బీజేపీకి 2024-25లో భారీగా విరాళాలు ఇచ్చినవారిలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ మహిళ

బీజేపీ, కాంగ్రెస్, విరాళం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాఘవేంద్ర రావ్, జాస్మిన్ నిహలానీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు, దిల్లీ

ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు రద్దు చేసింది.

అదేసమయంలో… భారతీయ జనతా పార్టీకి(బీజేపీ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.6,000 కోట్లు విరాళాల రూపంలో అందాయి.

ఈ రూ.6,000 కోట్లలో బీజేపీకి రూ.3,689 కోట్లు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా అందాయి. ఇది మొత్తం విరాళాల్లో సుమారు 62 శాతానికి సమానం.

కంపెనీల చట్టం కింద రిజిస్టరైన ఏ కంపెనీ అయినా భారత్‌లో ఎలక్టోరల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు. భారత్‌లోని ఏ పౌరుడైనా, కంపెనీ, సంస్థ, హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన వ్యక్తి లేదా దేశంలో నివసించేవారు.. ఈ ఎలక్టోరల్ ట్రస్ట్‌లకు విరాళాలు ఇవ్వొచ్చు.

ఎలక్టోరల్ ట్రస్ట్‌లు రాజకీయ పార్టీలకు ఆ డబ్బులను పంపిణీ చేస్తాయి.

ఎలక్టోరల్ ట్రస్ట్‌కు విరాళం ఇవ్వడానికి బదులుగా ఎవరైనా పౌరుడు రాజకీయ పార్టీకీ నేరుగానూ విరాళాలు ఇవ్వవచ్చు. అయితే ఆ విరాళం మొత్తం రూ.20,000 దాటితే.. రాజకీయ పార్టీలు ఏటా ఆ వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఓ రిపోర్ట్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీకీ 2024-25లో రూ. 517 కోట్లకు పైగా విరాళాలు రాగా, అందులో రూ. 313 కోట్లు ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా వచ్చాయి.

మరో రిపోర్టు ప్రకారం కాంగ్రెస్ పార్టీకి రూ. 522 కోట్ల విరాళాలు వచ్చాయి. అయితే, బీబీసీ ఈ సంఖ్యలను స్వయంగా ధ్రువీకరించడం లేదు.

పశ్చిమ బెంగాల్‌లోని పాలక తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ.184.5 కోట్ల విరాళాలు అందాయి. ఇందులో 153.5 కోట్లు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా అందాయి.

2024-25లో అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా బీజేపీ నిలిచిన నేపథ్యంలో… ఆ పార్టీకి అత్యధిక వ్యక్తిగత విరాళాలు ఇచ్చినవారు ఎవరో తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.

మేం ఎలాంటి పద్ధతి పాటించామంటే

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు బీజేపీ సమర్పించిన కంట్రిబ్యూషన్ రిపోర్టు ఆధారంగా ఈ విశ్లేషణ చేసింది బీబీసీ. ఈ రిపోర్టులో రూ.20,000కు పైగా విరాళాలను ఆ పార్టీకి అందజేసిన వారి వివరాలు ఉంటాయి.

ఓ వ్యక్తి లేదా సంస్థ అనేకసార్లు విరాళాలు ఇచ్చినట్లయితే.. ఆ ఆర్థిక సంవత్సరంలో పార్టీకి చేసిన మొత్తం విరాళాలను లెక్కించడానికి ఆ మొత్తాలన్నింటినీ కలిపి లెక్కించింది.

పార్టీల కంట్రిబ్యూషన్ల నివేదికలు పీడీఎఫ్ పార్మాట్‌లో ప్రచురితమయ్యాయి. ఈ టెక్స్ట్‌ సెలెక్ట్ చేసుకునే విధంగా ఉంది. అయితే ఇందులో అనేక తప్పులు, పేర్లు, విరాళం మొత్తాలలో అస్పష్టత ఉన్నాయి.

దీంతో స్పష్టమైన ఫలితాలను రాబట్టడంలో ఆటోమేటెడ్ టెక్ట్స్ ఎక్స్‌ట్రాక్షన్ టూల్స్‌ను వినియోగించడానికి ఆస్కారం లేకుండా పోయింది. అందువల్ల ఒరిజనల్ డాక్యుమెంట్లను క్రాస్-చెకింగ్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ధ్రువీకరించింది బీబీసీ.

బీజేపీ, కాంగ్రెస్, విరాళం

అత్యధిక వ్యక్తిగత విరాళాలు ఎవరు ఇచ్చారంటే..

1. సురేశ్ అమృత్‌లాల్ కోటక్

వ్యక్తిగత స్థాయిలో భాజపాకు సురేశ్ అమృత్‌లాల్ కోటక్ అత్యధిక మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.

2024-25లో అమృత్‌లాల్ కోటక్ రూ. 30 కోట్లను భాజపాకు విరాళంగా ఇచ్చారు. అలాగే ఆయన రూ. 7.5 కోట్లను కాంగ్రెస్‌కు విరాళంగా ఇచ్చారు.

భారతీయ కాటన్ పరిశ్రమలో ప్రసిద్ధ వ్యాపారవేత్త అమృత్‌లాల్ కోటక్. ఆయనను "కాటన్ మ్యాన్ ఆఫ్ ఇండియా"గా పిలుస్తుంటారు. కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కూడా ఆయన పని చేశారు.

2022లో కేంద్ర ప్రభుత్వం… కోటక్ అధ్యక్షుడిగా 'కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా'ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

2. ఆళ్ల దాక్షాయణి

భాజపాకు 2024-25లో అత్యధిక విరాళాలు ఇచ్చినవారిలో రెండోవారు ఆళ్ల దాక్షాయణి.

ఆమె రామ్‌కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ, వ్యవస్థాపకులు. బీజేపీకి రూ. 25 కోట్లు విరాళం ఇచ్చారు.

రామ్‌కీ గ్రూప్‌ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) సంస్థగా రామ్‌కీ ఫౌండేషన్ పని చేస్తోంది.

దీన్ని 2006లో ఏర్పాటు చేశారు. ఇది ప్రాథమికంగా సామాజిక సంక్షేమం కోసం పని చేస్తుంది.

రామ్‌కీ గ్రూప్ వెబ్‌సైట్ ప్రకారం ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.4.500 కోట్లు.

ఈ కంపెనీ రోడ్లు, పర్యావరణం, వేస్ట్ మేనేజ్‌మెంట్ సంబంధిత ప్రాజెక్టులపై పని చేస్తుంది.

ప్రభుత్వ, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌ ప్రాజెక్టులతో ఈ సంస్థ పని చేస్తుంది. భారత్‌లోని 55 నగరాల్లో ఈ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సింగపూర్‌లోనూ ఈ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి.

దాక్షాయణి భర్త ఆళ్ల అయోధ్య రామి రెడ్డి పారిశ్రామికవేత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

2023లో అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాజ్యసభలో సంపన్నులైన ఎంపీల జాబితాలో అయోధ్య రామిరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు.

ఆ సమయంలో ఆయన ఆస్తుల విలువ రూ. 2,577 కోట్లుగా ఏడీఆర్ నివేదిక పేర్కొంది.

3. దినేశ్ చంద్ర అగర్వాల్

2024-25లో భాజపాకు దినేశ్‌చంద్ర అగర్వాల్ రూ. 21 కోట్లను విరాళంగా ఇచ్చారు.

డీఆర్ఏ ఇన్‌ఫ్రాకాన్ అనే మౌలికవసతులు అభివృద్ధి సంస్థకు దినేశ్‌చంద్ర అగర్వాల్ మేనేజింగ్ డైరెక్టర్‌, ఛైర్‌పర్సన్.

2024-25లోనే డీఆర్ఏ ఇన్‌ఫ్రాకాన్ సంస్థ రూ.61.8 లక్షలను బీజేపీకి విరాళం ఇచ్చింది.

ఏప్రిల్ 3న ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో.. 121 కిలోమీటర్ల పొడవైన గువాహటి రోడ్ ప్రాజెక్టు దినేశ్‌చంద్ర ఆర్. అగర్వాల్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దక్కినట్లుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.5,729 కోట్లు.

4. హార్దిక్ అగర్వాల్

2024-25లో హార్దిక్ అగర్వాల్ బీజేపీకి రూ. 20 కోట్ల విరాళం ఇచ్చారు.

దినేశ్‌చంద్ర అగర్వాల్ కొడుకు హార్దిక్ అగర్వాల్. ఆయన డీఆర్ఏ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్.

5. రమేశ్ కున్హికన్నన్

2024-25లో రమేశ్ కున్హికన్నన్ రూ.17 కోట్లను బీజేపీకి విరాళం ఇచ్చారు.

భారత్‌లో ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, బిలియనీర్ రమేశ్ కున్హికన్నన్. ఆయన మైసూరుకు చెందిన కెన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్‌ వ్యవస్థాపకులు

2024-25 ఏడాదిలోనే ఆయన రూ.11 కోట్లను బీజేపీకి విరాళం ఇచ్చారు.

గుజరాత్‌లోని సనంద్‌లో ఓ సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు కెన్స్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అయిన కెన్స్ సెమికాన్ ప్రైవైట్ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని 2024 సెప్టెంబర్ 2న ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఉంది.

పీఐబీ ప్రకారం ఈ ప్రతిపాదిత యూనిట్‌ను రూ.3,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్‌ను రోజుకు 60 లక్షల చిప్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో నిర్మించనున్నారు.

బీజేపీ, కాంగ్రెస్, విరాళం

బీజేపీ నేతలు వ్యక్తిగతంగా ఎంత విరాళం ఇచ్చారంటే..

2024-25లో బీజేపీకి వ్యక్తిగతంగా విరాళం ఇచ్చినవారిలో అనేకమంది రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు.

బీజేపీ నేతలందరూ కలిపి తమ పార్టీకి సుమారు కోటి రూపాయలను విరాళం ఇచ్చారు.

ఉత్తరాఖండ్‌కు చెందిన లోక్ సభ సభ్యులు, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్… పార్టీకి రూ.11,51,113 విరాళం ఇచ్చారు.

ఒడిశా నుంచి బీజేపీ లోక్‌సభ సభ్యుడు బైజయంత్ జయ్ పండా రూ. 6 లక్షల విరాళం ఇచ్చారు. అలాగే కేంద్ర మంత్రి జువల్ ఓరమ్ రూ.5 లక్షల విరాళం ఇచ్చారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రూ.3 లక్షలను పార్టీకి ఇచ్చారు.

అలాగే అస్సాం నుంచి లోక్‌సభ సభ్యులైన పరిమల్ శుక్లా బైద్య రూ. 3 లక్షలను పార్టీకి విరాళంగా ఇచ్చారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రూ. లక్ష విరాళం అందించారు.

ఒడిశా నుంచి భాజపాకు చెందిన లోక్‌సభ సభ్యుడు నబచరణ్ మాఝీ రూ. 2 లక్షలు పార్టీకి విరాళంగా ఇచ్చారు.

అరుణాచల్ ప్రదేశ్ నుంచి భాజపా లోక్‌సభ సభ్యుడు తాపిర్ గావ్ రూ.1,59,817ను పార్టీకి విరాళం ఇచ్చారు. ఇదే మొత్తాన్ని(రూ.1,59,817) అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే మహేశ్ చోయ్ కూడా విరాళం ఇచ్చారు.

అలాగే, అస్సాం నుంచి తొమ్మిది మంది భాజపా ఎమ్మెల్యేలు కలిసి మొత్తం రూ.27.25 లక్షలు తమ పార్టీకి విరాళంగా ఇచ్చారు. వారిలో ఏడుగురు అస్సాం ప్రభుత్వంలో మంత్రులు.

ఒడిశా నుంచి లోక్‌సభ సభ్యులు సంబిత్ పాత్ర, ప్రతాప్ చంద్ర సారంగి చెరో రెండు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.

అలాగే ఒడిశాకు చెందిన 49 మంది భాజపా ఎమ్మెల్యేలు… రూ.55 లక్షలను పార్టీకి అందించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)