మహారాష్ట్ర: గర్భిణి తల నరికి దారుణంగా హత్య చేసిన తల్లి, తమ్ముడు

కీర్తి అలియాస్ కిషోరి మోటే

ఫొటో సోర్స్, PRASHANT TRIBHUWAN

ఫొటో క్యాప్షన్, కీర్తి అలియాస్ కిషోరి మోటే
    • రచయిత, నితిన్ సుల్తానే
    • హోదా, బీబీసీ కోసం

మరో పరువు హత్య ఘటనతో మహారాష్ట్ర ఉలిక్కిపడింది. ఔరంగాబాద్ జిల్లాలోని వైజాపూర్ తాలూకా గోయెగావ్‌లో ఓ గర్భిణిని ఆమె తల్లి, సోదరుడు దారుణంగా నరికి చంపారు.

ఆదివారం జరిగిన ఈ హత్య కలకలం రేపింది. తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎదిరించి ఆ యువతి ఇంట్లోంచి పారిపోయి తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నారు. దాంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆమెపై కోపం పెంచుకున్నారు.

హత్యకు గురైన యువతి రెండు నెలల గర్భిణి. ఈ సంగతి ఆమె తల్లికీ, సోదరుడికీ తెలుసు. హత్య తర్వాత తల్లి, సోదరుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. పోలీసుల ఎదుట తమ నేరాన్ని అంగీకరించారు.

ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.

హత్య చేసిన తరువాత నిందితులిద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు

ఫొటో సోర్స్, PRASHANT TRIBHUWAN

ఫొటో క్యాప్షన్, హత్య చేసిన తరువాత నిందితులిద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు

అమ్మాయిదీ, అబ్బాయిదీ ఒకే ఊరు

హత్యకు గురైన అమ్మాయి పేరు కీర్తి అలియాస్ కిషోరి మోటే. ఆ అబ్బాయి పేరు అవినాష్ థోర్. ఇద్దరూ గోయెగావ్ వాసులే. ఈ గ్రామం జనాభా సుమారు 500. అవినాష్ తమ గ్రామానికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నారు.

కీర్తి, అవినాష్ ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ, వీరి ప్రేమకు కీర్తి కుటుంబం అడ్డు చెప్పింది. రెండు కుటుంబాల మధ్య ఉన్న సామాజిక, ఆర్థిక అంతరాలే ఇందుకు కారణమని స్థానిక జర్నలిస్ట్ ప్రశాంత్ త్రిభువన్ బీబీసీకి తెలిపారు.

అయితే, కీర్తి, అవినాష్ ఇవేవీ లెక్క చేయకుండా, కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో వీళ్లిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. తరువాత, అలందిలో వివాహం చేసుకున్నారు.

పెళ్లి తరువాత ఇద్దరూ స్వగ్రామానికి వచ్చారు. అప్పటి నుంచి కీర్తి లడ్‌గావ్‌లోని తన అత్తవారింట్లోనే ఉంటున్నారు. ఆమెకు తన తల్లిదండ్రులతో సంబంధాలు తెగిపోయాయి. అయితే, ఈ హత్య ఘటనకు వారం ముందు కీర్తి తల్లి శోభ మోటే కూతురింటికి వెళ్లారు. ఆమెతో కబుర్లు చెప్పి, టీ తాగి వచ్చారు.

తల నరికి దారుణంగా హత్య చేశారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ 5 ఆదివారం నాడు కీర్తి తల్లి శోభా మోటే, సోదరుడు సంజయ్ మోటే ఆమెను కలవడానికి లడ్‌గావ్‌లోని వాళ్లింటికి వెళ్లారు. ఆ సమయంలో కీర్తి.. పక్కనే ఉన్న తమ పొలంలో కలుపు తీస్తున్నారు. అమ్మ, తమ్ముడు రావడం చూసి ఆమె సంతోషంతో ఇంటికి పరిగెత్తారు.

ఇద్దరికీ మంచినీళ్లు ఇచ్చి కూర్చోబెట్టిన తరువాత టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్లారు. అదే సమయంలో తల్లీకొడుకులిద్దరూ కీర్తిని దారుణంగా హత్య చేశారు. సంజయ్ ఒక పదునైన ఆయుధంతో కీర్తి తల నరికి శరీరం నుంచి వేరు చేశారు. తెగిన తలను బయటకు తీసుకొచ్చి అక్కడ గుమికూడిన వారందరికీ చూపించారు.

ఆ తరువాత, తలను అక్కడే ఇంటి వాకిలిలో ఉంచి ఇద్దరూ వెనుదిరిగారు. బైక్‌పై నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.

అప్పటికి కీర్తి రెండు నెలల గర్భిణి. ఈ సంగతి ఆమె తల్లికి, తమ్ముడికి తెలుసనీ, అయినా ఇద్దరూ ఇంత దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.

కీర్తిని తన ఇంట్లోనే హత్య చేశారు

ఫొటో సోర్స్, PRASHANT TRIBHUWAN

ఫొటో క్యాప్షన్, కీర్తిని ఆమె ఇంట్లోనే హత్య చేశారు

'ఇలాంటి ఘటనలకు కారణం పురుషాధిక్య సమాజమే'

కన్న తల్లే ఇలాంటి దారుణానికి పాల్పడడంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. "కొడుకు చెప్పుడు మాటలకు తల్లి లొంగిపోయి ఉండవచ్చు" అని సామాజిక కార్యకర్త మంగళ ఖివాంసారా అభిప్రాయపడ్డారు.

"పురుషాధిక్య సమాజంలో పరువు, ప్రతిష్ట లాంటి అంశాలను మహిళల మెదడులోకి చొప్పిస్తారు. కుటుంబ పరువు కాపాడాల్సిన బాధ్యతను స్త్రీల నెత్తి మీదే పెడతారు. అందుకే కొన్నిసార్లు మహిళలే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటారు" అన్నారామె.

"ఇదంతా కుటుంబంతో మొదలవుతుంది. కుటుంబం అధికారం మొత్తం పురుషుడి చేతిలో ఉంటుంది. ఇంట్లో మహిళలు అన్ని రకాలుగా అణచివేతకు గురవుతుంటారు. రాజ్యాంగం స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కులు కల్పించినప్పటికీ పురుషుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ప్రతి ఇంట్లో స్త్రీ పురుషులిద్దరి మధ్య సమానత్వం సాధించినప్పుడే ఇలాంటి ఘటనలను అరికట్టవచ్చు" అని మంగళ ఖివాంసారా అభిప్రాయపడ్డారు.

ఈ అంశంపై ఇరు కుటుంబాల సభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వీలుపడలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)