2019లో దేశ రాజకీయాలు, సమాజంపై లోతైన ప్రభావం చూపిన ప్రధాన ఘటనలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతాపార్టీ పట్ల వ్యతిరేకతలతో 2019 నిండిపోయింది.
ఒకవైపు ఈ ఏడాది ఎన్నికల్లో ఆయనకు భారీ ఆధిక్యం లభిస్తే, మరోవైపు ఏడాది చివర్లో ఆయన ఐదున్నరేళ్ల ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకతలు షాక్ ఇచ్చాయి.
ఈ ఏడాది కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు తీవ్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ఏడాదిలో కూడా సవాళ్లు స్వాగతం పలకొచ్చు.
బీజేపీ సర్కారు తన హిందూ జాతీయవాదం ఎజెండాను అమలు చేసిన సంవత్సరంగా విశ్లేషకులు 2019ని చూస్తున్నారు.
దానికోసం గత ఐదేళ్లుగా దారులు వేసిన వారు, ఇప్పుడు అమలు చేస్తున్నారని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హిందూ దేశ ఎజెండా
ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసినట్లు కచ్చితంగా కనిపిస్తోంది. ప్రధానమంత్రి డిసెంబర్ 22న దిల్లీలో ఇచ్చిన ప్రసంగం ద్వారా అది తెలుస్తోంది.
కానీ ఎక్కువ మంది విశ్లేషకులు మాత్రం 2020ని కూడా హిందూ దేశ ఎజెండాను కొనసాగించే సంవత్సరం కావొచ్చని చెబుతున్నారు. కొత్త ఏడాదిలో యూనిఫాం సివిల్ కోడ్ లాంటి చట్టాలు తీసుకురావొచ్చని చెబుతున్నారు. ఇదే ఏడాది నరేంద్ర మోదీని భారీ ఆధిక్యతతో గెలిపించిన ప్రజలు.. మోదీ 2.0 ఆకాంక్షలపై తమ ఆమోద ముద్ర వేశారు.
లఖ్‌నవూ సీనియర్ జర్నలిస్ట్ వీరేంద్రనాథ్ భట్ 2019ని ఒక ముఖ్యమైన ఏడాదిగా చూస్తున్నారు. "దేశ రాజకీయాల డిఫాల్ట్ రీసెట్ పనిని మోదీ ప్రభుత్వం, బీజేపీ 2019లో వేగంగా ప్రారంభించిందనే చెప్పవచ్చు" అని అన్నారు.
"ట్రిపుల్ తలాక్ అయినా, ఆర్టికల్ 370 రద్దు అయినా, అయోధ్య కేసు తీర్పు తమకు అనుకూలంగా రావడం, లేదంటే పౌరసత్వ సవరణ చట్టం బిల్లుకు ఆమోదముద్ర పడడం ఈ చర్యలు అన్నింటినీ డిఫాల్ట్ రీసెట్ కోణంలోనే చూడాలి" అని చెప్పారు.
"రాజ్యాంగ నిర్మాణం భారత దేశ నిర్మాణానికి పుల్‌స్టాప్ కాదు. ఆ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుంది. మనం సమసిపోయాయని అనుకున్న ఎన్నో అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. నరేంద్ర మోదీ ఐదున్నరేళ్ల పదవీకాలంలో భారత రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సమాజంలో ఎలాంటి డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయో వాటిని మార్చేయడాన్ని మనం చూశాం" అని భట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశ రాజకీయాల్లో మితవాద రాజకీయాలకు ఎక్కువ చట్టబద్ధత, అధిక గుర్తింపు, అధిక బలం లభించిన ఏడాదిగా 2019 నిలిచిపోయిందని చండీగఢ్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ప్రమోద్ కుమార్ అన్నారు.
"ఆర్టికల్ 370ని తొలగించడం, ట్రిపుల్ తలాక్, పౌరసత్వ సవరణ చట్టం, మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం లాంటి ఘటనలు ఈ ఏడాది కనిపించాయి. ఇవి దేశంలో మితవాద రాజకీయాలకు ఎక్కువ బలం, ఎక్కువ చోటు లభించిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి" అని చెప్పారు.
2019 జాతీయవాదానిది. ఈ సంవత్సరం శాంతికి బదులు, దుందుడుకు జాతీయవాదానికి కేంద్ర బిందువుగా మారిందని డాక్టర్ కుమార్ చెప్పారు.
ఆయన తన వాదనను అర్థమయ్యేలా చెప్పేందుకు పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్, పాకిస్తాన్‌తో చెడిన సంబంధాలను ఉదాహరణగా చెప్పారు.
"భారత రాజకీయాలు, సమాజంలో మార్పు తీసుకొచ్చిన మూడు ఘటనలు 2019లో జరిగాయి. మొదట ఆ ఘటనలు మితవాద రాజకీయాలకు భారత్‌లో చట్టబద్ధతను అందించాయి. ఆర్టికల్ 370ని తొలగించడం, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకురావడం లాంటి ఘటనతో మితవాద రాజకీయాలకు చట్టబద్ధత లభించింది. ఇది చాలా పెద్ద మార్పు" అన్నారు.

రెండోది జాతీయవాదానికి పాకిస్తాన్ కోణంలో ప్రోత్సాహం లభించింది. ఇందులో పుల్వామా తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఉన్నాయి. అది జాతీయవాదం నిర్వచనాన్ని మార్చేసింది.
"ఆర్థిక వ్యవస్థపై అన్ని పెద్ద పార్టీల అసమ్మతి మాయమైపోతుండడం కూడా 2019లో కనిపించిన ఒకే ఒక ముఖ్యమైన ఘటనగా నిలిచింది. దీనిని బహిరంగంగా వెల్లడించలేదు" అంటారు డాక్టర్ కుమార్
జీఎస్టీ ఎంత శాతం తగ్గించాలి అనేదానికి కూడా పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. ఆర్థిక అంశాలపై రాజకీయ పార్టీల్లో ఉన్న సమ్మతి సంస్థాగత రూపంలో కనిపించింది.
2019లో దేశ రాజకీయాలు, సమాజంపై లోతైన ప్రభావం చూపించిన ముఖ్యమైన ఘటన ఏది అనేదే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న.
ప్రజల్లాగే, దీనిపై దేశ నిపుణుల అభిప్రాయాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. మనం ఈ ఏడాది జరిగిన అన్ని ప్రభావవంతమైన ఘటనలన్నింటినీ ఓసారి చూద్దాం. ఏ ఘటన దేశ రాజకీయాలను మార్చేసింది లేదా ప్రభుత్వ ప్రాధాన్యాలను మార్చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఫొటో సోర్స్, VIDEO GRAB
పుల్వామా ఆత్మాహుతి దాడి
ఆదిల్ డార్ అనే ఒక స్థానిక యువకుడు ఫిబ్రవరి 14న జమ్ము-శ్రీనగర్ హైవేపై భద్రతాదళాలను తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి చేశాడు. ఈ దాడిలో కేంద్ర రిజర్వ్ పోలీసులకు చెందిన 40 మంది జవాన్లు మృతిచెందారు.
డార్‌కు జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. దానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి లింకులు ఉన్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది.
పాకిస్తాన్‌లో ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ ఈ దాడికి తామే బాధ్యులమని అంగీకరించింది. కానీ ఆ దాడి వెనుక తమ హస్తం ఉందన్న భారత ప్రభుత్వ ఆరోపణలను పాకిస్తాన్ ప్రభుత్వం ఖండించింది.
ఫిబ్రవరి 26న పాకిస్తాన్ లోపల బాలాకోట్‌లో ఉన్న జైషే స్థావరాలపై దాడులు చేసి వందలాది మిలిటెంట్లను చంపామని భారత వైమానిక దళం చెప్పింది.
తర్వాత రోజు పాకిస్తాన్ ప్రతిదాడులు చేసింది. వాటిలో భారత వైమానిక దళానికి చెందిన ఒక విమానం కూలింది. దాని పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ జోక్యంతో పాకిస్తాన్ అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది.

ఫొటో సోర్స్, EPA
'సర్జికల్ స్ట్రయిక్స్'
ఫిబ్రవరికి ముందు బీజేపీ, మిగతా రాజకీయ పార్టీలు సాధారణ ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. అప్పటికి బీజేపీ పరిస్థితి సరిగా లేదని చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటోందని, భాగస్వామ్య పార్టీలతో కలిసి అది అధికారంలోకి వస్తుందని కూడా అనుకుంటున్నారు.
కానీ పుల్వామా దాడి, సర్జికల్ స్ట్రయిక్స్ పరిస్థితిని మార్చేశాయి. ప్రజల మూడ్ పూర్తిగా బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా కనిపించింది.

సాధారణ ఎన్నికలు
ఏప్రిల్-మే నెలల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం భారీ ఆధిక్యం సంపాదించి మళ్లీ అధికారం చేపట్టింది. దానికి మోదీ 2.0 అనే పేరు పెట్టారు.
"ఆ ఎన్నికల్లో లభించిన భారీ ఆధిక్యం బీజేపీ ప్రభుత్వానికి తమ హిందూ దేశ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే సంకేతంగా నిలిచింది" అని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.
బీజేపీ మానిఫెస్టోలో ట్రిపుల్ తలాక్ రద్దు, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 తొలగించడం, అయోధ్యలో రామమందిరం నిర్మించడం అన్నీ ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్టికల్ 370 రద్దు
ఆగస్టు 5న పార్లమెంటులో నాటకీయ పరిణామాల మధ్య ఆర్టికల్ 370ని తొలగించి, జమ్ము-కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు ప్రకటించి భారత ప్రభుత్వం అందరినీ ఆశ్చర్యపరిచింది.
దీని గురించి మంత్రి మండలిలో సీనియర్ సభ్యులకు కూడా తెలీదు. దేశం దీని గురించి మొట్టమొదట అమిత్ షా పార్లమెంటు ప్రసంగంలోనే వినింది.
కశ్మీర్ లోయలో ప్రజలకు ప్రభుత్వం తమ సలహా లేకుండానే ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుందో నమ్మకం కలగలేదు. అయితే, కొన్నిరోజుల ముందు నుంచీ ఏదో పెద్ద విషయమే ప్రకటిస్తారు అనే చర్చ జరుగుతూ వచ్చింది. నేను అదే రోజు కశ్మీర్ చేరుకున్నాను.
ఒక కశ్మీరీ యువకుడు నాతో "లోయ నుంచి విదేశీయులు, స్థానిక పర్యటకులను బయటకు తీసుకెళ్లడం, 33 వేల అదనపు భద్రతా బలగాలను మోహరించడం అన్నింటినీ చూస్తే, ఏదో జరగబోతోందనే సంకేతంలా అనిపించింది. కానీ, అది మా హక్కును లాగేసుకునే ప్రకటన అవుతుందని మేం అసలు ఊహించలేదు" అన్నాడు.
అయూబ్ డార్ అనే ఒక వ్యక్తి అదే సమయంలో దిల్లీ నుంచి తిరిగివెళ్తున్నారు. "భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య కశ్మీరీలకు వెన్నుపోటు లాంటిది. మేం భారత్‌కు దగ్గరవుతున్నట్టు లేదు, ఇంకా దూరమైపోతున్నట్లు అనిపిస్తోంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ నేతలను గృహనిర్బంధం చేశారు. రాజకీయ పార్టీల కార్యకలాపాలను అణచివేశారు. ఇంటర్నెట్, మొబైల్, ల్యాండ్‌లైన్ సేవలు కూడా నిలిపివేశారు.
మరోవైపు దీనికి దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. జనం రోడ్లమీదకు వచ్చి డాన్సులు చేశారు. కానీ విపక్షాలు మాత్రం ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై గట్టిగా ఎలాంటి వ్యతిరేకతనూ వ్యక్తం చేయలేకపోయాయి.
కొన్ని రోజుల తర్వాత బీబీసీతో మాట్లాడిన రాజకీయ విశ్లేషకులు భరత్ భూషణ్ "కశ్మీర్‌పై ఈ చర్యకు భారత్ ముందు ముందు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అన్నారు.
"ఇది రాజకీయ ప్రక్రియ. చివరికి మీరు(భారత ప్రభుత్వం) చర్చల దారి ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు పాకిస్తాన్‌తో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. కశ్మీరీలతో కూడా చర్చించాల్సి ఉంటుంది" అన్నారు.

ఫొటో సోర్స్, EPA
పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అది ఐక్యరాజ్యసమితిలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తింది. కానీ దానివల్ల మోదీ ప్రభుత్వం నిర్ణయంపై ఎలాంటి ప్రభావం పడలేదు.
జమ్ము, కశ్మీర్ భారత్ నుంచి విడదీయలేని భాగమని, ఆర్టికల్ 370 రద్దు తమ అంతర్గత సమస్య అని మోదీ ప్రభుత్వం వాదించింది.
భారత ప్రభుత్వం ఇప్పుడు పాకిస్తాన్ దగ్గరున్న కశ్మీర్ కూడా భారత్‌లో విడదీయలేని భాగమేనని, చర్చలంటూ జరిగితే దాని గురించే అని చెబుతోంది.
కానీ దిల్లీలో మోదీ, అమిత్ షా ప్రభుత్వం ఉన్నంతవరకూ అలాంటివేం జరగవు అంటారు భరత్ భూషణ్.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఆగస్టు 31న అస్సాంలో ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల చేసింది. అందులో 19 లక్షల మంది పేర్లు ఉన్నాయి. అంటే ఆ 19 లక్షల మంది భారత పౌరులు కాకుండా పోయారు.
దీనిపై అస్సాంలో గందరగోళం తలెత్తింది. ఎన్ఆర్సీలోని ఈ 19 లక్షల మంది అక్రమ పౌరుల్లో దాదాపు 13 లక్షల మంది హిందువులు ఉన్నారు.
తర్వాత హిందువులను దేశం నుంచి పంపించి వేయడం ఉండదని కేంద్రం వారికి భరోసా ఇచ్చింది. కానీ అస్సాం ప్రజలు దీనికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రదర్శనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అయోధ్య ఆలయ నిర్మాణం
నవంబర్ 9న అయోధ్యలో రామమందిరం-బాబ్రీ మసీదు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది.
తీర్పు ప్రకారం ఆలయం నిర్మించడానికి మోదీ ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.
ముస్లిం పక్షాలకు మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
దశాబ్దాల నుంచీ నడిచిన ఈ వివాదాస్పద అంశానికి ఇలా తెరపడింది. ఈ తీర్పు మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
ఈ తీర్పు తర్వాత బీజేపీ ప్రభుత్వం మందిర నిర్మాణం హామీని పూర్తిచేసినట్టే కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
పౌరసత్వ సవరణ చట్టం
ఈ చట్టాన్ని ఆమోదించాక దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. రాష్ట్రాల్లో దీనిపై ఇప్పటికీ వ్యతిరేకతలు కొనసాగుతున్నాయి. ఈ చట్టాన్ని విమర్శించేవారు ఇది రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు. ముస్లిం సమాజంపై వివక్ష చూపుతున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ అంటున్నారు.
ముస్లిం సమాజం వీధుల్లోకి వచ్చింది. వారితోపాటు హిందూ, మిగతా సమాజాల వారు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇవి హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకూ 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిరసన ప్రదర్శనల సమయంలో ప్రభుత్వం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే ఎన్‌పీఆర్ అప్‌డేషన్, 2021 జనాభా లెక్కలు ప్రారంభించడానికి కూడా ఆమోదముద్ర వేసింది. దీనిపై కూడా వివాదాలు మొదలయ్యాయి. దేశమంతా ఎన్ఆర్సీ తీసుకురావడానికి దీనిని మొదటి చర్యగా కొంతమంది చెబుతున్నారు.
దిల్లీ విశ్వవిద్యాలయంలో ఒక నిరసన సభలో ప్రసంగించిన రచయిత అరుంధతి రాయ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)తో దేశ ముస్లింలను టార్గెట్ చేశారని ఆరోపించారు. కానీ హోంమంత్రి అమిత్ షా ఆ ఆరోపణలను తోసిపుచ్చారు.

ఫొటో సోర్స్, Nrc
మోదీ ప్రభుత్వం తన ఎజెండాను వదిలేస్తుందా?
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, రాజకీయ వ్యతిరేకతలతో ఏడాది ముగిసిపోతోంది.
కానీ మోదీ ప్రభుత్వం తన ఎజెండాను వదిలేస్తుందా? అనేదానిపై ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు.
2020లో ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్, మతపరివర్తనకు సంబంధించిన బిల్లులకు పార్లమెంటులో ఆమోదముద్ర వేయించే ప్రయత్నాలు చేయవచ్చని వీరేంద్ర నాథ్ భట్ భావిస్తున్నారు.
భట్‌తో పాటు మిగతా సీనియర్ రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఆర్థికవ్యవస్థ వచ్చే ఏడాది మోదీ ప్రభుత్వానికి అసలైన సవాలు విసరబోతోంది. వచ్చే ఏడాది రాజకీయాలను అదే నిర్వచిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- 2019లో సుప్రీం కోర్టు వెల్లడించిన సంచలన తీర్పులు
- కర్ణాటకలో పోలీసు కాల్పుల మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున తృణమూల్ కాంగ్రెస్ సాయం
- CAA నిరసనలు: "పశువులకు గడ్డికోసం వెళ్లిన మా అబ్బాయిని పోలీసులు చంపేశారు" - గ్రౌండ్ రిపోర్ట్
- ప్రియాంకా గాంధీ: 'ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు నా గొంతు పట్టుకున్నారు.. నాతో గొడవపడ్డారు'
- మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2020లో ఎలా ఉంటుంది? సవాళ్లకు పరిష్కారం లభిస్తుందా?
- CAA-NRC: ‘మేము 'బై చాన్స్' ఇండియన్స్ కాదు, 'బై చాయిస్’ ఇండియన్స్’ - మౌలానా మహమూద్ మదనీ
- అస్సాం డిటెన్షన్ కేంద్రాలు: నరేంద్ర మోదీ చెప్పింది నిజమా.. కాదా..
- ‘పోలీసులకు కనిపించకుండా లైట్లన్నీ ఆపేసి దాక్కున్నాం. ఎలాగోలా ఆ రాత్రి గడిచి బతికి బయటపడ్డాం’
- NPR: రూ.3941.35 కోట్లతో జాతీయ జనాభా జాబితాకు మోదీ క్యాబినెట్ ఆమోదం
- ‘పాకిస్తాన్‌లో ఉండే హిందూ, సిక్కు సోదరులు ఎప్పుడు భారత్ రావాలనుకున్నా, వారికి స్వాగతం’ అని గాంధీ అన్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









