చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ జనరల్ బిపిన్ రావత్: సీడీఎస్‌గా ఆయన చేయగలిగే, చేయలేని పనులు ఏమిటంటే..

జనరల్ బిపిన్ రావత్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జనరల్ బిపిన్ రావత్‌
    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్‌ 2019లో నియమితులయ్యారు.

త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి, సైన్యాన్ని మరింత పటిష్టం చేయడం సీడీఎస్ బాధ్యత.

సీడీఎస్‌గా జనరల్ రావత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు 2019, డిసెంబర్ 31న అమల్లోకి వచ్చాయి.

మూడేళ్ల క్రితం జనరల్ రావత్ సైన్యాధిపతి పదవి చేపట్టారు. పాకిస్తాన్, చైనా, ఈశాన్య ప్రాంతంలోని సరిహద్దులకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించారు.

సీడీఎస్ పదవిలో ఆయన మూడేళ్లు కొనసాగుతారు.

అయితే, సీడీఎస్ పదవిలో జనరల్ రావత్ చేయగలిగే పనులతో పాటు కొన్ని చేయలేని పనులు కూడా ఉన్నాయి. అవేంటంటే..

జనరల్ బిపిన్ రావత్

ఫొటో సోర్స్, PTI

చేసేవి

  • రక్షణ మంత్రికి ముఖ్య సైనిక సలహాదారు హోదాలో త్రివిధ దళాలకు సంబంధించిన వ్యవహారాలు ఆయన పరిధిలో ఉంటాయి. డిఫెన్స్ అక్విజిషేన్ కౌన్సిల్ (డీఏసీ), డిఫెన్స్ ప్లానింగ్ కమిషన్ (డీపీసీ) లాంటి కీలకమైన రక్షణ శాఖ సంస్థల్లో ఆయనకు చోటు ఉంటుంది.
  • రక్షణ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ (డీఎంఏ)కు కార్యదర్శిగా ఉంటారు. రక్షణ శాఖలో ఇది ఐదో విభాగం. అన్నింటికన్నా కొత్తది కూడా.
  • మిగతా దళాల అధిపతుల్లాగే సీడీఎస్‌కు జీతభత్యాలు ఉంటాయి. అయితే, త్రివిధ దళాల అధిపతుల పదవీవిరమణ వయసు 62 ఏళ్లు కాగా, సీడీఎస్ పదవీవిరమణ వయసు 65 ఏళ్లు ఉంటుంది.
  • సైనికపరమైన కొనుగోళ్లు, శిక్షణ, ఖాళీల భర్తీకి సంబంధించిన బాధ్యతలు చూస్తారు. మౌలిక వసతుల వినియోగం మెరుగ్గా జరిగేలా చర్యలు తీసుకుంటారు.
  • 'జాయింట్/థియేటర్ కమాండ్'ను ఏర్పాటు చేసి సైనిక కమాండ్ల పునర్వ్యవస్థీకరణ కోసం పనిచేస్తారు.
  • అండమాన్ నికోబార్, స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్, సైబర్, అంతరిక్ష, ప్రత్యేక బలగాల వంటి ట్రై-సర్వీస్ ఏజెన్సీల అధిపతిగా ఉంటారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీఓఏస్‌సీ)కి శాశ్వత ఛైర్మన్‌గా ఉంటారు.
  • న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (ఎన్‌సీఏ)కి సైనిక సలహాదారుడిగా సేవలు అందిస్తారు.
  • బడ్జెట్ అంచనాలు, త్రివిధ దళాల ప్రాథమ్యాల ఆధారంగా డిఫెన్స్ క్యాపిటల్ అక్విజిషన్ స్కీమ్ (డీసీఏపీ), యాన్యువల్ అక్విజిషన్ స్కీమ్ (ఏఏపీ)లతోపాటు కొత్తగా సమకూర్చుకోవాల్సినవాటికి సంబంధించిన ప్రతిపాదనలను నిర్ణయిస్తారు.
  • దుబారా వ్యయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తారు.
  • వ్యక్తిగత, సంస్థాగత విషయాలకు అతీతంగా రాజకీయ నాయకత్వానికి నిష్పక్షపాతంగా సలహాలు ఇస్తారు.
జనరల్ బిపిన్ రావత్

ఫొటో సోర్స్, PIB

చేయలేనివి

  • డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్-సర్వీస్‌మెన్ వెల్ఫేర్‌లతోపాటు రక్షణశాఖ ఆధ్వర్యంలోని సైనికేతర అధికారులు, కార్యాలయాలు కూడా సీడీఎస్ అధికార పరిధిలోకి వస్తాయా? ఈ విభాగాలకు ఇప్పటికే విడివిడిగా కార్యదర్శులున్నారు. అలాంటప్పుడు సీడీఎస్ ఐదో కార్యదర్శి అవుతారు.
  • త్రివిధ దళాల్లా సీడీఎస్ వ్యక్తిగతంగా కమాండ్ చేసే దళాలు ఏవీ ఉండవు.
  • త్రివిధ దళాల అధిపతులకు ఆదేశాలు గానీ, ఎలాంటి సైనికాదేశాలు గానీ సీడీఎస్ ఇవ్వలేరు. త్రివిధ దళాల అధిపతులకు ఆయన పైఅధికారి కాదు. వారితో సమానమైన హోదానే సీడీఎస్‌ది కూడా.
  • సర్వీస్ స్పెసిఫిక్ అక్విజేషన్ స్కీమ్‌ను, ముఖ్యంగా క్యాపిటల్ అక్విజిషన్ (కొత్త హార్డ్‌వేర్) లాంటివాటిని సీడీఎస్ అడ్డుకోలేరు. అయితే, ప్రాధాన్యతలను మాత్రం సూచించొచ్చు. ఆ సూచనల ప్రకారం వాటిని అమలు చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)