దిల్లీ అల్లర్ల కేసు: చార్జిషీటులో హర్ష్ మందర్... మరికొందరు పౌర హక్కుల నేతల పేర్లు

భార్య పూనమ్‌తో రతన్‌లాల్

ఫొటో సోర్స్, DHEERAJ BARI

ఫొటో క్యాప్షన్, భార్య పూనమ్‌తో రతన్‌లాల్

ఈశాన్య దిల్లీ అల్లర్లలో హత్యకు గురైన కానిస్టేబుల్ రతన్‌లాల్‌ కేసులో దిల్లీ పోలీసులు సమర్పించిన చార్జిషీటులో స్వరాజ్‌ పార్టీ అధినేత యోగేంద్ర యాదవ్‌, విద్యార్ధి సంఘం నాయకురాలు కవల్‌ప్రీత్‌ కౌర్‌, న్యాయవాది డిఎస్‌ బింద్రాల పేర్లు కూడా ఉన్నాయని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించింది.

పౌర హక్కుల సంఘం నేత హర్ష్‌ మందర్‌ పేరు కూడా చార్జిషీటులో ఉందని స్క్రోల్ ఆన్‌లైన్‌ మేగజైన్‌తోపాటు వివిధ పత్రికలు రాశాయి.

పోలీసులు సమర్పించిన చార్జిషీటును చూస్తుంటే ఈ ప్రజాస్వామ్యం చీకటి గుహలోకి ప్రవేశిస్తున్నట్లుగా ఉందని స్క్రోల్‌ వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో దిల్లీ యూనివర్సిటీ హిందీ ప్రొఫెసర్‌ అపూర్వానంద్ విమర్శించారు.

అసలేంటి కేసు ?

ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఈశాన్య దిల్లీ అల్లర్ల సందర్భంగా కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ హత్యకు గురయ్యారు. ఇక్కడ హింసాత్మక ఘటనలను రెచ్చగొట్టారంటూ పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసి ఛార్జిషీటు దాఖలు చేశారు.

ఘటన జరిగిన రోజు ఈశాన్య దిల్లీలోని వాజిరాబాద్‌ రోడ్డుపైకి భారీ ఎత్తున సీఏఏను వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు గుమిగూడారని, వారు ఆ సమయంలో తీవ్ర ఆవేశంలో ఉన్నారని పోలీసులు తమ ఛార్జిషీటులో పేర్కొన్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది.

ఆందోళనకారులను సముదాయించేందుకు షాదరా డీసీపీ అమిత్‌ శర్మ అక్కడికి చేరుకుని వెళ్లిపోవాల్సిందిగా సూచించారని, అయినా వారు మాట వినలేదని ఛార్జ్‌షీటులో పేర్కొన్నట్లు ఈ కథనంలో ఉంది.

గోకుల్‌పురి ఏసీపీ, షాదరా డీసీపీలు అక్కడ ఉండగానే కొందరు పోలీసులపై రాళ్లు రువ్వడం మొదలుపెట్టారని, ఈ ఘటనలో చాలామంది పోలీసులు గాయపడ్డారని కూడా ఛార్జిషీటులో పోలీసులు రాశారు.

తీవ్ర ఆవేశంలో ఉన్న ఆందోళకారులు కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారని, షాదరా డీసీపీ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారని, కొందరు పోలీసులు అక్కడున్న డివైడర్‌ ఫెన్సింగ్‌ను దూకి తప్పించుకోగలిగినా, కొందరు మాత్రం ఆందోళనకారులు చేతికి చిక్కారని, వారు పోలీసులను తీవ్రంగా హింసించారని ఛార్జ్‌ షీటులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హెడ్‌ కానిస్టేబుల్ రతన్‌లాల్‌(42) తీవ్రగాయాల పాలై మరణించారని, ఈశాన్య దిల్లీలోని చాంద్‌బాగ్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో ఈ ఉద్యమకారులకు సంబంధాలున్నాయని ఛార్జ్‌ షీట్‌లో పేర్కొన్నారు పోలీసులు.

యోగేంద్ర యాదవ్

ఫొటో సోర్స్, YogendraYY/facebook

ఫొటో క్యాప్షన్, యోగేంద్ర యాదవ్

హర్ష్‌ మందర్‌ పేరు ఎందుకు వచ్చింది?

ఈ ఛార్జ్‌ షీట్‌లో హక్కుల కార్యకర్త హర్ష్‌ మందర్‌ పేరు కూడా వచ్చినట్లు ప్రముఖ దిన పత్రికలతోపాటు స్క్రోల్‌, ఇండియా క్లారియన్‌ వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి. ఆందోళన కారులను హింసకు ప్రేరేపిస్తూ ఆయన ప్రసంగాలు చేశారంటూ ఛార్జ్‌ షీటులో ఆయనపై అభియోగం మోపినట్లు ఇండియన్‌ క్లారియన్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది.

భారత పార్లమెంటు, సుప్రీం కోర్టుల నుంచి ఆశించగలిగిందేమీలేదని, న్యాయం కోసం ప్రజలు రోడ్లమీదకు రావాల్సిందేనని ఆయన ఆందోళనకారులకు బోధించారని సుప్రీంకోర్టులో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించినట్లు కూడా ఇండియన్‌ క్లారియన్‌ పత్రిక రాసింది.

‘’ ఆయన ఎవరినీ రెచ్చగొట్టలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమిస్తారు. అందుకే ఆయనపై కేసులు పెట్టారు’’ అని హర్ష్‌ మందర్‌ తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే పేర్కొన్నట్లు ఈ కథనంలో ఉంది.

అయితే ఛార్జ్‌ షీట్‌లో పోలీసులు పేర్కొన్న ప్రసంగం ఫిబ్రవరి 14నాటిది కాదని దిల్లీ యూనివర్సిటీ హిందీ ప్రొఫెసర్‌ అపూర్వానంద్‌ అంటున్నారు. స్క్రోల్ వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో ‘’ ఆయన ప్రసంగం డిసెంబర్‌ 16నాటిది.

జామియా ఆందోళన సందర్భంగా ఆయన ప్రసంగించారు. దీన్ని ఫిబ్రవరి 14నాటికి అల్లర్లకు లింకు పెట్టి పోలీసులు ఛార్జ్‌ షీట్‌లో ఆయనపై అభియోగం మోపుతున్నారు. దీనివల్ల ఎలాంటి న్యాయపరమైన పర్యవసానాలు లేకపోతే దీన్ని చూసి మనం నవ్వుకోవాలి’’ అని అపూర్వానంద్‌ అన్నారు.

హర్ష్‌ మందిర్‌ చేసినదిగా పోలీసులు చెబుతున్న ప్రసంగం పాఠాన్ని అపూర్వానంద్‌ స్క్రోల్ వెబ్‌సైట్‌ వ్యాసంలో విపులంగా రాశారు.

ఏమని ప్రసంగించారు?

హర్ష్‌ మందర్‌ ప్రసంగం ఇదేనని స్క్రోల్ వెబ్‌సైట్‌లో ప్రొఫెసర్ అపూర్వానంద్‌ రాశారు.

దాని ప్రకారం ఆయన ప్రసంగం ఇలా ఉంది. ‘’ మన దేశ భవిష్యత్తు ఎలా కనిపిస్తోంది మీకు? మీరు ఇప్పుడు యువకులు. మీ పిల్లలకు ఎలాంటి దేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారు మీరు. నిర్ణయాలు ఎక్కడ తీసుకోవాలి? వీధుల్లోనే తీసుకోవాలి. మనం ఈరోజు వీధులకెక్కాం. కానీ వీధులకన్నా వేరే ప్రాంతం కూడా ఒకటి ఉంది. అక్కడే సంపూర్ణ నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అదే మన హృదయం. మీ హృదయం, నా హృదయం.

మనం సమాధానం ఇవ్వాలి. వాళ్లు మన గుండెలను ద్వేషంతో చంపేయాలనుకుంటున్నారు. మనం కూడా ద్వేషంతోనే సమాధానం ఇస్తే అది మరింత పెరుగుతుంది. మన భవిష్యత్తును చీకటిమయం చేయాలనుకుంటున్నవారికి చీకటితోనే సమాధానం చెబితే ఆ చీకటి మరింత పెరుగుతుంది. అందుకే చీకటిపై వెలుతురుతో యుద్ధం చేయాలి.

ద్వేషాన్ని ప్రేమతో ఓడించాలి. వాళ్లు మన మీద హింసను ప్రయోగించినా మనం దాన్ని ప్రయోగించవద్దు. వాళ్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మనం 2శాతం హింసను ప్రయోగిస్తే వాళ్లు 100శాతం హింసను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటారు. హింస అసమానతలపై పోరాడాలని మనకు గాంధీజీ చెప్పారు. మనం అహింస అనే ఆయుధంతోనే యుద్ధం చేయాలి. మనల్ని హింసకు ప్రోత్సహించేవారు మన శ్రేయోభిలాషులు కారు’’ అని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నట్లు ప్రొఫెసర్ అపూర్వానంద్‌ తన వ్యాసంలో రాశారు.

‘‘ఆయన చేసిన ప్రసంగంలో ఎక్కడైనా హింసను ప్రేరేపించే అంశాలు ఉన్నాయా’’ అని తన వ్యాసంలో ప్రశ్నించారు ప్రొఫెసర్‌ అపూర్వానంద్‌.

హర్ష్ మందర్

ఫొటో సోర్స్, harsh_mander/twitter

ఫొటో క్యాప్షన్, హర్ష్ మందర్

ఎవరీ హర్ష్‌ మందర్‌ ?

హక్కుల కార్యకర్తగా, ముఖ్యంగా మైనారిటీల తరఫున గళం వినిపించే వ్యక్తిగా హర్ష్‌ మందర్‌కు పేరుంది. ఒకప్పుడు ఐఏఎస్‌ ఆఫీసర్‌గా పని చేసిన హర్ష్‌ మందర్‌ తర్వాత హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలలోకి దిగారని అపూర్వానంద్‌ ఆయన గురించి తన వ్యాసంలో రాసుకొచ్చారు.

సమాజంలో వివిధ రూపాలలో కొనసాగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యంగా ఆయన పని చేశారని అంటారు అపూర్వానంద్‌. తన వ్యాసం ఉద్దేశం హర్ష్‌ మందర్‌ను కీర్తించడం కాదని, ఆయనలాగా సమానత్వం కోసం, అహింస కోసం, హక్కుల కోసం పోరాడేవారిని రాజ్యం లక్ష్యంగా చేసుకుంటుందని చెప్పడమే తన ఉద్దేశమని అన్నారు అపూర్వానంద్‌.

బలహీన వర్గాలకు ముఖ్యంగా మైనారిటీల కోసం తన గళాన్ని వినిపించడంలో హర్ష్‌ మందర్‌ చురుగ్గా పని చేస్తున్నారు. మనకున్నన్యాయవ్యవస్థ సహకారంతోనే మైనారిటీలకు భద్రత చేకూర్చే అవకాశం ఉందని హర్ష్ మందర్‌ నమ్ముతారని ఈ వ్యాసంలో పేర్కొన్నారు. 2002 గుజరాత్‌ అల్లర్ల తర్వాత ఆయన ఆయన తన నిరసన గళాన్ని మరింత పెంచారని చెప్పారు అపూర్వానంద్‌.

రతన్ లాల్

ఫొటో సోర్స్, DHEERAJ BARI

ఫొటో క్యాప్షన్, భార్య, పిల్లలతో రతన్‌లాల్

అభియోగాలపై ఎవరేమంటున్నారు?

హర్ష్‌మందర్‌ను ఛార్జిషీటులో చేర్చడంపై ఆందోళన వ్యక్తమైంది. దాదాపు 200మంది మేథావులు, విద్యావేత్తలు, కళాకారులు, హక్కుల ఉద్యమకారులు ఈ ఘటనకు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. వీరంతా తమ సోషల్ మీడియా వెబ్‌సైట్లలో ఆయనకు మద్దతును తెలియజేసినట్లు “ది నేషనల్ హెరాల్డ్’’ పత్రిక రాసింది.

తప్పుడు కథనాలతో తప్పుడు కేసులు పెట్టి హక్కుల కార్యకర్తల గొంతులను నొక్కడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించినట్లు ఈ కథనంలో ఉంది.

‘‘ప్రజల హక్కులను కాపాడే ప్రయత్నంలో ఆయన తన ఉద్యోగాన్నే వదులుకున్నారు. ప్రజల మధ్య ప్రేమ, అనుబంధాలను పెంచడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. అణగారిన వర్గాల వారి కోసం ఆయన గొంతు వినిపిస్తారు. మెరుగైన భారతదేశాన్ని ఆయన ఆకాంక్షిస్తారు. ఇటీవల లాక్‌డౌన్‌ కారణంగా ఆయన వలస కూలీలకు ఎంతో సాయం చేశారు. దాన్ని ఎవరూ మరచిపోలేరు’’ అని వారు తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నట్లు “ది నేషనల్‌ హెరాల్డ్‌’’ పేర్కొంది.

‘‘హర్ష్‌ మందర్‌ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పోలీసులకు అనిపించి ఉండదు. కానీ అధికారంలో ఉన్న మతతత్వ ప్రభుత్వానికే అలా వినిపించి ఉంటుంది'' అని తెలంగాణలో పౌరహక్కుల సంఘాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వీరబ్రహ్మచారి విమర్శించారు.

‘’ప్రజలు హక్కుల కోసం పోరాడటాన్ని ప్రభుత్వాలు జీర్ణించుకోలేవు. వారిని నడిపించే వారిని రాజ్య శత్రువులుగా ముద్రవేస్తాయి. తన బలం, బలగంతో వారిని అణచివేయాలని చూస్తాయి. హర్ష్ మందర్‌ వ్యవహారంలో కూడా ప్రభుత్వం చేస్తున్నది అదే’’ అని ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు బీబీసీతో అన్నారు.

‘‘ఒక్క హర్ష్‌ మందర్‌ వ్యవహారమే కాదు...దేశంలో ఎక్కడ హక్కుల ఉద్యమాలు జరిగినా దాని నాయకులు ప్రభుత్వ టార్గెట్‌లోకి వెళ్లిపోతారు’’ అని సుబ్బారావు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)