అస్సాంలో ఆందోళనలు: పౌరసత్వ సవరణ బిల్లుపై పెరిగిన నిరసనలు... ఇద్దరు మృతి

ఫొటో సోర్స్, Getty Images
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు.
ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందినట్లు రాష్ట్ర డీజీపీ రవిప్రకాష్ బీబీసీకి చెప్పారు.
అయితే, వారు తమ ఫైరింగ్‌లో వారు చనిపోలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘర్షణల్లో ఏడుగురు పోలీసులు కూడా గాయపడ్డారు.
గువాహటి ఆస్పత్రిలో ఒకరు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు బీబీసీకి చెప్పాయి.

ఫొటో సోర్స్, Getty Images
అస్సాంలోని అన్నివర్గాల వారూ శాంతి, భద్రతలను కాపాడాలని అస్సాం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ కోరినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడిన సోనోవాల్, "ఇది మన సంస్కృతి, సామాజిక, ఆధ్యాత్మిక సంప్రదాయం. ఎప్పటిలాగే, రాబోయే కాలంలో కూడా శాంతిని కాపాడుతారని నాకు నమ్మకం ఉంది" అన్నారు.
"అస్సాంలోని కోటి-కోటిన్నర మందికి పౌరసత్వం లభించబోతోందని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న కొన్ని వర్గాలు ప్రజలను తప్పుదోవ పట్టించి, పరిస్థితిని తీవ్రంగా మార్చాలని ప్రయత్నిస్తున్నాయి. ఇది తప్పుడు ప్రచారం" అని సోనోవాల్ అన్నారు.

ఫొటో సోర్స్, Ani
బుధవారం నుంచే కర్ఫ్యూ
అస్సాంలో పౌరసత్వ సవరణ బిల్లుపై వ్యతిరేకత పెరగడంతో బుధవారం సాయంత్రం గువాహటిలో కర్ఫ్యూ విధించారు. 10 జిల్లాల్లో ఇంటర్‌నెట్ నిలిపివేశారు.
గువాహటిలో సాయంత్రం 6.15 నుంచి కర్ఫ్యూ అమలు చేశారని, అది గురువారం ఉదయం 7 గంటల వరకూ ఉంటుందని అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.
అయితే, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని గువాహటి పోలీస్ కమిషనర్ దీపక్ కుమార్ తమకు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.
అస్సాం ప్రభుత్వం దీనిపై ఒక ఆదేశం జారీ చేసింది. 10 జిల్లాల్లో సాయంత్రం 7 గంటల నుంచి 24 గంటలపాటు మొబైల్ డేటా, ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేస్తామని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ ఆదేశాల్లో రాష్ట్రంలో శాంతికి భంగం కలగకుండా, మీడియాను దుర్వినియోగం చేయకుండా, శాంతిభద్రతల పునరుద్ధరణకే ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
ఇంటర్‌నెట్ నిషేధించిన జిల్లాల్లో లఖీమ్‌పూర్, తిన్‌సుకియా, ధేమాజీ, డిబ్రూగఢ్, సరాయిదేవ్, సిబసాగర్, జోరహాట్, గోలాఘాట్, కామరూప్(మెట్రో), కామరూప్ ఉన్నాయి.
అస్సాంలో వేలాది మంది ప్రదర్శనకారులు రోడ్లపైకి వచ్చి బిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ చేశారు.
అస్సాం ప్రభుత్వం రెండు ఆర్మీ దళాలను పంపాలని డిమాండ్ చేసిందని, వారిని బోంగాయిగావ్, డిబ్రూగఢ్‌లో మోహరించారని పీటీఐ చెప్పింది.

ఫొటో సోర్స్, Ani
వ్యతిరేకత ఎందుకు
పౌరసత్వ సవరణ బిల్లు అస్సాం ఒప్పందం ఉల్లంఘంచినట్లు అవుతుందని అస్సాం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
ఆ రాష్ట్రంలో ఉన్న వారి సామాజిక, సాంస్కృతిక, భాషా గుర్తింపునకు అసోం ఒప్పందం భద్రత అందిస్తుంది..
1985 ఆగస్టు 15న భారత ప్రభుత్వం, అస్సాం ఉద్యమ నేతల మధ్య ఈ ఒప్పందం జరిగింది.
అస్సాంలో ఆరేళ్లపాటు ఉద్యమం జరిగిన తర్వాత ఈ ఒప్పందం జరిగింది. దీనికి విద్యార్థులు నేతృత్వం వహించారు.
అక్రమంగా వలసవచ్చినవారిని గుర్తించి వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
అస్సాం ఒప్పందం ప్రకారం వలస వచ్చినవారికి చట్టబద్ధత కల్పించే తేదీ 1971 మార్చి 25గా నిర్ణయించారు. కానీ పౌరసత్వ సవరణ బిల్లులో ఆ తేదీని 2014 డిసెంబర్ 31గా చెప్పారు. ఈ కొత్త కటాఫ్ తేదీ గురించే రాష్ట్రంలో ఇంత వ్యతిరేకత వస్తోంది.
పౌరసత్వ సవరణ బిల్లులో ఉన్న కొత్త కటాఫ్ డేట్ వల్ల 2014 డిసెంబర్ 31కి ముందు అస్సాం వలస వచ్చిన వారికి కూడా మార్గం సుగమం అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- సనా మారిన్: పదిహేనేళ్లప్పుడు బేకరీలో ఉద్యోగి.. 34 ఏళ్లకు దేశ ప్రధాని
- ‘రోహింజ్యా మిలిటెంట్ల చేతుల్లో హిందువుల ఊచకోత’
- గ్రౌండ్ రిపోర్ట్: మియన్మార్‌లో హిందువులను హతమార్చిందెవరు?
- 'పౌరసత్వ బిల్లుపై అమెరికా కమిషన్ ప్రకటన అసంబద్ధం' - భారత విదేశాంగ శాఖ
- హ్యూమన్ రైట్స్ డే: మానవుడిగా మీ హక్కులు మీకు తెలుసా...
- భారతదేశ కొత్త 'ముస్లిం వ్యతిరేక' చట్టం మీద ఆందోళనలు ఎందుకు?
- రోహింజ్యాల మారణహోమం ఆరోపణలపై అంతర్జాతీయ కోర్టుకు ఆంగ్ సాన్ సూచీ
- బెంగళూరులో బొమ్మ పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ
- మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్ ప్రశ్న, సమాధానం ఏంటి?
- భారత 'యూనికార్న్'లు మరీ శక్తిమంతంగా ఎదుగుతున్నాయా?
- కశ్మీర్ వేర్పాటువాది మక్బూల్ భట్: ఒక వ్యక్తిని ఉరి తీసి, జైలులోనే ఖననం చేయడం తీహార్ జైలు చరిత్రలో అదే తొలిసారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








