CAA నిరసనలు: భారతదేశంలో విద్యార్థి ఉద్యమాల చరిత్ర ఏమిటి... వాటి ప్రభావం ఎలాంటిది? :విశ్లేషణ

విద్యార్థి ఉద్యమాలు

ఫొటో సోర్స్, Ravi Prakash

    • రచయిత, అనన్య దాస్
    • హోదా, బీబీసీ మానిటరింగ్

భారతదేశవ్యాప్తంగా చిన్న, పెద్ద నగరాల్లో విద్యార్థుల నిరసన పెల్లుబుకుతోంది. ఆగ్రహంతో, నిస్పృహతో, సంఘీభావంతో విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం అందిస్తున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పౌర సమాజంలోని ఇతర వర్గాలతో పాటు వీరు నిరసన తెలుపుతున్నారు.

అక్రమ వలసలను గుర్తించటం లక్ష్యంగా పెట్టుకున్న పౌరుల జాతీయ జాబితా (ఎన్ఆర్‌సీ)కి వ్యతిరేకంగా కూడా వీరు ఆందోళనలు చేస్తున్నారు.

న్యాయాన్యాయాలు, రాజకీయాలు పక్కనపెడితే, భారతదేశ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ప్రాథమిక సూత్రాలకు ముప్పు పొంచి ఉందన్న భావనతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ ఫలితాలను నిర్ణయించటంలో ఈ నిరసనలు ఎంతవరకూ విజయవంతం అవుతాయనేది ఇప్పటికి సమాధానం లేని ప్రశ్న. అయితే, ఈ విద్యార్థి ఉద్యమాలు ఒక గణనీయమైన శక్తిగా నిలిచిపోతాయని చరిత్ర చెబుతోంది.

భారతదేశంలో విద్యార్థి ప్రతిఘటనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఆ ఉద్యమాల్లో మార్పు కోసం ఆకాంక్ష ప్రధానాంశంగా ఉంది. అవి రాజకీయ స్థితిగతులను మార్చటంలో కీలక పాత్ర పోషించాయి.

విద్యార్థి ఆందోళనల్లో మైలురాళ్లు

భారతదేశంలో గత ఆరు దశాబ్దాల్లో భాష, కులం, భావప్రకటనా స్వేచ్ఛ తదితర అంశాలపై నిరసనలు పెల్లుబికాయి. అటువంటి ఉద్యమాల్లో విద్యార్థులు ముఖ్యమైన భూమిక పోషించారు. అయితే, వీటన్నిటికీ అణచివేత భావన కేంద్ర బిందువుగా ఉంది.

భారతదేశంలో విద్యార్థి ఉద్యమాలు

హిందీయేతర రాష్ట్రాల్లో ఇంగ్లిష్‌తో పాటు హిందీని కూడా ఒక అధికారిక భాషగా చేసిన టఅధికార భాషల చట్టం-1963'కు వ్యతిరేకంగా 1965లో దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో విద్యార్థులు ఉద్యమించారు. అప్పుడు 10,000 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు చెప్తారు. కొంతమంది విద్యార్థులు ఆత్మాహుతి చేసుకోగా.. ఆ సందర్భంగా జరిగిన హింసలో 70 మంది వరకూ చనిపోయారు.

జేపీ ఉద్యమంగా పిలిచే 1974 బిహార్ విద్యార్థి ఆందోళనలు... అవినీతిని అంతమొందించటం, ఎన్నికల, విద్యా సంస్కరణలు సాధించడం మీద కేంద్రీకరించాయి. తూర్పు రాష్ట్రమైన బిహార్‌లో మొదలైన ఈ నిరసనలు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకూ విస్తరించాయి.

1975 జూన్ 25న ఇందిరాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించటంతో, దేశవ్యాప్తంగా విద్యార్థులు అనేక నిరసనలు నిర్వహించారు. ''అంతర్గత కల్లోలా''న్ని నియంత్రించడం కోసమని ప్రభుత్వం ప్రకటించిన 'ఎమర్జెన్సీ' 1975 జూన్ 26వ తేదీ నుంచి 1977 మార్చి 23వ తేదీ వరకూ కొనసాగింది. ఆ కాలంలో రాజ్యాంగ హక్కులను తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యాలను ఉపసంహరించారు. ఆ అనూహ్య చర్యను నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశ ప్రయోజనాల పేరుతో సమర్థించుకున్నారు.

1979-85 మధ్య కాలంలో ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో అక్రమ వలసలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రారంభించింది. బంగ్లాదేశ్ అవతరణకు దారితీసిన 1971 యుద్ధం తరువాత అప్పటి తూర్పు పాకిస్తాన్ నుంచి ప్రజలు వరదలా తమ రాష్ట్రంలోకి వచ్చిన నేపథ్యంలో స్థానికుల అస్తిత్వాన్ని కాపాడటం కోసం జరిగిన ఉద్యమమది.

వెనుకబడిన తరగతులకు చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టటంతో 1990లో హింసాత్మక నిరసనలు చెలరేగాయి.

ఇక 2016 జనవరి 17న దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యతో కుల వివక్షకు వ్యతిరేకంగా విస్తృతంగా నిరసనలు తలెత్తాయి. ఆ అంశం చుట్టూ రాజకీయ చర్చ సాగింది.

రోహిత్ వేముల

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోహిత్ వేముల 2016లో ఆత్మహత్య చేసుకున్నాడు

ఆ ఉద్యమాలు ఏం సాధించాయి?

విస్తృత నిరసన ఉద్యమాల్లో ఒక అంతర్గత శక్తిగా ఉన్న విద్యార్థులు.. రాజకీయ వ్యవస్థలను మార్చటంలో, ప్రభుత్వాలను గద్దె దించటంలో, సమాజ రూపురేఖలను నిర్మించటంలో గణనీయమైన పాత్ర పోషించారు.

తమిళనాడులో 1967 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఆ ఎన్నికల తీర్పు ఉత్తర భారతదేశ సాంస్కృతిక ఏకజాతీయకరణ ప్రయత్నాన్ని తిరస్కరించటంతో పాటు ఇంగ్లిష్‌ను ఎంచుకోవటం ద్వారా 'ఆర్థిక పురోగతి' ఆకాంక్షలను ప్రతిబింబించింది.

బిహార్ నిరసనలు భారత రాజకీయ చిత్రపటాన్ని పునర్లిఖించింది. 1977లో కేంద్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్, ములాయంసింగ్ యాదవ్ వంటి యువ నాయకులు అప్పుడే ఆవిర్భవించారు. అనంతరం వారు కీలక ప్రాంతీయ రాజకీయ నాయకులుగా మారారు.

మొరార్జీ దేశాయ్ భారతదేశానికి తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు. చారిత్రకంగా కాంగ్రెస్ కంచుకోట ఉత్తరప్రదేశ్‌లో ఓటర్లు 1977 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీని తిరస్కరించారు. అక్కడ ఒక్క సీటు కూడా కాంగ్రెస్‌కు దక్కలేదు.

1985 ఆగస్టు 15న అస్సాం ఒప్పందం మీద సంతకాలతో అస్సాం ఆందోళన ముగిసింది. రాష్ట్రంలో 'విదేశీయుల సమస్య'ను పరిష్కరించేందుకు.. అస్సామీ ప్రజల 'వారసత్వం, అస్తిత్వాలను' పరిరక్షించేందుకు ఉద్దేశించిన పత్రం అది. ఆ ఒప్పందం మీద సంతకం చేసిన వారిలో ఒకరైన విద్యార్థి నాయకుడు ప్రఫుల్ల మహంత అనంతర కాలంలో ముఖ్యమంత్రి అయ్యారు.

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెల్లుబికిన నిరసనలు నాటి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత ప్రధానమంత్రి వి.పి.సింగ్ 1990 నవంబర్ 7వ తేదీన రాజీనామా చేయటంతో చల్లారాయి.

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను ఒక వర్గంగా చట్టబద్ధంగా గుర్తిస్తూ 1992లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వెనుకబడిన తరగతులను గుర్గించటానికి కులం ఒక అంశం కావచ్చునని చెప్పింది.

రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం తలెత్తిన నిరసనలు విద్యా సంస్థల్లో ప్రజాస్వామ్యానికి స్థానం కుంచించుకుపోతుండటాన్ని ప్రశ్నించాయి.

విద్యార్థి ఉద్యమాలు

ఫొటో సోర్స్, Pti

ఇప్పుడు ఏం జరుగుతోంది?

ప్రస్తుతం జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలు ఇప్పుడప్పుడే ముగిసే పరిస్థితి లేదు.

రాజకీయ, సైద్ధాంతిక, ఆర్థిక, తరాల చీలికలతో కూడిన భారతదేశపు సంక్లిష్ట రాజకీయాల్లో పోటీ శక్తుల మధ్య విద్యార్థి ఉద్యమాలు ఉధృతమవుతాయి.

కానీ,ఇప్పుడు కొనసాగుతున్న నిరసనల విషయంలో భారత ప్రభుత్వం బలప్రయోగంతో స్పందించింది. హింసాత్మక పోలీసు చర్యను ప్రయోగించటం, పలు సందర్భాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేయటం, ముఖాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించటం వంటి చర్యలు అధికార బీజేపీ అసమ్మతిని సహించబోదనే దీర్ఘకాలిక విమర్శలను బలపరుస్తున్నాయి.

దీనికి బదులుగా, నిరసనకారులతో చర్చలు జరపటానికి ప్రభుత్వం ఇప్పుడు ''కొత్త వైఖరిని, కొత్త భాషను'' అనుసరించాల్సిన అవసరం ఉందని 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా'లో ప్రచురితమైన ఒక వ్యాసం చెప్తోంది.

ఈ నిరసనలు విస్తృత కుట్ర ఫలితమనే బీజేపీ అభిప్రాయాన్ని ప్రస్తావిస్తూ.. ''వారు స్వతంత్రంగా ఉద్యమిస్తున్నారనే విషయాన్ని నిరాకరించటం, ఎవరో ఆడిస్తే ఆడుతున్న తోలుబొమ్మలు అని పరిగణించటం'' మానాలని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' అభిప్రాయపడింది.

పౌరసత్వాన్ని మత ప్రాతిపదికన పునర్నిర్వచించటానికి సంబంధించి అలా చేయటం ద్వారా భారత్ అనే భావననే మార్చివేయటానికి సంబంధించి ''నిరసనకారుల నిజమైన ఆందోళనలను గుర్తించటం'' ద్వారా ప్రభుత్వం ముందడుగు వేయగలదని ఆ పత్రిక పేర్కొంది.

ఆ చట్టాన్ని మారుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

ప్రస్తుత నిరసనల గురించి రాజకీయ విశ్లేషకుడు యోగేంద్రయాదవ్ చెబుతున్నట్లు, ''ఇది ఏదో కోల్పోవటం వల్లనో, నిస్పృహ వల్లనో తలెత్తిన ఉద్యమం కాదు. ఇది ఒక ఆకాంక్ష ఉద్యమం. ఇది తిరోగామి దృష్టితో కాకుండా పురోగామి దృష్టితో కూడిన జాతీయ ఆకాంక్ష.''

(గ్రాఫిక్: మహిమా సింగ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)