దిల్లీ హింస: ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో హింసకు కారకులెవరు? ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు?

- రచయిత, ఫైసల్ మహమ్మద్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలోని గోకుల్‌పురిలోని టైర్ మార్కెట్‌లో మంగళవారం కూడా విధ్వంసం జరిగింది. ఇక్కడి మెట్రో స్టేషన్ వద్ద రాళ్ల దాడులు కనిపించాయి.
మేం వీడియో తీస్తుండటం చూసి, జనాలు మా వైపు కూడా రాళ్లు రువ్వారు. మా వాహనానికి రాళ్లు తగులుతుండటంతో, ఆ చోటు నుంచి మేం వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఈ ప్రాంతంలో జై శ్రీరామ్ నినాదాలు వినిపించాయి. గోకుల్‌పురిలోని మీట్ నగర్ ప్రాంతంలో దాదాపు 200 మంది త్రివర్ణ, కాషాయ పతాకాలతో వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు.
‘దేశ ద్రోహులను కాల్చిపడేయాలి’ అంటూ కూడా వాళ్లు నినాదాలు చేశారు.
భజన్‌పురలోని బాబర్‌పుర్ కాలనీలో ఓ పాత సమాధి సోమవారం రాత్రి ధ్వంసమైంది. దాన్ని తగులపెట్టేందుకు ప్రయత్నాలు జరిగినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఎవరు చేశారనే విషయం మాత్రం తెలియదు.
దీనికి 10-15 మీటర్ల దూరంలోనే ఓ పోలీస్ సహాయ కేంద్రం ఉంది. ఖజూరీ ఖాస్ పోలీస్ స్టేషన్ శిబిరం ఇది. దీనిపైనా దాడి జరిగింది.


సమాధి బయట ఉన్న పూల దుకాణం కూడా ధ్వంసమైంది. బయట నిలిపి ఉంచిన రెండు బైక్‌లు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి.
ఈ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం ఉంది. ఎటూ చూసినా ఇటుక ముక్కలు, రాళ్లతో విధ్వంసపు ఆనవాళ్లే కనిపిస్తున్నాయి.
హింస చెలరేగిన సమయంలో ఇక్కడ ఉన్న స్థానికుడు ఒకరు మాతో మాట్లాడారు.
‘‘మధ్యాహ్నం పూట ఇది మొదలైంది. జనాలు పెట్రోల్ పంపుకు నిప్పు పెట్టారు. చాలా దుకాణాలను పెట్రోల్ పోసి తగులబెట్టారు. వాళ్లు బయటి నుంచి వచ్చినవాళ్లే. అందర్నీ కొట్టారు’’ అని అన్నారు.
బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్‌కు చెందిన వాళ్లు హింసను ప్రేరేపించారని అక్కడున్న కొంతమంది ఆరోపించారు. అయితే, దేని ఆధారంగా చెబుతున్నారని అడిగితే, వారి దగ్గర జవాబు లేదు.
పోలీసులు ముస్లింలను మాత్రమే కొట్టారని, రాళ్లు విసిరారని స్థానిక యువకుడు ఒకరు ఆరోపించారు.

ఇది ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతమని స్థానికుడు ఒకరు చెప్పారు. హింసకు పాల్పడినవారంతా బయటి నుంచి వచ్చినవాళ్లని, పోలీసుల మద్దతు కూడా వాళ్లకు ఉందని ఆరోపించారు. ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగిందని అన్నారు. ఐదారు గంటలపాటు రాళ్ల దాడి కొనసాగిందని, పోలీసులు దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదని చెప్పారు.
మళ్లీ హింస చెలరేగొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో పోగవ్వొద్దని అక్కడి వారికి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.
పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ క్యానిస్టర్లను కూడా స్థానికులు మాకు చూపించారు. తమనే లక్ష్యంగా చేసుకుని వాటిని ప్రయోగించారని అన్నారు.
మంగళవారం ఉదయం కూడా కొన్ని దుకాణాల నుంచి పొగ వెలువడుతూ ఉంది. ఓ పళ్ల దుకాణం పూర్తిగా ధ్వంసమై కనిపించింది. పళ్లంతా కాలిపోయి, నాశనమై రోడ్డుపై పడి ఉన్నాయి. అక్కడే ఉన్న ఓ చిన్న కారు కూడా పూర్తిగా కాలిపోయి కనిపించింది.
ఆ కారు ఆజాద్ చికెన్ సెంటర్ అనే దుకాణం నడుపుతున్న వ్యక్తిదని స్థానికుడు ఒకరు చెప్పారు. పెట్రోల్ బాంబుతో ఆ చికెన్ సెంటర్‌పై కొందరు దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు అన్నారు.
ఆజాద్ చికెన్ సెంటర్‌పైనే మాలిక్ భూరే ఖాన్ అనే వ్యక్తి ఇల్లు ఉంది.
‘‘రాళ్ల దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు ఆపే ప్రయత్నమే చేయలేదు. మేం పారిపోయే వీలు కూడా లేకపోయింది. వాళ్లు కింది అంతస్తులో నిప్పు పెట్టారు. మేం పై అంతస్తులో ఉన్నాం’’ అని భూరే ఖాన్ చెప్పారు.
తగులబడటం వల్ల భవనం పైకప్పు బాగా దెబ్బతింది. అది ఏ క్షణమైనా కూలిపోయేలా ఉంది.
‘‘మధ్యాహ్నం రెండున్నరకి నిప్పు పెట్టారు. ఏడున్నర తర్వాత ఫైర్ బ్రిగేడ్ వచ్చి నీళ్లు చల్లడం మొదలుపెట్టింది’’ అని భూరే ఖాన్ చెప్పారు.

‘‘మాకేమీ మిగల్లేదు. అంతా కాలి బూడిదైంది. దుకాణంలో కింద టార్పలిన్‌కు వాళ్లు నిప్పుపెట్టారు. మంటలు పైదాకా వ్యాపించాయి. అంతా నాశనమైంది’’ అంటూ భూరే ఖాన్ ఇంట్లో ఉన్న ఓ ముసలావిడ కన్నీళ్లు పెట్టుకున్నారు.
భూరే ఖాన్ మమ్మల్ని వాళ్ల ఇంటి రెండో అంతస్తుకు తీసుకువెళ్లారు. ఆయన పైకప్పుల మీద నుంచి పరుగెత్తుకుంటూ బంధువుల ఇంటికి ఎలా వెళ్లింది మాకు చూపించారు. మంటల తీవ్రతకు భవనంపైనున్న నీటి ట్యాంకులు కూడా కాలిపోయాయి.
కపిల్ మిశ్రపై ఆరోపణలు
హిందువులు, ముస్లింలు కలిసి సామరస్యంగా ఉండేవాళ్లమని, తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని చాంద్‌బాగ్‌లో ఉంటున్న జాహిద్ అన్నారు.
పెట్రోల్ బాంబులు విసిరిన వాళ్లంతా బయటి వ్యక్తులని, వాళ్లను ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ అల్లర్లు చేయించారని ఆయన చెప్పారు.

ఇదంతా ఆర్ఎస్ఎస్, కపిల్ మిశ్రల పని అని జాహిద్ ఆరోపిస్తున్నారు.
మోజ్‌పుర్‌లో సీఏఏకు అనుకూలంగా ఇటీవల నిర్వహించిన ర్యాలీలో... ‘‘డీసీపీ సాబ్ ఇక్కడున్నారు. ట్రంప్ వెళ్లేవరకూ మేం శాంతిగా ఉంటున్నాం. ఆ తర్వాత ఎవరి మాటా వినం. ట్రంప్ వెళ్లేలోపు జాఫరాబాద్, చాంద్‌బాగ్ ఖాళీ చేయించండి. లేదంటే, మేం తిరిగి రావాల్సి వస్తుంది’’ అని కపిల్ మిశ్ర వ్యాఖ్యానించారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మోడల్ టౌన్ సీటు నుంచి కపిల్ మిశ్ర బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
స్థానికులు ఓ హిందూ మందిరాన్ని చూపించారు. దానికి ఎవరూ నష్టం కలిగించకుండా ముస్లింలు కాపలా కాసినట్లు చెప్పారు.
అల్లర్లు చేశామన్న నింద రాకుండా.. హిందువుల దుకాణాలు, గుళ్లకు ఏమీ కాకుండా రాత్రంతా మేల్కొని కాపలా ఉన్నట్లు వివరించారు.
ఆ మందిర పూజారితో బీబీసీ మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ, ఆయన అందుబాటులో లేరు.
స్థానికుడు సంజయ్ తోమర్ ఆ గుడి గురించి బీబీసీతో మాట్లాడారు.
‘‘మేం చాంద్‌బాగ్‌లోనే మా జీవితం అంతా గడిపాం. నిన్న మేం చూసిన వాతావరణం, ఇదివరకెప్పుడూ లేదు. ఈ పరిస్థితి చూసి చాలా బాధ కలుగుతోంది’’ అని ఆయన అన్నారు.

మెయిన్ రోడ్‌పై ఉన్న బాలాజీ స్వీట్స్ మిఠాయి దుకాణం కూడా ధ్వంసమై ఉంది. దాని షటర్లు విరిగిపోయి ఉన్నాయి.
ఇక్కడే ఉన్న మారుతి సుజికి సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ కూడా పూర్తిగా కాలిపోయింది. దాని పరిస్థతిని చూస్తుంటే, మంటలు ఎంత తీవ్రంగా వ్యాపించాయో అర్థమవుతోంది.
మేం ఆ షోరూం యజమానితో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాం. కానీ, సమస్యలతో సతమతమవుతున్న ఆయన అందుకు నిరాకరించారు. ఆయన ఓ సిక్కు.

ఇవి కూడా చదవండి
- దిల్లీ హింస: సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనలతో రాత్రంతా భయం గుప్పిట్లో...
- పొరుగు దేశాల ముస్లింలను ‘బంధిస్తున్న’ చైనా.. ‘నిర్బంధ క్యాంపుల్లో కొడుతున్నారు, ఏవేవో ఇంజెక్షన్లు చేస్తున్నారు’
- బంగారం ధర ఏడేళ్ళలో ఎన్నడూ లేనంత పెరిగింది... ఎందుకిలా?
- దిల్లీ హింస: సీఏఏ వ్యతిరేక హింసాత్మక ఘర్షణలు హెడ్ కానిస్టేబుల్ సహా ఏడుగురు మృతి
- భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని ప్రాణాలు పోగొట్టుకున్నారు
- భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఎంతమంది? - ఫ్యాక్ట్ చెక్
- డోనల్డ్ ట్రంప్ భారత పర్యటనపై పాకిస్తాన్ మీడియా ఎలా స్పందించింది?
- ఛత్తీస్‌గఢ్ గిరిజనులపై బంగ్లాదేశ్ శరణార్థులు నిజంగానే ఆధిపత్యం చలాయిస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









