బనారస్ హిందూ యూనివర్సిటీలో హింసాత్మకంగా మారిన విద్యార్థినుల ఆందోళన, పలువురికి గాయాలు

ఫొటో సోర్స్, ANURAG
లైంగిక వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) విద్యార్థినులు చేపట్టిన ఉద్యమం శనివారం రాత్రి హింసాత్మక మలుపు తీసుకుంది. పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీచార్జి చేశారు. కోపోద్రిక్తులైన విద్యార్థులు వాహనాలకు నిప్పు పెట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనపై వారణాసికి వచ్చిన సమయంలోనే ఈ సంఘటన జరిగింది. ఆయన లోక్‌సభలో వారణాసికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గత రెండు రోజులుగా ధర్నా చేస్తున్న విద్యార్థినులను చెదరగొట్టడానికి పోలీసులు వారిపై లాఠీచార్జికి తలపడ్డారు. ఆ తర్వాత పోలీసులకూ, విద్యార్థులకూ మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి.

ఫొటో సోర్స్, Sameeratmaj Mishra
విద్యార్థులు అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు వారిపై బాష్పవాయువు గోళాలను ఉపయోగించారు. పరిస్థితిని నియంత్రించేందుకు భారీగా అదనపు బలగాలను మోహరించారు.
పోలీసులు వర్సిటీ హాస్టల్‌లలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వర్సిటీని అక్టోబర్ 2 వరకు మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
1916లో స్థాపించిన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం దేశదేశాల్లో బాగా పేరున్న విద్యా సంస్థ. అయితే గత కొద్ది కాలంగా ఈ వర్సిటీ ఇతర కారణాల వల్ల వార్తల్లో నిలిచింది.
'సాయంత్రం 5 తర్వాత అమ్మాయిలు బైట తిరగొద్దా?'
తాము లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తోందని విద్యార్థినులు చెబుతున్నారు. అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో వర్సిటీ అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని వారు ఆరోపిస్తున్నారు. పైగా, ఇందుకు తామే బాధ్యులమన్నట్టు అధికారులు మాట్లాడుతున్నారని ఆమ్మాయిలు చెబుతున్నారు.
అనిత అనే విద్యార్థిని బీబీసీ ప్రతినిధి సమీరాత్మజ్ మిశ్రాతో మాట్లాడుతూ, "ఇది సెప్టెంబర్ 21న జరిగిన సంఘటన. ఒక అమ్మాయిని కొందరు యువకులు లైంగికంగా వేధించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వర్సిటీ అధికారులకు ఆ అమ్మాయి ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్లు స్పందించలేదు. పైగా రాత్రి సమయంలో ఎందుకు ఇక్కడున్నావంటూ ఆమెనే తప్పుబట్టారు. బీహెచ్‌యూలో సాయంత్రం 5 నుంచే రాత్రిగా పరిగణిస్తున్నారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Sameeratmaj Mishra
"ఇది ఒక్కరోజుది కాదు, బీహెచ్‌యూలో ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయినా వర్సిటీ యాజమాన్యం అమ్మాయిలకు రక్షణ కల్పించలేకపోతోంది. మేం చేస్తున్న డిమాండ్లు చాలా చిన్నవి. వీటిని నెరవేర్చడం పెద్ద సమస్య కాదు. మానవ వనరుల అభివృద్ధి శాఖ, యూజీసీ రూపొందించిన మార్గదర్శకాలను అమలు చేయాలని మేం అంటున్నాం" అని మరో అమ్మాయి చెప్పారు.
'సోషల్' మద్దతు
బీహెచ్‌యూలో విద్యార్థినుల ఆందోళనకు సోషల్ మీడియాలో బాగా మద్దతు లభిస్తోంది. పలువురు పూర్వ విద్యార్థినులు ఈ సమస్యపై ఫేస్‌బుక్‌లో రాశారు.
ప్రదీపికా సారస్వత్ 2012లో బీహెచ్‌యూలో విద్యాభ్యాసం చేశారు. ఆమె తన ఫేస్‌బుక్ వాల్‌పై రాస్తూ, "2012లో నాకు నవీన్ హాస్టల్‌లో సీటు దొరికింది. వార్డెన్‌తో మొదటిసారి కలిసినప్పుడు ఈ హాస్టల్ గౌరవమే అమ్మాయిల గౌరవమని అన్నారు. హాస్టల్‌కు కిలోమీటర్ పరిధిలో అమ్మాయిలెవరూ అబ్బాయిలతో కలిసి కనిపించగూడదని చెప్పారు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Facebook
"రోజుకు 24 గంటలూ తెరిచి ఉండే లైబ్రరీని ప్రారంభించినప్పటికీ అందులోకి అమ్మాయిలు వెళ్లలేకపోయారు. ఎందుకంటే సాయంత్రం 7 తర్వాత మమ్మల్ని హాస్టల్ నుంచి బైటికి వెళ్లనిచ్చేవారు కాదు. దీనిపై సంతకాల సేకరణ చేసి విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది" అని ఆమె రాశారు.
చాలా మంది పూర్వ విద్యార్థినులు తమకూ, తమ స్నేహితురాళ్లకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనలను పోస్టుల్లో రాశారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)








