పౌరసత్వ సవరణ బిల్లు: ఇతర దేశాల్లో మైనారిటీల గురించి భారత్ వాదనలో నిజమెంత? - Reality Check

ఫొటో సోర్స్, Getty Images
మూడు పొరుగుదేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు.. వారు ముస్లిమేతర మైనారిటీ సమూహాలకు చెందిన వారైతే భారత పౌరసత్వం అందిస్తామంటూ భారత ప్రభుత్వం ఒక వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టింది.
భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు.. తాము ముస్లిం మెజారిటీ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి వచ్చామని నిరూపించుకోగలిగితే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆ మూడు దేశాల్లో మైనారిటీలు తరిగిపోతున్నారని.. మత విశ్వాసం ప్రాతిపదికన వారు పీడనను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ చట్టం ఇతర మైనారిటీ సమూహాలకు పౌరసత్వం ఇవ్వజూపటం లేదు కనుక ఇది వివక్షాపూరితంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరి.. ఆ మూడు పొరుగు దేశాల్లో ముస్లిమేతరులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమిటి?
పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన పీడిత మైనారిటీల రక్షణే ఈ బిల్లు ఉద్దేశం.
ముస్లిమేతరులు ఎంతమంది ఉన్నారు?
పాకిస్తాన్‌లో ముస్లిమేతరుల జనాభా 1951 నుంచి తరిగిపోయిందని భారత హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు.
ఇది.. 1947లో ఉపఖండం విభజన అనంతరం పాకిస్తాన్ నుంచి ముస్లిమేతరులు వలస రావటం, భారత దేశం నుంచి ముస్లింలు పాకిస్తాన్‌కు వలసపోవటం తర్వాత విషయం.
పాకిస్తాన్‌లో 1951 నాటికి మిగిలివున్న 23 శాతం మైనారిటీ జనాభా.. ఆ తర్వాత దశాబ్దాల్లో పీడన కాలంగా కుంచించుకుపోయిందని అమిత్ షా ఉటంకిస్తున్నారు.
అయితే అమిత్ షా చెప్తున్న గణాంకాలు.. నేటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ (నాడు తూర్పు పాకిస్తాన్)ల గణాంకాలను తప్పుగా కలిపి చెప్పినట్లు కనిపిస్తోంది.
1951లో ప్రస్తుత పాకిస్తాన్ (అంతకుముందు పశ్చిమ పాకిస్తాన్)లో 1.5 శాతం నుంచి 2 శాతంగా ఉన్న హిందువుల సంఖ్య నిజానికి పెద్దగా మారలేదని జనాభా లెక్కలు చెప్తున్నాయి.
బంగ్లాదేశ్‌లో 1951లో 22 శాతం నుంచి 23 శాతంగా ఉన్న ముస్లిమేతర జనాభా 2011 నాటికి 8 శాతానికి పడిపోయిందని కూడా జనాభా లెక్కలు సూచిస్తున్నాయి.
కాబట్టి, బంగ్లాదేశ్‌లోని ముస్లిమేతరుల జనాభా గణనీయంగా పడిపోయింది కానీ, పాకిస్తాన్‌లో మైనారిటీ జనాభా అతి తక్కువగానూ, స్థిరంగానూ కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీల వంటి ఇతర ముస్లిమేతర మత మైనారిటీలు కూడా ఉన్నారు.
ఇక పాకిస్తాన్‌లో అహ్మదీలు కూడా ఉన్నారు. వీరిని 1970లలో ముస్లిమేతరులుగా ప్రకటించారు. దాదాపు 40 లక్షల మంది ఉన్న ఈ జనాభా దేశంలో అతి పెద్ద మత మైనారిటీ సమూహం.
అఫ్ఘానిస్తాన్‌లో ముస్లిమేతర సమూహాల్లో హిందువులు, సిక్కులు, బహాయీలు, క్రైస్తవులు ఉన్నారు. వీరందరూ కలిపి జనాభాలో 0.3 శాతం కన్నా తక్కువే ఉంటారు.
అమెరికా విదేశాంగ శాఖ నివేదిక ప్రకారం.. 2018లో అఫ్ఘానిస్తాన్‌లో మిగిలివున్న సిక్కులు, హిందువుల సంఖ్య కేవలం 700 మాత్రమే. ఎందుకంటే దేశంలో అంతర్గత సంక్షోభం కారణంగా చాలా కుటుంబాలు ఆ దేశాన్ని వీడి వెళుతున్నాయి.
ముస్లిమేతరుల అధికారిక హోదా ఏమిటి?
''పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌ల రాజ్యాంగాలు ఒక నిర్దిష్ట రాజ్య మతాన్ని ప్రకటించాయి. దాని ఫలితంగా హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ సమూహాలకు చెందిన చాలా మంది వ్యక్తులు ఆ దేశాల్లో మత ప్రాతిపదికన పీడనను ఎదుర్కొన్నారు'' అని భారత ప్రభుత్వ పౌరసత్వ బిల్లు చెప్తోంది.
పాకిస్తాన్ రాజ్య మతం ఇస్లాం అనేది నిజం. అఫ్ఘానిస్తాన్ కూడా ఇస్లామిక్ దేశమే.
బంగ్లాదేశ్‌లో పరిస్థితి మరింత సంక్లిష్టమైనది. ఆ దేశం 1971లో ఒక లౌకిక రాజ్యాంగంతో ఏర్పడింది. కానీ 1988లో ఇస్లాం మతాన్ని అధికారిక రాజ్య మతంగా చేశారు.
ఆ మార్పును రద్దు చేయటానికి సుదీర్ఘంగా జరిగిన న్యాయ పోరాటం.. రాజ్య మతంగా ఇస్లాం కొనసాగాలని బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం 2016లో తీర్పు చెప్పటంతో ముగిసింది.
అయితే.. ఈ దేశాలన్నిటిలో కూడా ముస్లిమేతరులకు హక్కులు ఉన్నాయని, వారి మతాన్ని ఆచరించే స్వేచ్ఛ వారికి ఉందని రాజ్యాంగంలో పొందుపరిచాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హిందూ వ్యక్తులు ప్రముఖ పదవులు చేపట్టారు. ముఖ్యంగా రెండు దేశాల్లోనూ హిందూ వ్యక్తులు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు.
మైనారిటీలు వివక్ష ఎదుర్కొంటున్నారా?
ఆచరణలో ముస్లిమేతర మైనారిటీలు నిజంగానే వివక్ష, పీడన ఎదుర్కొంటున్నారు.
హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్.. పాకిస్తాన్‌లో మత దూషణ చట్టాలను ఉటంకిస్తూ.. ''వాటిని అస్పష్టంగా రూపొందించారు... ఆ చట్టాలను మతపరంగా మైనారిటీలను వేధించే, పీడించే విధంగా పోలీసులు, న్యాయవ్యవస్థ ఏకపక్షంగా అమలు చేస్తున్నాయి'' అని చెబుతోంది.

ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశానికి వలస వచ్చిన పాకిస్తానీ హిందువులు.. తాము సామాజిక, మత వివక్షను ఎదుర్కొంటామని బీబీసీకి చెప్పారు. ప్రత్యేకించి సింధ్ ప్రావిన్స్‌లో హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకోవటం ప్రధాన సమస్యగా పేర్కొన్నారు.
కానీ, భారత పౌరసత్వ బిల్లులో చోటు లేని అహ్మదీలు సైతం తమ విశ్వాసాల కారణంగా వివక్షను ఎదుర్కొంటున్నారనేది కూడా నిజం. దేశంలోని మెజారిటీ ముస్లింలు వీరిని మతభ్రష్టులుగా పరిగణిస్తారు.
అంతేకాదు, 2018 వరకూ మత దూషణ కేసులు అత్యధికంగా నమోదైంది ఇతర ముస్లింలు, అహ్మదీల మీదే... క్రైస్తవులు, హిందువుల మీద కాదు.
ఇక బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా నిష్పత్తి ఇన్నేళ్లలో పడిపోవటానికి పలు కారణాలు ఉన్నాయి.
సంపన్న హిందూ జనాభాకు చెందిన ఇళ్లు, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకునేవారు. కొన్నిసార్లు.. వారిని వెళ్లగొట్టటం ద్వారా వారి భూములు, ఆస్తులను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇలా జరిగేది. హిందువులు లక్ష్యంగా మతపరమైన తీవ్రవాదుల దాడులు కూడా జరిగాయి.
మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న భారతదేశ వాదనలను బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. ''ఈ దేశంలో మైనారిటీలను పీడించిన ఉదాహరణలు లేవు'' అని విదేశాంగ మంత్రి అబ్దుల్ మెమన్ బీబీసీతో పేర్కొన్నారు.
అయితే, భారతదేశంలో శరణార్థుల సంఖ్య 2016-19 మధ్య 17 శాతం మేర పెరిగిందని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చూపుతున్నాయి.
ఈ ఏడాది ఆగస్టు నాటికి ఐక్యరాజ్య సమితి శరణార్థి విభాగంలో నమోదు చేసుకున్న వారిలో అత్యధికులు టిబెట్, శ్రీలంకల నుంచి ఉన్నారు.

ఇవి కూడా చదవండి:
- ఆసిఫాబాద్ మహిళ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు.. నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- ‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’
- బాలికపై అత్యాచారం: డబ్బు కోసం కూతురిని రెండేళ్ళుగా రేప్ చేయించిన తండ్రి
- కశ్మీర్ వేర్పాటువాది మక్బూల్ భట్: ఒక వ్యక్తిని ఉరి తీసి, జైలులోనే ఖననం చేయడం తీహార్ జైలు చరిత్రలో అదే తొలిసారి
- పానిపట్ సినిమా వివాదం: 'అతడి నీడ పడిన చోట మృత్యువు కాటేస్తుంది'
- పాకిస్తాన్ థార్ ఎడారి: ఇక్కడ ఆవుల బలిదానం ఉండదు, గోమాంసం విక్రయించరు
- ‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ ప్రస్తావన ఎందుకు వస్తోంది... మతం ప్రధానాంశంగా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








