హాథ్‌రస్ కేసు: ఎస్పీ, డీఎస్పీలను సస్పెండ్ చేసిన యోగి ప్రభుత్వం - BBC Newsreel

హాథ్‌రస్ కేసులో ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎస్పీ, డీఎస్పీ తోపాటు మరికొందరు అధికారులను సస్పెండ్ చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
సస్పెన్షన్‌కు గురైనవారిలో ఎస్పీ విక్రాంత్ వీర్, ఇన్‌స్పెక్టర్ దినేశ్ కుమార్ వర్మ, సీవో రామ్ శబాద్, ఎస్ జగ్‌వీర్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ మహేశ్ పాల్ ఉన్నారు.
మరోవైపు దిల్లీలో హాథ్‌రస్ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన పలువురు రాజకీయ నాయకులు, సామాజిక ఉద్యమకారులను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీతోపాటు భారత్‌లోని కొన్ని ప్రధాన నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి.
మరోవైపు రాజకీయ నాయకులు, మీడియా పర్యటనల నడుమ బాధితురాలి గ్రామంలోకి బయటివారు ప్రవేశించకుండా యోగి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గ్రామం లోపల కూడా భారీగా పోలీసుల్ని మోహరించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రతినిధులు ప్రస్తుతం గ్రామం లోపలే ఉన్నారు.
జంతర్ మంతర్ వద్ద నిరసనలు

హాథ్‌రస్ బాధితురాలికి న్యాయం జరగాలంటూ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు.
నిరసన తెలుపుతున్న వారితో సీపీఐ నాయకుడు డి రాజా, స్వరాజ్ ఇండియా అధిపతి యోగేంద్ర యాదవ్, భీమ్ ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా కలిశారు.
మరోవైపు హాథ్‌రస్ బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులను అనుమతించాలని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని బీజేపీ నాయకురాలు ఉమా భారతి కోరారు.
''యూపీలోని బీజేపీ ప్రభుత్వం ఇకపై అధికారంలో ఉండటానికి వీల్లేదు. యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలి. హాథ్‌రస్ అత్యాచార కేసులో బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలి''అని సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ANI
బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ దిల్లీలోని వాల్మీకి దేవాలయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సందర్శించారు.
వాల్మీకీ సమాజ్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకూ ఆమె హాజరయ్యారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌లో దళిత వాల్మీకి వర్గానికి చెందిన 19ఏళ్ల బాలికపై నలుగురు ఉన్నత కులాల యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
రెండు వారాలపాటు బాధితురాలు ప్రాణాలతో పోరాడిన అనంతరం దిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆమె కన్నుమూశారు. అయితే ఆమె కుటుంబ అనుమతి లేకుండానే మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వాలంటీర్లకు చప్పట్లతో అభినందనలు తెలిపిన జగన్

గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా వలంటీర్లకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చప్పట్లతో అభినందనలు తెలిపారు.
అందరూ రాత్రి 7 గంటలకు తమ ఇంటి నుంచి బయటకువచ్చి చప్పట్లతో ఉద్యోగులు, వాలంటీర్లను అభినందించాలని మధ్యాహ్నం జగన్ పిలుపునిచ్చారు.
దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అందరూ ఉద్యోగులు, వాలంటీర్లను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.
అమెజాన్ సిబ్బందిలో 20 వేల మందికి కరోనావైరస్ పాజిటివ్

ఫొటో సోర్స్, Getty Images
మార్చి నుంచి ఇప్పటివరకు అమెరికాలోని తమ ఉద్యోగుల్లో 19,816 మంది కోవిడ్ బారినపడ్డారని అమెజాన్ సంస్థ తెలిపింది.
అమెజాన్, దాని అనుబంధ సంస్థ 'హోల్ ఫుడ్స్'కి 13.7 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు ఉండగా వారిలో 1.44 శాతం మందికి కరోనావైరస్ సోకింది.
సిబ్బంది ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని అమెజాన్‌పై విమర్శలు వచ్చాయి.కానీ, అమెజాన్ మాత్రం అనుకున్నకంటే తక్కువ మందికే వైరస్ సోకిందని చెబుతోంది.
కరోనావైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజల నుంచి వివిధ ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడడంతో అమెజాన్ ఈ కాలంలో తన సేవలను కొనసాగించింది.
కరోనాకాలంలో సేవలు కొనసాగించడం వల్ల అమెజాన్‌కు మంచి లాభాలు వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద మరింత పెరిగింది.
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అమెజాన్ అమ్మకాలు 40 శాతం పెరిగి 8890 కోట్ల డాలర్లకు చేరాయి. ఆ మూడు నెలల్లో అమెజాన్ 520 కోట్ల డాలర్ల లాభం ఆర్జించింది. 1994లో ఆ సంస్థను ప్రారంభించినప్పటి నుంచి ఒక త్రైమాసికంలో ఇంత లాభం ఆర్జించడం ఇదే తొలిసారి.
బయట సగటుతో పోల్చితే అమెజాన్ సిబ్బందిలో 33,952 మందికి కరోనా వైరస్ సోకే అవకాశం ఉన్నప్పటికీ అంతకంటే తక్కువ మందికే సోకిందని అమెజాన్ వెల్లడించింది.
వైరస్ సోకిన అమెజాన్ సిబ్బందిలో తాత్కాలిక కార్మికులు కూడా ఉన్నారని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ పని ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్ వంటి ఏర్పాట్లు చేశామని, 10 కోట్ల మాస్కులు పంపిణీ చేశామని అమెజాన్ చెబుతోంది.
తమతమ సంస్థల్లో ఎంతమందికి కోవిడ్ సోకిందో చెప్పాలంటూ అమెజాన్ ఇతర సంస్థలకు సవాల్ విసిరింది.

ఫొటో సోర్స్, Reuters
డోనల్డ్ ట్రంప్, మెలానియాలకు కరోనా పాజిటివ్... క్వారెంటైన్లో అధ్యక్షుడు, అమెరికా ప్రథమ మహిళ
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తనకు, భార్య మెలానియాకు కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధరణ అయిందని తెలిపారు. దాంతో, క్వారంటైన్లో ఉన్నామని ప్రకటించారు. ట్రంప్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు.
ట్రంప్ సన్నిహితులలో ఒకరికి కరోనా సోకిందని వార్తలు వెలువడిన కాసేపటికే ట్రంప్ ట్వీట్ వెలుగు చూసింది. అధ్యక్షుడి సలహాదారు అయిన 31 ఏళ్ల హోప్ హిక్స్‌కు కోవిడ్ నిర్ధరణ అయింది. గత వారం ట్రంప్ ఒక టీవీ డిబేట్ కోసం ఓహియో వెళ్లినప్పుడు ఆయనతో పాటు ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఆమె కూడా ప్రయాణించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అంతకు ముందు ట్రంప్ తన సహాయకురాలు హోప్ హిక్స్‌కు కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ కావటంతో.. తాను, తన భార్య మెలానియా ట్రంప్ క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
హోప్ హిక్స్‌కు కరోనా సోకిన నేపథ్యంలో తాను, మెలానియా కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నామని.. వాటి ఫలితాల కోసం వేచిచూస్తున్నామని ట్రంప్ ట్వీట్ చేశారు.
ఈ వారం ఆరంభంలో ఒక టీవీ డిబేట్ కోసం ఆమె ట్రంప్‌తో కలిసి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించారు. ఆమె మంగళవారం నాడు క్లీవ్‌లాండ్‌లో అధ్యక్షుడి విమానం నుంచి మాస్క్ లేకుండా దిగుతున్న దృశ్యాలు ఫొటోల్లో బంధించారు.
బుధవారం నాడు మినెసొటాలో ట్రంప్ ఒక సభలో పాల్గొనటానికి వెళ్లినపుడు మెరైన్ వన్ హెలికాప్టర్‌లో ప్రయాణించారు. అందులో హోప్ హిక్స్ కూడా ఉన్నారు. ఆ సందర్భంగా అధ్యక్షుడికి ఆమె మరింత దగ్గరగా ఉన్నారు.
''అసలు బ్రేక్ తీసుకోకుండా కష్టపడి పనిచేస్తున్న హోప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.. ఇది భయానకం'' అంటూ ట్రంప్ గురువారం రాత్రి ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, BCCI/IPL
IPL 2020 కింగ్స్ XI పంజాబ్ Vs. ముంబయి ఇండియన్స్: చెలరేగిన రోహిత్ శర్మ, పొలార్డ్
అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 13వ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 48 పరుగులు తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించింది.
ముంబయి ఇండియన్స్ 192 పరుగుల లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నంలో పంజాబ్ 8 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పంజాబ్ ప్రారంభం సరిగా లేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో మయంక్ అగర్వాల్ పిచ్ మీద ఎక్కువసేపు నిలవలేకపోయాడు. జట్టు స్కోర్ 38 పరుగులు ఉన్నప్పుడు జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మయంక్ 13 బంతుల్లో 25 పరుగులు చేశాడు.
తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు.
తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నికొలస్ పూరన్ కేఎల్ రాహుల్‌తో కలిసి భాగస్వామ్యం అందించడానికి ప్రయత్నించాడు.
కానీ, రాహుల్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. మొత్తం 19 బంతులు ఆడిన కెప్టెన్ 17 పరుగులే చేయగలిగాడు.
ఒకవైపు ధాటిగా ఆడుతున్న నికొలస్ పూరన్‌కు అండగా నిలిచేవారు కరువయ్యారు. చివరికి అతడు జేమ్స్ పాటిన్సన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
27 బంతులు ఆడిన పూరన్ రెండు సిక్సర్లతో 44 పరుగులు చేశాడు.
11 పరుగులు చేసిన మాక్స్ వెల్ కూడా తర్వాత ఓవర్లోనే అవుట్ అయ్యాడు. జేమ్స్ నీషామ్ కూడా 7 పరుగులకే పెవిలియన్ చేరడంతో పంజాబ్ ఓటమి దాదాపు ఖాయమైపోయింది.
తర్వాత వచ్చిన వారిలో క్రిష్ణప్ప గౌతమ్(22 నాటౌట్) మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. మహమ్మద్ షమీ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
పంజాబ్ 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముంబయి బౌలర్లలో జేమ్స్ పాటిన్సన్, జస్‌ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్ రెండేసి వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బోల్ట్, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఫొటో సోర్స్, BCCI/IPL
రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్
అంతకు ముందు టాస్ గెలిచిన పంజాబ్ ముంబయిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో ముంబయి 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 70 పరుగులు చేశాడు.
ఓపెనర్ క్వింటన్ డికాక్ ఖాతా తెరవకుండానే తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. కాసేపు ధాటిగా ఆడిన సూర్యకుమార్(10)ను షమీ రనౌట్ చేశాడు.
ఆ తర్వాత ఇషాన్ కిషన్ కెప్టెన్ రోహిత్ శర్మకు అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి స్కోరును 83 పరుగుల దగ్గరకు తీసుకెళ్లారు.
14వ ఓవర్లో కిషన్(28) మూడో వికెట్‌గా అవుట్ అయ్యాడు.
జట్టు స్కోరు 124 పరుగులు ఉన్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ పడింది. 45 బంతులు ఆడిన రోహిత్ 70 పరుగులు చేశాడు. మూడు సిక్సర్లు కూడా కొట్టాడు.
మ్యాచ్‌కే హైలైట్ ఆ క్యాచ్...
రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను ఇద్దరు పంజాబ్ ఫీల్డర్లు పంచుకోవడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
17వ ఓవర్ మొదటి బంతికి రోహిత్ కొట్టిన షాట్‌ను పరిగెడుతూ బౌండరీ లైన్‌కు ముందు పట్టిన మాక్స్ వెల్.. అదే వేగంలో బౌండరీ దాటేశాడు. కానీ, లోపలికి అడుగు పెట్టేముందే బంతిని బౌండరీ లోపలే ఉన్న జేమ్స్ నీషామ్‌కు అందించాడు. దాంతో ఆ క్యాచ్ నీషామ్ ఖాతాలోకి వెళ్లింది.
రోహిత్ తరువాత కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా మరో వికెట్ పడకుండా జట్టు స్కోరును 191 వరకూ తీసుకెళ్లారు.
4 సిక్సర్లు కొట్టిన పొలార్డ్ 20 బంతుల్లో 47 పరుగులు, హార్దిక్ పాండ్య 2 సిక్సర్లతో 11 బంతుల్లో 30 పరుగులు చేశారు.
ఆఖరి ఓవర్ వేసిన గౌతమ్ ఆరు బంతుల్లో 25 పరుగులు ఇచ్చాడు.
షెల్డన్ కోట్రెల్, మహమ్మద్ షమీ, క్రిష్ణప్ప గౌతమ్‌కు తలో వికెట్ దక్కింది.
ఇవి కూడా చదవండి:
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- డార్జీలింగ్ టీ పొడి: కిలో లక్షా 30 వేలు.. ఈ తేయాకును పౌర్ణమి వెలుగులోనే కోస్తారు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








