కరోనావైరస్: ఐఫోన్ల తయారీ ఆపేసి మాస్కులు తయారుచేస్తున్నారు

ఫాక్స్ కాన్ ప్లాంట్

ఫొటో సోర్స్, foxconn

ఫొటో క్యాప్షన్, ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో మాస్కుల తయారీ

ఐఫోన్లు తయారుచేసే ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫాక్స్‌కాన్ ఇప్పుడు సర్జికల్ మాస్క్‌లు తయారుచేస్తోంది.

కరోనా వైరస్ కారణంగా ఆపేసిన తమ రోజువారీ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పునఃప్రారంభించడానికి అనుమతులివ్వాలంటూ కూడా ఆ సంస్థ ఒత్తిడి చేస్తోంది.

కరోనా వైరస్ ప్రబలడంతో చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మాస్కులకు కొరత ఏర్పడింది. దీంతో మాస్కుల ఉత్పత్తిని ఫాక్స్‌కాన్ మొదలుపెట్టింది. ఈ నెల చివరి నాటికి రోజుకు 20 లక్షల మాస్కులను తయారుచేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

అడ్డగీత
News image
అడ్డగీత

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం విచాట్‌లో ఆ సంస్థ 'ఈ అంటువ్యాధిపై పోరాటంలో ప్రతి సెకనూ విలువైనదే' అని పోస్ట్ చేసింది.

''ఎంతవేగంగా నివారణ చర్యలు తీసుకుంటే, ఎంతవేగంగా ఈ వైరస్‌ను అరికడితే, ఎంతవేగంగా ప్రాణాలు కాపాడితే అంత త్వరలో మనం దీనిపై విజయం సాధిస్తాం'' అని ఆ సంస్థ పేర్కొంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థయిన ఫాక్స్‌కాన్ ఐఫోన్లనే కాకుండా ఐపాడ్‌లు, అమెజాన్ కిండిల్, ప్లే స్టేషన్ వంటి అనేక ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలనూ తయారుచేస్తుంది.

దక్షిణ చైనాలోని షెంజెన్ నగరంలో ఉన్న తమ కీలక కర్మాగారంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా మాస్కుల తయారీ మొదలుపెట్టినట్లు ఫాక్స్‌కాన్ వెల్లడించింది. మేం చేస్తున్నది ఫాక్స్‌కాన్ కార్పొరేట్ బాధ్యత నెరవేర్చడానికి మాత్రమే కాదు సామాజిక బాధ్యతగా ఈ పని చేస్తున్నామని పేర్కొంది ఆ సంస్థ.

ప్రస్తుతం తమ సంస్థకు చెందిన కార్మికులు, ఉద్యోగులకు మాస్కులు సరఫరా చేస్తున్న ఫాక్స్‌కాన్ పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది.

తమ ఉద్యోగుల్లో ఎవరికైనా కరోనా వైరస్ సోకిందా అన్నది తెలుసుకునేందుకు ఇన్‌ఫ్రారెడ్ టెంపరేచర్ మెజర్‌మెంట్ ఎక్విప్‌మెంట్ ఉపయోగిస్తున్నట్లు ఫాక్స్‌కాన్ చెబుతోంది.

కరోనా ప్రబలిన వెంటనే ఫాక్స్‌కాన్ తన యూనిట్లలో కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, గతంలో సెలవు దినాల్లోనూ తన కర్మాగారాలలో ఉత్పత్తి కొనసాగించిన ఫాక్స్‌కాన్ ఇప్పుడిలా మూసివేసిన ప్లాంట్లను తెరవడానికి అనుమతులివ్వాలంటూ అధికారులను కోరుతోంది.

చైనాలో కర్మాగారాల మూసివేత, ప్రయాణాలపై ఆంక్షలు వంటివి ప్రపంచవ్యాప్తంగా వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఫాక్స్‌కాన్ ఈ మేరకు కోరుతోంది.

కాగా.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్ 10 శాతం తగ్గుతుందని.. ఐఫోన్లు, ముఖ్యంగా ఐఫోన్ 11 కొరత ఏర్పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు సర్జికల్ మాస్కుల కొరతను ఎదుర్కోవడానికి అమెరికా కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ కూడా ముందుకొచ్చింది. చైనాలోని ఆ సంస్థ జాయింట్ వెంచర్ ఎస్‌ఏఐసీ-జీఎం వూలింగ్ రోజుకు 17 లక్షల మాస్కులు తయారుచేయనున్నట్లు ప్రకటించింది.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)