దిల్లీ అల్లర్లపై ఆమ్నెస్టీ నివేదిక: పోలీసులు చేసిన తప్పులకు శిక్షలు ఉండవా?

దిల్లీ అల్లర్ల సమయంలో పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపణలు వచ్చాయి

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, దిల్లీ అల్లర్ల సమయంలో పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపణలు వచ్చాయి
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈశాన్య దిల్లీలో గత ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లపై స్వతంత్ర దర్యాప్తు జరిపి మానవహక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ ఓ నివేదికను తయారు చేసింది.

దిల్లీ అల్లర్లను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించలేదని, వాటిలో వారు భాగం కూడా అయ్యారని ఆమ్నెస్టీ ఈ నివేదికలో ఆరోపించింది. సహాయం అర్థిస్తూ వచ్చిన ఫోన్ కాల్స్‌కు పోలీసులు స్పందించలేదని, బాధితులు ఆసుపత్రిలో చేరుతుంటే కూడా అడ్డుతగిలారని నిందించింది. ముఖ్యంగా ముస్లిం వర్గానికి చెందినవారినే పోలీసులు కొట్టారని కూడా ఆరోపించింది.

అల్లర్లు జరిగిన ఆరు నెలల తర్వాత కూడా అల్లర్ల బాధితులను, శాంతియుత ఆందోళనకారులను పోలీసులు బెదిరిస్తున్నారని, వారిపైనే కేసులు పెడుతున్నారని ఈ నివేదికలో ఆమ్నెస్టీ పేర్కొంది. మానవహక్కులు ఉల్లంఘించినట్లు దిల్లీ పోలీసులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి, ఇంతవరకూ ఒక్క కేసులోనూ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని తెలిపింది.

దిల్లీ పోలీసు విభాగం కేంద్ర హోంశాఖ నేతృత్వంలో పనిచేస్తుంది.

‘‘ప్రభుత్వం నుంచి వారికి దొరుతున్న ఈ రక్షణ... చట్టాన్ని అమల్లో పెట్టాల్సిన అధికారులు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడవచ్చని సందేశం ఇస్తోంది. అంటే, వారు సొంత చట్టాలు అమలు చేసుకోవచ్చు’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

ఈ నివేదిక వెల్లడించడానికి ముందు పోలీసుల వాదన ఏంటో తెలుసుకునేందుకు ఆమ్నెస్టీ వారిని సంప్రదించింది. కానీ, వారం రోజులు గడిచినా, వారి నుంచి స్పందన రాలేదు.

మార్చిలో దిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. దిల్లీ అలర్ల సమయంలో పోలీసులు మౌన ప్రేక్షకపాత్ర వహించారన్న ఆరోపణలను అప్పుడు ఆయన ఖండించారు. పోలీసుల వైపు ఏవైనా లోపాలు ఉన్నాయని ఆరోపణలు వస్తే, విచారణ జరుపుతామని చెప్పారు.

ఇదివరకు జులైలో దిల్లీ మైనార్టీ కమిషన్ కూడా దిల్లీ అలర్లపై నిజ నిర్ధారణ నివేదికను ఇచ్చింది. పోలీసులు తమ ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడం లేదని, రాజీకి రావాలని బెదిరిస్తున్నారని, తమపైనే కేసులు పెడుతున్నారని బాధితులు ఆరోపించినట్లు ఆ నివేదిక తెలిపింది.

ముస్లిం వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పన్నిన కుట్రను రెండు వర్గాల మధ్య ఘర్షణలుగా దిల్లీ పోలీసులు చిత్రించి చూపారని కూడా ఆరోపించింది. అయితే, ఈ నివేదికకు దిల్లీ పోలీసులు జవాబు ఇవ్వలేదు.

‘పోలీసులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి, ఇంతవరకూ ఒక్క కేసులోనూ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు’
ఫొటో క్యాప్షన్, ‘పోలీసులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి, ఇంతవరకూ ఒక్క కేసులోనూ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు’

ముందేం జరిగింది?

దిల్లీ అల్లర్ల బాధితులు, సాక్షులు, న్యాయవాదులు, వైద్యులు, మానవహక్కుల కార్యకర్తలు, విశ్రాంత పోలీసు అధికారులతో మాట్లాడి, జనాలు తీసిన వీడియోలను విశ్లేషించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ నివేదిక రూపొందించింది.

మొదటగా 2019 డిసెంబర్ 15న జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిరసలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు హింసకు, లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు వచ్చిన ఆరోపణలను ఈ నివేదిక ప్రస్తావించింది.

ఈ విషయమై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలంటూ దిల్లీ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దిల్లీ పోలీసులు వ్యతిరేకించారు.

2020 జనవరి 5న జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో రాడ్లతో కొందరు విధ్వంసానికి పాల్పడ్డారు. పదుల సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులపై దాడి చేశారు.

ఈ వ్యవహారంపై జేఎన్‌యూ విద్యార్థులు, అధ్యాపకుల తరఫు నుంచి 40కిపైగా ఫిర్యాదులు వచ్చినా, దిల్లీ పోలీసులు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు.

మరోవైపు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ సహా సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న కొందరు ఆందోళనకారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరిలో ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ నాయకులు కొందరు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాల గురించి కూడా ఆమ్నెస్టీ నివేదిక ప్రస్తావించింది.

2020 ఫిబ్రవరి 26న దిల్లీ హైకోర్టు ‘బాగా ఆలోంచించి తీసుకున్న నిర్ణయం’గా చెబుతూ… బీజేపీ నాయకులు కపిల్ మిశ్ర, పర్వేశ్ వర్మ, అనురాగ్ ఠాకుర్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. కానీ, ఇంతవరకూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గత జులైలో బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్యకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం తప్పని అప్పుడు ఆయన అన్నారు.

‘‘అలాంటి వ్యాఖ్యలను మేం వ్యతిరేకిస్తున్నాం. అవి దేశ ప్రతిష్ఠను, లౌకికవాద ముద్రను దిగజారుస్తాయి. వాటిని నేను ఖండిస్తున్నా. విద్వేషపు వ్యాఖ్యలను ఎవరమూ సమర్థించం. సమర్థించకూడదు’’ అని నఖ్వీ అప్పుడు చెప్పారు.

‘హిందువులతో పోల్చితే ముస్లింలకు చెందిన ఇళ్లు, దుకాణాలే ఎక్కువగా ధ్వంసమయ్యాయి’
ఫొటో క్యాప్షన్, ‘హిందువులతో పోల్చితే ముస్లింలకు చెందిన ఇళ్లు, దుకాణాలే ఎక్కువగా ధ్వంసమయ్యాయి’

అల్లర్ల సమయంలో ఏం చేశారు?

అల్లర్ల సమయంలో 100 నెంబర్‌కు ఫోన్ చేస్తే పోలీసులు కాల్ స్వీకరించలేదని, కొన్ని సార్లు ‘‘ఆజాదీ (స్వాతంత్ర్యం) కావాలన్నారుగా. తీసుకోండి ఆజాదీ’’ అంటూ బదులిచ్చారని కొందరు బాధితులు చెప్పినట్లు ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది.

సీఏఏ వ్యతిరేక ప్రదర్శనల సమయంలో ఆందోళనకారులు ‘‘మనం కోరుకుంటున్నదేంటి?... ఆజాదీ’’ అంటూ నినాదాలు చేశారు. ఆజాదీ అంటే తమ ఉద్దేశంలో వివక్ష, వేధింపులు దూరమవ్వడమని ఆందోళనకారులు చెబుతున్నారు.

పోలీసులు ఐదుగురు యువకులను బూట్లతో తన్నుతున్న ఓ వీడియో గురించి కూడా ఆమ్నెస్టీ ప్రస్తావించింది. ఆ ఘటనలో బాధితుడైన ఓ యువకుడి తల్లి తమతో మాట్లాడినట్లు పేర్కొంది.

తన కుమారుడిని 36 గంటలపాటు జైల్లో ఉంచారని, విడుదలయ్యాక అతడు చనిపోయాడని ఆమె వాపోయినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. తన కుమారుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఏ పత్రాలూ చూపలేదని, చట్టప్రకారం అదుపులోకి తీసుకున్న 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచలేదని ఆమె చెప్పినట్లు ఆమ్నెస్టీ తెలిపింది.

అలర్ల సమయంలో పోలీసులు మౌన ప్రేక్షకపాత్ర పోషించారని, రాళ్లదాడిలో గాయపడ్డవారిని ఆసుపత్రులకు వెళ్లకుండా అడ్డుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయని ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది.

ఈ నివేదిక ప్రకారం దిల్లీ అల్లర్లలో మరణించిన 53 మందిలో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు. హిందువులతో పోల్చితే ముస్లింలకు చెందిన ఇళ్లు, దుకాణాలే ఎక్కువగా ధ్వంసమయ్యాయి.

పోలీసులకు పదే పదే ఫోన్ చేసినా, తనకు సాయం అందలేదని ఓ హిందూ వ్యక్తి చెప్పారని... అయితే పోలీసులకు మద్దతుగానే ఆయన మాట్లాడారని ఆమ్నెస్టీ తెలిపింది. అల్లర్ల కారణంగా దారులు మూసుకుపోవడంతో పోలీసులు సాయం చేసేందుకు రాలేకపోయి ఉండొచ్చని అన్నారని పేర్కొంది.

దిల్లీ అలర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ‘సెంటర్ ఫర్ జస్టిస్’ అనే సంస్థ ‘దిల్లీ రయైట్స్: కాన్‌స్పిరసీ అన్‌వీల్డ్‌' పేరుతో ఓ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక కూడా పోలీసుల తీరుపై ఇదే వైఖరి చూపింది. అల్లర్లు హిందువులకు వ్యతిరేకంగా జరిగాయని పేర్కొంది.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, AFP

‘బాధితులపై వేధింపులు’

ఇదివరకు వచ్చిన నివేదికలకు భిన్నంగా దిల్లీ అల్లర్ల తర్వాత పోలీసుల విచారణల గురించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక చర్చించింది. ఈ కేసుల్లో పోలీసులు ముస్లింలనే ఎక్కువగా అరెస్టు చేశారని, వారిపైనే ఎక్కువగా కార్యకలాపాలు జరిగాయని ఆరోపించింది.

ఫిబ్రవరిలో నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మానవహక్కుల కార్యకర్త ఖాలిద్ సైఫీ అరెస్టు గురించి ఆమ్నెస్టీ నివేదిక ప్రస్తావించింది. పోలీసుల వ్యవహారశైలి వల్ల మార్చిలో కోర్టుకు సైఫీ వీల్ చెయిర్‌లో రావాల్సి వచ్చిందని పేర్కొంది.

ఆరు నెలలుగా సైఫీ జైల్లో ఉన్నారు. ఆయన్ను యూఏపీఏ చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తమను వేధించారని, బలవంతంగా తప్పుడు వాంగ్మూలాలు చెప్పించారని, ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని అల్లర్ల బాధితులు ఆరోపించినట్లు కూడా ఆమ్నెస్టీ నివేదికలో ఉంది.

పోలీసులు తన క్లైయింట్‌తో మాట్లాడనివ్వలేదని, తనతో అనుచితంగా ప్రవర్తించారని, లాఠీతో కొట్టారని ‘హూమన్ రైట్స్ లా నెట్‌వర్క్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఓ న్యాయవాది ఆరోపించినట్లుగా కూడా ఉంది.

దిల్లీ అల్లర్లకు సంబంధించి చేసే అరెస్టుల్లో ‘జాగ్రత్తగా’ వ్యవహరించాలని, ‘హిందువుల మనోభావాలకు విఘాతం’ కలగకుండా చూసుకోవాలని జులై 8న దిల్లీ పోలీసు శాఖ ఓ ఆదేశం జారీ చేసింది.

దీనిపై పోలీసులకు దిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. సదరు ఆదేశాన్ని రద్దు చేసింది.

సీనియర్ అధికారులు ఇచ్చే ఆదేశాల్లో చట్ట వ్యతిరేకమైన వివక్షకు తావు లేకుండా విచారణ సంస్థలు జాగ్రత్త వహించాలని సూచించింది.

దిల్లీ అల్లర్ల విషయంలో దిల్లీ పోలీసుల తీరుపై విచారణ జరగాలని, వారు జవాబుదారీతనం వహించేలా చేయాలని.. మతాల మధ్య ఉద్రిక్తతలు, హింస చెలరేగినప్పుడు ఎలా వ్యవహరించాలో వారికి శిక్షణ ఇవ్వాలని గత ఆరు నెలలుగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్లు చేస్తోంది.

గమనిక: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదికలో తమపై వచ్చిన ఆరోపణల గురించి దిల్లీ పోలీసులు ఇంకా స్పందించలేదు. పోలీసుల స్పందన రాగానే, ఈ కథనంలో జోడిస్తాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)