యూఎస్‌బీ కండోమ్ అంటే ఏమిటో తెలుసా?

యూఎస్‌బీ కండోమ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ కాలంలో ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యే సమస్య ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోవడం. ఈ సమస్యకు పరిష్కారంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు, పబ్లిక్ టాయిలెట్లు... ఇలా అనేక ప్రదేశాల్లో మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్టులు ఏర్పాటు చేస్తున్నారు.

ఎక్కడైనా అలాంటి ఏర్పాట్లు కనిపించగానే వెళ్లి ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. కానీ, అలాంటి చోట్ల ఛార్జింగ్ పెట్టడం మంచిదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా?

ఎక్కడ పడితే అక్కడ యూఎస్‌బీ పోర్టులతో మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టడం వల్ల మీ గోప్యత ప్రమాదంలో పడొచ్చు.

బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసే యూఎస్‌బీ పోర్టుల ద్వారా మీ ఫోన్‌లో నిక్షిప్తమై ఉండే సున్నితమైన, గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్లు చోరీ చేసే అవకాశం ఉంటుంది.

అలాంటి సైబర్ మోసగాళ్ళ బారిన పడకుండా ఉండేందుకు ఇప్పుడు యూఎస్‌బీ డేటా బ్లాకర్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని 'యూఎస్‌బీ కండోమ్స్' అంటున్నారు.

మొబైల్ ఛార్జింగ్

ఫొటో సోర్స్, Getty Images

కండోమ్ అంటే నిజంగా కండోమ్ కాదు. ఇది మీ ఫోన్‌ 'జ్యూస్ హ్యాకింగ్' బారిన పడకుండా రక్షణ కల్పిస్తుంది.

'జ్యూస్ హ్యాకింగ్' ఒక రకమైన సైబర్ దాడి. ఇందులో హ్యాకర్లు యూఎస్‌బీ పోర్టుల ద్వారా మాల్‌వేర్‌ను మీ ఫోన్‌లోకి పంపించి ఇన్‌స్టాల్ చేస్తారు. తర్వాత మీ ఫోన్‌లోని మీ వ్యక్తిగత వివరాలను ఆ మాల్‌వేర్ సైబర్ నేరగాళ్ళకు చేరవేస్తుంది.

యూఎస్‌బీ కండోమ్స్‌ యూఎస్‌బీ అడాప్టర్‌లాగే ఉంటాయి. వాటికి ఇన్‌పుట్, అవుట్‌పుట్ పోర్టులు ఉంటాయి. యూఎస్‌బీ కేబుల్‌కు, ఛార్జింగ్ అడాప్టర్‌కు మధ్యలో ఈ యూఎస్‌బీ కండోమ్ ఉంటుంది. దీని ద్వారా విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుంది. ఫోన్‌కు, ఛార్జింగ్ అడాప్టర్‌కు మధ్యలో డేటా బదిలీ కాకుండా పూర్తిగా అడ్డుకుంటుంది.

యూఎస్‌బీ పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

తస్మాత్ జాగ్రత్త

జ్యూస్ హ్యాకింగ్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విమానాశ్రయాల్లో, షాపింగ్ కేంద్రాలలో కనిపించే యూఎస్‌బీ ఛార్జింగ్ స్టేషన్లను వాడొద్దని అమెరికాలోని లాస్ ఏంజెలస్ జిల్లా అటార్నీ కార్యాలయం ఇటీవల హెచ్చరికలు చేసింది.

"హ్యాకర్లు మాల్‌వేర్‌తో మీ ఫోన్‌ను పూర్తిగా క్లోన్ చేయొచ్చు. ఫోన్‌లోని మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాల యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, చిరునామాలు లాంటి అనేక రకాల డేటాను హ్యాకర్లు చోరీ చేసే ప్రమాదం ఉంటుంది. ఉచితంగా బ్యాటరీ ఛార్జింగ్ సదుపాయం దొరుకుతోందని అజాగ్రత్తగా ఉంటే, మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది" అని డిప్యూటీ అటార్నీ ల్యూక్ సిసాక్ వివరించారు.

అలాంటి సైబర్ దాడుల బారిన పడకుండా ఉండేందుకు యూఎస్‌బీ ఛార్జర్లకు ఈ 'కండోమ్'లను వినియోగిస్తే మంచిదని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.

భారత్‌లో ప్రస్తుతం వీటి ధర రూ.500 నుంచి రెండు మూడు వేల రూపాయల దాకా ఉంది. షాపింగ్ వెబ్‌సైట్లలో దొరుకుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)