UPSC పరీక్షల్లో ముస్లింలకు ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయా? BBC Fact Check

ముస్లిం విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images Plus

    • రచయిత, మొహమ్మద్ షాహిద్
    • హోదా, బీబీసీ ఫ్యాక్ట్ చెక్ టీమ్

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసులకు సంబంధించి మీరు ఇటీవల ఎన్నో ట్వీట్స్ చూసే ఉంటారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షల గురించి ఒక వర్గం సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతోంది.

'UPSC జిహాద్’ హ్యాష్‌టాగ్‌తో ఎన్నో ట్వీట్స్ చాలా కాలం నుంచీ ట్రెండ్ అవుతున్నాయి. ఈ ట్వీట్లలో ముస్లిం అభ్యర్థుల కోసం వివిధ పారామీటర్స్ గురించి కూడా ప్రస్తావించారు.

వీటిలో కొన్నింటిలో యూపీఎస్‌సీలో హిందువులకు 6 అవకాశాలు ఉంటే, ముస్లింలకు మాత్రం 9 అవకాశాలు ఉన్నాయని, యూపీఎస్‌సిలో హిందువులకు గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు అయితే, ముస్లింలకు 35 ఏళ్లు ఉందని చెప్పడం లాంటివి ఉన్నాయి.

ఇవి కాకుండా, ఉర్దూ మీడియంలో పరీక్ష సక్సెస్ రేటు, ముస్లింల కోసం నడుపుతున్న కోచింగ్ సెంటర్లు లాంటి వాటి గురించి కూడా ప్రశ్నిస్తూ ఎన్నో ట్వీట్స్ చేశారు.

వీటన్నిటికీ మందు యూపీఎస్‌సీ పరీక్షలో ‘ఇస్లామిక్ స్టడీస్’ సబ్జెక్ట్ గురించి కూడా సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అయ్యింది.

‘ఇస్లామిక్ స్టడీస్’ వల్ల ముస్లింలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అవుతున్నారని. యూపీఎస్‌సీ పరీక్షల్లో వేదిక్, హిందూ స్టడీస్ లాంటి ఏ సబ్జెక్టూ లేదని అంటున్నారు.

యూపీఎస్సీ UPSC

ఫొటో సోర్స్, PTI

యూపీఎస్‌సీ పరీక్షకు అర్హతలు

ఈ ఏడాది ఫిబ్రవరి 12న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష కోసం యూపీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో అర్హత, వయోపరిమితి, రిజర్వేషన్లు, పరీక్ష సబ్జెక్టులు లాంటి వాటి గురించి చాలా వివరంగా సమాచారం ఇచ్చింది.

ఏ అర్హతలు ఉన్నవారు ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ కాగలరు. ఈ ప్రశ్నకు నోటిఫికేషన్‌లో స్పష్టంగా వారు తప్పనిసరిగా భారత పౌరుడు అయ్యుండాలని చెప్పారు, కులం, మతం, జాతుల గురించి చెప్పలేదు.

ఇక, వయోపరిమితి విషయానికి వద్దాం. యూపీఎస్‌సి సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం కనీస వయోపరిమితి 21 ఏళ్లని స్పష్టంగా చెప్పారు. కానీ, ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు, మాజీ సైనిక సిబ్బందికి సడలింపులు ఇచ్చారు.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 37 ఏళ్లు. ఓబీసీకి 36 ఏళ్లు, దివ్యాంగులకు 42 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఉంది. దీంతోపాటూ సివిల్స్ మెయిన్స్ రాసే సమయానికి అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అయి ఉండడం తప్పనిసరి.

ఇందులో ఎక్కడా ముస్లింల గురించి, ఇతర మతాల గురించి లేదు. అంటే, వయోపరిమితికి మతం ప్రాతిపదికగా లేదు.

ముస్లిం విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ముస్లింలకు ఎక్కువ అవకాశాలున్నాయా?

ముస్లింలకు యూపీఎస్‌సీ పరీక్షలో 9 సార్లు అవకాశం లభిస్తోందని కూడా సోషల్ మీడియాలో చెబుతున్నారు.

ఈ వాదన వెనుక నిజం తెలుసుకునే ముందు ఆ నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు 6 అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా ఉంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మాత్రం పరీక్ష రాయడానికి ఎలాంటి పరిమితులు లేవు.

వారితోపాటూ ఓబీసీ అభ్యర్థులు కూడా 9 సార్లు పరీక్ష రాయవచ్చు. అంటే యూపీఎస్‌సీ ఒక మతం ప్రాతిపదికన ఈ అవకాశాలు ఇవ్వడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. అంటే, ముస్లింలకు 9 సార్లు పరీక్ష రాయడానికి అవకాశం లభిస్తోంది అనే వాదనలో నిజం లేదు.

సివిల్స్ మెయిన్స్ పరీక్షలో 26 అప్షనల్ సబ్జెక్టుల్లో ఎక్కడా ‘ఇస్లామిక్ స్టడీస్’ అనే సబ్జెక్ట్ లేదు. ఈ సబ్జెక్ట్ ఉందనేది పూర్తిగా అవాస్తవం అని భోపాల్‌లో సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తున్న లక్ష్మీ శరణ్ మిశ్రా చెప్పారు.

“యూపీఎస్‌సీలో ‘ఇస్లామిక్ స్టడీస్’ అనే సబ్జెక్ట్ ఏదీ లేదు. ఉర్దూ సాహిత్యం సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు అందులో ఉంటాయి. ముస్లింలకు సంబంధించిన ప్రశ్నలు ఉండవు. చరిత్రలో అసలు మొఘల్ కాలానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడగరంటే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇప్పుడు ముస్లింల చరిత్ర అడగడం లేదు. కానీ, అదంతా చదివి ముస్లింలు సెలక్ట్ అయిపోతున్నారని చెబుతున్నారు” అన్నారు.

ముస్లింలకు సివిల్స్ ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు ఇస్తున్నారనే వాదనలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

దీనిపై మాట్లాడిన లక్ష్మీ శరణ్ మిశ్రా, “ఇంటర్వ్యూ బోర్డుకు ఒక ముస్లిం అధ్యక్షత వహించడం చాలా అరుదుగా జరుగుతుంది. బోర్డు సభ్యులందరి దగ్గరా మార్కులు సమానంగా ఉంటాయి. ఇంటర్వ్యూలో 275 మార్కులు ఉంటాయి. 1750 మార్కులకు ఉండే మెయిన్ పరీక్షలో వచ్చిన మార్కులను బట్టే ఇంటర్వ్యూ సెలక్షన్ జరుగుతుంది” అన్నారు.

मुसलमान

ఉర్దూ మీడియం వల్ల మేలు జరుగుతోందా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదనల్లో ఉర్దూ సాహిత్యం, మీడియం వల్లే ముస్లిం అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌లోకి ఎక్కువగా వస్తున్నారనేది కూడా ఒకటి.

ఇక ఉర్దూ మీడియం విషయానికి వస్తే ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చే ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో 2019- 94వ ఫౌండేషన్ కోర్సులో 326 ట్రైనీ ఐఏఎస్‌లు ఉన్నారు.

ఈ ట్రైనీ ఐఏఎస్‌ల మీడియం చూస్తే 315 మంది ఇంగ్లిష్, 8 మంది హిందీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ మీడియంల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో ఉర్దూ మీడియం వారు ఒక్కరు కూడా లేరు.

అలాగే, మేం 2018, 2017, 2016 ఫౌండేషన్ కోర్స్ ట్రైనీల మీడియం కూడా పరిశీలించాం. అందులో కూడా ఉర్దూ మీడియం వారు ఎవరూ లేరు. అంతే కాదు,

ఉర్దూ సాహిత్యం వల్ల ఎక్కువ మంది సక్సెస్ అయ్యారని కూడా సోషల్ మీడియాలోనే చెబుతున్నారు. భారత 8వ షెడ్యూల్లో చేర్చిన 88 భాషలను మెయిన్స్ పరీక్షలో ఐచ్ఛిక సబ్జెక్టులుగా తీసుకోవచ్చు.

యూపీఎస్‌సి ఒక గణాంకాలు విడుదల చేసింది. ఇందులో ఎంతమంది ఏ భాషా సాహిత్యాన్ని మెయిన్స్ పరీక్షల్లో ఐచ్చిక సబ్జెక్టుగా తీసుకున్నారు అనేది కూడా చెప్పింది.

దీని ప్రకారం, 2017లో 265 మంది హిందీ, 114 మంది కన్నడ, 111 మంది మలయాళం, 106 మంది తమిళ సాహిత్యం ఎంచుకున్నారు. ఇక ఉర్దూ విషయానికి వస్తే దానిని కేవలం 26 మంది ఎంచుకున్నారు. 2018లో ఉర్దూ సాహిత్యం ఐచ్చిక సబ్జెక్టుగా ఎంచుకున్న వారు కేవలం 16 మంది మాత్రమే.

భాషా సాహిత్యం సబ్జెక్టు గురించి చెప్పిన లక్ష్మీ శరణ్ మిశ్రా “అభ్యర్థులు భాషా సాహిత్యం ఐచ్చిక సబ్జెక్టును చాలా పారామీటర్స్ దృష్టిలో పెట్టుకుని ఎంచుకోవాల్సి ఉంటుంది. అది పాలీ భాష నుంచి మొదలవుతుంది. ఎందుకంటే పాలీ సిలబస్ చాలా తక్కువ. అది తెలిసిన వారు తక్కువమంది ఉంటారు. ఆ తర్వాత దక్షిణ భారత విద్యార్థుల వల్ల సివిల్ సర్వీసెస్‌లో దక్షిణ భారతీయ భాషల హవా పెరిగింది. కన్నడ విద్యార్థులకు దాని నుంచి చాలా ప్రయోజనం లభించింది. గత దశాబ్దంలో ఎక్కువగా సంస్కృత సాహిత్యం విద్యార్థులు ఈ ప్రయోజనం పొందారు” అన్నారు.

ఉర్దూ, సింధీ సాహిత్యం ఈమధ్య చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న సబ్జెక్టులు. కానీ, వీటిని తీసుకునే విద్యార్థులు కొద్దిమందే ఉంటారు. ఈ సబ్జెక్టుతో పరీక్ష సులభంగా పాస్ కాగలమని అనుకున్నవారే వాటిని తీసుకుంటారు. సక్సెస్ అవుతున్న ముస్లిం అభ్యర్థుల్లో కూడా 80 శాతం మంది ఉర్దూ సబ్జెక్టును ఎంచుకోవడంలేదు.

ఉర్దూ సాహిత్యం సక్సెస్ రేటు పెరిగినట్టు ఎందుకు కనిపిస్తోంది. ఈ ప్రశ్నకు కూడా లక్ష్మీ శరణ్ మిశ్రా సమాధానం ఇచ్చారు. “పొలిటికల్ సైన్స్ పది వేల మంది విద్యార్థులు తీసుకుంటారు అనుకుంటే, వారిలో కొంతమందే సక్సెస్ అవుతున్నారు. అటు, ఉర్దూ సబ్జెక్ట్స్ కొంతమంది మాత్రమే తీసుకుంటున్నారు. ఎక్కువ మంది పాస్ అవుతున్నారు. అంటే ఉర్దూ సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది.”

2017లో హిందీ సాహిత్యంలో 265 మంది పరీక్షలు రాస్తే, 19 మంది పాస్ అయ్యారు. అటు ఉర్దూలో 26 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే ఐదుగురే పాస్ అయ్యారు. అంటే హిందీ సక్సెస్ రేటు 7.1 అయితే, ఉర్దూ సక్సెస్ రేటు 19.2. కానీ, ఈ గణాంకాలను షేర్ చేస్తూ.. ప్రజలను భ్రమల్లో ముంచేస్తున్నారు.

फ़ैक्ट चेक, UPSC परीक्षा में मुसलमानों को अधिक मौक़े मिलते हैं?

ఫొటో సోర్స్, TWITTER

ముస్లింలకే ఉచిత కోచింగ్ సౌకర్యాలున్నాయా?

సివిల్స్ సర్వీస్ పరీక్ష రాయడానికి ముస్లింలకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇస్తోందని కూడా సోషల్ మీడియాలో చెబుతున్నారు. కానీ అది నిజం కాదు.

మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ సహా కొన్ని మంత్రిత్వ శాఖలు సివిల్ సర్వీసెస్ పరీక్షల ఎన్నో కోచింగ్ పథకాలకు నిధులు అందిస్తున్నాయి. కొన్ని కోచింగ్ కూడా ఇస్తున్నాయి. ముస్లింలకే కాదు, మహిళలకు, మైనారిటీలకు, ఎస్సీ, ఎస్టీలకు, ఓబీసీవారికి కూడా కోచింగ్ ఇస్తున్నారు.

ఇటీవల సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ శాఖ ఎస్సీ, ఓబీసీ విద్యార్థులు తమకు నచ్చిన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకోడానికి ఒక పథకం కూడా ప్రారంభించింది. ఇందులో మంత్రిత్వ శాఖ వారికి డబ్బులు ఇవ్వడంతోపాటూ స్కాలర్‌షిప్ కూడా అందిస్తుంది.

జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం జామియా హందర్ద్ విశ్వవిద్యాలయం, జకాత్ ఫౌండేషన్ లాంటి ఎన్నో ప్రభుత్వేతర సంస్థలు సివిల్స్ కోచింగ్ ఇస్తున్నాయి. ఇవి కూడా మైనారిటీ, మహిళలు, ఆర్థికంగా వెనకబడినవారు, ఎస్టీ విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నాయి.

ఇప్పుడు ముస్లింలకు సంబంధించిన సంస్థలు మాత్రమే సివిల్స్ కోచింగ్ ఇస్తున్నాయా అనే ప్రశ్న కూడా వస్తుంది. దీనికి లక్ష్మీ శరణ్ సమాధానం ఇచ్చారు.

ఈసారీ సివిల్ సర్వీస్ ఫలితాల్లో జైన సమాజం అభ్యర్థులు ఎక్కువ మంది సఫలం అయ్యారు. అంటే, యూపీఎస్‌సీ జైన మతాన్ని సమర్థిస్తోందని మనం చెప్పేయవచ్చా అంటున్నారాయన.

“వెయ్యి కోట్ల రూపాయల ఫండ్ ఉన్న జైన మతం సంస్థ జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తమ నిధులతో జైపూర్, ఇండోర్, దిల్లీ, చెన్నైలో రెసిడెన్షియల్ కోచింగ్ సెంటర్లు తెరిచింది. అక్కడ జైన విద్యార్థులకు మూడునాలుగేళ్ల వరకూ ఉచితంగా వసతి అందించి, కోచింగ్ ఇస్తోంది. మధ్యప్రదేశ్ పీఎస్‌సీలో జైన మతం అభ్యర్థుల ఎక్కువ ఎంపికవుతున్నారు. దాని సక్సెస్ రేటు 20-25 ఉంటుంది” అన్నారు.

సివిల్ సర్వీసుల్లో తమ వారు చేరుకోవాలని ఆ రాష్ట్రం, సమాజం కూడా కోరుకుంటోంది. గుజరాత్‌లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాతీలు సివిల్ సర్వీసుల్లో ఎక్కువగా చేరేలా సర్దార్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సివిల్స్ కోచింగ్ ప్రారంభించింది. మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ బ్లాక్ లెవల్ కోచింగ్ ప్రారంభించింది. ఇలాంటి శిక్షణ ఇచ్చే ఆర్ఎస్ఎస్ సంకల్ప సంస్థ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి మతం, ప్రతి కులం, ప్రతి సమాజం సివిల్ సర్వీసుల్లో తమ ప్రతినిధులను పెంచుకోడానికి ప్రయత్నిస్తుంటాయి.

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ముస్లింల సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది ప్రకటించిన సివిల్స్-2019 ఫలితాల్లో మొత్తం 829 మందిలో 42 మంది ముస్లిం అభ్యర్థులే విజయం సాధించారు. దేశంలో ముస్లింల జనాభా 15 శాతం అయితే, ఇది కేవలం ఐదు శాతమే. 2018లో 28 మంది, 2016లో 50 మంది అభ్యర్థులు ఈ పరీక్షల్లో విజయం సాధించగలిగారు.

యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ పరీక్షలో ముస్లింలకు ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయనే వాదనలు పూర్తిగా అవాస్తవం అని బీబీసీ ఫ్యాక్ట్ చెక్ పరిశోధనలో తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)