డోనల్డ్ ట్రంప్ అమెరికా చరిత్రలో ఎలా గుర్తుండిపోతారు?

- రచయిత, రీతు ప్రసాద్
- హోదా, బీబీసీ న్యూస్
గత బుధవారం మధ్యాహ్నంతో అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ శకం ముగిసింది. ఆయన అధికారంలో ఉన్న నాలుగు సంవత్సరాలు ప్రతిరోజూ ఒక సంచలనమే అన్నట్లుగా సాగాయి.
అమెరికా చరిత్రలో ఆయన స్థానమేంటి? ఆయన హయాంలోని కీలక అంశాలపై అభిప్రాయాలు తెలపాలని చరిత్రకారులు, నిపుణులను కోరింది బీబీసీ.
వారు చెప్పిన అభిప్రాయాల నిడివిని తగ్గించి సంగ్రహంగా పొందుపరిచాం.

రైట్ వింగ్‌తో ట్రంప్ అనుబంధం
- మాథ్యూ కాంటినెటి, అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇనిస్టిట్యూట్
ట్రంప్ పాలనా కాలంలో ఏం జరిగింది?
అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు రెండుసార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడిగా మిగిలిపోయారు ట్రంప్. ఎన్నికల్లో అంతా మోసం జరిగిందంటూ ఆయన తన అనుచరులను రాజధాని వాషింగ్టన్‌లో దాడులకు పురికొల్పారు.
బలవంతంగానైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నించారు. ట్రంప్ గురించి రాసేటప్పుడు చరిత్రకారులు ఆయనను ఈ హింసాత్మక ఘటనల కోణం నుంచే చూస్తారు. ట్రంప్ రైటిస్ట్ విధానాలు, 2017నాటి చార్లొట్స్ విల్లే నిరసనలను క్రూరంగా అణచివేసిన తీరును చరిత్రకారులు తప్పకుండా గుర్తు పెట్టుకుంటారు.
ఆయన పాలనా కాలంలో నడిచిన రైట్‌వింగ్ అతివాదం, అవి సృష్టించి ప్రచారం చేసిన కుట్ర సిద్ధాంతాలు, వాటిని ఆయన ప్రోత్సహించిన విధానం కచ్చితంగా మరిచిపోలేనిది.

ఫొటో సోర్స్, Getty Images
గుర్తు పెట్టుకోదగింది ఏంటి?
ఆయన తనకు ముందున్న అధ్యక్షుల మాదిరిగా ఓటమిని అంగీకరించి, వారసులకు శాంతియుతంగా, హుందాగా పగ్గాలు అప్పగించి ఉంటే విధ్వంసకారుడే అయినా పరిస్థితులను అర్ధం చేసుకుని వ్యవహరించిన అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచి పోయేవారు
కరోనా మహమ్మారికి ముందు డోనల్డ్ ట్రంప్ దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చే నేతగా కనిపించారు. చైనా విషయంలో అమెరికన్ల అభిప్రాయాన్ని మార్చి, యుద్ధభూమి నుంచి టెర్రరిస్టులను తరిమేసిన నేత అన్న అభిప్రాయం కలిగించారు. అంతరిక్ష కార్యక్రమాలను పునరుద్ధరించడమే కాకుండా, సుప్రీంకోర్టులో సంప్రదాయవాదులకు పెద్దపీట వేసిన నేతగా మారారు. కరోనా మహమ్మారికి యుద్ధ ప్రాతిపదికన టీకాను సిద్ధం చేయించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.

ప్రపంచ నాయకత్వానికి గండి
– ప్రొ.లారా బెల్‌మాంటే, వర్జీనియాటెక్ కాలేజ్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యూమన్ సైన్సెస్
ట్రంప్ కాలంలో ఏం జరిగింది?
అమెరికాకు ఉన్న ప్రపంచ నాయకత్వ హోదాను ఆయన దూరం చేశారు. ఇంకో అడుగు ముందుకేసి తన పని తాను చూసుకుని, తన కలుగులో ఉండిపోయే ధోరణిని అవలంబించారు.
ఈ విధానం విఉయవంతమైందని నేను అనుకోను. దీనివల్ల ప్రపంచంలో అమెరికాకు ఉన్న పరపతి పూర్తిగా పడిపోయింది. దీని ఫలితాలు మున్ముందు చూడవలసి ఉంది.
2018లో హెల్సింకిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసిన ఆయన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ అమెరికా పతనావస్థకు అద్దం పట్టింది. అమెరికా ఎన్నికల్లో రష్యా ఇంటెలిజెన్స్ జోక్యం విషయంలో ఆయన పుతిన్‌వైపు నిలిచారు.
ఒక అమెరికా అధ్యక్షుడు ఇలా అప్రజాస్వామికపు విధానాలకు మద్దతిచ్చిన ఘటనలను నేనెప్పుడూ చూడలేదు.
పారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం, ఇరాన్ అణు ఒప్పందం నుంచి బైటికి రావడంలాంటివి బహుపాక్షిక సంస్థలు, ఒప్పందాలకు ఆయన చేసిన అవమానానికి నిదర్శనాలుగా నిలిచి పోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
గుర్తు పెట్టుకోదగింది ఏంటి?
టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్దోవాన్‌ను మెచ్చుకోవడం, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశంలాంటివి అమెరికా చెబుతున్న ఉన్నత విలువలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న వారిని తన దారికి తెచ్చుకునే ప్రయత్నం అనవచ్చు.ఇది చాలా విలక్షణమైనదని నేను భావిస్తాను.
అయితే ఆందోళనకరమైన విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా మానవహక్కులను ప్రోత్సహించే బాధ్యత నుంచి, ప్రభుత్వ శాఖల మానవహక్కుల నివేదికలలో మార్పులు, ఎల్జీబీటీలాంటి సమానత్వ అంశాలను చేర్చడంలాంటి బాధ్యతల నుంచి అమెరికా తప్పుకుంది.

ప్రజాస్వామ్యానికి పరీక్ష
- క్యాథరిన్ బ్రౌనెల్, హిస్టరీ ప్రొఫెసర్, పుర్డ్యూ యూనివర్సిటీ
ట్రంప్ పాలనా కాలంలో ఏం జరిగింది?
ట్రంప్, రిపబ్లికన్ పార్టీలోని ఆయన అనుచరులు, మద్దతుదారులు అమెరికా ప్రజాస్వామ్యాన్ని అయోమయ స్థితిలోకి నెట్టడానికి ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
మీడియా సహకారంలో కల్పిత అంశాలను నిజమైనవి చూపించేందుకు ట్రంప్ ప్రయత్నం చేశారని ఒక చరిత్రకారుడిగా నేను చెప్పగలను.ట్రంప్ గత నాలుగేళ్లుగా చెబుతూ వచ్చిన కల్పితాలకు జనవరి 6న క్యాపిటల్ బిల్డింగ్ వద్ద జరిగిన ఘటనలు ప్రతిరూపంగా నిలిచాయి.
రిచర్డ్ నిక్సన్ కాలంలో జరిగిన వాటర్‌గేట్ కుంభకోణం, అభిశంసనలు దశాబ్దాలపాటు చరిత్రలో దొర్లుతున్నట్లుగానే, ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఈ ఘటనలు ట్రంప్ పాలనాకాలన్ని మదింపు వేసే సమయంలో తప్పకుండా తారస పడతాయి.
గుర్తు పెట్టుకోదగింది ఏంటి?
20వ శతాబ్దంలో వివిధ దేశాల అధినేతలను ప్రభుత్వ విధానాలను తమకు అనుకూలంగా వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
ట్రంప్ తన పాలనలో సోషల్ మీడియాను సమర్ధవంతంగా వాడుకున్నారు. అయితే ఆయన రాజకీయాలకు వినోదానికి తేడా లేకుండా చేశారు. తన విమర్శకులను పట్టించుకోకుండా, నిజాలు తెలుసుకోకుండా నేరుగా తన మద్దతుదారులతో మాట్లాడటానికి ప్రాధాన్యమిచ్చారు.
ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, జాన్ ఎఫ్ కెనెడీ, రోనాల్డ్ రీగన్‌లాంటి వారు కూడా అప్పటికి వచ్చిన కొత్త మీడియాను నేరుగా తన మద్దతుదారులతో సంప్రదించేందుకు ఉపయోగించుకున్నారు. అయితే వారు ఈ విషయంలో హుందాగా వ్యవహరించారు. కానీ ట్రంప్ దానిని పరాకాష్టకు చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యాయవ్యవస్థలో మార్పులు
- మేరీ ఫ్రాన్సెస్ బెరీ, హిస్టరీ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా
ట్రంప్ పాలనలో ఏం జరిగింది?
అధ్యక్షుడు ఎవరైనా, పరిపాలనా అవసరాలు ఎలాంటివైనా అవి న్యాయవ్యవస్థ ముందు సమర్ధవంతంగా పరీక్షకు నిలబడేలా రాబోయే 20, 30 సంవత్సరాలకు తగినట్లు న్యాయవ్యవస్థలో మార్పులు చేశారు ట్రంప్
సాధారణంగా జడ్జిలను రిపబ్లికన్లు నియమిస్తారు. అప్పుడప్పుడు మాత్రమే న్యాయమూర్తులు ఆశ్చర్యపరిచే తీర్పులు ఇస్తారు. వారి నేపథ్యాలు, రాజకీయ అభిలాషల ఆధారంగానే ఎక్కువ తీర్పులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.
గుర్తుంచుకోదగింది ఏంటి ?
నల్ల జాతీయులకు ఆర్ధికంగా సహకారం అందేలా ట్రంప్ ప్రయత్నాలు చేశారు. వారి యూనివర్సిటీలు, కాలేజీలకు నిధులు అందేందుకు వీలుగా తొలిసారి అప్రొప్రియేషన్ బిల్లులో మార్పులు చేశారు.
నల్లజాతీయులైన వ్యాపారులకు ఆర్ధికంగా అండగా నిలిచేందుకు రుణాలు ఇప్పించే ఏర్పాటు చేశారు. ఈ కారణంగా ఈసారి యువకులైన నల్లజాతి ఓటర్లు పెద్ద మొత్తంలో ఓట్లు వేశారు. అది ఇంకా తీవ్రస్థాయిలో కొనసాగినట్లయితే రిపబ్లికన్లు గట్టెక్కేవారు.
ట్రంప్ నల్లజాతీయులు, ఇతర వర్ణాలకు చెందిన ప్రజల గురించి అనేకసార్లు మాట్లాడారు. నల్ల జాతీయులపై పోలీసుల దాడులను తీవ్రంగా ఖండించారు. తెల్ల జాతీయులు నల్లజాతివారిపై విద్వేష వ్యాఖ్యలు చేయకుండా అదుపు చేయగలిగారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా పట్ల కాఠిన్యం
-ప్రొఫెసర్ సాయికృష్ణ ప్రకాశ్ , యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా లా స్కూల్
ట్రంప్ కాలంలో ఏం జరిగింది ?
ట్రంప్ పాలన చివరి రోజుల్లో తీవ్ర ఉత్కంఠగా కొనసాగింది. ఆయన తన అనుచరుల మీద పూర్తి స్థాయి కంట్రోల్ సాధించడంతోపాటు తాను మళ్లీ అధికారంలో కొనసాగుతానన్న భావనలోకి వెళ్లిపోయారు.
అధ్యక్ష పదవి బుష్, ఒబామాల కాలానికన్నా భిన్నంగా ఉంటుందని ప్రజలు అనుకునేలా ట్రంప్ చేయగలిగారు. 25వ రాజ్యాంగ సవరణ, అభిశంసనలాంటి అంశాలు బిల్‌క్లింటన్ తర్వాత మళ్లీ చర్చకు రాలేదు.
గుర్తు పెట్టుకోదగింది ఏంటి ?
ఒక దేశంతో అంతకు ముందు చేసుకున్న ఎలాంటి ఒప్పందాలనైనా తిరస్కరించడం, రద్దు చేయడం, లేదంటే మార్పులు చేయడం చేయవచ్చని, అలా చేసేవారికి ఓటు వేసే వర్గాలు ఉంటాయని ట్రంప్ నిరూపించారు.
అమెరికా నుంచి చైనా లబ్ధి పొందుతోందని, దానివల్ల అమెరికా ఆర్ధిక వ్యవస్థకు, అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని ట్రంప్ పదే పదే చెప్పారు. ఈ విమర్శల వెనక బలమైన కారణమే ఉండవచ్చు.
ఎందుకంటే చైనాపట్ల కరకుగా ఉన్నందుకు అమెరికాలో ఎవరూ తప్పుబట్టరు. అలాగే కెనడాతో ఎందుకు మెతకగా ఉన్నావని ఎవరూ అడగరు. మేం చాలా కఠినంగా ఉన్నామని, కనీసం చైనా విషయంలో సీరియస్‌గా ఉన్నామని ప్రజలు భావిస్తూ ఉండి ఉంటారు.
దేశీయంగా అధ్యక్షుడికి ఈ విషయంలో ప్రజల నుంచి మద్దతు ఉంది. కాకపోతే ఆయన కాఠిన్యం విధాన రూపంలోకి ఎప్పుడూ మారలేదు. అయినా సరే, రిపబ్లికన్లు ఈ ప్రజానుకూల ఐడియాలను అనుసరిస్తూనే ఉంటారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: భారత క్రికెట్‌ను మార్చిన ఒక మ్యాచ్ కథ
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- చైనాలో వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన బీబీసీ బృందాన్ని ఎలా వెంటాడారంటే..
- కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








