బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ ప్రస్తావన ఎందుకు వస్తోంది... మతం ప్రధానాంశంగా ఎలా మారింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పీటర్ బాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో జాతి, మతం చాలా పెద్ద అంశాలయ్యాయి. జాత్యహంకారం, ఇస్లాం పట్ల అపోహలు, ద్వేషం, యూదుల పట్ల వ్యతిరేకత ఉన్నాయనే ఆరోపణలు ప్రధానమంత్రి పదవికి పోటీపడుతున్న ఇద్దరు ప్రధాన నాయకులు బోరిస్ జాన్సన్, జెరిమీ కోర్బిన్‌లపై వస్తున్నాయి. హిందువుల ఓట్ల కోసం ఇద్దరూ గట్టిగా పోటీపడుతున్నారు.
ప్రచారం కీలక దశలో శుక్రవారం ప్రస్తుత ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు బోరిస్ జాన్సన్ యూదుల బేకరీని సందర్శించారు. తన ఈ కార్యక్రమంపై మీడియా దృష్టి ఉండేలా చూసుకున్నారు.
"ఆ మనిషి నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి" అని లేబర్ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్‌ను ఉద్దేశించి అక్కడున్న ఓ వ్యక్తి అరిచారు. మరో వ్యక్తి స్పందిస్తూ- "లేదంటే మేమంతా ఈ దేశం విడిచి వెళ్లిపోతాం" అన్నారు.
కొన్నేళ్ల కిందటి వరకు ఒక బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో మతాన్ని ముందుకు తీసుకొస్తారని, దాన్నో ప్రధానాంశం చేస్తారని ఎవరూ భావించి ఉండరు. అదీ ఇస్లాం పట్ల ద్వేషభావం గురించి పట్టించుకోవడం లేదని, అసలు ఆ సమస్యే లేనట్లు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని గత నెల్లో ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ ఆరోపించిన ప్రధాని ఇలా చేస్తారని అస్సలు అనుకొని ఉండరు.
యూదుమతం, ఇస్లాం, హిందూమతం బ్రిటన్ రాజకీయాల్లో కీలక తరుణంలో ప్రధానాంశాలు అవుతున్నాయి. పోలింగ్ గురువారం (డిసెంబరు12) జరుగనుంది.

ఫొటో సోర్స్, PA Media
యూదు ఓటర్లు ఎంత శాతం?
ఎన్నికల ప్రచారంలో బేకరీ సందర్శనతో బోరిస్ జాన్సన్ యూదుల ఓట్లను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకొన్నారని చెప్పలేం.
యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) జనాభాలో యూదుల శాతం ఇంచుమించు అర శాతం. ఈ వారం ప్రధాన అభ్యర్థులిద్దరి మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ, తుది ఫలితాన్ని యూదులు నిర్దేశించగల పరిస్థితైతే లేదు.
యూదు ఓటర్ల సమూహం ఒకటి లేబర్ పార్టీ నాయకుడిపై ఆందోళన వ్యక్తంచేస్తూ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడికి మద్దతు పలకడంలో ఉన్న 'సింబాలిజం' చాలా ముఖ్యమైనది.
సాధారణంగా లేబర్ పార్టీని జాత్యహంకారాన్ని వ్యతిరేకించడానికి ముందు నిలిచే పార్టీగా చూస్తుంటారు. ఈ పార్టీని చాలా మైనారిటీ గ్రూపులు సమర్థిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యాన్ని బట్టి చూస్తే,
యూదు వ్యతిరేకులంటూ లేబర్ పార్టీ నాయకత్వం, పార్టీ శ్రేణులపై వచ్చిన ఆరోపణలు పార్టీకి బాగా నష్టం కలిగించేవే.

ఫొటో సోర్స్, EPA
యూదు వ్యతిరేకత ఆరోపణలు
జెరిమీ కోర్బిన్ 2015లో లేబర్ పార్టీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అప్పట్నుంచి పార్టీ చరిత్రలోనే వామపక్ష భావజాలం అత్యధికంగా ఉన్న నాయకుడిగా ఆయన పేరు పడ్డారు. లేబర్ పార్టీలో ఎప్పుడూ పాలస్తీనా అనుకూల, కార్పొరేట్ వ్యాపార వ్యతిరేక శ్రేణులు ఉన్నాయి. కోర్బిన్ నాయకత్వంలో పార్టీలో ఇవి పెరిగాయి.
ఇజ్రాయెల్‌పై లేబర్ పార్టీ శ్రేణుల విమర్శ యూదుమత వ్యతిరేకతగా, వ్యాపార రంగంపై విమర్శ యూదు బ్యాంకర్లపై కుట్రగా పరిణమించాయా అనే వివాదాలు తలెత్తాయి.
ఈ పరిస్థితులతో యూకే యూదుల్లో ఇటీవల కాలంలో లేబర్ పార్టీకి మద్దతు పడిపోయింది. గతంలోనూ ఈ మద్దతు ఎక్కువగా ఏమీ లేదు. 2015 ఎన్నికల్లో యూదు వారసత్వమున్న ఎడ్ మిలిబాండ్ లేబర్ పార్టీకి నాయకత్వం వహించారు. ఆ ఎన్నికలకు ముందు యూదుల్లో పార్టీకి 22 శాతం మంది మద్దతు ఇచ్చేవారని అంచనా. 2017 ఎన్నికల సమయానికి జెరిమీ కోర్బిన్ నాయకత్వంలో ఉన్న ఈ పార్టీకి వీరి మద్దతు 13 శాతానికి పడిపోయింది. గత నెల్లో ఇది ఆరు శాతానికి చేరింది. అంటే నాలుగేళ్లలో మద్దతు 22 శాతం నుంచి ఆరు శాతానికి క్షీణించినట్లు అంచనా.
జ్యూయిష్ లేబర్ మూవ్‌మెంట్, కాంపెయిన్ అగెనెస్ట్ యాంటీ-సెమిటిజంల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లేబర్ పార్టీపై విచారణ మొదలుపెట్టింది.
యూదు మతానికి వ్యతిరేకులనే ఆరోపణలను జెరిమీ కోర్బిన్ చాలా సార్లు ఖండించారు. ఈ అంశానికి సంబంధించి పార్టీ శ్రేణులపై ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించలేకపోయినందుకు క్షమాపణ చెప్పారు. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు.
యూదుల ఓట్లు కోల్పోవడం లేబర్ పార్టీ అవకాశాలపై అంతగా ప్రభావం చూపే అవకాశం లేదు. అయితే యూదు వ్యతిరేకత ఆరోపణలు పార్టీకి నష్టం కలిగిస్తాయనడంలో మాత్రం సందేహం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లాం పట్ల ద్వేషం
కోర్బిన్‌పై యూదులు ఆరోపణలు చేస్తుండగా, ఆయన ప్రధాన ప్రత్యర్థి బోరిస్ జాన్సన్ ముస్లిం సంస్థల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్రిటన్ జనాభాలో ముస్లింలు ఐదు శాతానికిపైగా ఉంటారు.
బ్రిటన్ సమాజంలో ఇస్లాంపై ద్వేషాన్ని కన్జర్వేటివ్ పార్టీ సహిస్తోందని, అది పెంపొందుకు వీలు కల్పిస్తోందని, ఈ తరహా జాత్యహంకారాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి చర్యలు చేపట్టడం లేదని ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ గత నెల్లో ఆరోపించింది.
ఇస్లాంపై తన వ్యాఖ్యలతో స్వయానా ప్రధాని బోరిస్ జాన్సన్ వివాదంలో చిక్కుకున్నారు. బుర్ఖాలు ధరింపజేయడం అణచివేతకు కిందకు వస్తుందని, బుర్ఖాలు వేసుకున్నవాళ్లు బ్యాంకుల్లో దొంగతనం చేసేవాళ్లలాగా, లెటర్ బాక్సుల్లాగా కనిపిస్తారని ఒక వ్యాసంలో ఆయన వ్యాఖ్యానించారు.
కన్జర్వేటివ్ పార్టీలో 'ఇస్లామోఫోబియా' వల్ల ఎవరైనా బాధ పడి ఉంటే తమను క్షమించాలని బోరిస్ జాన్సన్ కోరారు. ఇస్లాం పట్ల పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకతపై స్వతంత్ర అంతర్గత దర్యాప్తు క్రిస్మస్‌లోగా మొదలవుతుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ముస్లింలలో కన్జర్వేటివ్‌లకు మద్దతు తక్కువ. 2017 ఎన్నికల్లో దాదాపు 87 శాతం మంది ముస్లింలు లేబర్ పార్టీకి ఓటేశారని అంచనా. కన్జర్వేటివ్ నాయకులు ప్రచారంలో తమ వ్యాఖ్యలతో ముస్లింలలో మద్దతును మరింత కోల్పోతున్నారు.
ఇస్లామోఫోబియాకు కారణమయ్యే, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే, కశ్మీర్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ 'దాడి'ని సమర్థించే కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిస్తూ ముస్లింలకు లండన్లోని బ్రిటిష్ ముస్లిం లాబీ, పౌర హక్కుల గ్రూపు 'ముస్లిం పబ్లిక్ అఫైర్స్ కమిటీ(ఎంపీఏసీ)' వాట్సప్ సందేశాలు పంపిస్తున్నట్లు బజ్‌ఫీడ్ వెబ్‌సైట్ తెలిపింది.
ఈ సందేశాలపై విమర్శలు వస్తున్నాయి. ఇవి విభజన రాజకీయాలని, నిధులు, డేటా భద్రతకు సంబంధించిన ఎన్నికల నిబంధనలకు విరుద్ధమనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై సమాధానమిచ్చేందుకు తమకు తగిన అవకాశమివ్వడం లేదని ఎంపీఏసీ పేర్కొంటోంది.
ఈ ఎన్నికల్లో ఇతర వాట్సప్ సందేశాలపైనా విమర్శలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, EPA
హిందువుల ఓట్లు
యూదు, ముస్లిం ఓటర్లలో పార్టీల వారీ మద్దతులో పెద్ద మార్పేమీ లేదు. అలాంటి మార్పు బ్రిటన్ హిందువుల్లో కనిపిస్తోంది.
యూకేలో పది లక్షల మంది హిందువులు ఉన్నారు.
చాలా మైనారిటీ గ్రూపుల్లాగే హిందువులు కూడా గతంలో లేబర్ పార్టీకే మద్దతు ఇస్తూ వచ్చారు. కొన్ని తీవ్రస్థాయి, వివాదాస్పద ప్రచార కార్యక్రమాల ప్రభావంతో హిందువులు కన్జర్వేటివ్ పార్టీ వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తోంది.
2010 నుంచి 2017 మధ్య హిందువుల్లో కన్జర్వేటివ్ పార్టీకి మద్దతు దాదాపు 30 శాతం నుంచి 40 శాతానికి చేరింది. ఇప్పుడు ఇది మరింత పెరిగే అవకాశముంది.
'ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ' ప్రతినిధులు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ- బ్రిటన్ హిందువులు లేబర్ పార్టీకి ఓటేయకుండా చూసేందుకు తాము కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థులతో కలసి పనిచేస్తున్నామని చెప్పారు.
జమ్మూకశ్మీర్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వయంప్రతిపత్తిని రద్దుచేసి, రాష్ట్రాన్ని విభజించి కేంద్ర ప్రభుత్వ నియంత్రణను పెంచుకోవడాన్ని లేబర్ పార్టీ విమర్శించడమే బీజేపీ తాజా వైఖరికి ప్రధాన కారణం.
పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని లేబర్ పార్టీ అడ్డగోలుగా సమర్థించిందని, అందువల్ల ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి ఓటేయండని పిలుపునిస్తూ బ్రిటన్ వ్యాప్తంగా హిందువులకు వాట్సప్ సందేశాలు వెళ్తున్నాయి.
ఈ సందేశాలను లేబర్ పార్టీ నేతలు విమర్శించారు. మద ఛాందసవాదుల విభజన రాజకీయ వ్యూహాలకు ప్రభావితం కావొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కశ్మీర్ విషయంలో బ్రిటన్ హిందువులతో పార్టీ బంధాన్ని మెరుగుపరచుకొనేందుకు శతధా ప్రయత్నిస్తున్నారు.
బ్రిటన్ ఎన్నికల్లో బ్రెగ్జిట్ అంశం దృష్ట్యా ముందు నుంచే ఒక చీలిక ఉన్నట్లు కనిపిస్తోంది.
బ్రిటన్ ఎన్నికల్లో మతం అరుదుగా మాత్రమే చర్చకు వచ్చేది. తమ రాజకీయాలు దేవుడి చుట్టూ ఉండవని మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రతినిధి అలిస్టైర్ క్యాంప్‌బెల్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆయన మాట బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఇప్పుడు మాత్రం మతం ఒక ప్రధానాంశంగా వచ్చి చేరింది. ఎన్నికల ప్రచారం తీవ్రతను ఇది మరింతగా పెంచేసింది.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ ఎన్కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- జస్టిస్ సుదర్శన రెడ్డి: ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్కౌంటర్ చేయడం సాధ్యమేనా?
- 'పౌరసత్వ బిల్లుపై అమెరికా కమిషన్ ప్రకటన అసంబద్ధం' - భారత విదేశాంగ శాఖ
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- బ్రెగ్జిట్: ఎందుకింత సంక్లిష్టం.. ఈయూ, బ్రిటన్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి
- తెలుగు భాష ఎప్పటిది? ద్రవిడ భాషలు ఎన్నాళ్ల నాటివి?
- బ్యాంకుల విలీనం: సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కిస్తుందా? - అభిప్రాయం
- ఉదారవాదానికి కాలం చెల్లిందా? పుతిన్ మాట నిజమేనా?
- పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనా? శరణార్థికి, చొరబాటుదారుడికి అమిత్ షా ఇచ్చిన నిర్వచనం సరైనదేనా?
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...
- సనా మారిన్: పదిహేనేళ్లప్పుడు బేకరీలో ఉద్యోగి.. 34 ఏళ్లకు దేశ ప్రధాని
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








