ముజఫర్‌నగర్‌లో ముస్లింల ఇళ్లపై దాడి చేసింది ఎవరు? పోలీసులు ఏమంటున్నారు?

- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చలికి తట్టుకోలేక రగ్గు కప్పుకున్న హాజీ అన్వర్ ఇలాహి తన ఇంట్లో చిందరవందరగా పడి ఉన్న సామాన్లను చూసి ఎంతో వేదనతో ఊగిపోతున్నారు. ఆయన కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు భయభ్రాంతులకు లోనై పక్కనే ఉన్న పడకమంచంపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
ముజఫర్‌నగర్‌లో హోల్‌సేల్ చెప్పుల దుకాణం నడిపే 73 ఏళ్ల ఇలాహి భయం గుప్పిట్లో గడిపిన గత శుక్రవారం రాత్రిని గుర్తు తెచ్చుకుంటూ... "కొంతమంది టోపీలు పెట్టుకుని ఉన్నారు. కొంతమంది యూనిఫామ్‌లో ఉన్నారు. వాళ్లందరూ వచ్చి ఇంట్లో ఉన్నవాళ్లని చితక్కొట్టడం మొదలుపెట్టారు" అని అన్నారు.
హాజీ ఇలాహి ఒక వికలాంగుడు. "ఒకతను నన్ను కర్రతో కొట్టడంతో నేను నేలపై పడిపోయాను. అప్పుడు పక్కనుంచి ఎవరో వచ్చి ఇతన్ని కొట్టొద్దు అని చెప్పారు" అని ఇలాహి చెప్పుకొచ్చారు.
ముజఫర్‌నగర్‌లోకి ప్రవేశించిన వెంటనే మీనాక్షి చౌక్ ఎదురవుతుంది.
ఆ చుట్టుపక్కల ముస్లిం కుటుంబాలు నివసిస్తుంటాయి. హాజీ అన్వర్ ఇలాహి ఇల్లు కూడా అక్కడే ఉంది.
గత శుక్రవారం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ పెద్ద ప్రదర్శన చేపట్టారు. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఈ ప్రదర్శన హింసాత్మకంగా మారింది.

ఈ హింసలో నిరసనకారులు, పోలీసులు ప్రధాన పాత్ర పోషించారు.
తనకు కూడా ఒక బుల్లెట్ తగిలిందని ముజఫర్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్ సత్పాల్ అంతిల్ చెప్పారు.
సోమవారానికి మొత్తం 48 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి 12 గంటలకి ఒక పెద్ద గుంపు ఈ వీధుల్లోకి వచ్చి ఇలాహి పక్కింటి వారి ఇళ్లలోకి దూరి సామాన్లు ధ్వంసం చేయడం మొదలుపెట్టారు.
ఇలాహి ఇంటిపై దాడి చేసినవారే ఆయన్ని ఎత్తుకుని ఎక్కడికో తీసుకెళ్లారు. మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారు అని నేను అడిగితే... "పోలీసులే తీసుకెళ్లారు, టోపీలు పెట్టుకుని ఉన్నారు. నన్ను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే నాలాంటి వారు చాలా మంది ఉన్నారు. వారందరినీ పోలీసులు కొడుతుంటే వారి అరుపులు బయటకి చాలా గట్టిగా వినిపించాయి" అని ఇలాహి చెప్పారు.
మరుసటిరోజు సాయంత్రం ఇలాహి బంధువు వచ్చి ఆయన్ని విడిపించుకుని వెళ్లారు.
"నన్ను బయటకు వదిలేముందు హిందీలో రాసి ఉన్న ఏదో ఒక పత్రం తీసుకొచ్చి దానిపై మాతో సంతకాలు పెట్టించుకున్నారు".


సోమవారంనాడు ఇలాహి ఇంటికి మేము వెళ్లే సమయానికి వారి ఇంటి బయట ఒక కారు, ఇంటి లోపల సామాన్లు ధ్వంసమై ఉన్నాయి.
వారి మూడుగదుల ఇంట్లో ఎక్కడ చూసినా విరిగిపోయిన గాజు ముక్కలు కనిపించాయి. వంటగదిలో ఫ్రిడ్జ్, ఇతర సామాన్లు కిందపడి ఉన్నాయి.
మేము ఇలాహి ఇంటికి వెళ్లే సమయానికి వారి ఇంట్లో ఆయనతోపాటు ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.
వారిలో ఒక మహిళ... "మా ఇల్లంతా ఎందుకు ధ్వంసం చేస్తున్నారని అడిగితే ఒకతను.. ‘వెళ్లి నీ గదిలో కూర్చో’ అని నాకు చెప్పాడు. మొన్ననే మా ఇంట్లో పెళ్లి జరిగింది. ఇంట్లో ఉన్న 3 లక్షల రూపాయల విలువైన నగలు అతను తీసుకెళ్ళిపోయాడు" అని ఆవిడ వాపోయింది.
ఈ ప్రాంతంలో చాలా ఇళ్లలో ఇదే జరిగింది. ఒకరి ఇంట్లో అయితే, ఇంట్లో ఉన్న సామాన్లు అన్నింటినీ ధ్వంసం చేశారు. అలాగే ఈ వీధిలోని ఒక మసీదు ముఖద్వారానికి ఉన్న అద్దాన్ని కూడా పగులగొట్టారు.

దగ్గర్లో ఉన్న ఒక దుకాణదారుడు మాకొక సీసీటీవీ వీడియో చూపించాడు. అందులో యూనిఫామ్‌లో ఉన్న పోలీసులు లాఠీలతో కార్లను ధ్వంసం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. సీసీటీవీ కెమెరాను విరక్కొట్టడంతో సగంలోనే ఆ వీడియో ఆగిపోయింది.
ఇక్కడ జనం చాలా భయపడుతున్నారు. ఒక మహిళ అయితే మాతో మాట్లాడడానికి నిరాకరించింది.
ఒక వ్యక్తిని పోలీసులు కొట్టారని మాకు తెలిసిన వెంటనే ఆయనతో మాట్లాడడానికి మేం ఆయన ఇంటికి వెళ్ళాం.
చాలా ఇళ్లలో మగవారు ఉన్నారు, కానీ ఎవరూ మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. అందరూ భయపడుతూ ఇంట్లోనే కూర్చున్నారు.
అక్కడ భయం ఎంత ఎక్కువగా ఉందంటే... అద్నాన్ అలీ అనే ఒక యువ లాయర్ మాకు వీడియో ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆయన ముఖం స్పష్టంగా చూపించకూడదని షరతు పెట్టారు. ఆ రోజు రాత్రి జరిగిన ఘటనలను మాకు ఇలా వివరించడం మొదలుపెట్టారు.
"బయట ఒక పెద్ద గుంపు గుమిగూడింది. అప్పటికే బయట ఇళ్లలోంచి ఆడవాళ్ల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ గుంపులో జనాలు పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఉన్నారు. కానీ వారు పోలీసులో కాదో నాకు తెలీదు. వాళ్లు నవ్వుతూ 'మీకు స్వతంత్రం కావాలని అరుస్తున్నారు కదా. ఇదిగో తీస్కోండి మీ స్వత్రంత్రం' అని ఎగతాళి చేశారు."


ఈ మొత్తం కథలో అసలు ఆ గుంపులో ఎవరున్నారన్నదే ప్రధాన ప్రశ్న.
ఈ ప్రాంతవాసులు చెబుతున్న దాని ప్రకారం ఆ గుంపులో ఎక్కువగా బయటివారే కనిపించారు. కానీ, అందులో కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు.
జిల్లా ఎస్పీ కథనం ప్రకారం ఇళ్లలో దూరి సామాన్లు ధ్వంసం చేసినట్లు పోలీసులకు ఇంకా ఫిర్యాదు రాలేదు.
"మాకు ఫిర్యాదు వస్తే కచ్చితంగా నిందితులను పట్టుకుని విచారిస్తాం'’ అని వారు అంటున్నారు.
ఈ నిందితులలో పోలీసులు కూడా ఉన్నారని నేను అంటే వారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.
ఈ ఘటనలో ప్రధాన పాత్రధారులెవరో ఆయన సూచనప్రాయంగా చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం చాలా చోట్ల నుంచి జనాలు మీనాక్షి చౌక్ దగ్గరకు చేరుకున్నారు.
"అందరినీ చెదరగొట్టడంతో వాళ్లంతా పక్కనే ఉన్న వీధుల్లోకి పారిపోవడం మొదలుపెట్టారు. బాగా రాత్రి అయ్యేంతవరకు ఇలానే నడిచింది."
ప్రదర్శనకి లక్షమందికి పైగా హాజరయ్యారు. "మీనాక్షి చౌక్ ప్రదర్శనలకు ఒక కంచు కోటగా మారింది" అని ఆయన అన్నారు.

ఈ వీధుల్లో ఇళ్లు ఉన్నవాళ్లకి మెయిన్ రోడ్డులో దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న 50కు పైగా దుకాణాలను జిల్లా అధికార యంత్రాంగం సీల్ చేసింది.
అసలు ఈ దుకాణాలను ఎందుకు మూసేశారో ఇప్పటికీ సరైన కారణాన్ని అధికారులు చెప్పలేదు.
ఈ దుకాణదారులు ప్రదర్శనలో పాల్గొన్నారనే కారణంతోనే వారి దుకాణాలను సీజ్ చేశారని స్థానికులు అంటున్నారు.
గత శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు.
కొన్ని ప్రాంతాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటి వరకూ 18 మంది చనిపోయారు. మరెంతో మందికి గాయాలయ్యాయి. చాలామందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, ఈ ప్రాంతంలో పరిస్థితులు ఇప్పుడు అదుపులోనే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమా?
- అమెజాన్‌కు లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి?
- జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?
- అమిత్ షా: ‘NRCకి NPRకి సంబంధం లేదు.. రెండూ వేర్వేరు.. దీనివల్ల ఏ ఒక్క మైనార్టీ పౌరసత్వం రద్దు కాదు’
- ఐసిస్: 'ఇరాక్‌లో మళ్లీ బలపడుతున్న మిలిటెంట్లు'
- "నమాజ్ చేసి బయటకు వస్తుంటే పోలీసులు లాఠీచార్జి చేసి, కాల్పులు జరిపారు"
- ‘పోలీసులకు కనిపించకుండా లైట్లన్నీ ఆపేసి దాక్కున్నాం. ఎలాగోలా ఆ రాత్రి గడిచి బతికి బయటపడ్డాం’
- అస్సాం డిటెన్షన్ కేంద్రాలు: నరేంద్ర మోదీ చెప్పింది నిజమా.. కాదా..
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- మార్కెట్లోకి ఏడాది పాటు నిల్వ ఉండే కొత్త రకం ఆపిల్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









