ఆంధ్రప్రదేశ్: 'ఇంగ్లిష్ మీడియం బిల్లు'కు రెండోసారి అసెంబ్లీ ఆమోదం.. ఇప్పుడు మండలిలో ఏం జరుగుతుంది..

ఫొటో సోర్స్, iStock
- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టుదలతో అడుగులు వేస్తోంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుని ఇప్పటికే ఓసారి శాసనమండలి తిరస్కరించినా ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయలేదు. శాసనమండలి చేసిన సవరణలను తిరస్కరిస్తూ మరోసారి అసెంబ్లీలో బిల్లుకి ఆమోదం పొందింది.
దాంతో ఇక అనివార్యంగా బిల్లుని శాసనమండలి ఆమోదించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రెండోసారి కూడా శాసనమండలి బిల్లుని తిరస్కరిస్తే మూడోసారి అసెంబ్లీ ఆమోదం ద్వారా ద్రవ్యేతర బిల్లు ఆమలులోకి తీసుకొచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది.
ద్రవ్యబిల్లు విషయంలో శాసనమండలి తిరస్కరించినప్పటికీ 14రోజుల తర్వాత దానిని అమలులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
ఈ బిల్లును ద్రవ్యేతర బిల్లుగా పేర్కొన్న నేపథ్యంలో రెండోసారి మండలి ఏం చేస్తుందనేది చర్చనీయాంశం అవుతోంది.

ఫొటో సోర్స్, iStock
ఇంగ్లిష్ మీడియంపై అభ్యంతరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేసింది. అందుకు అనుగుణంగా ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్‌లో సవరణలు చేస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ఆమోదం కూడా పొందింది.
ఆ తర్వాత ఆ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ఈ బిల్లుని మండలిలో ప్రవేశపెట్టారు.
కానీ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం పూర్తిగా తీసేస్తూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతుండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
విపక్ష టీడీపీతో పాటుగా పీడీఎఫ్‌కి చెందిన ఎమ్మెల్సీలు కూడా దీనిపై పట్టుబట్టారు. చివరకు ఓటింగ్ జరిగింది.


మండలిలో ప్రభుత్వ బిల్లుకి తొమ్మిది మంది సభ్యుల మద్దతు లభించగా 38 మంది వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పలు సవరణలను ప్రతిపాదించారు.
శాసనమండలిలో తాము చేసిన ప్రతిపాదనలపై పీడీఎఫ్ నేత విఠపు బాలసుబ్రహ్మణ్యం బీబీసీతో మాట్లాడారు.
"ఇంగ్లిష్ మీడియం పేరుతో మాతృభాషలో చదువుకునే అవకాశం దూరం చేయడం సమంజసం కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి వెల్లడించాం. ఎవరు ఏ భాషలో చదువుకోవాలనేది పిల్లలు, తల్లిదండ్రులు ఎంచుకునేలా ఆప్షన్లు ఉండాలని ప్రతిపాదించాం. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఓటింగ్‌కి పట్టుబట్టాం. చివరకు ప్రభుత్వ వాదన వీగిపోయింది. అయినా దానిని అంగీకరించకుండా మరోసారి అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసుకోవడం విచారకరం. విద్యావేత్తలు, నిపుణులు చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది" అని బాలసుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండోసారి అసెంబ్లీ ఆమోదంతో మండలి ఏం చేస్తుంది?
ఇంగ్లిష్ మీడియం విషయంలో శాసనమండలి ప్రతిపాదనలు, తాజాగా అసెంబ్లీలో రెండోసారి చేసిన తీర్మానంతో శాసనమండలి ఇప్పుడు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారుతోంది.
ఇప్పటికే ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు విషయంలో శాసనమండలి తీరు పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే విషయంలో రూపొందించిన బిల్లుకి రెండోసారి అసెంబ్లీ ఆమోదం దక్కిన తర్వాత మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశం అవుతోంది.
వాస్తవానికి ఒక బిల్లుని శాసనమండలి తిరస్కరించిన సమయంలో రెండోసారి అసెంబ్లీ ఆమోదం దక్కితే, దిగువ సభ నిర్ణయాన్ని అంగీకరించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తిరస్కరించే హక్కు మండలికి ఉందని న్యాయనిపుణులు పి ఉమాపతి అభిప్రాయపడ్డారు.
శాసనమండలి తిరస్కరించిన బిల్లును గురువారంనాడు మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం ఏకగ్రీవంగా సభ ఆమోదం పొందింది.
శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలతో గురువారం సభకు విపక్ష టీడీపీ దూరమైంది. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇంగ్లిష్ మీడియంలో బోధనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దాంతో బిల్లు ఏకగ్రీవంగా రెండోసారి శాసనసభ ఆమోదాన్ని పొందింది.
ఈ నేపథ్యంలో మండలి ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.
దీనిపై ఉమాపతి మాట్లాడుతూ "సహజంగా ఎగువ సభ చేసిన సూచనలను స్వీకరిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి శాసనసభకు ఎక్కువ హక్కులున్నందున ఈ చట్టం అమలు అనివార్యం. ఇక మండలి కూడా పట్టువిడుపులతో వ్యవహారించాల్సి ఉంటుంది. దానికి భిన్నంగా వెళ్లినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇక గవర్నర్ ఆమోదం తర్వాత చట్టరూపం దాల్చడం అనివార్యంగా కనిపిస్తోంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పేదలకు మేలు చేద్దామనుకుంటే అడ్డుకుంటున్నారు
పేదవాడికి మంచి జరగాలని ప్రవేశపెట్టిన బిల్లులకు అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇంగ్లిష్ మీడియం బిల్లు విషయంలో గురువారం ఆయన సభలో మాట్లాడారు.
"టీడీపీ సభ్యులు ప్రతీసారి బిల్లులను అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన బిల్లును మండలిలో తిరస్కరించడం అందులో భాగమే. ఎవరెన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా పేద పిల్లలకు జగన్ మామ తోడుగా ఉంటాడని చెబుతున్నాను. ప్రభుత్వ బడుల్లో పునాది దశలోనే ఇంగ్లిష్ మాట్లాడడం, చదవడం మొదలయితే భవిష్యత్ మెరుగవుతుంది. ఇప్పటి వరకూ 23.67 శాతం మాత్రమే ప్రాథమిక స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఉంది. ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం 98.5 శాతం ఇంగ్లిష్ మీడియం ఉంది" అని జగన్ అన్నారు.

ఫొటో సోర్స్, iStock
చట్టం అమలులోకి వస్తే..
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో ఇంగ్లిష్, తెలుగు మీడియంలలో బోధన సాగుతోంది. అది ఇకపై పూర్తిగా ఇంగ్లిష్ మీడియంగా మారుతుంది.
తొలి ఏడాది ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతుండగా ఆ తర్వాత ఏడాదికి ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లిష్ మీడియంలోకి తీసుకొస్తారు.
రాబోయే నాలుగేళ్లలో పూర్తిగా అన్ని తరగతులను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చే యోచనలో ఉన్నట్లు బిల్లులో ప్రభుత్వం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ‘ఆడపిల్ల చదువుకు అంత ఖర్చు దేనికి?’.. ఈ ప్రశ్నకు కారణాలేంటి?
- హైడ్రోజన్‌తో నడిచే డ్రోన్లు.. ‘ఢీకొట్టినా పేలిపోవు’ అంటున్న హెచ్2గో పవర్
- పెరిగిన ద్రవ్యోల్బణం ప్రభావం సామాన్య ప్రజలపై ఎలా ఉంటుంది?
- రాత్రిలా మారిన పగలు... పరుగులు తీసిన ప్రజలు
- రాళ్లలో దొరికే సిలికాన్.. మన జీవితాలను ఎలా మార్చేసింది
- వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు పెద్ద ప్రయత్నం చేస్తున్న చిన్న దేశం
- గాలి నుంచి ఆహారం తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









