భారతీయ అమెరికన్లలో హిందువులు ట్రంప్‌కు, ముస్లింలు బైడెన్‌కు ఓటేస్తారా?

ఇలియాస్ మహమ్మద్
ఫొటో క్యాప్షన్, ఇలియాస్ మహమ్మద్
    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, సౌత్ఏసియా కరస్పాండెంట్

ఆ రోజు జనవరి 26, భారతదేశం గణతంత్ర దినోత్సవం జరుపుకొంటోంది. అదే రోజు అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్‌లోని తన ఇంటి నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాషింగ్టన్ డీసీకి ఇలియాస్ మహమ్మద్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. భారత్‌లోని పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు.

సీఏఏకు వ్యతిరేకంగా అమెరికాలో జరిగిన నిరసనల్లో మతాలకు అతీతంగా చాలామంది భారతీయులు పాల్గొన్నారు.

భారత త్రివర్ణ జెండాలు ఎగురవేస్తూ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శించారు. వాటిపై 'స్టాప్ జినోసైడ్ ఇన్ ఇండియా', 'సేవ్ మై సెక్యులర్ ఇండియా' వంటి నినాదాలు, డిమాండ్లు రాశారు.

''పౌరసత్వ సవరణ చట్టానికి ముందు ఏదైనా విషయంలో నా అభిప్రాయాలను ఆన్‌లైన్‌లో మాత్రమే తెలిపేవాడిని.. కానీ, సీఏఏ తరువాత ఆ పద్ధతి మార్చుకున్నాను. కంప్యూటర్ స్క్రీన్ వెనుక నుంచి చేసే ఉద్యమం వల్ల మార్పు రాదని తెలుసుకున్నాను'' అన్నారు ఇలియాస్.

హైదరాబాద్‌కు చెందిన ఇలియాస్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

''ట్రంప్, మోదీ ఆలోచనల్లో పెద్దగా తేడా ఏమీ కనిపించదు. ట్రంప్ ఇక్కడ(అమెరికాలో) ముస్లింలపై నిషేధం విధించారు. మా మోదీజీ కూడా భారత్‌లో అలాంటిదే ఏదో చేయాలని ఆలోచిస్తున్నారు'' అన్నారు ఇలియాస్.

మూకదాడులు, గోమాంసం తీసుకెళ్తున్నారని ఆరోపిస్తూ దాడులు, పౌరసత్వ సవరణ చట్టం, రామమందిర వివాదం, కశ్మీర్, దిల్లీ అల్లర్లు వంటివన్నీ సుమారు 45 లక్షల మంది భారతీయ అమెరికన్లను.. మరీ ముఖ్యంగా వారిలో ముస్లింలను కలవరపరుస్తున్నాయి.

ఇవన్నీ.. ప్రజలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకునేలా చేస్తున్నాయి.

అమెరికాలో సీఏఏ వ్యతిరేక నిరసనలు
ఫొటో క్యాప్షన్, అమెరికాలో సీఏఏ వ్యతిరేక నిరసనలు

ఇది ఫాసిస్టు ప్రభుత్వం, ద్వేషాన్ని రగుల్చుతోంది, విదేశీభయం పీడిస్తోంది అంటూ మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకులు విమర్శలు చేస్తుంటే ఆయన మోదీ మద్దతుదారులు మాత్రం విమర్శించేవారందరినీ వామపక్షానికి చెందినవారని చిత్రీకరిస్తుంటారు.

''ఎవరో ఆవేశపరులు అనాలోచితంగా మూకదాడులకు పాల్పడ్డారు. మూకదాడుల్లో హిందువులూ మరణించారు, కానీ అదెప్పుడూ హైలైట్ కాలేదు'' అని 'ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ (ఓఎఫ్‌బీజేపీ-యూఎస్‌ఏ) వర్కింగ్ ప్రెసిడెంట్ అడపా ప్రసాద్ అన్నారు.

అమెరికాలోని భారత వ్యతిరేక, వామపక్ష ధోరణి పత్రికలన్నీ పక్షపాతపూరితమైన కథనాలు రాస్తాయని ఆయన అన్నారు.

''నా సోదరులు(ముస్లింలు) అవి చదివి ఆ ప్రభావానికి లోనయితే మాత్రం అది చాలా దురదృష్టకరం'' అన్నారాయన.

మోదీ మద్దతుదారులు కూడా అమెరికాలో ప్రదర్శనలు నిర్వహించారు.

''ముస్లింలను భారత్ నుంచి తరిమేస్తారనే వదంతులు వ్యాపించాయి. భారత్ పరువు తీయడానికి, నాశనం చేయడానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న ప్రచారం'' అన్నారు అడపా ప్రసాద్. ప్రజల మధ్య తీసుకొస్తున్న ఈ విభజన కూడా కొందరు పద్ధతి ప్రకారం చేస్తున్నదేనని ఆయన ఆరోపించారు.

''షార్లట్‌లో నేను 2011 నుంచి నివసిస్తున్నాను. ఇక్కడ మేమంతా భారతీయ సమాజంగా ఒక్కటిగానే నివసిస్తున్నాం. మాకు అనేక విషయాలపై భేదాభిప్రాయాలు ఉండేవి కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు మా మధ్య సంబంధాలు దెబ్బతీస్తున్నాయి'' అన్నారు ఇలియాస్ మహమ్మద్.

మోదీకి, సీఏఏకు మద్దతిస్తున్న కొందరు హిందువుల గురించి ఇలియాస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతదేశంలో ప్రజలను విభజిస్తున్న రాజకీయాలు అమెరికాలోని భారతీయుల అస్థిత్వాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయా?

రంగస్వామి
ఫొటో క్యాప్షన్, రంగస్వామి

వాషింగ్టన్ డీసీకి చెందిన కాలమిస్ట్ సీమా సిరోహి మాట్లాడుతూ.. ''భారతీయ అమెరికన్ల గుర్తింపు ఇప్పటికే దెబ్బతింది.. ఇప్పుడు పతనం అంచుల్లో ఉంది'' అన్నారు.

''మోదీ ప్రధాని అయిన తరువాత భారతీయ అమెరికన్లలో ముస్లింలు వేరయ్యారు. వారు తమను భారతీయ అమెరికన్ సమాజంలో భాగంగా భావించడం లేదు'' అన్నారామె.

''వారు కశ్మీర్‌ను చూస్తారు. గత ఆరేళ్లలో భారతదేశంలో ముస్లింలను ఎలా చూస్తున్నారన్నదీ చూస్తున్నారు. వాటన్నిటిపైనా వారు బాధపడుతున్నారు. అమెరికాలోని భారతీయ ముస్లింలు మిగతా భారతీయ అమెరికన్ల నుంచి వేరయ్యారు. అమెరికాలోని సిక్కులు కూడా అంతే. మరికొన్నేళ్లలో భారతీయ అమెరికన్లంటే హిందూ అమెరికన్లుగానే పరిమితమవుతారు.

అమెరికాలో 2020 జనాభా లెక్కల్లో సిక్కు అమెరికన్లను ప్రత్యేకంగా లెక్కించనున్నారు.

అమెరికాలోని ప్రవాస భారతీయుల వేదిక 'ఇండియాస్పొరా' వ్యవస్థాపకుడు ఎంఆర్ రంగస్వామి మాత్రం భారతీయ అమెరికన్లలో అలాంటి విభజనేమీ లేదంటున్నారు.

''నేను నిత్యం ఇక్కడి భారతీయులను కలుస్తుంటాను. వారెవరూ నేను సిక్ అమెరికన్, హిందూ అమెరికన్, ముస్లిం అమెరికన్ అనడం లేద''ని చెప్పారు రంగస్వామి.

భేదాభిప్రాయాలు భారతీయు అమెరికన్ల అస్తిత్వంపై ప్రభావం చూపవని అడపా ప్రసాద్ అన్నారు.

మరోవైపు ఈ పరిణామాలపై యామెస్ట్ కాలేజ్ ప్రొఫెసర్ పవన్ ధింగ్రా మాట్లాడుతూ.. ఇండియన్ అమెరికన్లలో చీలికలు కొత్తేంకాదని.. ఎప్పుడూ ఉన్నాయని అన్నారు.

''అమెరికాపై 9/11 దాడుల తరువాత అక్కడి ముస్లింలపై అనేక దాడులు జరిగాయి. ఎన్నో అవహేళనలకు గురయ్యారు అక్కడి ముస్లింలు. అందులో దక్షిణాసియావారూ ఉన్నారు. అయితే, భారతీయ అమెరికన్లు ఎన్నడూ వారికి అండగా నిలవలేదు. పైగా, మేం హిందువులం.. మేం చెడ్డవాళ్లం కాదు అని కొందరు అనేవారు'' అని ధింగ్రా అన్నారు. హోటళ్లు నడుపుతున్న భారతీయ అమెరికన్లపై ధింగ్రా ఒక పుస్తకం రాశారు.

''1980ల్లో న్యూయార్క్‌‌లో 'డాట్ బస్టర్స్' గ్రూప్ హిందువులపై దాడులు చేసిన సమయంలోనూ భారతీయ అమెరికన్లంతా వారికి రక్షణగా కలిసి రాలేదు. కాబట్టి ఇలాంటిది ఎప్పుడూ ఉంది'' అన్నారు ధింగ్రా.

బొట్లు పెట్టుకునే హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన ఈ గ్రూప్‌ను 'డాట్ బస్టర్స్'గా పిలిచేవారు. న్యూజెర్సీ నుంచి హిందువులను తరిమేస్తామంటూ ఈ గ్రూపు దాడులకు పాల్పడేది.

రషీద్ అహ్మద్
ఫొటో క్యాప్షన్, రషీద్ అహ్మద్

'చీలికకు అదే మొదలు'

1982లో రషీద్ అహ్మద్ వైమానిక శిక్షణ కోసం హైదరాబాద్ నుంచి అమెరికా వచ్చారు.

2002లో గుజరాత్ అల్లర్ల తరువాత ఆయన ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్(ఐఏఎంసీ) స్థాపించారు.

ఐఏఎంసీ, హ్యూమన్ రైట్స్, గ్లోబల్ ఇండియన్ ప్రోగ్రెసివ్ అలయన్స్ వంటి సంస్థలు అప్పటి మోదీ ప్రభుత్వానికి(గుజరాత్) వ్యతిరేకంగా ప్రచారం చేశాయి.

''భారతీయ అమెరికన్లలో హిందువులు, ముస్లింల మధ్య చీలిక బాబ్రీ మసీదు కూల్చివేతతో ప్రారంభమైంది. ఆ ఘటన భారతీయ అమెరికన్ సమాజాన్ని విచ్ఛిన్నం చేసింది'' అని షికాగో నుంచి రషీద్ అహ్మద్ చెప్పారు.

''అయితే, భారతీయ అమెరికన్ ముస్లింలు తమ సొంత వేదికను ఏర్పాటు చేయాలని అనుకోలేదు. బాబ్రీ మసీదు కూల్చివేతను కూడా భారతదేశానికి చెందిన వ్యవహారంగా చూశారు. అయితే, దాన్ని అన్యాయంగా భావించారు. భారతీయ సంస్కృతికి విరుద్ధమని.. ఆ ఘటన తరువాత సరైన నిర్ణయం వస్తుందని ఆశించారు. కానీ, గుజరాత్ అల్లర్ల తరువాత మాత్రం ఇండియన్ అమెరికన్ ముస్లింలలో ఒక వర్గం మాత్రం ఏదో ఒక చేయాలని అనుకుంటుండేవారు'' అన్నారు రషీద్ అహ్మద్.

''1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత కూడా ఇండియన్ అమెరికన్ ముస్లింలు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉండేవారు. కానీ, 2002 గుజరాత్ అల్లర్లు వారిలోని అలాంటి నమ్మకాన్ని దెబ్బతీశాయి'' అన్నారు అహ్మద్.

అప్పటి అల్లర్లు అమెరికాలో స్థిరపడిన అనేక గుజరాతీ కుటుంబాలపై ప్రభావం చూపించాయి.

అమెరికాలోని 'అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్'కు చెందిన కలీం కవాజా ​​మాట్లాడుతూ 2002 నాటి అల్లర్లు చల్లారాయి.. కానీ గత అయిదేళ్లలో తిరిగి అదే వాతావరణం మొదలైంది అన్నారు.

''ఉత్తర ప్రదేశ్‌లో, దిల్లీలో జరుగుతున్నది నాతో సహా అందరినీ కదిలిస్తోంది. నా దేశానికి ఏమవుతోంది.. నేను నివసించిన నగరానికి ఏమవుతోంది?" అని కాన్పూర్ నుంచి అమెరికా వచ్చిన కవాజా అన్నారు.

హిందూత్వ ప్రభావంతోనే భారతీయ అమెరిన్ సంఘాలలో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయన్నారు కవాజా.

అక్కడ నిర్వహించే కార్యక్రమాలకు వెళ్లే ముస్లింలు కంఫర్ట్‌గా లేరని ఆయన అంటారు. ఒకసారి వెళ్లినవారు ఇంకోసారి వెళ్లరని చెప్పారు.

భారతీయ అమెరికన్లలో ముస్లింలు 20 శాతానికి మించి ఉండరు. భారతీయ అమెరికన్లలో ముస్లింలు, హిందువులు అనే విభజన గత అయిదేళ్లలోనే కనిపిస్తోంది అంటారు కవాజా.

ఈ విభజన చేసింది బీజేపీ కాకపోయినా అవి మరింత స్పష్టంగా కనిపించేలా చేసింది మాత్రం బీజేపీనే అంటారు పవన్ ధింగ్రా.

సిక్కులు వేరవుతున్నారా?

అమెరికాలోని సిక్కులను ఆసియన్ ఇండియన్స్‌గా వర్గీకరించారు.

9/11 దాడుల తరువాత సిక్కులపై దాడులు పెరగడం వల్లే వారికి అమెరికాలో ప్రత్యేక జాతి గుర్తింపు ఇచ్చారని చెబుతారు.

2020 అమెరికా జనాభా లెక్కల్లో సిక్కులను ప్రత్యేక ఎథ్నిక్ గ్రూపుగా పరిగణించి లెక్కిస్తారు.

సిక్కుల్లోని కొందరిలో ఉన్న వేర్పాటువాద ఆకాంక్షలకు ఇది ఆజ్యం పోసిందన్న ఆందోళనలూ ఉన్నాయి.

అయితే, సిక్కులను ప్రత్యేకంగా లెక్కించడం వల్ల భారత్‌లోని రాజకీయ అంశాలపై పెద్దగా ప్రభావవమేమీ ఉండదని.. అమెరికాలోని భారతీయ సమాజం నుంచి వేరు కుంపట్లకూ అవకాశమివ్వదని 'యునైటెడ్ సిక్స్' అరే సంస్థకు చెందిన వాండా సాంచెజ్ అన్నారు.

పవన్ ధింగ్రా
ఫొటో క్యాప్షన్, పవన్ ధింగ్రా

సామాజిక విభజనతో రాజకీయ చిక్కులు

ట్రంప్, బైడెన్ ప్రచారశిబిరాలు రెండూ హిందువులు, ముస్లింలు, సిక్కులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారతీయ అమెరికన్ల కోసం ప్రత్యేకంగా సందేశాలు వినిపిస్తున్నారు.

''ఇలా భారతీయ అమెరిన్లలో వర్గాలను బట్టి రాజకీయ లక్ష్యం చేసుకోవడం వల్ల విభజన జరుగుతుందని నేనేమీ ఆందోళన చెందడం లేదు'' అన్నారు పవన్ ధింగ్రా.

'ఇండియాస్పొరా' ఇటీవల 260 మంది భారతీయ అమెరికన్లతో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 65 శాతం మంది జో బైడెన్‌కు, 28 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నట్లు తేలింది.

''ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ'' సహాధ్యక్షుడు అల్ మాసన్ ట్రంప్ వైపు 50 శాతం వరకు అనుకూలంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

ఏ సమాజమైన గంపగుత్తగా ఒకరికే మద్దతివ్వడమనేది సరికాదని ఓఎఫ్‌బీజేపీ-యూఎస్‌ఏ అధ్యక్షుడు అడపా ప్రసాద్ అన్నారు.

కశ్మీర్, ఎన్‌ఆర్‌సీ విషయాల్లో ప్రధాని మోదీపై ప్రమీలా జయపాల్ వంటి డెమొక్రటిక్ పార్టీ నాయకులు చేసిన విమర్శలు కూడా భారతీయ అమెరికన్లు ట్రంప్ వైపు మళ్లడానికి కారణం కావొచ్చు.

కొన్ని ముస్లిం దేశాల ప్రజలు అమెరికా రాకుండా నిషేధం విధించడంతో ట్రంప్‌ను జాత్యహంకారి అని విదేశీ వ్యతిరేకి అని అంటారు విమర్శకులు. అయితే, హౌదీ మోదీ, నమస్తే ట్రంప్ కార్యక్రమాల తరువాత ట్రంప్ భారత్‌కు అనుకూలుడని చాలామంది భారతీయ అమెరికన్లు నమ్మారు. ప్రధానంగా హిందువుల్లో ఇలాంటి అభిప్రాయం నాటుకుంది.

''2019లో కశ్మీర్ విషయంలో ఇంటాబయటా మోదీపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి సమయంలో మోదీకి ధైర్యంగా మద్దతు పలికిన ఒకే ఒక్క నేత ట్రంప్'' అన్నారు

"2019 లో, కాశ్మీర్ సమస్యపై ప్రపంచం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు - ఇది ప్రపంచం యొక్క మండుతున్న అంశం - ప్రపంచ నాయకులు మోడిని విమర్శించారు. మోడీ సొంత ప్రతిపక్ష పార్టీ ఆయనపై ఆయుధాలు కుదుర్చుకుంది. ప్రధాని మోడీకి అండగా నిలబడటానికి ధైర్యం ఉన్న వ్యక్తి ట్రంప్ మాత్రమే" అని ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ సహ అధ్యక్షుడు అల్ మాసన్ అన్నారు.

అమెరికాలో సీఏఏ వ్యతిరేక నిరసనలు

భారతీయ అమెరికన్లలో విభేదాలు సమసిపోయేలా చేయడానికి వారిని కలుసుకోవడం సరైన మార్గమని ఓఎఫ్‌బీజేపీ-యూఎస్ఏ అధ్యక్షుడు అడపా ప్రసాద్ అన్నారు.

భారతీయ అమెరికన్లలో కొత్తతరం ఇదంతా సర్దుకునేలా చేస్తుందని ఐఏఎంసీకి చెందిన రషీద్ అహ్మద్ అన్నారు.

''వారు పెద్దయ్యాక ప్రాపంచిక దృక్పథం వారికి ఉండొచ్చు. వారు ఉదారవాదులు కావొచ్చు'' అని ఆయన ఆశించారు.

భారతీయ అమెరికన్లలో రెండో తరం డెమొక్రాట్లవైపు మొగ్గు చూపొచ్చు.. అంతేకాదు, వారు వారి తల్లిదండ్రులు రాజకీయ దృష్టికోణాన్ని కూడా సవాల్ చయొచ్చు.

''పాతవారు ట్రంప్ చెప్పేది వినడానికి కారణం ఉంది. వారంతా భారత్‌లో పుట్టినవారు. అందుకే భారత్, అమెరికాల గురించి ట్రంప్ ఇచ్చే సందేశాలు వారిని తాకుతాయి. కానీ, ప్రస్తుత తరం అమెరికాలోని సమస్యలతో సంబంధం ఉన్నవారు'' అన్నారు ఇండియాస్పొరా వ్యవస్థాపకుడు రంగస్వామి.

''నేను ఎక్కువ కాలం అమెరికాలో జీవించొచ్చు కానీ నాలో ఉన్నది భారతీయతే. చనిపోయే వరకు నా దేశ ప్రజల పట్ల ఉండే ప్రేమ పోదు'' అంటారు ఇలియాస్ మహమ్మద్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)