పౌరసత్వ సవరణ చట్టాన్ని తిరస్కరించే అధికారం రాష్ట్రాలకు ఉందా?

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పార్లమెంటు ఆమోదించినప్పటికీ ఈ చట్టాన్ని తాము అమలు చేయబోమని, దీన్ని అమలు చేయాలని రాష్ట్రాలను బీజేపీ అణచివేయలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు
    • రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పౌరసత్వ (సవరణ) చట్టం 2019ని అమలు చేయబోమని కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీశ్‌గఢ్ రాష్ట్రాలు ప్రకటించాయి. అసోంలో కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.

ఈ చట్టం అమలుకు సంబంధించి రాష్ట్రాల పాత్రపై చర్చించడానికంటే ముందు పౌరసత్వ (సవరణ) చట్టం 2019కి సంబంధించి కొన్ని విషయాలు.

  • పౌరసత్వం అనేది కేంద్ర జాబితాలోని అంశం. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే పార్లమెంటు ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారింది.
  • కేంద్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. పౌరసత్వం అనేది కేంద్ర జాబితాలోని అంశం కాబట్టి, ఈ చట్ట సవరణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. రాజ్యాంగంలోని ర్టికల్ 368(2) పరిధిలోకి రాని ఏ బిల్లుకూ రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. రాజ్యాంగంలోని ర్టికల్ 54, 55, 73, 162, 241, ఐదవ భాగంలోని చాప్టర్ 4, ఆరవ భాగంలోని చాప్టర్ 5, పదకొండవ భాగంలోని చాప్టర్ 1, ఏడవ షెడ్యూల్‌లోని జాబితాలను మార్చాల్సి వచ్చినప్పుడు, పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని మార్చాల్సి వచ్చినప్పుడు మాత్రం.. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించడానికంటే ముందే.. దేశంలోని కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాల్సి ఉంటుంది. అలా ఆమోదం పొందిన బిల్లులే చట్టం అవుతాయి.
  • ఈ చట్టం ప్రకారం భారతీయ పౌరసత్వం కోసం అర్హులైన వారు నేరుగా కేంద్ర హోం శాఖకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను పరిశీలించి, నిర్ణయం తీసుకునే బాధ్యత నేషనల్ రిజిస్ట్రేషన్ అథార్టీకి చెందిన నేషనల్ రిజిస్ట్రార్‌ది. రిజిస్ట్రార్‌కు సహకరించేందుకు అవసరమైన సిబ్బంది, అధికారులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.

''కేంద్ర జాబితాలోని చట్టాన్ని అమలును నిరాకరించడానికి రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేవు'' అని కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారి చెప్పారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

న్యాయ నిపుణులు సైతం కేంద్ర ప్రభుత్వ వాదన సరైనదేనని అంటున్నారు.

''రాజకీయ ప్రకటనలు వేరు. ఈ చట్టాన్ని అమలు చేయడం మినహా రాష్ట్రాలకు వేరే ప్రత్యామ్నాయం లేదు'' అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రామలింగేశ్వరరావు బీబీసీతో అన్నారు.

ఒకవేళ కేంద్ర చట్టాన్ని అమలు చేయకుండా రాష్ట్రాలు తిరస్కరిస్తే.. దానిని అమలు చేయాలని ఆదేశించే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 256 ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆ ఆదేశాలను కూడా రాష్ట్రాలు పాటించకపోతే? అప్పుడు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒక మార్గం కాగా, రాజ్యాంగ సూత్రాలను పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందుకు ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించడం మరొక మార్గం అని వారు వివరిస్తున్నారు.

అస్సాంలో నిరసనలు

ఫొటో సోర్స్, PTI

చట్టాన్ని అమలు చేయం అంటున్న రాష్ట్రాల ఉద్దేశం ఏంటి?

ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టాన్ని రూపొందించారని, ఇది రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాదం, సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు, బిల్లును వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు అంటున్నాయి.

ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ జైరామ్ రమేశ్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ బిల్లు కేంద్ర జాబితాలోనిదని, పౌరసత్వం జారీ చేసే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని తెలిసినప్పటికీ ఈ చట్టాన్ని అమలు చేయబోమని రాష్ట్రాలు అనడానికి కూడా సాధ్యాసాధ్యాలు ఉన్నాయి.

పేరు వెల్లడించడానికి ఇష్టపడని హోం శాఖ అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. పౌరసత్వం జారీ విషయంలో ఏమైనా వివాదం తలెత్తితే.. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. అలాంటప్పుడు తన పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఎవ్వరూ కేంద్రానికి సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వవచ్చు.

అలాగే, పౌరసత్వం పొందేందుకు అర్హత లేదని తేలిన వారిని దేశం నుంచి బయటకు పంపించేందుకు, లేదా ఏదైనా శిబిరాన్ని ఏర్పాటు చేసి అక్కడికి తరలించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం కేంద్రానికి అవసరం అవుతుంది. అప్పుడు కూడా రాష్ట్రాలు సహకరించకపోవచ్చు.

ఉదాహరణకు కేరళలో ఎవరైనా విదేశీయులు తలదాచుకుంటున్నప్పుడు, వారి పౌరసత్వాన్ని నిర్ధారించేందుకు, పౌరసత్వాన్ని నిరాకరించినప్పుడు వారిని దేశం నుంచి బయటకు పంపించేందుకు లేదా శిబిరానికి తరలించేందుకు కేరళలోని క్షేత్రస్థాయి అధికారుల సహకారం కేంద్ర ప్రభుత్వానికి అవసరం అవుతుంది. కేరళ ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రానికి సహాయ నిరాకరణ చేయవచ్చు.

అయితే, ఆయా రాష్ట్రాల్లో నివసిస్తున్న వసలదారులు ఎవరో చెప్పాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించవచ్చునని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. అసోంలో నేషనల్ రిజిస్ట్రర్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌సీ) అమలు సందర్భంగా.. ఆయా రాష్ట్రాల్లో నివసిస్తున్న అసోం పౌరులు ఎంతమందో చెప్పాలని అన్ని రాష్ట్రాలకూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను వారు గుర్తు చేస్తున్నారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ముస్లిం ముక్త్ భారత్‌ను ఎవరైనా ఏర్పాటు చేయాలనుకున్నా సాధ్యం కాదని అమిత్ షా చెప్పారు

పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

మత ప్రాతిపదికన పౌరసత్వం మంజూరు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.

లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన వలసదారుల పట్ల వివక్ష చూపడం రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21, 25, 26లను అతిక్రమిస్తోందని, రాజ్యాంగం ప్రసాదించిన కులం, రంగు, వర్గం, మతంతో సంబంధం లేకుండా చట్టం అందరినీ సమానంగా చూస్తుందన్న సమానత్వ హక్కును కాలరాస్తోందని తెలిపారు.

కాంగ్రెస్ ఎంపీలు చిదంబరం, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్‌లు సైతం రాజ్యసభలో చర్చ సందర్భంగా దాదాపు ఈ అంశాలనే ప్రస్తావించారు.

ఈ బిల్లుతో ముస్లిం ముక్త్ భారత్ (ముస్లింలు లేని భారతదేశం) ఏర్పాటవుతుందని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జావేద్ అలీ ఖాన్ అన్నారు.

బీజేపీ ఏమంటోంది?

భారతదేశ విభజన మతం ఆధారంగానే జరిగిందని, అప్పట్లో చేసిన తప్పిదాలను సరిదిద్దేందుకే తాము ఈ బిల్లును తీసుకురావాల్సి వచ్చిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటు ఉభయ సభల్లో చెప్పారు.

ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ముస్లిం ముక్త్ భారత్‌ను ఎవరైనా ఏర్పాటు చేయాలనుకున్నా సాధ్యం కాదని అమిత్ షా చెప్పారు.

'సమంజసమైన వర్గీకరణ' ఆధారంగా పార్లమెంటు చట్టాలు చేసేందుకు ఆర్టికల్ 14 అవకాశం కల్పిస్తోందని తెలిపారు.

ఆ సమంజసమైన వర్గీకరణ ఏంటంటే.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ దేశాలు ముస్లిం మత రాజ్యాలు, అక్కడ ఉన్న మైనార్టీలపై మత పరమైన ఒత్తిళ్లు ఉన్నాయి అని బీజేపీ చెబుతోంది.

దీనికి ఉదాహరణగా హోం మంత్రి అమిత్ షా ఆసియా బీబీ కేసును పార్లమెంటులో ఉదహరించారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పదికి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి

న్యాయ నిపుణులు ఏమంటున్నారు?

ఈ చట్టంలో 'విస్పష్టమైన వర్గీకరణ' ఉందని, దీని లక్ష్యాలు కూడా స్పష్టంగా ఉన్నాయని, కాబట్టి ఇది చెల్లుబాటు అవుతుందని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే ఇండియాటుడేతో చెప్పారు. అయితే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ దేశాల్లో మతపరమైన ఒత్తిళ్లకు లోనవుతున్న ఆరు మైనార్టీ మతాలకు చెందిన వారికి భారతీయ పౌరసత్వం ఇవ్వటం అనే బిల్లు ఉద్దేశాన్ని మరింత విస్తరించి, శ్రీలంక, బర్మా, ఆఫ్రికాల్లోని మతపరమైన మైనార్టీలకు కూడా ఈ సదుపాయం కల్పించి ఉండొచ్చు కదా అనేది విధానపరమైన విషయమని ఆయన చెప్పారు. భారతదేశం ఎన్ని దేశాల నుంచి వచ్చే వలసదారులకు ఆశ్రయం కల్పించాలి అనేది వేరే అంశమని తెలిపారు.

అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (మతం, వర్గం, కులం, లింగం, పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్ష చూపకుండా నిరోధించడం) భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుందని, పౌరసత్వ చట్టం వలసదారులకు వర్తిస్తుందని హరీశ్ సాల్వే చెప్పారు. వలసదారులు భారతీయ పౌరులు అయిన తర్వాతనే ఆర్టికల్ 15 వారికి వర్తిస్తుందని వెల్లడించారు.

ఆర్టికల్ 21 ప్రకారం.. ఏ వ్యక్తి ప్రాణాలనూ, వ్యక్తిగత స్వేచ్ఛనూ హరించకూడదు. (అయితే, చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా ఇలా చేసేందుకు మాత్రం మినహాయింపు ఉంటుంది.) దీనిపై సాల్వే స్పందిస్తూ.. ''ఇలాగైతే పౌరసత్వ చట్టం (1955)ను పూర్తిగా రద్దు చేయాలి. ఇరుగుపొరుగు దేశాల్లోని ముస్లింలు సహా అన్ని మతాల వారినీ అది నిరోధిస్తోంది'' అని సాల్వే అన్నారు.

''ఈ చట్టం విషయంలో ఆర్టికల్ 14, 21లను సుప్రీంకోర్టు ఎలా అన్వయిస్తుందో చూడాలి. భారతీయ పౌరసత్వం లేకుండా భారతదేశంలోకి వచ్చిన వాళ్లు, లేదా వచ్చే వారు తమ వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదు అంటే.. అప్పుడు ఆర్టికల్ 21 వర్తిస్తుందా? అన్నది స్పష్టంగా చెప్పలేం. దీనిపై వాదప్రతివాదాలు, చట్టం వర్తింపుపై న్యాయ అన్వయం అనేవి కూడా చూడాల్సి ఉంటుంది'' అని జస్టిస్ రామలింగేశ్వరరావు బీబీసీతో చెప్పారు.

పాకిస్తాన్ హిందూ శరణార్థులు
ఫొటో క్యాప్షన్, పౌరసత్వ సవరణ చట్టం ముస్లిం వలసదారుల్ని లక్ష్యంగా చేసుకుందని, హిందూ వలసదారులకు మేలు చేస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి

భారతదేశంలో ఉన్న శరణార్థులు ఎంతమంది?

ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర హోం శాఖ ప్రకటించిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ) జాబితా ప్రకారం అస్సాం రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల్లో 19 లక్షల మంది భారతీయులు కాదు. సింపుల్‌గా చెప్పాలంటే, ఎన్‌ఆర్‌సి అంటే... అస్సాంలో నివసిస్తున్న భారతీయ పౌరుల జాబితా అని అనుకోవచ్చు.

వారు కాకుండా.. 2014 డిసెంబర్ 31వ తేదీ నాటికి దేశంలో శరణార్థులుగా ఉన్న విదేశీయులు 2,89,394 మంది అని 2016 మార్చి 1వ తేదీన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వీరిలో అత్యధికంగా తమిళనాడులో 1,02,478 మంది ఉన్నారని, అత్యల్పంగా చండీగఢ్‌లో ఒక్కరు ఉన్నారని.. అస్సాంలో 13 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 358 మంది, తెలంగాణలో 210 మంది ఉన్నారని తెలిపారు. దేశాల వారీగా చూస్తే.. బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా 1,03,817 మంది, శ్రీలంక నుంచి 1,02467 మంది వచ్చారని, అత్యల్పంగా.. సింగపూర్, దక్షిణ కొరియాల నుంచి ఒక్కరు చొప్పున వచ్చారని వివరించారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వారు 8799 మంది కాగా, అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన వారు 3469 మంది. వీరిలో ఎంత మంది ఏ మతం వారు? అన్న వివరాలను హోం శాఖ వెల్లడించలేదు.

రాజకీయ ప్రభావం ఎంత?

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకూ ఒక్కరు కూడా రాష్ట్రం విడిచివెళ్లే పరిస్థితి రాదని ఆ పార్టీ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

‘‘వాళ్లు హిందువులు-ముస్లింలు, బెంగాలీలు-బెంగాలీయేతరులు, రాజ్‌బంగ్షీలు-కంటపురీల మధ్య శత్రుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు’’ అని బీజేపీ పేరు ఎత్తకుండా ఆమె ఆ పార్టీని విమర్శించారు.

బీజేపీ తన ఎన్నికల హామీల్లో దేశాన్ని అభివృద్ధి చేసే అంశాలను పేర్కొనకుండా.. దేశాన్ని విభజిస్తామని హామీ ఇచ్చిందని మమతా బెనర్జీ ఆరోపించారు.

‘‘పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ పౌరసత్వం ముస్లిం వలసదారులకు ఇస్తున్నారు తప్ప హిందూ వలసదారులకు ఇవ్వట్లేదని, ఈ చారిత్రక అన్యాయాన్ని తాము సరిదిద్దుతామని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతోంది. ఈ చట్టం, దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ తీసుకొస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలు, తదనంతర రాజకీయ పరిణామాలు బీజేపీకి లాభం చేకూర్చవచ్చు. పశ్చిమ బెంగాల్‌లోని 60 నియోజకవర్గాల్లో బీజేపీకి అనుకూలత లభించవచ్చు’’ అని ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)