పాఠశాలలో విద్యార్థులు వేసిన నాటకం... తల్లి, టీచర్ల అరెస్టుకు దారి తీసింది

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
కర్ణాటకలోని బీదర్‌లో ఉన్న ఓ పాఠశాలలో ప్రదర్శించిన నాటకం చర్చనీయాంశంగా మారింది. ఈ నాటకం కారణంగా ఒక తల్లి, ఒక ఉపాధ్యాయురాలు ఇప్పుడు బీదర్ జిల్లా జైలులో ఉన్నారు.
"నన్నెందుకు జైలులో పెట్టారో నాకు అర్థం కావటంలేదు" అని అంటున్నారు 26 ఎల్లా నాజ్బున్నీసా. ఒంటరి మహిళ అయిన ఆమె, ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.


జనవరి 30న ఆమెతో పాటు, తన 12 ఏళ్ల కుమార్తె చదువుతున్న పాఠశాలలో పనిచేసే 52 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఫరీదా బేగంను బీదర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరిపై దేశ ద్రోహం కేసు పెట్టారు.
అయితే, ఆ అభియోగాలను ఈ ముస్లిం మహిళలు ఖండించారు.
బీదర్ జైలు అధికారి కార్యాలయంలో వారు బీబీసీతో మాట్లాడారు.
"మా జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అయినా, ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తాం" అని వారన్నారు. వీరిపై అన్యాయంగా ఆ అభియోగాలు మోపారని వీరి తరపు న్యాయవాది అంటున్నారు.
ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారం ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.
దేశ ద్రోహ చట్టం బ్రిటిష్ పాలనా కాలంలో తీసుకొచ్చింది. అప్పట్లో స్వాతంత్ర్య సమరయోధులపై కేసులు పెట్టి, వారిని అణచివేసేందుకు తెచ్చిన చట్టం ఇది. ఇప్పటికీ ఈ చట్టం అమలులో ఉంది, కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అయితే, ఈ చట్టం వాడకంపై సుప్రీంకోర్టు పరిమితులు విధించినప్పటికీ ఇంకా ఈ చట్టం కింద కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.
ముస్లిం సముదాయంలో ఆందోళన పెరిగేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అగౌరవపరిచేలా పిల్లలతో వ్యాఖ్యలు చేయించారని ఈ కేసులో ఆ ఇద్దరు మహిళలపై అభియోగాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
జనవరి 21న బీదర్‌లోని షహీన్ స్కూల్‌లో నిర్వహించిన ఒక నాటకంతో వీరికి కష్టాలు మొదలయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రదర్శించిన నాటకం అది.
ఈ కొత్త చట్టం పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి వచ్చే వలసదారులకు (ముస్లింలు మినహా) భారత పౌరసత్వం కల్పిస్తుంది. భారత్‌లోని 20 కోట్ల ముస్లింలలో ఇది భయానికి దారి తీసింది. దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌సీ) కూడా చేపట్టాలని యోచిస్తున్న నేపథ్యంలో ఈ చట్ట సవరణ మరింత చర్చనీయాంశమైంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భారీ నిరసనలకు దారితీశాయి. మరోవైపు, భారత పౌరులైన ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అంటోంది.
ఈ వివాదం నేపథ్యంలో బీదర్‌లోని పాఠశాలలో నిర్వహించిన నాటకాన్ని, ఒక విద్యార్థి తండ్రి ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అది వైరల్ అయ్యింది. వాట్సాప్‌లోనూ విస్తృతంగా షేర్ అయ్యింది. ఆ వీడియోను చూసిన నీలేష్ రక్షల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తానొక సామాజిక కార్యకర్తగా చెప్పుకునే నీలేష్... ఆ నాటకంలో ఒక సన్నివేశం దేశ ప్రధానమంత్రిని అవమానపరిచేలా ఉందని అంటున్నారు.
ఆ సన్నివేశంలో ఒక వ్యక్తి ఒక వృద్ధురాలితో ఇలా చెబుతాడు.. "ముస్లింలు తమ భారతీయ పౌరసత్వాన్ని రుజువు చేసే పత్రాలను చూపించాలి, లేకపోతే వారు దేశం విడిచి వెళ్లాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు" అని అంటారు. దానికి ఆ వృద్ధురాలు, తాను తరతరాలుగా భారతదేశంలో ఉన్నానని, పత్రాల కోసం తన పూర్వీకుల సమాధులను తవ్వాల్సి ఉంటుందని అంటారు. అంతే కాకుండా, ఒకప్పుడు టీ అమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు నన్ను పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని అడుగుతున్నారని ఆమె అంటారు.
"నేను ఆయన పత్రాలను అడుగుతాను. నాకు చూపించకపోతే, ఆయన్ను చెప్పుతో కొడతా" అని ఆమె ఆ సన్నివేశంలో అంటారు.

"పాఠశాలను, చిన్న పిల్లలను వాడుకుని ప్రధానమంత్రిని అగౌరవపరచడమే కాకుండా, ద్వేషాన్ని వ్యాప్తి చేసేలా ఆ నాటకం వేయించారు" అంటూ పాఠశాలపై పోలీసులకు ఫిర్యాదు చేశానని నీలేష్ చెప్పారు. ఆ నాటక ప్రదర్శనను సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఒక విద్యార్థి తండ్రి పేరు కూడా ఆయన తన ఫిర్యాదులో ప్రస్తావించారు.
పాఠశాల యాజమాన్యంలోని కొందరు సభ్యులు, పాఠశాల అధినేతపై కూడా దేశద్రోహం అభియోగాల కింద కేసు పెట్టారు. అయితే, పాఠశాల యాజమాన్యంలోని కొందరు సభ్యులు, పాఠశాల అధినేత పరారీలో ఉన్నారని, వారికోసం ఇంకా వెతుకుతున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు.
మరోవైపు, ముందస్తు బెయిల్ కోసం పాఠశాల అధినేత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
"పాఠశాలపై దేశద్రోహం కింద కేసు ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. మైనారిటీ విద్యా సంస్థ కావడం వల్లే కావాలని మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం" అని పాఠశాల సీఈవో తౌసీఫ్ మడికేరి చెప్పారు.
పోలీసులు విద్యార్థులను కూడా ప్రశ్నించారు. పోలీసులు విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు చూపే సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది.
"ఇప్పటికి ఆ విద్యార్థులను పోలీసులు ఐదుసార్లు ప్రశ్నించారు. ఒకసారి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు లేకుండా, పోలీసులు యూనిఫాంలో వచ్చి విద్యార్థులను ప్రశ్నించారు. దీని ప్రభావం పిల్లలపై పడే అవకాశం ఉంది. విద్యార్థులను ప్రశ్నించిన తర్వాత ఆ ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు" అని తౌసీఫ్ మడికేరి అన్నారు.
అయితే, దీనిని బీదర్ పోలీసు సూపరింటెండెంట్ డీఎల్ నగేష్ ఖండించారు. కర్ణాటక బాలల హక్కుల సంఘం రంగంలోకి దిగి, విద్యార్థులను ఎందుకు అన్నిసార్లు ప్రశ్నించారో వివరించాలని పోలీసులను కోరింది. విద్యార్థులందరూ ఒకే సమయంలో అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"నాటకం నేర్పించిన ఉపాధ్యాయులను, ఇతర వ్యక్తులను గుర్తించాలని పోలీసులు పదేపదే అడిగారని నా కుమార్తె చెప్పింది" అని ఒక తండ్రి తెలిపారు.
"నా కూతురు కూడా ఆ నాటకంలో ఒక పాత్ర వేసింది. కానీ, ఇప్పుడు పాఠశాలకు వెళ్ళేందుకే భయపడుతోంది. నాటకంలో అసలు తప్పేంటి? దేశవ్యాప్తంగా ఏం జరుగుతోందో అది పిల్లలు చూస్తున్నారు. వారు సోషల్ మీడియా నుంచి డైలాగులను నేర్చుకున్నారు" అని ఆయన అటున్నారు.
తనను ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావడంలేదని నాజ్బున్నీసా అంటున్నారు.
"నాటకం కోసం నా కుమార్తె ఇంట్లోనే రిహార్సల్ చేసింది. కానీ, అది ఏంటన్నది నాకు తెలియదు. సీఏఏ గురించి కానీ ఎన్‌ఆర్సీ గురించి కానీ అసలు వివాదం ఏంటో నాకు తెలియదు. నేను నాటకం చూసేందుకు కూడా వెళ్లలేదు" అని నాజ్బున్నీసా బీబీసీతో చెప్పారు. నేను జైలులో ఉన్నప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే నా బిడ్డను చూశాను. అది కూడా కొద్ది నిమిషాల పాటు ఒక కిటికీలోంచి చూశాను" అని ఆమె తెలిపారు.
అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఫరీదా బేగం... "నా భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడుతున్నాను" అని చెప్పారు.

ఈ కేసు పూర్తిగా మత వివక్ష ఆధారంగానే పెట్టారని బీదర్‌కు చెందిన సెక్యులర్ సిటిజెన్స్ ఫోరం ప్రతినిధులు విమర్శించారు.
"సీఏఏకు వ్యతిరేకంగా వారు పోరాడుతున్నారు. సాంస్కృతిక జాతీయవాదాన్ని బలవంతంగా రుద్దుతున్నారు" అని ఆ సంస్థ నిర్వాహకులు బాబూ రావు విమర్శించారు.
"ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. మోదీ ప్రభుత్వం ఫాసిస్టు ఆలోచనలతో నడుస్తోంది. రాజద్రోహం అనేది బ్రిటిష్ పాలకుల నాటి చట్టం. స్వాతంత్ర్య సమరయోధులకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టాన్ని వాడుకుంది. ప్రస్తుతం మైనార్టీల గొంత నొక్కేందుకే మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని వాడుతోంది. వారు పౌర హక్కులను అణచివేయాలనుకుంటున్నారు. ఇది మత వివక్షే" అని అన్నారాయన.
ఒకే అభియోగానికి చెందిన రెండు వేర్వేరు కేసుల్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించిందన్న దానిని వారు ఉదాహరణగా చూపిస్తున్నారు.
డిసెంబరు 15న దక్షిణ కన్నడలోని శ్రీరామ విద్యాకేంద్రం పాఠశాల ఆవరణలో కొన్ని ఘట్టాలను ప్రదర్శించారు. అందులో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు జరిగిన పరిణామాలను ప్రదర్శించారు. జై శ్రీరాం నినాదాల మధ్య వక్తల ఆదేశాల ప్రకారం కొంత మంది విద్యార్థులు బాబ్రీ మసీదు చిత్రపటాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలున్న ఆ వీడియో వైరల్ అయింది. ఆ ప్రదర్శనకు పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ హాజరయ్యారు. దానిపై ఆమె ట్వీట్ కూడా చేశారు.

ఫొటో సోర్స్, AFP
కళ్లడ్క ప్రభాకర్ భట్ అనే ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ఈ వివేకానంద ఆ పాఠశాల నడుపుతున్నారు. ఆ ఘటనపై కూడా ఒక కేసు నమోదైంది. జరిగిన ఘటనను ప్రదర్శించడంలో తప్పేంటో తనకు అర్థం కాలేదన్నారు ప్రభాకర్ భట్.
"బాబ్రీ విధ్వంసం ఒక చారిత్రక ఘటన. గాంధీ హత్య, ఇందిరా గాంధీ హత్యలను కూడా పునర్నిర్మించి ప్రదర్శించారు. ఒకవేళ అది సరైంది అయితే, అప్పుడు బాబ్రీ విధ్వంసం ప్రదర్శించడం కూడా సరైనదే" అన్నారాయన.
ఆయన స్కూలు ఉన్న చోటకు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్ స్కూల్లో జరిగిన తాజా ఘటన గురించి ప్రస్తావిస్తూ, ఈ రెండు పాఠశాలలపై పెట్టిన కేసులను పోలీసులు వేర్వేరుగా చూస్తున్నారా? అని ప్రశ్నించినప్పుడు, బీదర్ ఘటన గురించి తనకు తెలియదని ఆయన చెప్పారు.
కేసు పెట్టి నెల రోజులైనా, ఇంకా విచారణ సాగుతోందని దక్షిణ కన్నడ పోలీసులు చెబుతున్నారు. మత అసహనాన్ని పెంచుతున్నారన్న ఆరోపణలతో కేసు నమోదయ్యింది. దీనిపై విద్యార్థులను ప్రశ్నించినట్టు తెలిసింది.
అయితే, ఆర్ఎస్ఎస్‌కు చెందిన కళ్లడ్క ప్రభాకర్ భట్ మాత్రం తనను పోలీసులు ప్రశ్నించలేదు అని తెలిపారు.
దక్షిణ కన్నడ కేసులో ఆలస్యం చేస్తూ, బీదర్ కేసులో మాత్రం దేశద్రోహం కేసు పెట్టి, నాలుగు రోజుల్లోనే కేసులో ఉన్న వ్యక్తులను అరెస్టు చేసి ఎందుకు అత్యుత్సాహం చూపుతున్నారని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు.
బాబ్రీ చిత్ర పటాన్ని ధ్వంసం చేసిన ఘటన చట్టాల్ని ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారని ఉద్యమకారిణి లక్ష్మీ బావ్గీ అన్నారు. "మరి, బాబ్రీ చిత్రపటాన్ని ధ్వంసం చేసిన ఆ స్కూలుపై ఎందుకు చర్య తీసుకోరు? మనం దేశం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడొచ్చు కానీ, ప్రధానమంత్రి గురించి మాట్లాడకూడదనే పరిస్థితికి ఈ దేశం చేరుకుందా?" అని ఆమె ప్రశ్నించారు.
ఈ వివాదంపై వివరణ కోసం కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మేం సంప్రదించగా, అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బీదర్‌లో పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరించారని కర్ణాటక హోం మంత్రి బసవరాజ బొమ్మాయ్ చెప్పారు. "ఆ నాటకంలో ప్రధానమంత్రిని అవమానించారు. అది తప్పు. ఆ ఘటనపై కేసు నమోదైంది. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం" అని మంత్రి అన్నారు.

ఇవి కూడా చదవండి:
- బీజేపీ పాలిత రాష్ట్రాలు సరే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు ఎందుకు జరగలేదు: అమిత్ షా
- ''ఆ రాళ్ల దాడిని తప్పించుకుని ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదు''
- విద్యార్థుల ఆందోళనలు భారతీయుల నాడి గురించి ఏం చెబుతున్నాయి?
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- అమిత్ షా ర్యాలీలో CAA వ్యతిరేక బ్యానర్ పట్టుకున్న అమ్మాయి ఏమన్నారు...
- అసదుద్దీన్ ఒవైసీ: 'ఇద్దరు పిల్లల విధానం' అసలు సమస్యలను పక్కదోవ పట్టించడానికే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









