పౌరసత్వ సవరణ బిల్లు: హైదరాబాద్‌లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు

- రచయిత, బళ్ల సతీశ్, సంగీతం ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోనూ సోమవారం ఆందోళనలు జరిగాయి.
కేంద్రీయ విశ్వవిద్యాలయాలైన హైదరాబాద్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీల్లో విద్యార్థులు సోమవారం నిరసనలు చేపట్టారు. పౌరసత్వ చట్ట సవరణను వెనక్కు తీసుకోవాలని, ఎన్‌ఆర్‌సీ ప్రతిపాదన మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని విద్యార్థులు నినదించారు.

మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో కొన్ని రోజులుగా చిన్నచిన్న నిరసనలు జరుగుతున్నప్పటికీ, ఆదివారం దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ దగ్గర చోటుచేసుకున్న ఘటనలపై విద్యార్థులు ఆదివారం రాత్రి పెద్ద ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ గేటు నుంచి లోపల దారి పొడవునా బైఠాయించారు.
సోమవారం ఉదయం నుంచి యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. పరీక్షలు, తరగతులు బహిష్కరించారు. రోజంతా నిరసన చేపట్టారు. చట్టం ప్రతులను తగలబెట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, అమిత్ షా, మోదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, దిల్లీ జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై దిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు దాడి చేశారంటూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీ బయట పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
''మేం రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నాం. ఈ చట్టం ముస్లింలను హిందూస్తాన్ నుంచి తీసేయడానికి చేస్తున్నారు. మిగిలిన వారు ఇక్కడ ఉండటానికి ఎంత హక్కు ఉందో, ముస్లింలకూ అంతే హక్కు ఉంది. మిగిలిన ముస్లిం దేశాల్లో కూడా అనేక వేరే మతాల వారున్నారు. చాలా ముస్లిం దేశాల్లో హిందువులు ఉన్నారు. వారిని ఎవరూ ఇబ్బంది పెట్టడం లేదు కదా? జామియా విద్యార్థులపై దిల్లీ పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వారికి మద్దతుగా మేం నిరసన తెలుపుతున్నాం'' అన్నారు మౌలానా ఆజాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం కోశాధికారి విష్ణు ప్రియ.

''మా ఆందోళనను ఉద్ధృతం చేస్తాం. మిగిలిన విశ్వవిద్యాలయాలతో కలసి ఆందోళన కొనసాగిస్తాం. ఈ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకం. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వకూడదు. పార్లమెంటులో బలం ఉన్నంత మాత్రాన రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లడం సాధ్యం కాదు. మాకు రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది'' అన్నారు విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఒమర్ ఫరూఖ్.
ఇక సోమవారం సాయంత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హెచ్‌సీయూ క్యాంపస్ బయటి నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకూ బిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శన చేశారు.
విద్యార్థులతో పాటూ కొందరు ఉపాధ్యాయులూ ఈ ఇందులో పాల్గొని ప్రసంగించారు. గచ్చిబౌలి స్టేడియం బయట చట్టం ప్రతిని కాల్చి, చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

''మా అసంతృప్తిని వ్యక్తం చేయడానికి నిరసన చేశాం. బయటి నుంచి వచ్చే వాళ్లలో మతం ఎందుకు చూస్తున్నారు. ఇది 1985 ఒప్పందానికి వ్యతిరేకం. ఇది విస్తృత హిందూ ఎజెండాలో భాగంగా వాళ్లు ఇదంతా చేస్తున్నారు. శ్రీలంక హిందువుల సంగతేంటి? వాళ్లను ఎందుకు పట్టించుకోలేదు? ఇది కేవలం ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయడంలో భాగంగా ఇదంతా చేస్తున్నారు'' అన్నారు హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ప్రధాన కార్యదర్శి గోపిస్వామి.
పౌరసత్వ చట్ట సవరణ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగుతుందని రెండు విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలూ ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి:
- ఉన్నావ్ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్‌ను దోషిగా ప్రకటించిన కోర్టు
- బాగ్దాద్ గోడలపై ప్రతిబింబిస్తున్న మహిళల చైతన్యం
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
- యూఎస్బీ కండోమ్ అంటే ఏమిటో తెలుసా?
- బెంగాల్లో అక్రమంగా ఉంటున్న అందరినీ 'బయటకు గెంటేస్తాం'- అమిత్ షా
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండానే, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- ఎన్‌ఆర్‌సీ: పౌరసత్వం చట్రంలో నలిగిపోతున్న అసోం చిన్నారులు
- షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూ: ‘అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి..’
- నిర్భయ ఘటనకు ఏడేళ్లు.. మహిళలపై నేరాల విషయంలో దేశం ఎంత మారింది
- భారత్‌లో అత్యాచారాలను రాజకీయ అంశంగా మార్చిన రాహుల్, మోదీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








