హామ్‌ట్రాక్: ముస్లింలు పాలిస్తున్న అమెరికా నగరం

ఫొటో సోర్స్, COURTESY OF AMANDA JACZKOWSKI
- రచయిత, జావోయిన్ ఫెంగ్
- హోదా, బీబీసీ న్యూస్, మిచిగాన్
మిచిగాన్‌లోని హామ్‌ట్రాక్ నగర ప్రధాన వీధిలో నడుస్తుంటే, ప్రపంచ పర్యటనకు వచ్చినట్లుగా ఉంటుంది.
ఈస్ట్రన్ యూరోపియన్ బేకరీ, పోలీష్ సాసేజ్ స్టోర్ వాటి పక్కనే యెమెన్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ స్టోర్, బెంగాలీ బట్టల దుకాణం ఒకే దగ్గర కనబడుతుంటాయి. చర్చి గంటల శబ్ధంతో పాటు, మసీదులో ప్రార్థనలు కూడా వినబడుతుంటాయి.
అయిదు కిలోమీటర్ల పరిధిలో ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ 5 కి.మీ పరిధిలోనే దాదాపు 30 భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తుంటారు.
28 వేల జనాభా కలిగి ఉండే ఈ హామ్‌ట్రాక్ నగరం ఈ నెలలో ఒక కొత్త మైలురాయిని అందుకుంది. ఈ నగరంలో మొత్తం ముస్లిం పాలక వర్గం ఏర్పడింది. ముస్లిం సిటీ కౌన్సిల్‌తో పాటు ముస్లిం మేయర్ ఎన్నికయ్యారు. అమెరికాలో ముస్లిం-అమెరికన్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి.
ఒకప్పుడు వివక్షకు గురైన ముస్లింలు, భిన్న సంస్కృతుల కలయికతో విలిసిల్లుతోన్న ఈ నగరంలో ఇప్పుడు ఒక భాగంగా మారారు. నగరంలో ప్రస్తుతం ముస్లిం జనాభా సగం కంటే ఎక్కువగా ఉంది.
ఆర్థిక అంతరాలు, సామాజిక తారతమ్యాలు, వివిధ మత, సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ హామ్‌ట్రాక్‌లోని ప్రజలు సామరస్యంగా జీవిస్తుంటారు. వీరంతా అమెరికా భవిష్యత్ వైవిధ్య జీవన విధానానికి ఈ నగరాన్ని మంచి కేస్ స్టడీగా చూపిస్తున్నారు.
జర్మన్ సెంటర్ల నగరంగా ప్రారంభమైన నాటి నుంచి తాజా తరం వరకు హామ్‌ట్రాక్ నగర చరిత్రను తరిచి చూస్తే, ఇది అమెరికాలో ముస్లిం మెజార్టీ జనాభా కలిగి ఉన్న తొలి నగరంగా తెలుస్తుంది.
దుకాణాల ముందు అరబిక్, బెంగాలీ సంకేతాలు కనబడతాయి. బంగ్లాదేశ్ ఎంబ్రాయిడరీ వస్త్రాలు, యెమెన్‌కు చెందిన వంపులు తిరిగిన బ్లేడ్ల దుకాణాల డిస్‌ప్లేలలో కనబడతాయి. కస్టర్డ్‌తో నిండిన పోలిష్ డోనట్ 'ప్యాజ్కీ'లను కొనుగోలు చేసేందుకు ముస్లిం ప్రజలు దుకాణాల ముందు బారులు తీరుతారు.
''ఒకే వీధిలో బురఖాలు ధరించిన వారితో పాటు టాటూలు, మినీ స్కర్టులు ధరించిన వారు కూడా ఇక్కడ తిరుగుతుంటారు. ఇలా రెండు సంస్కృతులకు చెందినవారు ఇక్కడ తిరగడం అసాధారణం ఏం కాదు. ఇదే మా నగర ప్రత్యేకత'' అని బోస్నియా వలసదారు జ్లాటన్ సాడికోవిక్ చెప్పారు. ఆయన హామ్‌ట్రాక్‌లో ఒక కేఫ్‌ను నడుపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఆటోమోటివ్ పరిశ్రమకు హామ్‌ట్రాక్ ఒకప్పుడు కేంద్రంగా ఉండేది. తర్వాత జనరల్ మోటార్స్ ఆధిపత్యం ప్రదర్శించడంతో హామ్‌ట్రాక్ వెనకబడింది. 1980ల్లోనే ఈ నగరంలో తొలి కాడిలాక్ ఎల్డోరాడో కారు ఉత్పత్తి అయింది.
20వ శతాబ్ధంలో పోలాండ్ నుంచి వలసలు పెరగడంతో ఈ నగరం ఒక చిన్న స్థాయి 'వార్సా'గా మారిపోయింది. వార్సా అనేది పోలాండ్ దేశ రాజధాని. 1970 నాటికి హామ్‌ట్రాక్ మొత్తం 90 శాతం పోలాండ్ మూలాలున్న వారితో నిండిపోయింది.
అదే దశాబ్ధంలో యూఎస్ కార్ల తయారీ పరిశ్రమ దీర్ఘకాల క్షీణతకు గురైంది. యువ, సంపన్న పోలీష్ అమెరికన్లు శివారు ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభించారు. ఈ మార్పు వల్ల మిచిగాన్‌లోని అత్యంత పేద నగరాల్లో హామ్‌ట్రాక్ కూడా చేరింది. కానీ ఇది మళ్లీ వలసదారులకు ఆకర్షించింది.
గత 30 ఏళ్లలో హామ్‌ట్రాక్ మళ్లీ మారిపోయింది. అరబ్, ఆసియా వలసదారులకు ముఖ్యంగా యెమెన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారికి స్థావరంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇక్కడ నివసిస్తోన్న వారిలో 42శాతం మంది విదేశీయులే. ఇక్కడి మొత్తం జనాభాలో సగానికి పైగా ముస్లిం సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు.
కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ కార్యవర్గాన్ని గమనిస్తే హామ్‌ట్రాక్‌లో మారుతోన్న జనాభా సమీకరణాలను తెలుసుకోవచ్చు. కొత్తగా ఎన్నికైన సిటీ కౌన్సిల్‌లో ఇద్దరు బెంగాలీ అమెరికన్లు, ముగ్గురు యెమెన్ అమెరికన్లు, ఒక పోలీష్ అమెరికన్‌లకు చోటు దక్కింది. వీరంతా ఇస్లాం మతంలోకి మారిపోయారు.
ఎన్నికల్లో 68శాతం ఓట్లను గెలుచుకున్న ఆమేర్ గాలిబ్ అమెరికాలో తొలి యెమెన్ అమెరికన్ మేయర్ కానున్నాడు.
''నాకు గౌరవంగా ఉంది. గర్వంగా అనిపిస్తోంది. ఇది చాలా పెద్ద బాధ్యత అనే విషయం నాకు తెలుసు'' అని 41 ఏళ్ల గాలిబ్ అన్నారు.
ఆయన యెమెన్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. 17 ఏళ్ల వయస్సులో అమెరికాకు వలస వచ్చారు. హామ్‌ట్రాక్ సమీపంలోని కార్ల ప్లాస్టిక్ విడి భాగాలను తయారు చేసే పరిశ్రమలో పనిచేశారు. తర్వాత ఇంగ్లీష్ నేర్చుకొని వైద్యరంగంలో శిక్షణ పొందారు. ప్రస్తుతం హెల్త్‌కేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నారు.
ఒకే దగ్గర నివసిస్తూ కూడా హామ్‌ట్రాక్ ప్రజలు తమ సంస్కృతిక నేపథ్యాలను చక్కగా కాపాడుకుంటున్నారని సిటీ కౌన్సిల్ మెంబర్‌గా ఎన్నికైన అమెండా జాకోవ్‌స్కీ అన్నారు. ''ఇక్కడి ప్రజలు తమ తమ సంస్కృతి పట్ల గర్విస్తున్నారు. అలా కాకుండా వీరంతా కలిసిపోయి ఒకే సంస్కృతిగా రూపొందితే మేం మా ప్రత్యేకతను కోల్పోతాం.''
''ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు, సమూహాల మధ్య ఉన్న భేదాలు తొలిగిపోతాయి'' అని 29 ఏళ్ల అమెండా వ్యాఖ్యానించారు.
''కానీ హామ్‌ట్రాక్, డిస్నీల్యాండ్ కాదు. ఇది ఒక చిన్న ప్రాంతం. ఇక్కడి వారిలో కూడా విభేదాలు ఉన్నాయి'' అని కరెన్ మజేవ్‌స్కీ పేర్కొన్నారు. ఆయన 15 ఏళ్ల పాటు హామ్‌ట్రాక్ మేయర్‌గా పనిచేశారు.
2004లో ఇస్లాం ప్రార్థనల విషయంలో గొడవలు జరిగాయి. మజీద్‌లకు సమీపంలోని బార్లపై నిషేధం విధిస్తే స్థానికంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని కొంతమంది స్థానికులు వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరేళ్ల క్రితం, ముస్లిం మెజారిటీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తొలి అమెరికా నగరంగా హామ్‌ట్రాక్ ఘనత సాధించినప్పడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు ఇక్కడ వాలిపోయాయి.
కొన్ని మీడియా సంస్థలు, ముస్లిం మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటుతో అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని వార్తలు రాసుకొచ్చాయి.
మేయర్‌గా ఉండటం భయం కలిగిస్తుందా అని కరెన్ మజెవ్‌స్కీని ఒక జాతీయ టీవీ ఛానెల్ యాంకర్ అడిగారు.
ముస్లింల నియంత్రణలోకి వెళ్లిన సిటీ కౌన్సిల్... హామ్‌ట్రాక్ నగరంలో షరియా లా అమలు చేయొచ్చనే ఊహాగానాలు కూడా వెల్లువెత్తాయి.
''ఇలాంటి రకమైన ఊహాగానాలు, మాటలు విన్నప్పుడు హామ్‌ట్రాక్ ప్రజలు కళ్లు తేలేస్తారని'' అమెండా అన్నారు.
యూఎస్ సెన్సస్ బ్యూరో మత ప్రాతిపదికన డేటాను సేకరించదు. కానీ 2020లో అమెరికాలో 38.5 లక్షల మంది ముస్లిం జనాభా ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది.
అమెరికా మొత్తం జనాభాలో ఇది 1.1 శాతం మాత్రమే. 2040 నాటికి క్రిస్టియన్ల తర్వాత అమెరికాలో ముస్లింలు రెండో అతిపెద్ద కమ్యూనిటీగా మారే అవకాశం ఉంది.
అమెరికాలో వారి ఉనికి పెరుగుతున్నప్పటికీ, ఇప్పటికీ ముస్లిం సమాజం పక్షపాతానికి గురైవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
9/11 దాడులు జరిగి 20 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అమెరికాలోని ముస్లింలను, ఇతర అరబ్ అమెరికన్లను ఇస్లామోఫోబియా వెంటాడుతూనే ఉంది. ముస్లిం అమెరికన్స్‌లో దాదాపు సగం వయోజనులు, తాము వ్యక్తిగతంగా ఏదో ఒక పద్ధతిలో వివక్షను ఎదుర్కొన్నామని 2016లో ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో చెప్పారు. ముస్లిం మెజార్టీ దేశాల నుంచి వలసలను నిషేధిస్తున్నామని ఆ సమయంలోనే డోనాల్డ్ ట్రంప్ ఒక ప్రతిపాదన తెచ్చారు. మిగతా మతాల వారితో పోలిస్తే ముస్లిం ప్రజలపై నేటివ్ అమెరికన్లు ఎక్కువ వ్యతిరేకతను చూపుతారని పరిశోధనల్లో కూడా తేలింది.
సగానికి పైగా అమెరికన్లు తమకు వ్యక్తిగతంగా ముస్లింలు ఎవరూ తెలియదని చెప్పారు. మిగతా వారు, అన్ని మతాల కంటే ఇస్లాం మతం హింసను ఎక్కువగా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.
వ్యక్తిగత పరిజ్ఞానం, ఇస్లామోఫోబియాను ఎలా తగ్గిస్తుందో చెప్పడానికి హామ్‌ట్రాక్ అనేది సజీవ సాక్ష్యం.
9 /11 దాడుల అనంతరం, సిటీ కౌన్సిల్ మెంబర్ పదవి కోసం పోటీ చేసిన షాహబ్ అహ్మద్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది.
''విమానంలో చోటు దక్కని ఆ 20వ హైజాకర్‌నని నేనే అని, నా గురించి నగరం అంతటా ఫ్లయర్లు అంటిచారు'' అని అహ్మద్ గుర్తు చేసుకున్నారు. ఆయనో బెంగాళీ అమెరికన్. 2001 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన తన ఇరుగుపొరుగు వారి ఇంటికి వెళ్లి తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు.
ఆ తర్వాత రెండేళ్లకు ఆయన మళ్లీ ఎన్నికయ్యారు. హామ్‌ట్రాక్ నగరానికి తొలి ముస్లిం నగర అధికారిగా నియమితులయ్యారు.
అప్పటి నుంచి, నగరంలో ముస్లిం సమాజానికి మద్దతు పెరిగింది.

2017లో ట్రంప్ ప్రభుత్వం అమెరికా ప్రవేశాలపై నిషేధం విధించినప్పుడు, ఇక్కడి స్థానికులందరూ కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
''హామ్‌ట్రాక్‌లో నివసించాలంటే ఇతర ప్రజలను గౌరవించాలనే సంగతి ఇక్కడి ప్రజలందరికీ తెలుసు కాబట్టే, వారంతా ఏకమయ్యారు'' అని 'హామ్‌ట్రాక్, యూఎస్ఏ' అనే డాక్యుమెంటరీ సహ డైరెక్టర్ రజీ జాఫ్రీ పేర్కొన్నారు.
జాతీయంగా కూడా రాజకీయాల్లో ముస్లిం అమెరికన్లు ఉనికి చాటుకుంటున్నారు. 2007లో మిన్నెసోటా డెమొక్రాట్ నేత కేత్ ఎల్లిసన్ తొలి ముస్లిం నేతగా అవతరించారు. ప్రస్తుతం యూఎస్ కాంగ్రెస్‌లో నలుగురు ముస్లిం నేతలు ఉన్నారు.
ఈనెలలో హామ్‌ట్రాక్ ఎన్నికలు జరిగిన రోజున, పోలింగ్ స్టేషన్ల ఎదుట డజన్ల కొద్దీ స్థానికులు గుమిగూడారు. ''నేను ఓటు వేశాను'' అనే స్టిక్కర్లను పట్టుకొని వారంతా ఒకరినిఒకరు అభినందించుకున్నారు.
''ప్రజాస్వామ్యంలో భాగం అయ్యేందుకు వలసదారులు కూడా ఉత్సాహంగా చూశారు'' అని జకోవ్‌స్కీ చెప్పారు.
దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే, ఇక్కడ కూడా తీవ్రమైన సాంస్కృతిక చర్చలు జరుగుతుంటాయి.
జూన్‌లో సిటీహాల్ ముందర 'గే' ప్రైడ్ ఫ్లాగ్‌ను ఎగురవేసేందుకు నగర ప్రభుత్వం ఆమోదించినప్పుడు కొందరు స్థానికులు మండిపడ్డారు. నగరంలోని పలు ప్రైవేట్ వ్యాపార సముదాయాలు, ఇళ్లు దగ్గర ఉన్న జెండాలను కూల్చేశారు. అందులో అమెండాకు చెందిన వింటేజ్ బట్టల దుకాణం బయట ఏర్పాటు చేసిన జెండాను కూడా చించేశారు. ''ఇలాంటి చర్యలు ప్రజలకు చాలా ప్రమాదకరమైన సందేశాలను పంపుతాయి'' అని అమెండా వ్యాఖ్యానించారు.
గంజాయి కూడా ఇక్కడ వివాదానికి వనరుగా మారింది. హామ్‌ట్రాక్‌లో మూడు గంజాయి డిస్పెన్సరీలను ప్రారంభించడంతో కొంతమంది ముస్లిం, పోలీష్ క్యాథలిక్ కమ్యూనిటీలకు చెందిన ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సంప్రదాయ ముస్లిం సమాజాల్లో మహిళల రాజకీయ భాగస్వామ్యం లేకపోవడం పట్ల కొంతమంది నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో మేయర్‌గా గెలుపొందిన తర్వాత గాలిబ్ ఇచ్చిన విందులో యెమెన్ అమెరికన్ మద్దతుదారులు పాల్గొన్నారు. 100 మందికి పైగా పాల్గొన్న ఆ విందులో అందరూ పురుషులే ఉన్నారు.
రాజకీయ ప్రచారంలో మహిళల కూడా పాల్గొన్నారని గాలిబ్ చెప్పారు. ''లింగం ప్రకారం విభజన అనేది సంప్రదాయకంగా వస్తోంది. ఇప్పుడు అమెరికా వారసత్వాన్ని పునికిపుచ్చుకుంటోన్న నేటి తరం యువత కూడా దీనిపై సవాలు చేస్తోంది'' అని గాలిబ్ పేర్కొన్నారు.
అమెరికాలోని రస్ట్ బెల్ట్ నగరాల తరహాలోనే హామ్‌ట్రాక్ కూడా మౌలిక వసతుల లేమి, పరిమిత ఆర్థిక వనరులు లాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. వేసవిలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని మురికి కాలువలు పొంగిపొర్లడంతో పాటు పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. నగరంలోని తాగునీటి నమూనాల్లో అధిక స్థాయిలో సీసం నిక్షేపాలు బయల్పడ్డాయి. ఈ అంశం జాతీయ స్థాయిలో అందర్నీ ఆకర్షించింది. నగరంలో సగానికి పైగా జనాభా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. తాజాగా ఏర్పాడిన కొత్త నాయకత్వం పరిష్కరించాల్సిన వాటిలో ఇవి కొన్ని ముఖ్యమైన సమస్యలు.
''ముస్లిం మెజార్టీ ఉన్న నగరంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది? అన్నిచోట్లలాగే గజిబిజిగా, అర్థం కాకుండా ఉంటుంది.'' అని డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత జాఫ్రి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశం బొగ్గు వినియోగాన్ని ఆపేస్తే ఏం జరుగుతుంది?
- బిడ్డ నల్లగా పుట్టింది.. డీఎన్ఏ పరీక్ష చేసి ఈ జంట తెలుసుకున్న ‘భయానక’ నిజం ఏంటంటే..
- శిథిలమైన ఇంటిలో నిద్రిస్తోన్న చిన్నారి ఫొటోకు మొదటి బహుమతి
- టీ20 వరల్డ్ కప్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
- జిమ్మీ నీషామ్: ఒకప్పుడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్నాడు కానీ, ఇప్పుడు న్యూజీలాండ్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాడు
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- కంగనా రనౌత్: ‘1947లో లభించింది స్వాతంత్ర్యం కాదు, భిక్ష.. మనకు స్వాతంత్ర్యం 2014లో వచ్చింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













