JNUలో దాడి జరిగినప్పుడు వీసీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? :వైస్ చాన్స్‌లర్ జగదీశ్ కుమార్‌‌తో ఇంటర్వ్యూ...

జగదీష్ కుమార్

ఫొటో సోర్స్, JAGDESH KUMAR/FACEBOOK

    • రచయిత, నీలేష్ ధోత్రే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఇటీవల విద్యార్థులపై జరిగిన దాడి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ హింసను అడ్డుకోవడంలో, ఆ తరువాత తలెత్తిన పరిస్థితులను ఎదుర్కోవడంలో విఫలమయ్యారంటూ జేఎన్‌యూ వైస్ ఛాన్స్‌లర్ జగదీష్ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో జగదీష్ కుమార్ బీబీసీతో మాట్లాడారు. ఆ దాడిలో గాయపడ్డ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఆయిషీ ఘోష్‌ను ఇప్పటిదాకా ఎందుకు కలవలేదో చెప్పారు. హింస నేపథ్యంలో ఎదురవుతున్న అనేక ప్రశ్నలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు.

ఆదివారం రాత్రి యూనివర్సిటీలో హింస చెలరేగిన సమయంలో వీసీ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?

ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ ''ఆ సమయంలో నేను ఇక్కడ నా ఆఫీసులోనే ఉన్నాను. అప్పుడు యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఎంపిక పనులు జరుగుతున్నాయి. సాయంత్రం 4.30 సమయంలో దాదాపు 100 మంది విద్యార్థులు చాలా దూకుడుగా హాస్టల్ గదులవైపు వెళ్తున్నారనే సమాచారం నాకు అందింది. మేం వెంటనే సెక్యూరిటీ గార్డులను వాళ్ల దగ్గరికి పంపించాం. కానీ, ఆ విద్యార్థులు చాలా కోపంగా ఉన్నారని, వారిని అదుపు చేయడం సెక్యూరిటీ గార్డులకు సాధ్యం కాలేదని మాకు తరువాత అర్థమైంది. వెంటనే మేం పోలీసులకు సమాచారమిచ్చాం. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు'' అని చెప్పారు.

ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ తమకు క్యాంపస్‌లోకి వెళ్లడానికి వెంటనే అనుమతి లభించలేదని, అందుకే లోపలికి వెళ్లలేదని అంటున్నారు. కానీ వీసీ మాత్రం వెంటనే పోలీసులను పిలిచామని చెబుతున్నారు. మరి వీరిలో ఎవరి మాట నిజం?

దీనికి వీసీ సమాధానమిస్తూ.. ''పోలీసులు లోపలికి రావాలంటే సరైన ప్రక్రియను అనుసరించాలి. మేం వారికి లిఖిత పూర్వకంగా అనుమతి ఇస్తూ పత్రాన్ని రూపొందించి పంపించాం. ఆ తరువాత పోలీసులు లోపలికి వచ్చారు. ఇదంతా జరగడానికి కాస్త సమయం పట్టింది'' అన్నారు.

జేఎన్‌యూ

ఫొటో సోర్స్, Getty Images

‘‘విచారణలో అన్నీ బయటపడతాయి’’

గొడవ జరుగుతుందన్న సమాచారం తనకు 4.30కు అందిందని వీసీ చెప్పారు. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో అనుమతి పత్రాన్ని తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? హాస్టల్లో గలాటా 3 గంటల పాటు సాగిందని విద్యార్థులు చెబుతున్నారు. మరి అంత ఆలస్యం ఎందుకైంది?

ఈ ప్రశ్నకు వీసీ సమాధానమిస్తూ.. ''వైస్‌ ఛాన్స్‌లర్‌తో పాటు ఇతర సిబ్బందికి పోలీసు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశాలున్నాయి. అందుకే క్యాంపస్‌లో యూనిఫాంలో లేని పోలీసులు ఉన్నారు. క్యాంపస్‌లోని కొన్ని కీలకమైన ప్రదేశాల్లో కూడా పోలీసులు ఉన్నారు. మరింతమంది పోలీసులు రావడానికి ఆలస్యమైంది'' అన్నారు.

కానీ, జేఎన్‌యూలో పటిష్ఠమైన భద్రత వ్యవస్థ ఉంది. బయటివాళ్లు లోపలికి రావాలంటే అనేక అనుమతులు కావాలి. ఐడీ కార్డు ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో అంతమంది ఒకేసారి లోపలికి ఎలా రాగలిగారు? ఆ స్థాయిలో హింసను ఎలా సృష్టించగలిగారు?

ఈ ప్రశ్నకు ఆయన.. ''విచారణ జరగనివ్వండి. విచారణలో అన్నీ బయటపడతాయి'' అని బదులిచ్చారు.

ఎంత మంది లోపలికి వచ్చారు? ఎన్ని వాహనాలకు టోకెన్లు ఇచ్చారు? ఆ మూడు గంటల్లో క్యాంపస్‌లో ఏం జరిగింది? మీకు ఎలాంటి సమాచారం అందింది? అన్న ప్రశ్నలకు కూడా ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదు.

ఆ గొడవను వీడియో తీయకూడదన్న ఉద్దేశంతోనే క్యాంపస్‌లో ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారా? ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ''క్యాంపస్‌లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతూనే ఉంటుంది. కానీ, క్యాంపస్ బయట నుంచి విద్యుత్ కనెక్షన్‌ తొలగిస్తే అది యూనివర్సిటీ నియంత్రణలో ఉండదు'' అని చెప్పారు.

ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

‘‘చేతులెత్తి వేడుకుంటున్నా... మమ్మల్ని వదిలేయండి’’

జేఎన్‌యూ హింసలో గాయపడిన విద్యార్థి నాయకురాలు ఆయిషీ ఘోష్‌ను వీసీ ఇప్పటిదాకా కలవకపోవడంపై కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే, యూనివర్సిటీలో అనేక వ్యవస్థలుంటాయని, ప్రతి ఒక్కరికీ కొన్ని బాధ్యతలుంటాయని, అది తనొక్కరి బాధ్యత మాత్రమే కాదని వీసీ చెప్పారు.

జేఎన్‌యూ పూర్వ విద్యార్థి అయిన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ మాటలతో తాను ఏకీభవిస్తున్నానని, ఆయన చెప్పినట్లుగా జేఎన్‌యూ ఒకప్పటిలా లేదని జగదీష్ కుమార్ అన్నారు.

''జేఎన్‌యూ కేవలం ఆలోచనలు- చర్చలకు వేదికగా ఉండేది. హింసకు క్యాంపస్‌లో అస్సలు చోటుండేది కాదు. వీసీపైన దాడి చేయడం, విశ్వవిద్యాలయం పనిచేయకుండా ఆటంకం కలిగించడం అనేది జేఎన్‌యూ పద్ధతి కాదు'' అని చెప్పారు.

జనవరి 5న క్యాంపస్‌లో జరిగిన హింసకు ఏబీవీపీదే బాధ్యత అంటూ ఆరోపణలు వస్తున్నాయి. హిందూ రక్షా దళ్‌ కూడా ఆ దాడిలో తమ పాత్ర ఉందని అంగీకరించింది.

హిందూ రక్షా దళ్ గురించి వీసీని అడిగినప్పుడు.. ''మా విశ్వవిద్యాలయాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్న వాళ్లందరినీ చేతులెత్తి వేడుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని ఇలా వదిలేయండి'' అన్నారు.

ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమిస్తే, చట్టం తన పని తాను చేయాల్సిందేనన్నారు.

ఆయిషీ ఘోష్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఆయిషీ ఘోష్

ఈ మొత్తం సమస్య యూనివర్సిటీ ఫీజులు, మెస్ ఛార్జీల పెంపుతో మొదలైంది. కానీ, శాంతియుతంగా మాటలతో సమస్యను పరిష్కరించే అవకాశం విద్యార్థులు కల్పించడం లేదని, అలాంటి పరిస్థితుల్లో చర్చలు ఎలా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు.

''విద్యార్థులు ఆందోళనలు చేస్తారు. దాడులు చేస్తారు. నాపైన కూడా దాడి జరిగింది. నా వాహనాన్ని ధ్వంసం చేశారు. కొందరిని గదుల్లో పెట్టి తాళం వేశారు. దీన్ని బట్టి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి ఎవరు అడ్డుతగులుతున్నారో మీరే అర్థం చేసుకోవచ్చు'' అని వీసీ వివరించారు.

ఆరెస్సెస్ హిందుత్వ ఎజెండాను అమలు చేయడానికి జగదీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని, అందుకే విద్యార్థులతో ఆయనకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయని, యూనివర్సిటీలో వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థులదే పైచేయి కావడం అందుకు కారణమని ఆరోపణలు ఉన్నాయి.

దీనికి స్పందిస్తూ.. ''అత్యున్నత విద్యా ప్రమాణాలు, ఫలితాల ఆధారంగానే ఈ విశ్వవిద్యాలయం నడుస్తుంది. మిగతావన్నీ కింది స్థాయి విషయాలు. నేను ఒక విద్యావేత్తను. నా లక్ష్యం విశ్వవిద్యాలయాన్ని మెరుగ్గా నడిపించడమే. మీరు విషయాన్ని రాజకీయ దృష్టితో చూస్తున్నారు. నేను ఎకడమిక్ కోణంలో ఆలోచిస్తాను'' అని చెప్పారు.

''జేఎన్‌యూ ఒక అద్భుతమైన విశ్వవిద్యాలయం. ఇక్కడ చదువుకొని చాలామంది ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ, ఇప్పుడిలా ఆందోళనలు, ధర్నాలు చేస్తూ యూనివర్సిటీ కార్యకలాపాలను స్తంభింపజేస్తే, ఇతర విద్యార్థులు ఎలా చదువుకుంటారు? యూనివర్సిటీ భవిష్యత్తు ఏమవుతుంది?'' అని వీసీ జగదీష్ కుమార్ ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)