హాంకాంగ్ నిరసనలు: నాయకుడెవరూ లేకపోయినా.. యాప్స్ ద్వారా ఇంత భారీ ఉద్యమం ఎలా సాధ్యమైంది?

ఫొటో సోర్స్, EPA / GETTY IMAGES
- రచయిత, డానీ విన్సెంట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హాంకాంగ్ యూకే పాలన నుంచి చైనా పాలనలోకి మారిన రోజైన జూలై ఒకటిన నిరసనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ వార్షికోత్సవం నాడు వీధుల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. సోమవారం నాటి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ఎగురవేసే వేడుకల వద్ద నిరసన కారులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
కొందరు నిరసన కారులు ప్రభుత్వ భవనంలోకి కూడా దూసుకు వెళ్ళారు.
చైనాకు హంకాంగ్‌లోని నిందితులను అప్పగించే వివాదాస్పద బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు సోమవారం కొత్త రూపం తీసుకున్నాయి.
ఆ బిల్లును నిరవధికంగా సస్పెండ్ చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ నిరసన ప్రదర్శనలు తగ్గడం లేదు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ రాజీనామా చేయాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.
అధికారమార్పిడి రోజున ప్రతి ఏటా ప్రజాస్వామ్య-అనుకూల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా జనం భారీ సంఖ్యలో వస్తుంటారు. అయితే, ఈసారి భద్రతా కారణాల రీత్యా కార్యక్రమాలను తగ్గించుకోవాలని, లేదంటే రద్దు చేసుకోవాలని పోలీసులు నిర్వాహకులకు సూచించారు.
హాంకాంగ్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద జెండా ఎగరవేసే కార్యక్రమానికి సోమవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, నిరసనకారులు అన్ని దారులనూ దిగ్బంధం చేశారు. వందలాది మంది నిరసనకారులు పోలీసులకు ఎదురువెళ్ళడంతో ఘర్షణ తీవ్రమైంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రే చేశారు.
యాప్స్ నడిపిస్తున్న ఉద్యమం
ఈ ప్రజా ఉద్యమాన్ని నాయకులు కాకుండా యాప్స్ నడిపిస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. హాంకాంగ్‌లోని ఓ సాధారణ భవన సముదాయంలో ఓ మారుమూల గదిలో టోనీ (అసలు పేరు కాదు) అనే వ్యక్తి ల్యాప్‌టాప్ ముందు పెట్టుకుని కూర్చున్నారు. దాని ద్వారా లెక్కల కొద్దీ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ గ్రూప్‌లను, ఆన్‌లైన్ ఫోరమ్స్‌ను ఆయన నడిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
హాంకాంగ్‌లో జరుగుతున్న భారీ నిరసనల కోసం టోనీ ఓ స్వచ్ఛంద కార్యకర్తలా పనిచేస్తున్నారు. ఆయన లాంటి చాలా మంది వందల సంఖ్యలో టెలిగ్రామ్ గ్రూప్‌లను నడిపిస్తూ ఉద్యమానికి ఊపిరులు ఊదుతున్నారని నిరసనల నిర్వాహకులు అంటున్నారు. వివాదాస్పద నేరస్థుల అప్పగింత చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన నిరసనల్లో 20 లక్షల మంది వీధుల్లోకి వచ్చి పాల్గొన్నారని వారు చెబుతున్నారు.
ఆ ప్రతిపాదిత చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్‌లో వరుసగా కొన్ని భారీ ర్యాలీలు జరిగాయి.
ఈ చట్టం హాంకాంగ్ న్యాయవ్యవస్థ స్వతంత్రను దెబ్బతీస్తుందని ఉద్యమకారులు చెబుతున్నారు.
హాంకాంగ్ తిరిగి చైనాతో కలిసిన రోజైన జులై 1న కూడా నిరసనల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున జనాలు వస్తారని వారు అంచనా వేస్తున్నారు.

రియల్ టైమ్ ఓటింగ్
ఆకాశరామన్న పిలుపులతోనే చాలా వరకూ ఈ నిరసనలు జరుగుతున్నాయి. ఎన్‌క్రిప్టెడ్ (రహస్యంగా) మెసేజ్‌లు పంపించుకునే యాప్‌ల ద్వారా వివిధ గ్రూప్‌ల్లో, వేదికల్లో ఇవి ఒకరి నుంచి మరొకరికి చేరుతున్నాయి.
కొన్ని గ్రూప్‌ల్లో 70 వేల మంది వరకూ యాక్టివ్ సభ్యులు ఉంటున్నారు. హాంకాంగ్ జనాభాలో ఇది ఒక శాతం. నిరసనల గురించి సమాచారం, వార్తలు కూడా ఈ గ్రూప్‌ల ద్వారా వెంటవెంటనే వారికి చేరిపోతున్నాయి. పోలీసుల గురించి సమాచారం, దగ్గర్లో జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉంటారు..
న్యాయవాదులు, ప్రాథమిక వైద్య చికిత్సలు చేసేవాళ్లు, వైద్యులతో కొన్ని చిన్న గ్రూప్‌లు కూడా ఉంటున్నాయి. నిరసనల్లో ముందుండి పోరాడేవారికి వీరు అవసరమైన సాయం చేస్తుంటారు.
నిరసనల నిర్వహణకు ఆన్‌లైన్ ద్వారా సమన్వయం చేసుకోవడం చాలా సౌకర్యవంతంగా ఉందని, సమాచారాన్ని వెంటనే చేరవేసే సౌలభ్యం దొరికిందని నిరసనకారులు చెబుతున్నారు. తమ తదుపరి చర్య ఎలా ఉండాలన్నది నిర్ణయించడానికి కూడా రియల్ టైమ్ పోల్‌లు నిర్వహిస్తున్నామని వివరిస్తున్నారు.
''మా ముందు రెండు, మూడు ఆప్షన్‌లున్నప్పుడే, దేన్ని ఎంచుకోవాలని మేం అడగొచ్చు. అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడే పోల్‌లు పనిచేస్తాయి'' అని టోనీ అన్నారు.
జూన్ 21న హాంకాంగ్ పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని నిరసనకారులు ముట్టడించారు. ఆ రోజు సాయంత్రం ఆ ముట్టడిని అలాగే కొనసాగించాలా, లేక నిరసనకారులు తిరిగి ఇంటికి వెళ్లిపోవాలా అన్న దానిపై టెలిగ్రామ్ గ్రూప్‌లో పోల్ జరిగింది. 4వేల మంది దీనిలో పాల్గొన్నారు. 39% మందే ముట్టడిని ఇంకా కొనసాగిద్దామని అభిప్రాయపడ్డారు. ఇలా తమ చర్యలు ఎలా ఉండాలన్నది నిర్ణయించుకోవడంలో నిరసనకారులకు ఇలాంటి యాప్‌లు చాలా ఉపయోగపడుతున్నాయి.
ఐఫోన్లు, ఐప్యాడ్లలో ఉండే ఎయిర్ డ్రాప్ యాప్ ద్వారా తదుపరి కార్యక్రమాల గురించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో షేర్ చేసుకుంటున్నారు.
ఇటీవలే ఓ క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ ద్వారా కొందరు అజ్ఞాత నిరసనకారులు రూ.3.4 కోట్లకు పైగా నిధులు సేకరించారు. జీ-20 సదస్సు సందర్భంగా వివాదస్పద నేరస్థుల అప్పగింత చట్టంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ పత్రికల్లో ఈ డబ్బుతో ప్రకటనలు ఇవ్వాలని వారు ప్రణాళికలు వేసుకున్నారు. టెక్నాలజీ కారణంగానే నాయకులు లేకుండా ఈ ఉద్యమం నడుస్తోందని వారు అంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
వివరాలు గోప్యం
ప్రభుత్వంపైనున్న అసంతృప్తే నిరసనలకు ప్రధాన కారణమని హాంకాంగ్ బాప్టిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎడ్మండ్ చాంగ్ అభిప్రాయపడ్డారు.
2014లో జరిగిన ప్రజాస్వామ్య అనుకూల నిరసనలకు నేతృత్వం వహించిన చాలా మందిపై ప్రభుత్వం విచారణలు జరిపి, జైల్లో పెట్టిందని ఆయన అన్నారు.
గత ఏప్రిల్‌లో తొమ్మిది మంది నాయకులను అక్కడి కోర్టులు పబ్లిక్ న్యూసెన్స్ కేసుల్లో దోషులుగా తేల్చాయి.
ఇలాంటి కేసులను ఎదుర్కోవాల్సి రావడంతోనే తమ గురించి ఆధారాలు దొరకకుండా హాంకాంగ్ నిరసనకారులు డిజిటల్ వేదికలను వాడుకుంటున్నారు.
నిరసనల సమయంలో తాము ఏటీఎమ్‌లను వాడమని, నగదునే ఉపయోగిస్తామని జానీ అనే 25 ఏళ్ల నిరసనకారుడు చెప్పారు.
నిరసనల్లో పాల్గొనే ప్రతిసారీ తాను కొత్త సిమ్ కార్డును ఉపయోగిస్తానని వివరించారు.
''మా దగ్గరు మూడు, నాలుగు ఫోన్లు ఉంటాయి. ఐప్యాడ్, ట్యాప్‌టాప్, కంప్యూటర్లనూ వాడతాం. ఒక్కో వ్యక్తి ఐదారు ఖాతాలు వాడుతుంటాడు. ఒకే ఖాతానూ చాలా మంది వినియోగిస్తుంటారు. ఏ ఖాతాలు ఎవరివో కనుక్కోవడం సాధ్యం కాదు'' అని వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ నిరసనకారుడు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కేసుల నుంచి రక్షణ
గ్రూప్‌లో పోల్‌ల ద్వారా నిరసనలకు సంబంధించి నిర్ణయాలు జరుగుతుంటాయి కాబట్టి కేసుల నుంచి వ్యక్తులకు రక్షణ ఉండే అవకాశం ఉందని టోనీ అన్నారు.
''ఈ ఉద్యమంలో భాగమయ్యే ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. దీన్ని ప్రభావితం చేస్తున్న నాయకులను లక్ష్యంగా ఎంచుకుంటుంది. వారిని శిక్షించడం ద్వారా, మిగతావారికి భయం పుట్టించే ప్రయత్నం చేస్తుంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
జూన్ 12న ఓ టెలిగ్రామ్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హాంకాంగ్ చట్టసభల భవన సముదాయ ముట్టడికి మరికొందరితో కలిసి అతడు కుట్ర పన్నాడని కేసు నమోదు చేశారు.
''గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లుగా ఉండేవారికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. గ్రూప్‌లో ఎవరు, ఏ పోస్ట్‌లు చేస్తారన్నది కూడా వారి నియంత్రణలో ఉండదు'' అని టోనీ అన్నారు.
ఇలా అరెస్టైనవారి కోసం బాండ్ అనే న్యాయవాది కోర్టుల్లో వాదిస్తున్నారు.
''ఇంటర్నెట్‌లో దాక్కున్నా, మీ ఇంటికి వచ్చి అరెస్టు చేయగలం అని ప్రభుత్వం సందేశం ఇవ్వాలనుకుంటుంది'' అని బాండ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆ పొలం నిండా కుళ్లిపోతున్న మృతదేహాలు.. వాటి మీద శాస్త్రవేత్తల పరిశోధనలు
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి
- బేబీ 'ఇండియా'ను మాకివ్వండి, మేం పెంచుకుంటాం
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- దేశమంతా ఇంటర్నెట్ ఆపేశారు.. కోర్టుకెళ్తే ఒక్కరికే ఇచ్చారు
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








