జేఎన్‌యూలో దాడి నిందితుల్లో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ సహా 9 మంది నిందితుల పేర్లు వెల్లడించిన పోలీసులు..

విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జనవరి 5న విద్యార్థులపై దాడితో సంబంధమున్న తొమ్మిది మంది విద్యార్థులను గుర్తించామని దిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోలు, ఫొటోల ఆధారంగా తొమ్మిది మంది విద్యార్థులను పోలీసులు గుర్తించారని క్రైమ్ బ్రాంచ్ డీసీపీ జోయ్ టిర్కీ శుక్రవారం మీడియాకు తెలిపారు.

వీరిలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్, కౌన్సెలర్ సుచేతా తలుక్దార్, చున్‌చున్ కుమార్, ప్రియా రంజన్, డోలన్ సమంత్, యోగేంద్ర భరద్వాజ్, వికాస్ పటేల్, వస్కర్ విజయ్ ఉన్నారు.

జనవరి 3 నుంచే కేంపస్‌లో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందని, జనవరి 5న అది దాడుల రూపంలో బహిర్గతమైందని పోలీసులు తెలిపారు.

విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీ ఘోష్

ఫొటో సోర్స్, ANI

న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది

దీనిపై ఆయిషీ ఘోష్ స్పందించారు.

పోలీసులు చెప్పినంత మాత్రాన ఎవరూ అనుమానితులు కారని ఐషీ ఘోష్ వ్యాఖ్యానించారు.

"ఈ దేశంలోని న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది, నిజమైన దోషులు ఎవరో త్వరలో తెలుస్తుంది. విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి. కానీ, దిల్లీ పోలీసులు ఇలా పక్షపాతంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పటివరకూ నా ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. నేనెలాంటి నేరం, దాడికీ పాల్పడలేదు" అని ఆమె అన్నారు.

"కావాలంటే దిల్లీ పోలీసులు విచారణ చేసుకోవచ్చు. నాపై ఎలా దాడి జరిగిందో చూపించే ఆధారాలు నా దగ్గర కూడా ఉన్నాయి. నేనె తప్పూ చేయలేదు. దిల్లీ పోలీసులంటే మాకేం భయం లేదు. మేం చట్టప్రకారమే వ్యవహరిస్తున్నాం. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం.

వీసీని వెంటనే తొలగించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఆయన యూనివర్సిటీని నడపలేరు. కేంపస్‌లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి సహకరించే వీసీ మాకు కావాలి" అని ఆమె అన్నారు.

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్

దాడికి పాల్పడ్డ అనుమానితులను గుర్తించామని పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించిన తర్వాత కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ దీనిపై స్పందించారు.

"ఇవన్నీ గత 5 రోజులుగా బీజేపీని, ఏబీవీపీని నిందించడానికి ఉద్దేశపూర్వకంగా చేపట్టిన నిరసనలే అని స్పష్టమైంది. వారి ఆరోపణలన్నీ అబద్దాలే. లెఫ్ట్ సంఘాలే ముందస్తు పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడ్డాయి. వాళ్లు సీసీటీవీలను, సర్వర్లను ధ్వంసం చేశారు" అని అన్నారు.

విచారణ నివేదిక త్వరగా రావాలని, దోషులను గుర్తిస్తే, వారికి శిక్ష పడాలని జేఎన్‌యూ వీసీ ఎం జగదీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, ANI

అసలేం జరిగింది?

ఆదివారం సాయంత్రం దిల్లీలోని జేఎన్‌యూలో దాదాపు 50 మంది దుండగులు ప్రవేశించి విద్యార్థులపై దాడికి దిగారు. ఈ హింసలో 30-35 మంది విద్యార్థులు గాయపడ్డారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత ఆయిషీ ఘోష్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.

దీనికి సంబంధించి దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేయగా, క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చెయ్యలేదు. ఏబీవీపీ, లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఈ దాడికి మీరంటే మీరు కారణమని ఆరోపణలు చేసుకున్నారు.

జేఎన్‌యూలో ఫీజుల పెంపు, హాస్టల్, మెస్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ విద్యార్థులు కొన్ని నెలలుగా నిరసనలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)