హెచ్‌సీయూ ‘వెలివాడ’లో విద్యార్థుల నిరసనలు

ఫొటో సోర్స్, BIKKU RATHOD/HCU
- రచయిత, దీప్తి బత్తిని, వెంకట కిషన్ ప్రసాద్
- హోదా, బీబీసీ తెలుగు ప్రతినిధులు
దళిత స్కాలర్ రోహిత్ మరణం తర్వాత హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో మరోసారి విద్యార్థుల ఆందోళన మొదలైంది. 'వెలివాడ'లో గిరిజన విద్యార్థుల ఫోరం (టీఎస్ఎఫ్) చేపట్టిన రిలే నిరాహార దీక్ష నాల్గవ రోజుకు చేరింది.
టీఎస్‌ఎఫ్‌తో పాటు, ఏఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ, డీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్, టీవీవీ సహా మొత్తం 15 విద్యార్థి సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి.
నరేశ్ లునావత్‌ను యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం విద్యార్థులు వెంటనే దీక్ష విరమించాలని కోరుతున్నారు.
వివాదానికి మూలం
సెప్టెంబర్ 21న వర్సిటీ విద్యార్థి సంఘానికి ఎన్నికలు జరిగాయి. మరుసటి రోజున ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
ఈ ఎన్నికల్లో అలియెన్స్ ఫర్ సోషల్ జస్టిస్ (ఏఎస్‌జే)కు చెందిన అభ్యర్థులు అన్ని స్థానాలనూ గెల్చుకున్నారు. వామపక్ష, దళిత, బహుజన, ఆదివాసీ విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఈ కూటమిగా ఏర్పడ్డాయి.
బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం అయిన ఏబీవీపీ రెండో స్థానంలో నిలిచింది.
అయితే ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన టీఎస్‌ఎఫ్ అభ్యర్థి నరేశ్ లునావత్‌కు 75 శాతం కంటే తక్కువ అటెండెన్స్ ఉందన్న ఆరోపణతో ఎన్నికైనట్టు ప్రకటించకుండా నిలిపివేశారు. ఏబీవీపీకి చెందిన ఒక విద్యార్థి నుంచి ఫిర్యాదు అందడంతో వర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫొటో సోర్స్, NARESH LUNAVATH/HCU
వరంగల్ జిల్లాకు చెందిన నరేశ్ ఆదివాసీ (లంబాడా) సముదాయానికి చెందిన విద్యార్థి. తమ కుటుంబంలో పెద్ద చదువు చదువుతున్న మొదటి తరం వ్యక్తి ఆయనే.
తమ వారికి "స్కాలర్‌షిప్పులు, హాస్టల్‌లు వంటి విషయాల గురించి సరిగా తెలియదు. చాలా మందికి భాష కూడా సమస్యే. అందుకే విద్యార్థి సంఘంలో ఉండటం ద్వారా వారికి సాయం చేయగలన"ని నరేశ్ చెబుతున్నారు.
ఎంపీహెచ్ (మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) మొదటి సంవత్సరం చదువుతున్న నరేశ్ తన సమీప ఏబీవీపీ అభ్యర్థిపై 264 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
నరేశ్ ఎన్నికను నిలిపివేయడంపై ఏఎస్‌జేకు సంబంధించిన విద్యార్థులు అప్పుడే నిరసన తెలిపారు. కానీ దీనిపై విచారణ జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
ఇందుకోసం ప్రొఫెసర్ ఆలోక్ పరాషర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీని వేశారు.
హాజరు శాతంపై ఎన్నో సందేహాలు
2009 నుంచి అమలులోకి వచ్చిన లింగ్డో కమిటీ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి చేశారు. ఈ నియమాన్ని దిల్లీ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీ వంటి చోట్లలో కచ్చితంగా అమలు చేయరనీ, జేఎన్‌యూ, హెచ్‌సీయూ లంటి వర్సిటీలలోనే కచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తారనే ఆరోపణలున్నాయి.
అయితే నామినేషన్ల సమయంలో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెడ్ సంతకంతో జారీ చేసిన ప్రమాణ పత్రంలో నరేశ్‌కు 75 శాతం హాజరు ఉన్నట్టుగా ఉంది. ఈ పత్రం ఆధారంగానే వర్సిటీ ఎన్నికల సంఘం ఆయన నామినేషన్‌ను స్వీకరించినట్టు టీఎస్‌ఎఫ్ నేత వెంకటేశ్ చౌహాన్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, NARESH LUNAVATH/HCU
"ఆ సమయంలో తగినంత హాజరు లేని కారణంగా దాదాపు 10 మంది నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. చాలానే స్క్రూటినీ జరిగింది. అలాంటప్పుడు నరేశ్‌కు హాజరు తక్కువుంటే ఆయనను ఎలా అనుమతించారు?" అని వెంకటేశ్ ప్రశ్నిస్తున్నారు.
"నరేశ్‌ను ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ప్రకటించకుండా అపడానికి ఉపకులపతి చెబుతున్న కారణాలు సహేతుకమైనవి కావు" అని గిరిజన విద్యార్థి ఫోరం అధ్యక్షుడు సందర్ రాథోడ్ బీబీసీతో అన్నారు.
ఈ విషయంపై బీబీసీ నరేశ్‌తో కూడా మాట్లాడింది. తాను ఆదివాసీని అయినందునే అధికారులు కక్షపూరితంగా ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
"మేము ఆర్టీఐ ద్వారా అటెండెన్స్ షీట్ తీసుకున్నాం. హాజరు వివరాలను తారుమారు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు 75 శాతం హాజరు ఉందని ప్రకటించిన డిపార్ట్‌మెంట్, ఆ తర్వాత 64 శాతం ఉన్నట్టుగా ఒకసారి, 71 శాతం ఉన్నట్టుగా మరోసారి ప్రకటించింది. ఇదెలా సాధ్యం?" అని ప్రశ్నించారు నరేశ్ లునావత్.
అటెండెన్స్ తీసుకునే రిజిస్టర్‌లో కూడా అవకతవకలున్నాయని నరేశ్, వెంకటేశ్‌లు ఆరోపించారు. కొన్ని చోట్ల గ్యాప్ వదిలారనీ, తేదీలు వేయలేదనీ, ముందుగా వేసిన వాటిని కూడా దిద్దినట్టు కనిపిస్తున్నదనీ వారి ఆరోపణ.

ఫొటో సోర్స్, Rohith Vemula/Facebook
'ఎలాంటి దురుద్దేశాలూ లేవు'
అటెండెన్స్‌పై విచారణ కోసం వేసిన కమిటీ నివేదిక వెంటనే వచ్చినప్పటికీ అందులోని వివరాలు విద్యార్థి సంఘాలకు వెల్లడి చేయలేదు. దీని గురించి హెచ్‌సీయూ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ వినోద్ పరవాల బీబీసీతో మాట్లాడుతూ కమిటీ చేసిన నిర్ధరణలేమిటో తనకు తెలియదని అన్నారు.
"అంతర్గత కమిటీ నివేదిక వచ్చాక దీనిపై మూడో వ్యక్తితో... ఒక హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వీసీ అప్పారావు నిర్ణయించారు. హాజరు రికార్డులన్నీ ఆయనకు అందజేశాం. జస్టిస్ జి. చంద్రయ్య ఇందుకు సిద్ధపడ్డారు. విచారణ నిష్పక్షపాతంగా ఉండాలనీ, తమకు అన్యాయం జరిగినట్టు ఏ పక్షమూ భావించకుండా ఉండాలనీ వీసీ అప్పారావు ఉద్దేశం" అని వినోద్ అన్నారు.
అయితే వెంకటేశ్ మాత్రం "వీసీ పొదిలె అప్పారావు ఉద్దేశపూరితంగానే దళిత, ఆదివాసీ విద్యార్థుల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నార"ని ఆరోపించారు.
నరేశ్ హాజరుకు సంబంధించి వేర్వేరు శాతాలతో ప్రమాణ పత్రాలు ఎలా ఇచ్చారని ప్రొఫెసర్ వినోద్‌ను ప్రశ్నించినప్పుడు హాజరు రికార్డుల వివరాల్లోకి తాను వెళ్లలేనని, ఒక్కో విభాగంలో ఎలా హాజరు నిర్వహిస్తారో చెప్పలేనని ఆయన బీబీసీతో అన్నారు.
ఈ విషయంపై స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ గీత వేముగంటితో మాట్లాడడానికి ప్రయత్నించగా, ఆమె ఇదివరకే ఇంటర్నల్ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారనీ, ప్రస్తుతం జస్టిస్ చంద్రయ్య విచారణ జరుపుతున్నారు కాబట్టి మాట్లాడలేరని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, BIKKU RATHOD/HCU
'ఆమరణ నిరాహార దీక్ష తప్పదు'
"అక్టోబర్ 23న కమిటీ వేసిన నాటి నుంచి పది రోజుల్లో మాకు నిర్ణయం చెబుతామన్నారు. ఇక మాకు వెలివాడ దగ్గర నిరసనకు కూర్చోవడం ఒకటే మార్గం" అన్నారు సుందర్. సుందర్ నిరుటి విద్యా సంవత్సరంలో వర్సిటీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
విద్యార్థుల చేత దీక్ష విరమింప చేయడానికి విద్యార్థి సంక్షేమ విభాగం డీన్, ఛీఫ్ వార్డెన్‌లు ప్రయత్నించారు. అంతకు ముందు రిజిస్ట్రార్, యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్లు టీఎస్ఎఫ్ ప్రతినిధులను కలసినా వారు దీక్ష విరమణకు సిద్ధపడలేదు.
2016 జనవరిలో రోహిత్ వేముల ఆత్మహత్య దరిమిలా తలెత్తిన పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండాలని హెచ్‌సీయూ అధికారులు భావిస్తున్నారు. ఈ సమస్యను వీలైనంత సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని ప్రొఫెసర్ వినోద్ బీబీసీతో అన్నారు.
ఇందులో చట్ట సంబంధ అంశాలున్నాయి కాబట్టే మూడో వ్యక్తిగా ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జి అభిప్రాయం కోరాం. ఇక ఈ వ్యవహారం ముదరదని అనుకుంటున్నాం. విద్యార్థులు జడ్జి నివేదిక వచ్చే వరకూ ఆగుతారని ఆశిస్తున్నాం" అని ఆయన చెప్పారు.
అయితే, విచారణల పేరుతో అధికారులు కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నరేశ్‌ను వెంటనే ఉపాధ్యక్షుడిగా ప్రకటించడానికి సిద్ధం కానట్టయితే దీక్షను తీవ్రం చేయక తప్పదని టీఎస్‌ఎఫ్ నేతలు అంటున్నారు. అవసరమైతే ఇందుకోసం ఆమరణ దీక్షకు కూడా సిద్ధమవుతామని వెంకటేశ్ అన్నారు.
"జస్టిస్ చంద్రయ్య విచారణ జరిగేంత వరకు వేచి చూడొచ్చు కదా" అని అడిగినప్పుడు, "విద్యార్థులను సంప్రదించకుండా, కమిటీలో తగిన వ్యక్తులు లేకుండా ఏకపక్షంగా విచారణ జరిపిస్తే ఇది మరో రూపన్‌వాల్ విచారణ నివేదికలా కాక తప్పదు" అని వెంకటేశ్ అన్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








