పాకిస్తాన్ థార్ ఎడారి: ఇక్కడ ఆవుల బలిదానం ఉండదు, గోమాంసం విక్రయించరు

పాకిస్తాన్ థార్ ఎడారి
    • రచయిత, రియాజ్ సొహైల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దొంగతనం భయం లేదు, దోపిడీల చింత లేదు. పర్యావరణం కలుషితం అవుతుందనే దిగుల్లేదు. అక్కడకు వెళ్లిన వారికి తాము పరాయివాళ్లమని కూడా అనిపించడం లేదు.

ఇదే పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న థార్ ఎడారి. ఇక్కడ సంస్కృతి, సంప్రదాయం, విలువలు ఇప్పటికీ తమ అసలు రూపంలోనే ఉంటాయి.

ప్రపంచంలోని పెద్ద ఎడారుల్లో థార్ ఒకటి. దీనిని ఫ్రెండ్లీ డెజర్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే మిగతా ఎడారులతో పోలిస్తే ఇక్కడకు చేరుకోవడం చాలా సులభం.

థార్ ఎడారి

కరాచీ నుంచి మఠీ

థార్ జిల్లా హెడ్ క్వార్టర్ మఠీ. ఒక మహిళ పేరుమీద ఈ నగరం వెలిసిందని చెబుతారు.

ఇక్కడ మఠా అనే ఒక మహిళ బావి ఉండేదని, ఎడారిలో ప్రయాణించేవారు ఆ బావిలోని నీటితో దాహం తీర్చుకునేవారని, అందుకే నగరానికి మఠీ అనే పేరు వచ్చిందని అంటారు.

మఠీ వెళ్లడానికి ఉమర్‌కోట్, మీర్‌పూర్ ఖాస్, బదీన్ నుంచి రహదారులు ఉన్నాయి.

పాకిస్తాన్ థార్ ఎడారి

ప్రస్తుతం ఇక్కడ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి జరుగుతోంది. దాంతో ఇక్కడకు చేరుకోవడం చాలా సులభం అవుతోంది.

జాతీయ రహదారిపై ప్రయాణిస్తే మక్లి నుంచి సజావల్, అక్కడి నుంచి బదీన్ తర్వాత అక్కడి నుంచి థార్ సరిహద్దులోకి ప్రవేశించవచ్చు.

థార్‌లో రహదారులు చాలా బాగుంటాయి. చిన్నాపెద్ద పట్టణాలకు ఇక్కడి నుంచి బైపాస్‌ రోడ్లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా కరాచీ నుంచి మఠీకి ఐదారు గంటల్లో చేరుకోవచ్చు.

థార్ ఎడారి

హిందూ ముస్లిం సోదరభావం

థార్ ఎడారిలో హిందూ, ముస్లింలు శతాబ్దాల నుంచి కలిసే ఉంటున్నారు. ఒకసారి ముస్లింలు, ఇంకోసారి హిందువులు అధికారంలో ఉంటారు.

ఈద్, హోళీ, దసరా, ముహర్రం లాంటి పండుగలు, పవిత్ర దినాలను రెండు మతాల వారూ కలిసి జరుపుకుంటూ ఉంటారు.

నగరంలో పదికి పైగా దర్గాలు ఉన్నాయి. వీటిని హిందువులే నిర్వహిస్తున్నారు. మఠీలో గోవులను వధించరు. గోమాంసం విక్రయించడం ఉండదు.

థార్ ఎడారి

గడీ భట్

మఠీ నగరం ఇసుక దిబ్బల మధ్య ఉంటుంది. దీని జనాభా ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఇక్కడ అత్యంత పెద్ద ఇసుక దిబ్బను గడీ భట్ అంటారు. ఇక్కడ ఒక తిన్నె కూడా నిర్మించారు.

ఇక్కడ తాల్పూర్ రాజుల కాలం నాటి ఒక చెక్‌పోస్ట్ కూడా ఉంది. అది కాలక్రమేణా శిథిలమయ్యింది.

ఒకప్పుడు గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చే విదేశీ ఆక్రమణదారులు, బందిపోట్లపై నిఘా పెట్టడానికి ఈ చెక్‌పోస్టును నిర్మించారు.

పాకిస్తాన్ థార్ ఎడారి

ఫొటో సోర్స్, BBC Sport

ఇసుక దిబ్బల వెనుక సూర్యుడు అస్తమించగానే, నగరం విద్యుద్దీపాల కాంతుల్లో వెలిగిపోతుంది. రాగి పళ్లెంలో ఎవరో దీపాలు వెలిగించినట్లు ఉంటుంది.

అందమైన ఆకాశం ఆ దృశ్యాన్ని మరింత అందంగా మార్చేస్తుంది.

పాకిస్తాన్ థార్ ఎడారి

సంస్కృతి సంగీతం కలయిక

థార్ హస్తకళలు కరాచీ, ఇస్లామాబాద్ సహా దేశంలోని చాలా పెద్ద నగరాల్లో లభిస్తాయి. వీటిలో సంప్రదాయ దుస్తులు, శాలువాలు, లెటర్ బాక్సులు, వాల్ పెయింటింగ్స్ ఉంటాయి.

కొన్ని డిజైన్లను బట్టలపై ఇప్పటికీ అద్దకం ద్వారా ముద్రిస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికీ మగ్గంపై నేస్తుంటారు. మెషీన్లతో తయారైన బట్ట కంటే ఇవి గట్టిగా ఉంటాయి.

పాకిస్తాన్ థార్ ఎడారి

మార్వాడీ గీతాలు పాడే మాయీ భాగీతోపాటు ప్రముఖ గాయకులు ఆరిబ్ ఫకీర్, సాదిక్ ఫకీర్, ప్రస్తుత కరీమ్ ఫకీర్ ఇక్కడ సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

మాంగణహార్ వంశానికి చందిన ఈ గాయకుల స్థానిక భాష ఢాట్కీ, వీరు సింధీ, ఉర్దూలో పాడుతుంటారు.

పాటలు, సంగీతం ఇష్టపడే పర్యటకులు వారిని తమ ప్రైవేటు నివాసాలు, గెస్ట్ హౌస్‌లకు పిలిపించి పాటలు పాడించుకుంటారు.

పాకిస్తాన్ థార్ ఎడారి

సంత్ నెటూ రామ్ ఆశ్రమం

మఠీ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఇస్లాంకోట్ ఉంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేకమైన నగరం కావడంతో దీని దగ్గర విమానాశ్రయం కూడా ఉంది.

ఒకప్పుడు ఇస్లాం కోట్‌ను వేపచెట్ల నగరంగా పిలిచేవారట. ఇక్కడ భారీగా వేప చెట్లు ఉండేవట. ఈ నగరం లోపల జ్ఞాని సంత్ నెటూ రామ్ ఆశ్రమం కూడా ఉంది.

థార్‌లో కరవు వచ్చినప్పుడు, అక్కడ నుంచి వెళ్లే ప్రయాణికుల దగ్గర చందాలు సేకరించిన ఆ సన్యాసి, ఆ డబ్బుతో అన్నం వండేవారని.. ఆ దారిలో వెళ్లే ప్రయాణికులను పిలిచి వారి కడుపు నింపేవారని చెబుతారు.

ఆ దారిలో వెళ్లే ప్రయాణికుల కడుపు నింపే ఆ అన్నదానం సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

పాకిస్తాన్ థార్ ఎడారి

ఆయన ఆశ్రమంలో మనుషులతోపాటు పశువులు, పక్షులకు కూడా తినడానికి, తాగడానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడకు వచ్చే ప్రయాణికులను.. మీది ఏ మతం అని అడగరు.

థార్‌లో ఎక్కువగా జనం ఉగ్లూ నుమా అనే మట్టి గుడిసెల్లో ఉంటారు. వాటి కప్పులు గడ్డితో ఉంటాయి. ఇవి వేసవిలో చల్లగా ఉంటాయి. ప్రతి ఏటా లేదా రెండేళ్లకోసారి వాటిపై తాజా గడ్డిని కప్పుతుంటారు. అంతే కాదు, సిమెంట్, మట్టితో చేసిన ఇళ్లు కూడా ఉంటాయి. వాటిని లాండీ అంటారు.

థార్ ఎడారి

ఇక్కడ సాధారణంగా బావుల నుంచే తోడే నీళ్లే వాడతారు. బావుల నుంచి నీళ్లు తోడే బాధ్యత పురుషులదైతే, ఆ నీటిని ఇంటివరకూ చేర్చే బాధ్యత మహిళలది. మారుతున్న కాలంతోపాటు ఇక్కడ ఇప్పుడు బోరు బావులు కూడా వేశారు. అందుకే ఇప్పుడు తలపై వరుసగా రెండు మూడు కుండలు పెట్టుకుని నడిచే మహిళలు అరుదుగా కనిపిస్తుంటారు.

థార్ ఎడారి

థార్ ఆతిథ్యం

థార్‌లో కరవు ఉన్నా, వర్షాలు పడి సుభిక్షంగా ఉన్నా ఇక్కడి వారు అతిథులకు స్వాగతం పలుకుతారు. ప్రయాణికులు ఏ గ్రామం దగ్గరైనా ఆగితే, వారికి సాయం చేయడం, ఆతిథ్యం ఇవ్వడం స్థానికుల సంప్రదాయంలో భాగమైపోయింది.

పురుషులు చొక్కా, సల్వార్ లేదా లుంగీ కట్టుకుంటారు. ముస్లిం మహిళలు సల్వార్, కమీజ్, హిందూ మహిళలు ఘాఘ్రా లేదా చీరలు కట్టుకుంటారు. మహిళల దుస్తులు ఎక్కువ ప్రకాశవంతమైన రంగుల్లో ఉంటాయి. కొన్నింటిపై ఎంబ్రాయిడరీ కూడా ఉంటుంది.

థార్ ఎడారి

థార్ వాతావరణం

ఇక్కడ సూర్యుడు అస్తమించగానే, రాన్ ఆఫ్ కచ్ నుంచి వచ్చే గాలులతో వాతావరణం ఆహ్లాదంగా మారుతుంది. ఆకాశంలో మెరిసే తారలు ఈ అందాన్ని రెట్టింపు చేస్తాయి.

థార్ ఎడారి

నెమళ్లు, జింకలు

థార్‌లోని ఎక్కువ గ్రామాల్లో నెమళ్లు తిరుగుతూ కనిపిస్తాయి. ఉదయం ఇళ్ల దగ్గర ధాన్యం తినడానికి వచ్చే అవి తర్వాత అడవుల్లోకి వెళ్లిపోతాయి. సాయంత్రం మళ్లీ వస్తుంటాయి. హిందువుల జనాభా ఎక్కువ ఉండే చోట నెమళ్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే దానిని వాళ్లు శ్రీకృష్ణుడు, సరస్వతికి సంబంధించినవిగా భావిస్తారు.

కొన్ని గ్రామాల్లో నెమళ్లను పట్టుకోవడం, అమ్మడంపై జరిమానా విధించడం కూడా ఉంది.

పాకిస్తాన్ థార్

థార్ ఎడారిలో జింకలు, నీల్ గాయ్ లాంటి జంతువులు కనిపిస్తాయి. భారత్ సరిహద్దుల్లో రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఇవి కనిపిస్తాయి. వీటిని వేటాడడం నిషేధం. సరిహద్దు భద్రతా దళాలు వాటిపై నిఘా పెడతాయి.

పాకిస్తాన్ థార్ ఎడారి

నంగర్ పార్కర్, జైన మందిరం

మఠీ నుంచి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో నంగర్ పార్కర్ అనే పురాతన నగరం ఉంది. ఇది కరూంఝర్ పర్వతాల ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. ఎర్ర గ్రానైట్ రాతి పర్వతాల రంగు సూర్యుడి వెలుతురుతోపాటు మారుతూ ఉంటుంది.

ఇక్కడ మతపరమైన ఎన్నో పవిత్ర ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో సాధ్డూ ధామ్ ఒకటి. అక్కడ హిందువుల మృతదేహాలను దహనం చేస్తారు.

పాకిస్తాన్ థార్

మహాభారత కాలంలో పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం చేసినపుడు ఈ కొండలపైనే ఉన్నారని కొందరు నమ్ముతారు. వారి పేరుతో ఇక్కడ నీటి పాయలు కూడా ఉన్నాయి. నంగర్ పార్కర్‌లో పర్వతాల నుంచి తీసుకొచ్చే తేనె, వనమూలికలు, కట్టెలు అమ్ముతుంటారు.

నంగర్ పార్కర్ నగరంలోను, బయటా జైన మందిరాలు కూడా ఉన్నాయి. వీటిని 12, 13వ శతాబ్దాలలో నిర్మించారు. నగరంలో ఉన్న మందిరానికి మళ్లీ మరమ్మతులు చేయిస్తున్నారు. నగరం బయట ఉన్న మందిరం మాత్రం శిథిలమైపోయింది.

పాకిస్తాన్ థార్

వీటితోపాటూ ఒక కదీమ్ మసీదు కూడా ఉంది. ఈ మసీదును గుజరాత్ ముస్లిం పాలకులు నిర్మించారని కొందరు, ఇది దిల్లీ పాలకులకు సంబంధించినదని మరికొందరు చెబుతారు.

ఈ ప్రాంతం జైన మతానికి కోట లాంటిదని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ కలీముల్లా చెప్పారు.

థార్ ఎడారి

13వ శతాబ్దంలో జైన మతం వ్యాపారంతో వృద్ధి చెందిందని, ఆర్థిక స్థితి బలోపేతం కావడంతో, వారు ఆలయాలు నిర్మించారని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)