ఏబీవీపీ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేపథ్యమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలోని జేఎన్‌యూలో ఈ నెల 5న ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించిన దుండగులు కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులపై, అధ్యాపకులపై దాడికి తెగబడ్డారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు గంటకు పైగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.
క్యాంపస్ బయట మరో గుంపు జాతీయవాద నినాదాలు చేస్తూ, జర్నలిస్టులను, అంబులెన్సులను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడింది. ఈ హింసలో దాదాపు 40 మంది గాయపడ్డారు.
దాడికి పాల్పడ్డ గుంపులో ప్రధానంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి చెందినవారు, బయటివారు ఉన్నారని ప్రత్యక్షసాక్షులు, వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందినవారు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. జేఎన్‌యూలో హింస జరిగిన కొద్ది సేపటికే దాడికి పాల్పడింది ఏబీవీపీనేనని జేఎన్‌యూ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఆరోపించింది. జేఎన్‌యూఎస్‌యూ నాయకురాలు ఆయిషీ ఘోష్ కూడా ఈ హింసలో గాయపడ్డవారిలో ఉన్నారు.
వామపక్ష విద్యార్థి సంఘాలే ఈ దాడికి పాల్పడ్డాయని ఏబీవీపీ అంటోంది.
ఈ హింస వ్యవహారంపై ఇండియా టుడే టీవీ చానెల్ ఒక 'స్టింగ్ ఆపరేషన్' వీడియో టెలికాస్ట్ చేసింది. జేఎన్‌యూలో చదువుకుంటున్న అక్షత్ అవస్థీ ఈ దాడిలో తన పాత్ర ఉన్నట్లు అంగీకరించారని, ఏబీవీపీలో తాను సభ్యుడినని వెల్లడించారని కథనం ప్రసారం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏబీవీపీ నేపథ్యమేంటి?
ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం తమదేనని ఏబీవీపీ చెబుతోంది.
హిందూ జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు అనుబంధ విద్యార్థి సంఘంగా 1949లో ఇది ఏర్పాటైంది.
బీజేపీతో తమకు అనుబంధం లేదని ఏబీవీపీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి సంఘ్ పరివార్‌గా పిలుస్తుంటారు. ఈ సంఘ్ పరివార్‌లో బీజేపీ, ఏబీవీపీ కూడా భాగం.
ఏబీవీపీ సహకారం బీజేపీకి ఎంతగానో ఉపయోగపడిందని విశ్లేషకులు చెబుతుంటారు. ఏబీవీపీ నుంచి వచ్చిన చాలా మంది ఆ పార్టీలో పెద్ద నాయకులుగా ఎదిగారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీని చాలా మంది రాజకీయ విశ్లేషకులు, మేధావులు ఒక్కటిగానే చూస్తారు. ఏబీవీపీని కూడా ఆ రెండింటి అనుబంధ సంస్థగా చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
విద్య, జాతీయ భద్రత, విశ్వవిద్యాలయ సంస్కరణలు ఏబీవీపీ భావజాలంలో ప్రధానాంశాలుగా ఉన్నాయి.
1990లో ఏబీవీపీ స్టూడెంట్స్ ఫర్ డెవెలప్‌మెంట్ (ఎస్ఎఫ్‌డీ) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 'సమగ్ర, సుస్థిరాభివృద్ధి ఆవశ్యకతపై సరైన దృక్పథాన్ని పెంపొందించడం' దీని లక్ష్యం.
ఏబీవీపీ అధికారిక మాసపత్రిక పేరు 'రాష్ట్రీయ ఛాత్ర్‌శక్తి'. హిందీలో ఇది వెలువడుతోంది.
కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఏబీవీపీ పేరు వినిపిస్తూ వస్తోంది.
రాజకీయ పక్షపాతాలకు తాము దూరమన్నది ఏబీవీపీ వాదన. అయితే, సామాజిక కార్యక్రమాలు ఏవైనా రాజకీయాలకు పూర్తిగా అతీతంగా ఉండటం సాధ్యం కాదని కూడా ఆ సంస్థ అంటోంది.

ఫొటో సోర్స్, ugc
జేఎన్‌యూ హింసపై ఏబీవీపీ ఏమంది..
జేఎన్‌యూలో హింసపై ఇండియా టుడే నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌ను తమపై 'బురద చల్లేందుకు' జరిగిన ప్రయత్నమని ఏబీవీపీ వర్ణించింది.
అక్షత్ అవస్థీ తమ విద్యార్థి సంఘంలో సభ్యుడు కాదంటూ ఏబీవీపీ సీనియర్ నాయకురాలు నిధి త్రిపాఠి ప్రకటన విడుదల చేశారు.
ఓపీ ఇండియా న్యూస్ పోర్టల్ కూడా ఇండియా టుడే కథనం విశ్వసనీయతను ప్రశ్నిస్తూ మరో కథనం ప్రచురించింది.
దిల్లీ పోలీసులు జేఎన్‌యూ హింస కేసు విచారణకు హాజరుకావాలని అవస్థీని కోరినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై అవస్థీ ఇంతవరకూ స్పందించలేదు.
మరోవైపు జేఎన్‌యూలో విద్యార్థులపై దాడికి పాల్పడింది వామ పక్ష విద్యార్థి సంఘాలేనని, వీడియో ఆధారాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోందని రిపబ్లిక్ టీవీ చానెల్ కథనం ప్రసారం చేసింది.
ఇవి కూడా చదవండి:
- ‘47 ఏళ్ల ఈ వ్యక్తి జేఎన్‌యూ విద్యార్థి.. 32 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు’ నిజమేనా? - BBC Fact Check
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- "జేఎన్‌యూ వీసీని వెంటనే తొలగించాలి": బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి
- #SatyaNadella: 'విచారకరం - బాధాకరం' - CAAపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన
- దీపికా పడుకోణే: బాలీవుడ్‌కి ఒక రాజకీయ గళం దొరికిందా?
- ఆస్ట్రేలియాలో వేల సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు... ఎందుకు?
- జేఎన్‌యూ విద్యార్థులతో దీపిక ఏం మాట్లాడారు?
- అల వైకుంఠపురములో సినిమా రివ్యూ:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








