దిశ అత్యాచారం, హత్య నిందితుల రీ-పోస్ట్‌మార్టం: హైకోర్టుకు చేరిన ప్రాథమిక నివేదిక

నాలుగు గంటలపైగా సమయం తీసుకుని రీ-పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, ప్రాథమిక నివేదికను ఎయిమ్స్ వైద్యులు హైకోర్టుకు అందచేశారు. దిల్లీ వెళ్లిన తర్వాత పూర్తి నివేదిక సిద్దం చేసి ఇస్తామని తెలిపారు.
'దిశ' అత్యాచారం, హత్య కేసులో నిందితుల మృతదేహాలకు సోమవారం రీ-పోస్ట్‌మార్టం పూర్తయింది. దిల్లీ ఎయిమ్స్ వైద్యులు నాలుగు మృతదేహాలకు నాలుగు గంటలకు పైగా రీ-పోస్ట్‌మార్టం నిర్వహించారు.
ఎయిమ్స్‌కి చెందిన ఫొరెన్సిక్ డాక్టర్లు ఈ రీ-పోస్ట్‌మార్టం నిర్వహించారు. రీ-పోస్ట్‌మార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు.
రీ-పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికను, సీడీని హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఎయిమ్స్ డాక్టర్లు సమర్పించారు.
హైకోర్టు ఆదేశాల ప్రకారం నాలుగు మృతదేహాలను సాయంత్రం ఐదు గంటల తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత ప్రత్యేక అంబులెన్సుల్లో మృతదేహాలను మహబూబ్‌నగర్‌కు తరలించారు.
హైకోర్టు ఆదేశాలతో రీ-పోస్ట్‌మార్టం
"హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలకు రీ-పోస్ట్‌మార్టం చేస్తున్నాం. దీనికోసం ఎయిమ్స్ నుంచి మొత్తం నలుగురు వైద్యుల బృందం వచ్చింది" అని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ సోమవారం నాడు చెప్పారు.
ముందుగా ఎయిమ్స్ వైద్యుల బృందం మృతుల బంధువులు, కుటుంబసభ్యులతో మాట్లాడిందని, వాళ్లు బాడీలను గుర్తించిన తర్వాతే పోస్ట్‌మార్టం ప్రారంభమైందని శ్రవణ్ తెలిపారు.
కోర్టు ఆదేశాల మేరకు ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ మొత్తాన్నీ వీడియో రికార్డింగ్ చేస్తున్నారని, అవన్నీ బయటకు వెల్లడించడం కుదరదని ఆయనన్నారు.
ప్రక్రియ పూర్తైన తర్వాత నివేదికలను సీడీ లేదా యూఎస్బీ డ్రైవ్ ద్వారా హైకోర్టుకు సమర్పిస్తామని చెప్పారు.
ఈ ప్రక్రియలో గాంధీ ఆస్పత్రి వైద్యులెవరూ పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.
ప్రత్యేక వైద్యుల బృందం అడిగిన పరికరాలను సమకూర్చామని, వాటితో పోస్ట్‌మార్టం జరుగుతోందని తెలిపారు.
మృతదేహాలు 50శాతం పైగా కుళ్లిపోయాయని ఆయన అన్నారు. చలికాలం కావడం వల్ల ఇలా అయినా ఉన్నాయని, వేసవికాలం అయితే మరింత కుళ్లిపోయి ఉండేవన్నారు.
గతంలో ఏం జరిగిందో తమకు తెలియదని, కోర్టు ఆదేశాలను అనుసరించి, నిబంధనల ప్రకారం ఇప్పుడు రీ-పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నామని శ్రవణ్ చెప్పారు.
కోర్టు ఏం చెప్పింది?
హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం హత్య కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ-పోస్ట్‌మార్టం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఈ ప్రక్రియను ముగించాలని తెలిపింది. ఈ కార్యక్రమం మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించాలని కూడా ఆదేశించింది.
మెడికల్ బోర్డ్ ఆఫ్ ఇండియా బృందం చేత మళ్లీ పోస్టుమార్టం జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచిస్తూ.. ఈ ప్రక్రియలో సేకరించే ఆధారాలను షీల్డు కవర్‌లో భద్రపరచి, తమకు అందజేయాలని తెలిపింది.
అదేవిధంగా.. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన బుల్లెట్లు, గన్‌లు, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక.. వీటన్నింటినీ భద్రపర్చాలని ఆదేశించింది.
రీ పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాలను పోలీసుల సమక్షంలో నిందితుల కుటుంబ సభ్యులకు అప్పగించాలని తెలిపింది.
'50 శాతం కుళ్లిపోయిన మృతదేహాలు'
నిందితుల మృతదేహాల 50 శాతం కుళ్లిపోయాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ తెలంగాణ హైకోర్టులో చెప్పారు.
డిసెంబర్ 6వ తేదీన సైబరాబాద్ పోలీసుల 'ఎన్‌కౌంటర్'లో చనిపోయిన ఈ నలుగురు నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ విచారణకు హాజరైన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్.. మృతదేహాలను 2 డిగ్రీల సెల్సీయస్ ఫ్రీజర్‌లో ఉంచామని తెలిపారు. అయితే, అవి ఇప్పుడు 50 శాతం కుళ్లిపోయాయని, మరో వారం, పది రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయని వివరించారు.దేశంలోని ఇతర ఆసుపత్రుల్లో మృతదేహాలను భద్రపరిచేందుకు అవకాశం ఉందా అని హైకోర్టు ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదని డాక్టర్ శ్రావణ్ సమాధానం చెప్పారు.
నిందితుల మృతదేహాలను డిసెంబర్ 9వ తేదీన గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు.
కాగా, నిందితుల మృతదేహాలకు ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో పోస్టుమార్టం నిర్వహించామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
ఈ ఫోరెన్సిక్ నిపుణుల బృందంలో గాంధీ మెడికల్ కాలేజీ హెచ్‌ఓడీ ఠాగూర్ కృపాల్ సింగ్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేందర్ ఉన్నారని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ వెల్లడించారు.
పోస్టుమార్టం రిపోర్ట్ ఉందా అని ఏజీని హైకోర్టు అడగ్గా.. ప్రస్తుతం లేదని ఏజీ సమాధానం ఇచ్చారు.
'రీ-పోస్ట్మార్టం చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలి'
రీ- పోస్ట్‌మార్టం పూర్తి చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న న్యాయవాది ప్రకాష్ రెడ్డి హైకోర్టును కోరారు.
అయితే, రీ-పోస్ట్‌మార్టం చేయాలని పిటిషనర్లు తమ పిటిషన్‌లో ఎక్కడా కొరలేదని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ చెప్పారు.
పిటిషనర్లు సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో రీ-పోస్ట్‌మార్టం కోరారని ప్రకాష్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇండిపెండెంట్ టీంతో రీ-పోస్ట్‌మార్టం నిర్వహించవచ్చునని వెల్లడించారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
అసలు కేసు ఏంటి?
పోలీసుల కథనం ప్రకారం.. నవంబర్ 27వ తేదీ రాత్రి శంషాబాద్ వద్ద దిశ (పోలీసులు పెట్టిన పేరు)ను లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేస్తున్న నలుగురు యువకులు కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేశారు. షాద్ నగర్ సమీపంలోని చటాన్‌పల్లి గ్రామ శివారు రోడ్డు వంతెన దగ్గర 28వ తేదీ తెల్లవారుజామున పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది.
డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ శివారులోని చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద 'ఎన్‌కౌంటర్'లో చనిపోయినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ చెప్పారు. సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నిందితులు దిశను దహనం చేసిన స్థలంలోకి తీసుకెళ్లగా, వారు తప్పించుకొని పోలీసులపై దాడి చేశారని, ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు.
ఈ 'ఎన్‌కౌంటర్'పై పలు మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు అదే రోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశాయి. కస్టడీలో ఉన్న నిందితులు పోలీసుల చేతుల్లో మరణించడంపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఫోరెన్సిక్ నిపుణుల చేత పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ ప్రక్రియను వీడియో తీయాలని విజ్ఞప్తి చేశాయి.
దీనికి హైకోర్టు స్పందిస్తూ.. వీడియో చిత్రీకరణతో పోస్టు మార్టం నిర్వహించాలని, ఆ వీడియోను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అందించాలని ఆదేశించింది. తదనంతర విచారణలో భాగంగా.. నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి, భద్రపర్చాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








