అమిత్ షా: ‘NRCకి NPRకి సంబంధం లేదు.. రెండూ వేర్వేరు.. దీనివల్ల ఏ ఒక్క మైనార్టీ పౌరసత్వం రద్దు కాదు’

ఫొటో సోర్స్, ANI
జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్ఆర్‌సీ)కి, జాతీయ జనాభా జాబితా (ఎన్‌పీఆర్)కు మధ్య ఎలాంటి బంధం (లింక్) లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఎన్‌పీఆర్ కారణంగా ఏ ఒక్కరి పౌరసత్వం రద్దు కాదని, ఒక్క మైనార్టీ పౌరుడి పౌరసత్వం కూడా దీనివల్ల వెనక్కు తీసుకోవడం జరగదని చెప్పారు.
దేశవ్యాప్తంగా జాతీయ జనాభా జాబితా (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్)ను నవీకరించేందుకు కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏఎన్ఐ వార్తా సంస్థకు అమిత్ షా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలుపై ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిందే వాస్తవమని, దీనిపై క్యాబినెట్‌లో కానీ, పార్లమెంటులో కానీ ఎలాంటి చర్చా లేదని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సీఏఏపై అసదుద్దీన్ ఒవైసీ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. తమ వైఖరిని అసదుద్దీన్ ఎప్పుడూ వ్యతిరేకిస్తుంటారని, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని తాము చెబితే.. కాదు పశ్చిమాన ఉదయిస్తాడని ఒవైసీ అంటారని అమిత్ షా ఆరోపించారు. ఎన్‌ఆర్‌సీతో సీఏఏకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి ఆయనకు హామీ ఇవ్వదల్చుకున్నానని తెలిపారు.
ఒకవేళ ఎన్‌పీఆర్‌లో ఎవరి పేర్లు అయినా గల్లంతైనా.. వారి పౌరసత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదని అమిత్ షా వివరణ ఇచ్చారు.
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్)ను అమలు చేయబోమని కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు చేసిన ప్రకటనలపై స్పందిస్తూ.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తాను మరొకసారి వినయంతో అభ్యర్థిస్తున్నానని.. అలాంటి చర్యలు తీసుకోవద్దని, ఎన్‌పీఆర్‌ను అమలు చేయబోమన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ‘కేవలం మీ రాజకీయాల కోసం పేదలను అభివృద్ధి కార్యక్రమాలనుంచి దూరం పెట్టకండి’ అని అమిత్ షా కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి అన్నారు.

ఫొటో సోర్స్, ANI
జాతీయ జనాభా జాబితా నవీకరణకు రూ.3941.35 కోట్లు - కేంద్ర క్యాబినెట్ ఆమోదం
దేశవ్యాప్తంగా జాతీయ జనాభా జాబితా (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్)ను నవీకరించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు. అస్సాం మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్‌పీఆర్ కసరత్తు జరుగుతుందని వెల్లడించారు.
మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకాశ్ జావడేకర్ మీడియాకు వివరించారు.
ప్రజలపై తమకు నమ్మకం ఉందని, కాబట్టి ఈ జనాభా రిజిస్టర్‌కు ఎలాంటి డాక్యుమెంట్లు చూపించాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజల నుంచి ఎలాంటి ఆధారాలూ స్వీకరించడం లేదని, బయోమెట్రిక్ కూడా తీసుకోవడం లేదన్నారు.
దీన్ని చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయని, నోటిఫికేషన్ కూడా జారీ చేశాయని, ఆయా రాష్ట్రాల అధికారులకు శిక్షణ కూడా ఇస్తున్నాయని ఆయన తెలిపారు.
జాతీయ జనాభా జాబితాను 2010లోనే తొలిసారి ప్రవేశపెట్టారని, అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొలి కార్డును జారీ చేశారని తెలిపారు. యుపీఏ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్నైతే మొదలు పెట్టిందో దానినే తాము కొనసాగిస్తున్నామని, ప్రతి పదేళ్లకు ఒకసారి దీనిని కొనసాగించాల్సి ఉంటుందన్నారు.
భారతదేశంలో జీవించే ప్రజలందరి జాబితాను రూపొందించేందుకే దీనిని నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రబుత్వ పథకాలను అర్హులైన వారికి అందించడమే దీని లక్ష్యమన్నారు.
భారతదేశ జనగణన, జాతీయ జనాభా జాబితా నవీకరణ రెండూ ఒకేసారి జరుగుతాయని జావడేకర్ తెలిపారు. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయన్నారు.
జన గణనకు రూ.8,754.23 కోట్లు, జాతీయ జనాభా జాబితా నవీకరణకు రూ.3,941.35 కోట్లు మంజూరు చేసేందుకు క్యాబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు.
ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జన గణన స్వతంత్ర్యం లభించిన తర్వాత ఇప్పటి వరకూ 7 సార్లు జరిగిందని, 2021లో జరగబోయేది 8వ సారని ఆయన తెలిపారు.
ఎన్నార్సీకి, ఎన్‌పీఆర్‌కీ సంబంధం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా జావడేకర్ చెప్పారు. ఎన్నార్సీ అనేది పౌరసత్వానికి సంబంధించినది అయితే, ఎన్‌పీఆర్ జనాభా జాబితా తయారీకి సంబంధించినదని ఆయన చెప్పారు.
జన గణన, జాతీయ జనాభా జాబితా తయారీ ఇలా..
2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ భారత జన గణన, జాతీయ జనాభా జాబితా నవీకరణ కోసం గృహాల నమోదు ప్రక్రియ జరుగుతుంది. (ఎన్‌పీఆర్ అస్సాంలో జరగదు)
2021 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జనాభా గణన జరుగుతుంది.
ఈ ప్రక్రియలో 30 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గోనున్నారు. 2011లో ఈ పని 28 లక్షల మంది చేశారు.
2011లో జన గణన ప్రాథమిక నివేదిక 2016లో విడుదలైందని, తుది నివేదికపై ఇంకా కసరత్తు జరుగుతోందని జడేకర్ చెప్పారు. ఈ సమయాభావాన్ని తగ్గించేందుకు ఈసారి జనగణన, ఎన్‌పీఆర్‌ల తయారీకి తొలిసారిగా ఒక యాప్‌ను, వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నాయని ఆయన వెల్లడించారు.
ప్రజలు తమంతట తాముగా జన గణన ప్రక్రియలో తమ వివరాలను నమోదు చేయవచ్చునని ఆయన తెలిపారు.
1872లో మొదలైన జన గణన
భారత దేశంలో జన గణన 1872లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది.
చివరిసారిగా దేశంలో 2011లో జన గణన జరిగింది. మొత్తంగా చూస్తే అది 15వ జన గణన, స్వతంత్ర్యం తర్వాత అయితే 7వ జన గణన.
గ్రామం, పట్టణం, నగరాల్లో క్షేత్రస్థాయి నుంచి గృహాలు, మౌలిక సదుపాయాలు, ప్రాంతం, మతం, కులం, భాష, అక్షరాస్యత, విద్య, ఆర్థిక పరిస్థితి, వలస సమాచారంతో పాటు సంతానోత్పత్తిపై కూడా సమాచారం సేకరిస్తారు.
జాతీయ జనాభా జాబితా తయారీ ప్రక్రియ 2010లో ప్రారంభమైంది. 2015లో ఈ జాబితాను ఆధార్‌తో అనుసంధానించి, తాజా సమాచారాన్ని జోడించారు.
ఇవి కూడా చదవండి:
- ‘పాకిస్తాన్లో ఉండే హిందూ, సిక్కు సోదరులు ఎప్పుడు భారత్ రావాలనుకున్నా, వారికి స్వాగతం’ అని గాంధీ అన్నారా?
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
- "ఈ దేశంలో పౌరులు కాదు, తమ ఓటర్లు మాత్రమే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది"
- సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని
- దిశ అత్యాచారం, హత్య నిందితుల రీ-పోస్ట్‌మార్టం: హైకోర్టుకు చేరిన ప్రాథమిక నివేదిక
- ‘పోలీసులకు కనిపించకుండా లైట్లన్నీ ఆపేసి దాక్కున్నాం. ఎలాగోలా ఆ రాత్రి గడిచి బతికి బయటపడ్డాం’
- అమెజాన్‌కు లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి?
- జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?
- అయిదు మైళ్ల అవతల పొరుగు దేశంలో ఉన్న భార్యను కలవాలని పన్నెండేళ్లు తపించాడు.. చివరకు నదిలో కొట్టుకొచ్చిన ఆమె శవాన్ని చూశాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








