కరోనావైరస్ తీవ్రత గురించి తేలికగా మాట్లాడలేదన్న డోనల్డ్ ట్రంప్ - BBC NewsReel

ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

కోవిడ్ 19 తీవ్రత గురించి తానెప్పుడూ తేలికగా మాట్లాడలేదని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. ఈ మాటలు ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన అమెరికన్ ఓటర్లను ఉద్దేశించి ఏబీసీ న్యూస్ నిర్వహించిన టెలివిజన్ షోలో ప్రసంగించారు. ఈ సంవత్సరం మొదట్లో అమెరికన్ జర్నలిస్ట్ బాబ్ వుడ్‌వర్డ్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రజలను భయభ్రాంతులు అవ్వకుండా వైరస్ గురించి తేలికగా మాట్లాడినట్లు ఆయన చెప్పారు.వైద్య నిపుణులు వ్యాక్సీన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ , మరి కొన్ని వారాల్లో కోవిడ్ వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందన్నారు. వ్యాక్సీన్ తయారీకి అవసరమైన క్లినికల్ ట్రయిల్స్ కూడా పూర్తి కాని దశలో వ్యాక్సీన్ ని అందుబాటులోకి తేవడానికి సైన్సు, వైద్య రంగం కంటే రాజకీయాలు ఎక్కువ ప్రభావితం చేస్తాయేమోననే భయంగా ఉందని శాస్త్రవేత్తలు భయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి అమెరికాలో ఇప్పటి వరకు 195,000 మంది మరణించినట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అంచనా వేసింది. ఇదిలా ఉంటే, 175 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 'సైంటిఫిక్ అమెరికన్ట అనే సైన్స్ మ్యాగజైన్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌కు మద్దతు ప్రకటించింది. ట్రంప్ సైన్సును, ఆధారాలను ధిక్కరిస్తారని, కరోనావైరస్ మహమ్మారి తలెత్తినప్పుడు ఆయన నిజాయితీగా వ్యవహరించలేదని 'సైంటిఫిక్ అమెరికన్' పత్రిక విమర్శించింది.

భారతదేశంలో 50 లక్షలు దాటిన కరోనావైరస్ కేసులు

కరోనావైరస్ ఇండియా

ఫొటో సోర్స్, Reuters

భారతదేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50లక్షలు దాటిందని అధికారులు ప్రకటించారు.

అత్యధిక కేసులలో అమెరికా తర్వాత భారత్‌ ఇప్పటికే రెండో స్థానంలో ఉంది. మరణాలలో అమెరికా, బ్రెజిల్‌ల తర్వాత మూడో స్థానంలో కొనసాగుతోంది.

లాక్‌డౌన్‌ నిబంధనలను తొలగిస్తున్నప్పటి నుంచి భారతదేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 80,000మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

దేశంలో ప్రతిరోజూ 90వేలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1200 మరణాలు సంభవించాయి. అయితే కేసులు సంఖ్య పెరుగుతున్నా మరణాల రేటు తక్కువగానూ, రికవరీ రేటు ఎక్కువగానూ ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత సరళం చేసిన గత నెలరోజుల్లో కేసులు విపరీతంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

సుగా

ఫొటో సోర్స్, Reuters

జపాన్‌ కొత్త ప్రధానిగా యోషిహిదే సుగా ఎన్నిక

షింజో అబే రాజీనామా చేయడంతో జపాన్‌ కొత్త ప్రధానిగా యోషిహిదే సుగాను ఆ దేశ పార్లమెంటు ఎన్నుకుంది. ఈ వారంలోనే ఆయన పాలకపార్టీ ప్రధాని అభ్యర్ధిగా ఎన్నిక కాగా, ప్రధానిగా ఆయనకే పట్టంగడుతూ జపాన్‌ పార్లమెంటు ఆమోదం తెలిపింది.

ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తాను ప్రధాని పదవిలో కొనసాగలేనని షింజో అబే ఇటీవలే ప్రకటించారు. షింజోకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సుగా ఆయన విధానాలను కొనసాగిస్తారని భావిస్తున్నారు.

సుగా ప్రధానిగా ఎన్నిక కావడానికి ముందు క్యాబినెట్‌ సమావేశాన్ని నిర్వహించిన షింజో అబే, ఈ ఎనిమిదేళ్ల కాలంలో అధికారంలో ఉండగా తాను సాధించిన విజయాలపట్ల గర్వపడుతున్నానని విలేకరులతో అన్నారు.

త్వరలో ప్రధానిని, కొత్త క్యాబినెట్‌ను ఇంపీరియల్ ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో జపాన్‌ చక్రవర్తి అధికారికంగా ప్రకటిస్తారు.

భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

నేపాల్‌లోని కఠ్‌మాండూలో తీవ్ర భూప్రకంపనలు

నేపాల్ రాజధాని కఠ్‌మాండూలో బుధవారం ఉదయం తీవ్ర భూప్రకంపనలు వచ్చాయి.

భూకంపం తీవ్రత 6 వరకూ ఉన్నట్లు నేపాల్ సిస్మొలాజికల్ సెంటర్ నుంచి సమాచారం అందిందని వార్తా సంస్థ రాయిటర్స్ చెప్పింది.అయితే యూరోపియన్-మెడిటేరియన్ సిస్మొలాజికల్ సెంటర్ మాత్రం నేపాల్‌లో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 ఉందని చెప్పింది.భూకంపం వల్ల ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదని నేపాల్ పోలీసులు చెబుతున్నారు.భూకంప కేంద్రం కఠ్‌మాండూకు తూర్పుగా 100 కిలోమీటర్ల దూరంలో రామ్‌చేలో ఉన్నట్టు గుర్తించారు.రామ్‌చే చైనా అధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది.

ఆసియా

ఫొటో సోర్స్, Getty Images

60 ఏళ్ల తర్వాత ఆసియాలో తొలి ప్రాంతీయ ఆర్థిక మాంద్యం

కరోనా మహమ్మారి ఆసియాను ఆర్థిక మాంద్యంలోకి నెట్టిందని ఏసియన్‌ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ (ఏడీబీ) వెల్లడించింది.

45 దేశాలున్న ఆసియాకు అభివృద్ధి చెందుతున్న ఖండంగా పేరుంది. కానీ 60 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతం ఆర్థికంగా తిరోగమనంలో ఉందని ఏడీబీ పేర్కొంది.

ఈ ఏడాది ఆసియా అభివృద్ధి రేటు 0.7% పడిపోతుందని అంచనా వేసిన బ్యాంక్‌, వచ్చే ఏడాది పుంజుకుని 6.8% వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తోంది.

ఆసియాలోని మూడొంతుల ప్రాంతం రాబోయే రోజుల్లో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోనుందని బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది.

మొదట ఈ ప్రాంతపు జీడీపీలో 0.1% వృద్ధి ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది. కానీ పరిస్థితి మారింది.

“ఈ ఏడాది మొత్తం ఆసియా ఖండంలోని దేశాలన్నీ ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటాయి’’ అని ఏసియన్‌ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు చెందిన ఆర్థిక నిపుణుడు యసుయుకి సవాడా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆసియా ఖండంలో ఆర్థిక పరిస్థితులపై ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ కూడా ఇదే తరహా నివేదికను విడుదల చేసింది. కరోనా కారణంగా దక్షిణాసియా ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైందని, చైనా దీన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఏడీబీ విశ్లేషించింది.

ఈ ఏడాది భారతదేశపు వృద్ధిరేటు 9% పడిపోతుందని చెప్పిన ఏడీబీ, చైనా వృద్ధి రేటు 1.8% ఉంటుందని అంచనా వేసింది. మొత్తం మీద దక్షిణాసియా ప్రాంతపు ఆర్ధిక వ్యవస్థలో 3.8% శాతం క్షీణత ఉంటుందని తెలిపింది.

పర్యాటకరంగం మీద ఆధారపడ్డ ఆర్ధిక వ్యవస్థలు ఎక్కువగా దెబ్బతిన్నాయని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఫిజీ ఆర్థిక వ్యవస్థలో 19.5%, మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో 20.5% క్షీణత కనిపిస్తోందని బ్యాంక్‌ తెలిపింది.

అయితే వచ్చే ఏడాదికల్లా మళ్లీ అన్ని వ్యవస్థలు పుంజుకుని సరాసరిన 6.8% వృద్ధిని నమోదు చేస్తాయని కూడా బ్యాంక్‌ ఊహిస్తోంది.

2021లో చైనా 7.7%, భారత్‌ 8% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఏడీబీ వెల్లడించింది.

ఆర్థిక మాంద్యం నుంచి రికవరీ అనేది మహమ్మారి తీవ్రత మీద ఆధారపడి ఉంటుందని, లాక్‌డౌన్‌లు, కంటైన్‌మెంట్‌లు ఇలాగే కొనసాగితే పెద్దగా పురోగతి ఉండదని తెలిపింది. “నిబంధనలు ఇలాగే కొనసాగితే కరోనా వల్ల వచ్చిన ఆర్ధిక సంక్షోభం కూడా అలాగే కొనసాగుతుంది’’ అని ఏడీబీ ఆర్థిక నిపుణుడు సవాడా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)