‘ఆధార్ లేకపోతే అంతక్రియలు చేయం’.. మొండికేసిన శ్మశానం - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
మృతురాలి ఆధార్ కార్డును చూపితే తప్ప అంత్యక్రియలు నిర్వహించేది లేదని బెంగళూరులో ఓ శ్మశానవాటిక నిర్వాహకులు మొండికేశారంటూ 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఓ వార్త రాసింది.
బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) పరిధిలో నివాసం ఉంటున్న 75ఏళ్ల మహిళ వారం క్రితం చనిపోయారు.
అంత్యక్రియల కోసం సుమనహళ్లి శ్మశానవాటికకు బంధువులు తీసుకెళ్లారు.
మృతురాలి ఒరిజినల్ అధార్ కార్డును చూపెట్టాల్సిందేనని నిర్వాహకులు చెప్పారు.


ఇంటికి వెళ్లి ఆమె ఆధార్‌ను తెద్దామనుకున్నా, అదెక్కడుందో బంధువులకు తెలియలేదు. ఈ-ఆధార్ తీసుకుందామన్నా, దానితో లింక్ అయిన మొబైల్ నంబరు పనిచేస్తుండకపోవడంతో కుదరలేదు.
దీంతో సమస్యను బంధువులు నిర్వాహకులకు వివరించారు. వాళ్లు మాత్రం ఆధార్ కావాల్సిందనంటూ మొండికేశారు.
మృతురాలి బంధువులు చివరికి ఎలాగో ఆ ఫోన్ నంబరును అప్పటికప్పుడు యాక్టివేట్ చేయించి, ఈ-ఆధార్ కార్డు తీసుకువచ్చారు. శ్మశానవాటిక నిర్వాహకులకు చూపించి అంత్యక్రియలు జరిపించారు.
ఆధార్ కార్డు ఉంటేనే అంత్యక్రియలకు అనుమతిస్తామని బీబీఎంపీ అధికారులు చెబుతుండటంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఫొటో సోర్స్, TELANGANA I&PR
మేడారంలో తప్పిపోయి, భువనగిరిలో దొరికాడు
మేడారం జాతరకు కుటుంబంతో వచ్చి తప్పిపోయిన ఓ నాలుగేళ్ల బాలుడి ఆచూకీ సోషల్ మీడియా వల్ల లభ్యమైందంటూ 'ఈనాడు' దినపత్రిక ఓ కథనం రాసింది.
పెద్దపల్లి జిల్లాలోని కన్నాల గ్రామానికి చెందిన బీమనపల్లి అనిల్, యమున దంపతులు... తమ ఇద్దరు కొడుకులు సాత్విక్, విన్నీ (సాయి శశాంత్), బంధువులతో కలిసి ఫిబ్రవరి 6న మేడారం జాతరకు వెళ్లారు.
జంపన్న వాగు వద్ద స్నానాలు చేస్తుండగా విన్నీ ఆడుకుంటూ తప్పిపోయాడు. ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారడంతో బాలుడు దొరకలేదు. తప్పిపోయిన పిల్లల శిబిరాల్లో అనౌన్సుమెంటు ఇచ్చినా ఫలితం లేకపోయింది.
కొడుకు ఆచూకీ దొరికే వరకు మేడారం విడిచి వెళ్లబోమని.. జాతర ముగిసినా బాలుడి తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు.
యాదాద్రి జిల్లా గుండాల మండలం పడిశాల గ్రామానికి చెందిన జయమ్మ తన మనుమరాలితో కలిసి మేడారం జాతరకు వచ్చారు.
విన్నీ తప్పిపోయినట్లుగా గుర్తించిన జయమ్మ... అతడిని తల్లిదండ్రులకు అప్పగించాలని చూశారు. అయితే, వారెవరో తెలియకపోవడంతో తన వెంటే స్వగ్రామానికి తీసుకెళ్లారు. నాలుగు రోజులుగా అతడి ఆలనాపాలన చూస్తూ వచ్చారు.
విన్నీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి బాబు కోసం మేడారం పరిసరాల్లో గాలిస్తున్నారు. తమ కుమారుడి ఫొటో వివరాలతో వాట్సప్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి వేదికల్లో పోస్టులు చేశారు.
జయమ్మ ఉంటున్న ఊళ్లో ఒకరు ఈ పోస్టు చూసి ఆమెకు బాలుడి విషయం చెప్పారు. వెంటనే విన్నీ తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించారు.
దీంతో కథ సుఖాంతమైంది. బాలుడి తల్లిదండ్రులు జయమ్మకు కృతజ్ఞతలు చెప్పారు.

ఫొటో సోర్స్, SURAIAH
గర్భిణిని ఆసుపత్రికి చేర్చేందుకు జోలీ మోసిన ఎమ్మెల్యే
ఒడిశాలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు 5 కి.మీ. దూరం ఓ ఎమ్మెల్యే జోలీ మోశారంటూ 'సాక్షి' దినపత్రిక ఓ వార్త రాసింది.
ఒడిశా రాష్ట్రం నవరంగ్‌పూర్ జిల్లా పపడహండి సమితి కుసుముగుడకు చెందిన జెమ బెహర నిండు గర్భిణి.
సోమవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అయితే, ఆ గ్రామానికి రహదారి లేదు. అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు.
ఈ విషయం గురించి తెలిసిన డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి వెంటనే గ్రామానికి చేరుకున్నారు.
గ్రామస్తులు ఏర్పాటు చేసిన జోలీలో గర్భిణిని ఉంచి వారితో పాటు జోలీని మోసుకుంటూ తీసుకెళ్లి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.
ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఫొటో సోర్స్, Thinkstock
‘ఏపీలో 500 యూనిట్లు దాటేవారికి విద్యుత్ చార్జీల పెంపు’
ఆంధ్రప్రదేశ్‌లో 500 యూనిట్ల కన్నాతక్కువ విద్యుత్‌ను వినియోగించేవారికి చార్జీల పెంపుదల ఉండదని, అంతకుమించి వినియోగించేవారికి యూనిట్‌కు 90 పైసలు పెరుగుతుందని 'ప్రజాశక్తి' దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
రాష్ట్ర విద్యుత్ మండలి (ఈఆర్‌సీ) నూతన టారిఫ్ వివరాలను ప్రకటించింది.
కొత్తగా పెంచిన ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేది నుంచి రాష్ట్రంలో అమల్లోకి రానున్నాయి.
500 యూనిట్ల కన్నా అదనంగా వినియోగించే వారు ఇప్పటి వరకు యూనిట్‌కు రూ. 9.05 చెల్లిస్తున్నారు. కొత్త టారిఫ్ అమలులోకి వచ్చిన తర్వాత వాళ్లు రూ.9.95 చెల్లించాల్సివస్తుంది.
500 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగించే వారు ప్రస్తుతం చెల్లిస్తున్న విధంగానే చెల్లించాల్సివస్తుంది.
రాష్ట్రంలో 9,504 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులు ఉందని ఈఆర్సీ చెప్పింది. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటిచింది.
ప్రస్తుత విధానానికి భిన్నంగా నెలవారీ వినియోగం ఆధారంగా వినియోగదారులను వర్గీకరించనునట్లు తెలిపింది.
వ్యవసాయ రంగం కోసం ఈ ఏడాది నుంచి పక్కా ప్రణాళికలు అమలు చేస్తామని, ప్రభుత్వ పాలసీ ప్రకారం 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొంది.
అదేసమయంలో విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్ధిక లోటును భర్తీ చేయడానికి ఛార్జీలను కొంత మేర పెంచుతున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి.
- ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
- బాగ్దాద్ గోడలపై ప్రతిబింబిస్తున్న మహిళల చైతన్యం
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- "ఇప్పుడు మా చర్చంతా చావుబతుకుల గురించే, రేపటి సూర్యోదయాన్ని చూస్తామో లేదో" - కరోనా రోగులకు వైద్యం చేస్తున్న ఓ మహిళ కథ
- పీరియడ్స్‌లో ఉన్న మహిళలు బ్యాడ్జీలు ధరించే విధానంపై 'పునరాలోచన' చేస్తున్న జపాన్ సూపర్ బజార్
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- 'ఒక మహిళ ఒక వ్యక్తితో సెక్స్‌కు అంగీకరిస్తే, దాని అర్థం అతడు ఏం చేసినా ఫరవాలేదని కాదు'
- కరోనా వైరస్: ఐఫోన్ల తయారీ ఆపేసి మాస్కులు తయారుచేస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









