విజన్ 2020: అబ్దుల్ కలాం, చంద్రబాబు లక్ష్యాలు ఏంటి? వాటిలో ఎన్ని నెరవేరాయి

చంద్రబాబు నాయుడు, అబ్దుల్ కలామ్

ఫొటో సోర్స్, facebook/TDP.Official

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''పెద్దయ్యాక నీకు ఏం కావాలని ఉంది?'' ఇది చిన్నారులకు భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎప్పుడూ సంధించే ప్రశ్న. అయితే ఓ పదేళ్ల బాలిక ఇచ్చిన సమాధానం కలాంను ఆలోచనల్లో మునిగేలా చేసింది. అంతేకాదు ఓ పుస్తకమే రాసేలా చేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పింది? ఆ పుస్తకమేంటి?

కలాం అడిగిన వెంటనే.. ''నాకు అభివృద్ధి చెందిన భారత్‌లో జీవించాలనుంది''అని ఆమె ఠక్కున చెప్పేసింది. దీంతో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలంటే చేయాల్సిన కృషి, అందుకోవాల్సిన లక్ష్యాలపై కలాం ఆలోచనల్లో పడ్డారు.

దీనిపై 1998లో ''ఇండియా 2020 ఎ విజన్ ఫర్ ది న్యూ మిలీనియమ్'' పేరుతో ఓ పుస్తకంరాసి ఆ బాలికకే అంకితమిచ్చారు.

ప్రణాళికా సంఘం కూడా భారత్ 2020నాటికి చేరుకోవాల్సిన లక్ష్యాలపై ''ఇండియా విజన్ 2020'' పేరుతో ఓ నివేదికను 2002లో విడుదల చేసింది. ఈ రెండింటికీ చాలా సారూప్యత ఉంటుంది.

మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కూ ఇలాంటి లక్ష్యాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు.

"ఆంధ్రప్రదేశ్ విజన్: 2020" పేరుతో ఆయన ఓ దార్శనికపత్రాన్ని 1999లో విడుదలచేశారు. కన్సల్టెన్సీ సంస్థ మెకెన్సీ సాయంతో దీన్ని తయారుచేశారు. 2020నాటికి చేరుకోవాల్సిన లక్ష్యాలను, చేయాల్సిన కృషిని దీనిలో నిర్దేశించారు.

ఇంతకీ ఈ దార్శనిక పత్రాల్లో ఏముంది? ఆ లక్ష్యాలను మనం చేరుకున్నామా? 2020లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఓ సారి పరిశీలిద్దాం.

విజన్ 2020

ఆంధ్రప్రదేశ్ విజన్ 2020లో ఏముంది?

  • పేదరికాన్ని నిర్మూలించాలి. వృద్ధులు, చిన్నారులతోపాటు నిజంగా సాయం అవసరమైనవారికి తోడ్పాటు అందించాలి.
  • అభ్యాసం, ఆర్జనతోపాటు ఆరోగ్యకర జీవనం సాగించేందుకు ప్రజలకు అవకాశం కల్పించాలి.
  • ఆరోగ్యకర, సుసంపన్న సమాజం కోసం చిన్న కుటుంబాలను ప్రోత్సహించాలి.
  • చిన్నారులకు సంతోషకర జీవితం అందించాలి. తమ శక్తిని 100 శాతం వినియోగించుకునేందుకు అవసరమైన అవకాశాలు వారికి కల్పించాలి.
  • సమాజంతోపాటు ఆర్థిక వ్యవస్థలో పురుషులతో సమానంగా పోటీపడేలా మహిళలు, బాలికలకు అవసరమైన సాధికారత, మద్దతు కల్పించాలి.
  • పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు లాంటి వనరులను ప్రజలకు కల్పించాలి. ఇవి వారి భవిష్యత్తును సంపూర్ణంగా మార్చగలవు.
  • వ్యవసాయంలో కొత్త మెళకువలు, మేటి సేవలు, నాణ్యమైన వస్తూత్పత్తి కోసం ఆవిష్కరణలను ప్రోత్సహించాలి.
  • ప్రభుత్వాన్ని పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, ప్రతిస్పందించేలా మార్చాలి.
  • పాలనలో ప్రజల స్వరం గట్టిగా వినిపించేలా చూడాలి.
విజన్ 2020

ఆర్థిక లక్ష్యాలు ఏమిటంటే..

ఆంధ్రప్రదేశ్ విజన్ 2020లో రంగాల వారిగా లక్ష్యాలను నిర్దేశించారు. తలసరి ఆదాయం, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి, జనాభా పెరుగుదల విషయంలో చేరుకోవాల్సిన గమ్యాలు దీనిలో ఉన్నాయి. ప్రతి ఐదేళ్లకు సగటుతోపాటు 1995 నుంచి 2020 వరకు సగటునూ లక్ష్యాల్లో పేర్కొన్నారు. వాటిలో ఎన్నింటిని చేరుకోగలిగామో ఓ సారి చూద్దాం.

తలసరి ఆదాయం పెరుగుదల రేటు

విజన్: రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల రేటు 2015-2020 మధ్య 13.4 శాతంగా ఉండాలి. 1995 నుంచి 2020ల సగటు 9.4 శాతంగా ఉండాలి.

పరిస్థితి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే ప్రకారం.. 2018-19లో రాష్ట్ర తలసరి వార్షిక ఆదాయం రూ.1,64,025గా ఉంది. అంతకుముందు ఏడాది ఇది రూ.1,43,935గా ఉంది. అంటే 13.96 శాతం పెరుగుదల నమోదైంది.

తెలంగాణ ఆర్థిక సర్వే ప్రకారం.. 2018-19లో రాష్ట్ర తలసరి వార్షిక ఆదాయం రూ.2,05,696గా ఉంది. అంతకుముందు ఏడాది ఇది రూ.1,80,697గా ఉంది. అంటే 13.8 శాతం పెరుగుదల నమోదైంది.

భారత్ ఆర్థిక సర్వే ప్రకారం.. 2018-19లో దేశ తలసరి వార్షిక ఆదాయం రూ.1,26,406గా ఉంది. అంతకుముందు ఏడాది ఇది రూ.1,14,658గా ఉంది. అంటే 10.0 శాతం పెరుగుదల నమోదైంది.

దేశ తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ తలసరి ఆదాయమూ దాదాపు నాలుగు పాయింట్లు ఎక్కువగా ఉంది. మరోవైపు విజన్ 2020లో చివరి ఐదేళ్ల సగటు రేటు 13.4 శాతం కంటే రెండు రాష్ట్రాలూ ఎక్కువగానే ఉన్నాయి.

(నోట్: లక్ష్యాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గణాంకాల ఆధారంగా నిర్దేశించారు.)

రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు

విజన్: రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు 2015-2020 మధ్య 14.0 శాతంగా ఉండాలి. 1995 నుంచి 2020ల సగటు 10.3 శాతంగా ఉండాలి.

పరిస్థితి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే ప్రకారం.. 2018-19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు 15.3 శాతంగా అంచనా వేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది 16.1 శాతంగా నమోదైంది.

తెలంగాణ విషయంలో 2019-19 జీఎస్‌డీపీ వృద్ధి రేటు 15.0 శాతంగా అంచనా వేశారు. 2017-18లో ఇది 14.3 శాతంగా ఉంది.

భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.8 శాతంగా అంచనా వేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది 7.2 శాతంగా నమోదైంది.

భారత్ జీడీపీతో పోల్చినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల జీడీపీ వృద్ధి రేటు రెండింతలు ఉండటం విశేషం. మరోవైపు విజన్ 2020లో నిర్దేశించిన చివరి ఐదేళ్ల సగటు 14.0 కంటే రెండు రాష్ట్రాల వృద్ధి రేటు ఎక్కువగానే ఉంది.

జనాభా వృద్ధి రేటు

విజన్: జనాభా వృద్ధి రేటు 2015-2020 మధ్య 0.5 శాతానికి మించకూడదు. 1995 నుంచి 2020ల వార్షిక సగటు 0.8 శాతంగా ఉండాలి.

పరిస్థితి: 1995 నుంచి 2000 మధ్య సగటున ఏడాదికి 1.3 శాతంగానున్న జనాభా వృద్ధి రేటును 2015 నుంచి 2020 మధ్య 0.5 శాతానికి కట్టడి చేయాలని.. 1995 నుంచి 2020 మధ్య సగటు 0.8 శాతానికి మించకూడదని విజన్ 2020లో లక్ష్యం నిర్దేశించారు.

అయితే.. 2001-2011 దశకంలో ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధిరేటు 11 శాతంగా నమోదైంది. సంవత్సరాల వారీగా చూస్తే ఇది 1.1 శాతంగా ఉంది. తెలంగాణ జనాభా వృద్ధి రేటు 13.58 శాతంగా నమోదైంది. అంటే వార్షిక వృద్ధిరేటు 1.35 శాతం.

మరోవైపు భారత్ జనాభా వృద్ధి రేటు 2001-11కుగాను 17.7 శాతం నమోదైంది. వార్షిక వృద్ధి రేటు 1.77 శాతం. దేశ జనాభా వృద్ధి రేటు కంటే రెండు తెలుగురాష్ట్రాలు తక్కువగానే ఉన్నప్పటికీ.. విజన్ 2020 లక్ష్యాలను మాత్రం అందుకోలేదు.

విజన్ 2020

రంగాల వారీగా వృద్ధి రేటు లక్ష్యాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందాలో కూడా దార్శనిక పత్రంలో సూచించారు. రంగాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. ఈ రంగం వృద్ధి రేటు ఎలా ఉండాలో పేర్కొన్నారు.

వ్యవసాయంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వృద్ధి రేటు కలిపిఉంది.

ఆంధ్రప్రదేశ్‌ మూడు రంగాల్లోని అనుకున్న లక్ష్యాలను చేరుకోగలిగింది. తెలంగాణ మాత్రం పరిశ్రమల వృద్ధి రేటులో కాస్త వెనుకబడింది.

విజన్ 2020

ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో వాటా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందాలో కూడా దార్శనిక పత్రంలో సూచించారు. రంగాల వారీగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవల పరిమాణంలో 2020లో ఎలా ఉండాలో నిర్దేశించారు.

సేవల పరిమాణం నిర్దేశించిన స్థాయిలో రెండు రాష్ట్రల్లోనూ పెరగలేదు.

పరిశ్రమల వాటా మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో పెరగ్గా.. తెలంగాణలో ఎలాంటి పురోగతీ కనిపించలేదు.

వ్యవసాయం పరిమాణంలో.. లక్ష్యానికి చాలా దూరంలోనే రెండు రాష్ట్రాలు ఉండిపోయాయి.

పేదరిక నిర్మూలన

విజన్: 2020 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా నిర్దేశించారు. వృద్ధులు, దివ్యాంగులు, సాయం అవసరమైనవారికి తోడ్పాటు అందించాలి.

పరిస్థితి: 2018 మార్చి 13న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మల్టీ డైమెన్షియల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) రిపోర్ట్‌ను విడుదల చేశారు. పాఠశాల హాజరు శాతం, పోషక స్థాయిలు, సురక్షిత మంచి నీరు సహా పది సూచీల ఆధారంగా ఈ రిపోర్ట్‌ను తయారుచేశారు. దీనిలో 21 శాతం మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మల్టీ డైమెన్షియల్ పావర్టీతో బాధపడుతున్నట్లు తేలింది.

నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) గణాంకాల ప్రకారం.. 2012నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు 9.2 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా అయితే ఇది 21.9 శాతం.

అంటే రెండు రాష్ట్రాల్లోనూ పేదరిక నిర్మూలన సాధ్యపడలేదు.

విద్య

విజన్: 2010నాటికి సంపూర్ణ అక్షరాస్యత (ప్రాథమికం) సాధించాలి. బాలికల విద్యను ప్రోత్సహించాలి. వృత్తి విద్య, ఉన్నత కోర్సులపై దృష్టి సారించాలి.

పరిస్థితి: 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67 శాతం. దీనిలో బాలురది 74.9 శాతం కాగా. . బాలికలది 59.1 శాతం. దేశ అక్షరాస్యత రేటు 74.04 శాతంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే.. అప్పటి 35 రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 31వ స్థానంలో ఉంది. అంటే రెండు సంపూర్ణ ప్రాథమిక అక్షరాస్యత సాధ్యపడలేదు.

వైద్యం చేస్తున్న యువతి

ఫొటో సోర్స్, iStock

ఆరోగ్యం

విజన్: అందరికీ ప్రైమరీ, సెకండరీ హెల్త్‌కేర్ అందేలా చూడాలి. టెర్షియరీ హెల్త్ కేర్‌లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. వ్యాధుల నియంత్రణపై దృష్టిపెట్టాలి.

పరిస్థితి: నీతీ ఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. తెలంగాణ ర్యాంకు 11. జననాల రేటు, లింగ నిష్పత్తి సహా 23 ఆరోగ్య సూచీల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు.

పర్యావరణం

విజన్: 2020నాటికి అందరూ ఆరోగ్యకర పరిసరాల్లో జీవిస్తారు. స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన మంచినీటిని ఆస్వాదిస్తారు.

పరిస్థితి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నదీ జలాలు కోలిఫోమ్ బ్యాక్టీరియాతో కలుషితం అవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) అధ్యయనంలో తేలింది. తుంగభద్ర, నాగావళితోపాటు గోదావరి, కృష్ణ నదులదీ ఇదే పరిస్థితని తెలిపింది.

మరోవైపు కలుషితమైన గాలి కారణంగా 2017లో ఆంధ్రప్రదేశ్‌లో 45,525 మంది, తెలంగాణలో 26 వేల మంది మరణించినట్లు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయనంలో తేలింది. ఏపీలో చనిపోయిన 70ఏళ్లలోపు వ్యక్తుల్లో 48.7 శాతం మరణాలకు ఏదో ఒక రూపంలో గాలి కాలుష్యమే కారణమైంది. తెలంగాణలో ఆ సంఖ్య 50.4 శాతంగా ఉంది.

ఆవిష్కరణలు

విజన్: వ్యవసాయం, వస్తూత్పత్తి, మెరుగైన సేవల కోసం ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికలను ప్రోత్సహించాలి.

పరిస్థితి: ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతల్లో రాష్ట్రాల పురోగతిని అంచనా వేసేందుకు ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ (ఐఐఐ)ను నీతీఆయోగ్ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. 2019లో ఆవిష్కరణల ప్రోత్సహంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 10.

తెలుగు రాష్ట్రాలకు పొరుగునున్న కర్ణాటక దీనిలో మొదటి ర్యాంకు ఒడిసిపట్టడం విశేషం.

ప్రభుత్వంలో పారదర్శకత, సుపరిపాలన

విజన్: ప్రభుత్వాన్ని పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, ప్రతిస్పందించేలా మార్చాలి.

పరిస్థితి: సుపరిపాలనలోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ (జీజీఐ) పేరుతో మోదీ ప్రభుత్వం వీటిని విడుదల చేసింది. దీని ప్రకారం.. సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ 5.05 స్కోర్‌తో ఐదో స్థానంలో ఉండగా.. తెలంగాణ 4.83 స్కోర్‌తో 11వ స్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌కు పొరుగు రాష్ట్రమైన తమిళనాడు దీనిలో 5.62 స్కోర్‌తో ప్రథమ స్థానం దక్కింది.

మౌలిక సదుపాయాల కల్పన

విజన్: పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు లాంటి వనరులను ప్రజలకు కల్పించాలి. ఇవి వారి భవిష్యత్తును సంపూర్ణంగా మార్చగలవు.

పరిస్థితి: మౌలిక సదుపాయాల కల్పనలో భారత్‌లోని రాష్ట్రాలకు ఇండియా టుడే ర్యాంకులు ప్రకటించింది. స్టేట్ ఆఫ్ ది స్టేట్స్-2018 పేరుతో వీటిని విడుదల చేసింది. దీనిలో ఆంధ్రప్రదేశ్‌కు మూడో ర్యాంకు రాగా.. తెలంగాణ 11వ ర్యాంకులో ఉంది.

స్త్రీ, పురుషుల సమానత్వం

విజన్: సమాజంతోపాటు ఆర్థిక వ్యవస్థలో పురుషులతో సమానంగా పోటీపడేలా మహిళలు, బాలికలకు అవసరమైన సాధికారత, మద్దతు కల్పించాలి.

పరిస్థితి: అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సర్వే 2017-18 ప్రకారం.. స్ర్రీ, పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్సాసంలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో ఉన్నాయి. పాయింట్ల వారిగా చూస్తే ఏపీలో 16, తెలంగాణలో 19 పాయింట్ల తేడా ఉంది. దేశ వ్యాప్తంగా వ్యత్యాసం 17 పాయింట్లు. అంటే ఈ వ్యత్యాసం దేశ సగటు కంటే తెలంగాణలో ఎక్కువగా ఉంది.

2015లో ఈ విజన్ 2020 డాక్యుమెంట్‌ను చంద్రబాబు నాయుడు అప్‌డేట్ చేశారు. దీనిలో కొన్ని మార్పులతో 2029 విజన్‌ను రూపొందించారు. దీనికి విజన్ 2.0గా నామకరణం చేశారు.

అబ్దుల్ కలామ్

ఫొటో సోర్స్, facebook/TDP.Official

ఇది ఇండియా విజన్ 2020

కలాం విజన్‌ 2020లోని లక్ష్యాలు, ప్రణాళిక సంఘం నివేదికలోని లక్ష్యాలు దాదాపు ఒకేలా ఉంటాయి. నేడు వాటిలో ఎన్నింటికి చేరుకున్నామో ఓసారి పరిశీలిద్దాం..

''లక్ష్యాలు అస్పష్టం.. సామాజిక లక్ష్యాలను అంచనా వేయలేం''

ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పత్రంలోని పేదరికం, ఆరోగ్యం, పర్యావరణం తదితర సామాజిక అంశాలపై నిర్దేశించిన లక్ష్యాలు అస్పష్టంగా ఉన్నాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం సోషియాలజీ ప్రొఫెసర్ డా. డి.రామారావు అభిప్రాయపడ్డారు.

''దార్శనిక పత్రంలో ఆదాయ పెరుగుదల రేటు, రాష్ట్ర స్థూల వృద్ధి రేటు లక్ష్యాలను రెండు తెలుగు రాష్ట్రాలూ చేరుకోగలిగాయి. ఆర్థిక పరమైన లక్ష్యాలను మనం ఆర్థిక సర్వే, ఇతర నివేదికల ఆధారంగా అంచనా వేయగలం. అయితే ఆరోగ్యం, పర్యావరణం తదితర అంశాలపై లక్ష్యాలను అంచనా వేయడం కష్టం. 'ఆరోగ్యకర, సుసంపన్న సమాజం కోసం చిన్న కుటుంబాలను ప్రోత్సహించాలి. చిన్నారులకు సంతోషకర జీవితం అందించాలి. పాలనలో ప్రజల స్వరం గట్టిగా వినిపించేలా చూడాలి'లాంటి లక్ష్యాలను అంచనా వేయడం కష్టం' అదే ఇండియా విజన్ 2020 తరహాలో జీడీపీలో ఇంత శాతం ఈ రంగానికి వెచ్చించాలని ఉంటే స్పష్టంగా ఉండేది''అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)