దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: కేజ్రీవాల్ భవిష్యత్తు బడి పిల్లల చేతిలో ఉందా...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ఇండియా కరస్పాండెంట్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొన్ని వారాల కిందట ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు.
''మన పాఠశాలల, విద్యావ్యవస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశాం. మీరు ఇతర పార్టీలకు ఓటు వేస్తే మీ పిల్లల చదువుల గురించి పట్టించుకునేవారు ఎవరు? ఆలోచించండి'' అన్నారు.
భారత్‌లోని రాజకీయ నాయకులు తమ ఉపన్యాసాల్లో సాధారణంగా స్కూళ్లు, కాలేజీల గురించి మాట్లాడరు. విద్యా సంస్కరణలు ఓట్లు రాల్చుతాయని వారు నమ్మరు. ఎందుకంటే ఇలాంటి సంస్కరణల వల్ల సానుకూల మార్పులు రావడానికి చాలా సమయం పడుతుంది. ''ప్రస్తుత రాజకీయాలకు తక్షణ ఫలితాలు కావాలి'' అని దిల్లీ విద్యా శాఖ మంత్రి మనీశ్ సిసోడియా అన్నారు.


దిల్లీ రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రయత్నిస్తోంది. ఇదేసమయంలో దేశంలోని జనాకర్షక నేతలు నమ్మే ఓట్ల సిద్ధాంతాలు తప్పని ఆ పార్టీ నేతలు నిరూపించాలనుకుంటున్నారు.. విద్య ప్రధానాంశంగా తన ప్రచారాన్ని సాగిస్తున్నారు.
విద్య, ఆరోగ్య సేవల్లో కేజ్రీవాల్ ప్రభుత్వ పనితీరును చెబుతూ ఓట్లు అడగడం ఒక అసాధారణ ప్రచార తీరనే చెప్పాలి.
నిత్యం వార్తల్లో ఉండే ఆప్ అయిదేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 67 గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ విద్యారంగంలో సాధించిన ప్రగతిని చూపుతూ అలాంటి విజయాన్నే దక్కించుకోవాలని కేజ్రీవాల్ ఆశ పడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 1000 పాఠశాలల్లో 15 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారందరికీ విద్య పూర్తిగా ఉచితం. తన కంటే ముందు దిల్లీని పాలించిన ముఖ్యమంత్రులెవరూ చేయనంతంగా తన హయాంలో విద్యారంగ అభివృద్ధి సాధ్యమైందని కేజ్రీవాల్ చెప్పుకొంటున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో ఆయన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. కేజ్రీవాల్‌కి భిన్నంగా బీజేపీ వివాదాస్పద కొత్త పౌరసత్వ చట్టం, కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు, రామమందిర నిర్మాణం వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది.
కేజ్రీవాల్ తన వార్షిక బడ్జెట్‌లో పావు వాటా విద్యారంగానికే కేటాయించారు. భారత దేశంలో ఇంకే రాష్ట్రమూ విద్యారంగానికి ఇంతగా కేటాయింపులు చేసిన దాఖలాలు లేవు. ఆయన కంటే దిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు ఎవరూ 16 శాతం కంటే అధికంగా విద్యారంగానికి కేటాయించలేదు. దేశంలోని ఇతర రాష్ట్రాల బడ్జెట్లలో సగటు విద్యారంగ వ్యయం 14.8 శాతమే.
దిల్లీ నగరంలోని అట్టడుగు వర్గాల పిల్లలు, పేద వలస కార్మికుల పిల్లలు హాజరయ్యే ఈ పాఠశాలల్లో ఫలితాలు భారీ ఫీజులుండే ప్రైవేటు స్కూళ్ల కంటే మెరుగ్గా వచ్చాయి.
దిల్లీ ప్రభుత్వ పాఠశాలల నుంచి 12వ తరగతి పరీక్షలు రాసినవారిలో 96 శాతం మంది ఉత్తీర్ణులైతే ప్రైవేట్ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం 94 శాతమే నమోదైంది.
ఇలాంటి మెరుగైన ఫలితాలే దిల్లీ ప్రభుత్వ పాఠశాలలకు ప్రశంసలు దక్కేలా చేస్తున్నాయి. ఇటీవల ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికై అభిజిత్ బెనర్జీ వంటివారూ దిల్లీ పాఠశాలలను మెచ్చుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విద్యారంగ సంస్కరణలు సాధారణంగా కొంత గందరగోళంగా ఉంటాయి. కానీ, కేజ్రీవాల్ ప్రభుత్వం గణనీయమైన మార్పు తీసుకురావడానికి ఈ రంగంలో కొన్ని సరళీకృత సంస్కరణలను అమలు చేసినట్లుగా కనిపిస్తుంది.
తరగతి గదులను ఆధునికీకరించారు, టాయిలెట్లు, పాఠశాల ఆట స్థలాలను శుభ్రంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. తరగతి గదుల్లో విద్యార్థులను పర్యవేక్షించడానికి సీసీ కెమేరాలను ఏర్పాటు చేయాలన్న వివాదాస్పద నిర్ణయాన్నీ అమలు చేశారు. స్మార్ట్ డెస్క్‌లు, డిజిటల్ లెర్నింగ్, గ్రంథాలయాలు, సైన్స్ ప్రయోగశాలలు వంటివన్నీ చదువుపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి పెంచేలా చేశాయి.
ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ షరీక్ అహ్మద్ మాట్లాడుతూ.. 'పేదరికం నుంచి వచ్చి విద్యార్థులకు ఇలాంటి విద్యా వాతావరణం పెద్ద ఉపశమనం'' అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో కొందరిని ఎంపిక చేసి నాయకత్వ శిక్షణల కోసం సింగపూర్ జాతీయ యూనివర్సిటీకి, భారత్‌లోనే ఓ బిజినెస్ స్కూల్‌కు కూడా పంపుతున్నారు.
మరికొందరిని బ్రిటన్, ఫిన్లాండ్‌లలో విద్యా వ్యవస్థ పరిశీలనకు పంపించారు.
ఇక కరికులమ్‌లోనూ కొన్ని మార్పులు చేశారు. సంతోషం, వ్యాపార స్ఫూర్తి వంటివి పాఠ్యాంశాలుగా చేర్చారు. ఏడాదిలో అనేకసార్లు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
విభజన వివాదం
దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చాలావరకు హిందీ మాధ్యమంలోనే బోధన ఉంటుంది. అదేసమయంలో ప్రతి తరగతిలోనూ ఒక ఇంగ్లిష్ మీడియం సెక్షన్ ఉంటుంది.
దిల్లీ పాఠశాలల్లోని బోధనా పద్ధతులలో కొన్నిటిపై వివాదం ఉంది. ముఖ్యంగా బాగా చదివే, వెనుకబడిన విద్యార్థులను వేర్వేరు సెక్షన్లలో ఉంచడంపై విమర్శలున్నాయి. గత ఏడాది విద్యారంగ ఉద్యమకారిణి కుసుమ్ జైన్ ఈ విధానాన్ని దిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు.
సమ్మిళిత విద్యా విధానానికి భిన్నంగా ఇలా ప్రజ్ఞ ఆధారంగా విద్యార్థులను వేరు చేయడమనేది తప్పని ఆమె వాదించారు.
ఈ విధానంపై దిల్లీ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు దీన్ని సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బాలికలే ఎక్కువ...
దిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో 53 శాతం మంది బాలికలే. మిగతా 47 శాతం బాలురు. దీన్ని లోతుగా పరిశోధిస్తే తల్లిదండ్రుల్లో చాలామంది తమ కుమార్తెల విద్యపై ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టం లేక వారిని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నట్లుగా తేలింది. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల్లో చాలామంది సోదరులు ప్రయివేటు పాఠశాలలకు వెళ్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే పాఠశాలల వాతావరణం, కరికులమ్‌లో కేజ్రీవాల్ తీసుకొచ్చిన సమూల మార్పులు విద్యార్థుల ఆలోచనా తీరుపై ప్రభావం చూపుతున్నాయన్నది మాత్రం వాస్తవం. ఈశాన్య దిల్లీలోని షాదీపూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదహారేళ్ల మనీషా కోహ్లీ మాట్లాడుతూ తాను వ్యాపారవేత్తను కావాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆమె తండ్రి ఓ చిన్నపాటి టైలర్.. ఒకే ఒక గదిలో ఆమె కుటుంబం నివసిస్తోంది. నిరుపేద విద్యార్థులు తమ భవిష్యత్తుపై కలలు కనడానికి, నిర్మించుకోవడానికి కేజ్రీవాల్ తెచ్చిన విద్యావిధాన మార్పులు తోడ్పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:
- అమరావతి గజెట్: హోంశాఖ ఏం చెప్పింది? మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం ఏమంటోంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- అయోధ్య రామమందిర ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం - పార్లమెంటులో మోదీ ప్రకటన
- జింకల వేటకు పెంపుడు చీతాలు.. క్రూర మృగాలనే మచ్చిక చేసుకున్న కొల్హాపూర్ వాసులు
- ముంబయిలో 51 మందిపై రాజద్రోహం కేసు.. షర్జీల్ ఇమామ్‌ను సమర్థిస్తూ, రెచ్చగొట్టే నినాదాలు చేశారని ఆరోపణ
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- నిర్భయ కేసు: నలుగురు దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదు - దిల్లీ హైకోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









