దువుకోవ‌డానికి కేటాయించిన ప్రదేశం చాలా తక్కువ.

ఎక్కువ భాగాన్ని ఆట‌స్థ‌లం, విద్యార్థుల మధ్య చ‌ర్చా కార్యక్రమాల కోసం క‌దంబం, సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌ల కోసం రంగం లాంటి వాటికే వాడుతున్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: ‘రోజుకు 4 గంట‌లే చ‌దువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, క‌మ్యూనిటీ పనులు’

‘పాఠ‌శాల‌ కాదు.. 'క‌మ్యూనిటీ'’

నిద్ర లేచింది మొద‌లు తిరిగి నిద్ర‌పోయే వ‌ర‌కు పుస్త‌కాలతో కుస్తీ ప‌డుతున్న నేటి విద్యార్థుల‌కు దూరంగా ఇక్కడ చ‌దువులు సాగుతున్నాయి.

"గ‌దులు విశాలంగా ఉండ‌డ‌మే కాదు, పిల్ల‌ల మ‌న‌సులు కూడా విక‌సింప‌జేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం" అని జీవన వికాస విద్యావనం వ్య‌వ‌స్థాప‌కుడు డాక్ట‌ర్ ఎస్.ఆర్.ప‌రిమి బీబీసీతో చెప్పారు. ఆయన గతంలో అమెరికాలో ఇంజినీరింగ్ అధ్యాప‌కుడిగా పనిచేశారు.

తమ పాఠ‌శాల‌ను 'క‌మ్యూనిటీ' అని పిలుస్తామని ఆయన తెలిపారు. "ఇక్క‌డ అంద‌రూ స‌మాన‌మే. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అని కాకుండా అంతా క‌లిసి మెలిసి నేర్చుకుంటాం" అని వివ‌రించారు.

విద్య

బోధన నాలుగ్గంటలే..

రోజూ ఉద‌యం 8 గంటల నుంచి 12.30 గంటల వ‌ర‌కు పాఠ్యాంశాల బోధ‌న ఉంటుంది. మ‌ధ్య‌లో అర‌గంట విరామం. తరగతి గదులకు మాత్రమే ప‌రిమిత‌మ‌య్యేలా పుస్త‌కాల సంచి ఉంటుంది.

ఎల్‌కేజీ, యూకేజీ లాంటివి ఇక్కడ ఉండవు. పిల్లలను విద్యాభ్యాసానికి అలవాటు చేసేందుకు తొలి రెండేళ్లు 'బొమ్మ‌రిల్లు' పేరుతో చదువు చెబుతారు. ఆ త‌ర్వాత ఆరోత‌రగ‌తి వ‌ర‌కు సాగే అభ్యాసాన్ని 'బాలానందం' అంటారు.

కృష్ణా జిల్లాలోనే, అడవి నెక్కలానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని పోరంకి వ‌ద్ద న‌డుపుతున్న వికాస విద్యావనంలో ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉంది. ఆ త‌ర్వాత అడవినెక్క‌లం వ‌ద్ద ఉన్న జీవ‌న వికాస విద్యావనంలోనే గురుకులం త‌ర‌హా బోధ‌న సాగుతోంది.

పోరంకి పూర్వవిద్యార్థుల్లో విదేశాల్లో స్థిరపడినవారూ, ఐఐటీ ప్రొఫెసర్లుగా సేవలందిస్తున్నవారూ ఉన్నారు.

జీవ‌న వికాస విద్యావనం

నేల‌పై కూర్చుని చ‌దువుకోవాలి

హోమ్ వ‌ర్క్ అస‌లు ఉండదు. త‌ర‌గ‌తి గ‌దుల్లోనే అన్నీ పూర్తిచేస్తారు. త‌ర‌గ‌తి గదుల్లోనూ నేల‌పై కూర్చుని చ‌దువుకోవాల్సిందే.

మార్కులు, గ్రేడ్లు ఉండ‌వు. ప‌రీక్ష‌లు పిల్ల‌ల‌కు భారం కాకుండా వారి మేధ‌స్సు పెంచ‌డానికి అనుగుణంగా ఉంటాయ‌ని నిర్వాహకులు చెప్పారు.

ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి

ఉదయాన్నే బోధనేతర ప‌నులతో విద్యార్థుల దిన‌చ‌ర్య ప్రారంభ‌మ‌వుతుంది. సొంతంగా తయారుచేసుకున్న సబ్బులే స్నానానికి వాడతారు. త‌లస్నానానికి కుంకుడుర‌సం ఉపయోగిస్తారు.

బ‌ట్ట‌లు కుట్ట‌డం, మ‌ట్టిబొమ్మ‌ల త‌యారీ, ఇత‌ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా వివిధ వ‌స్తువుల త‌యారీలోనూ విద్యార్థులు శిక్ష‌ణ పొందుతారు.

మ‌ధ్యాహ్నం భోజ‌నం త‌ర్వాత సొంత ప‌నుల‌న్నీ విద్యార్థులే చేసుకుంటారు. బ‌ట్ట‌లు వాళ్లే ఉతుక్కుంటారు. ఇస్త్రీ వాళ్లే చేసుకుంటారు.

పిల్లలు

ఆ త‌ర్వాత గంట పాటు పొలం ప‌ని చేయాలి. ప్రతి విద్యార్థి అందులో పాలుపంచుకుంటారు.

భోజ‌న‌శాల‌కు అవ‌స‌ర‌మైన కూర‌గాయ‌లు, ఆకుకూరలతోపాటు పాలు పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోనే సిద్ధం చేసుకుంటున్నారు. మొక్క‌లు నాట‌డం నుంచి, కూర‌గాయ‌లు శుభ్రం చేసి భోజ‌న‌శాల‌కు త‌ర‌లించే వ‌ర‌కు అంతా విద్యార్థుల‌దే బాధ్య‌త‌.

సాయంత్రమైతే అంతా ఆట‌ల్లోనే. సంగీతం, నాట్యం, యోగా, ఈత కూడా పిల్ల‌ల దినచ‌ర్య‌లో ఉంటాయి.

‘ప్ర‌తి విద్యార్థి స‌మానాభివృద్ధికి..’

క‌దంబంలో మ‌న‌సు విప్పి మాట్లాడుకోవ‌డం మ‌నోవికాసానికి తోడ్పడుతుందని జీవ‌న వికాస విద్యావనం ప్రిన్సిపాల్ శ్రీరామ్ బీబీసీకి తెలిపారు.

"రోజూ ఉద‌యాన్నే త‌ర‌గ‌తుల ప్రారంభానికి ముందుగా క‌దంబం పేరుతో అందరం ఓ చోట కూర్చుని మాట్లాడుకుంటాం. ఎవ‌రికి తోచింది వారు చెబుతుంటారు. పాట‌, మాట‌, కొత్త విష‌యాలు, విశేషాలు, వారి అనుభ‌వాలు అన్నీ పంచుకుంటారు. అది వారి మాన‌సిక వికాసానికి దోహ‌ద‌ప‌డుతుంది. మ‌న‌సు విప్పి మాట్లాడడం, న‌లుగురితో అభిప్రాయాలు పంచుకోవ‌డం చిన్న‌త‌నం నుంచే అల‌వ‌డుతాయి" అని ఆయన చెప్పారు.

క‌మ్యూనిటీ అవ‌స‌రాలు, ప‌రిష్కారాలు కూడా క‌దంబంలో చ‌ర్చించి ప్ర‌ణాళిక రూపొందిస్తామని శ్రీరామ్ తెలిపారు.

"సమాచార వినిమయ నైపుణ్యాల (క‌మ్యూనికేష‌న్ స్కిల్స్) ప్రాధాన్యాన్ని గ్ర‌హించి ఈ ఏర్పాటు చేశాం. అంద‌రూ భాగ‌స్వాములు కావ‌డంతో ప్ర‌తి విద్యార్థి స‌మానాభివృద్ధికి ఇది దోహ‌దం చేస్తోంది. మా కమ్యూనిటీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో రాణించేందుకు, ఏ హోదాలో ఉన్నా ఉన్న‌తంగా జీవించేందుకు ఈ ప్ర‌య‌త్నాలు దోహ‌దం చేస్తున్నాయి" అని ఆయన వివరించారు.

విద్యార్థులు

'నా పిల్లలకు ఎదురైన అనుభవాల్లోంచి పుట్టింది'

అమెరికా నుంచి భారత్ వచ్చిన తర్వాత ఇక్కడ త‌న పిల్ల‌ల విద్యావిధానంలో ఎదురైన అనుభ‌వాల‌ నుంచి ఈ పాఠశాల ఆలోచ‌న పుట్టిందని ఎస్.ఆర్.ప‌రిమి చెప్పారు.

"నా పిల్ల‌లు ఓనమాలు నేర్చుకునే వ‌య‌సులోనే మ‌న విద్యావిధానంవల్ల ఒత్తిడిని ఎదుర్కోవడం నన్ను క‌ల‌వ‌ర‌ప‌రిచింది. దీని గురించి చాలా మందితో చ‌ర్చించాను. సాటి అధ్యాప‌కులు, మిత్రులు చేసిన సూచ‌న‌తో చివ‌ర‌కు 1983లో పోరంకి వ‌ద్ద 'వికాస విద్యావనం' ప్రారంభించాం. విభిన్న విద్యావిధానంతో విద్యార్థుల్లో స‌మ‌గ్రాభివృద్ధే ల‌క్ష్యంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. మారుతున్న ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా విద్యార్థుల‌ను స‌న్న‌ద్ధం చేస్తున్నాం. ఐదో త‌ర‌గ‌తి వరకు పోరంకిలో చ‌దివిన త‌ర్వాత ఆరో త‌ర‌గ‌తి నుంచి ప‌దోత‌ర‌గ‌తి వ‌ర‌కూ ఐసీఎస్ఈ పాఠ్యప్రణాళికతో జీవ‌న విద్యావికాస వనం ప్రారంభించాం" అని ఆయన వివరించారు.

టీవీలు లేవు

సాధారణంగా చాలా మంది పిల్లలు టీవీలు, కంప్యూట‌ర్లు, ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్లు, మొబైల్ ఫోన్లతో ఎక్కువ సమయం గడపడం మనకు కనిపిస్తుంటుంది. జీవ‌న వికాస విద్యావనంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది.

ఇక్కడ బోధ‌న‌లో భాగంగా కంప్యూట‌ర్ కోర్స్ కోసం రోజూ ఒక గంట మాత్రమే ఇంట‌ర్నెట్ వాడేందుకు విద్యార్థులను అనుమతిస్తారు.

ఇక్కడ టీవీలు ఉండవు.

జీవ‌న వికాస విద్యావనం

ఆహారం

వనంలో ముడిబియ్యం, చిరుధాన్యాలు, ర‌సాయనాలు లేకుండా సొంతంగా పండించిన కాయ‌గూర‌లు, ఇత‌ర పోష‌క ప‌దార్థాలతో కూడిన సంప్ర‌దాయ ఆహారాన్నే పిల్లలకు అందిస్తారు. పంచ‌దార స్థానంలో బెల్లం వాడతారు.

ఇక్కడ ఫ్రిజ్‌లు ఉండవు.

భోజ‌న‌శాల పిల్ల‌ల భాగ‌స్వామ్యంతోనే నడుస్తుంది. అంద‌రూ క‌లిసి భోజ‌నాలు చేస్తారని, దీనివల్ల ఐక‌మ‌త్యం ఏర్పడుతుందని నిర్వాహ‌కులు చెబుతున్నారు.

వెన్నెల రాత్రుల్లో ఫుట్ బాల్

పౌర్ణ‌మి కోసం పిల్ల‌లు నెలంతా ఎదురుచూస్తూ ఉంటార‌ని ప్రిన్సిపాల్ శ్రీరామ్ చెప్పారు. ఆ రోజు వెన్నెల్లో ఫుట్ బాల్ ఆడ‌డంలో క‌లిగే ఆనందం వేరుగా ఉంటుంద‌న్నారు. ఇక కొండ‌ల్లో ట్రెక్కింగ్ త‌మ షెడ్యూల్లో భాగమని ఆయ‌న తెలిపారు.

జీవ‌న వికాస విద్యావనం

'మాతో చెప్పడానికి బ‌య‌టి పిల్ల‌ల ద‌గ్గ‌ర ఏమీ ఉండ‌దు'

బ‌య‌టి ప్ర‌పంచానికి దూరంగా ఉంటున్న‌ప్ప‌టికీ ఎప్ప‌టిక‌ప్పుడు అన్ని అంశాల‌ను తెలుసుకుంటూ అంద‌రి క‌న్నా ముందు ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని పదో తరగతి విద్యార్థిని స్వాతి బీబీసీతో చెప్పింది.

"క‌మ్యూనిటీ జీవ‌నంలో ప్రకృతి నుంచి నేర్చుకోవ‌డానికే ప్రాధాన్య‌మిస్తాం. దాని వ‌ల్ల స్వేచ్ఛగా, స్వ‌తంత్రంగా నేర్చుకుంటున్నాం. నాలుగు గోడ‌ల మ‌ధ్య కాకుండా నాలుగు ర‌కాల ప‌నులు చేయ‌డంతోనే మాకు అన్నీ తెలుస్తున్నాయి" అని ఆమె పేర్కొంది.

ఇక్క‌డ‌కొచ్చి క‌మ్యూనిటీలో క‌లిసిపోయిన త‌ర్వాత ఇంటికి కూడా వెళ్లాల‌నిపించ‌దని స్వాతి తెలిపింది.

జీవన విద్యావికాస వనం

"ఎప్పుడైనా ఇంటికి వెళ్తే బ‌య‌ట స్కూళ్ల‌లో చ‌దువుతున్న పిల్ల‌ల‌తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల ద‌గ్గ‌ర మాతో చెప్ప‌డానికి ఏమీ ఉండ‌దు. మేం పొలంలో ఏం చేస్తాం, క‌దంబంలో ఎలాంటి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తాం, మా జీవ‌నశైలి ఎలా ఉంటాయి లాంటివి చెప్పినప్పుడు వారికి ఆశ్చ‌ర్యంగా ఉంటాయి. మాకు అల‌వాటు కావ‌డంతో ఒత్తిడి లేని చ‌దువులతో సంపూర్ణంగా ఎద‌గ‌గ‌ల‌మ‌నే ధీమా పెరుగుతోంది" అని ఈ విద్యార్థిని వివరించింది.

'మా ఊరు'

ఏటా ఒక‌రోజు జీవ‌న వికాస విద్యావనం విద్యార్థులు 'మా ఊరు' పేరుతో ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. ఏడాది పాటు తాము నేర్చుకున్న వివిధ అంశాలు ప్ర‌ద‌ర్శించ‌డం, తాము త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేయ‌డం, త‌మ ఆలోచ‌న‌లతో సిద్ధమైన ప్రాజెక్టుల‌ను వివ‌రించ‌డం ఇందులో భాగం.

ఈ కార్యక్రమానికి ఏటా మంచి స్పంద‌న వ‌స్తోంది. బ‌య‌టి వారికి ఈ త‌ర‌హా విద్యావిధానం గురించి అవ‌గాహ‌న పెంచ‌డానికి ఇది దోహ‌ద‌ప‌డుతోందని ఎస్.ఆర్.ప‌రిమి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)