ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో నల్లజాతి బ్రిటన్ విద్యార్థులకు తొలిసారిగా స్కాలర్‌షిప్ పథకం

బ్రిటన్లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వెనకబడిన వర్గాలకు చెందిన నల్లజాతి బ్రిటన్ విద్యార్థుల కోసం తొలిసారిగా స్కాలర్‌షిప్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన వ్యాపారవేత్త ఆర్లన్ హామిల్టన్ నిధులు సమకూరుస్తారు.
'ఆక్స్‌ఫర్డ్-ఆర్లన్ హామిల్టన్ అండ్ ఎర్లీన్ బట్లర్ సిమ్స్ స్కాలర్‌షిప్' అనే ఈ ఉపకారవేతన పథకం 2020లో ప్రారంభమై, మూడేళ్లు కొనసాగుతుంది.
దీనికి అర్హత సాధించే విద్యార్థులకు మూడేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ చదవడానికి ఫీజులు, నివాస వ్యయాలను చెల్లిస్తారు.

ఫొటో సోర్స్, AMANDA EDWARDS
వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన ఆర్లన్ హామిల్టన్, వెనకబడిన వర్గాలకు చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్తల స్టార్టప్‌లకు నిధులు అందించేందుకు 2015లో 'బ్యాక్‌స్టేజ్ కాపిటల్' ఏర్పాటు చేశారు.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం చరిత్రలోనే అత్యధిక స్థాయిలో ఈ ఏడాది జూన్‌లో జాతిపరమైన మైనారిటీ విద్యార్థులకు సీట్లు ఇచ్చినట్లు యూనివర్శిటీ తెలిపింది.
యూజీ విద్యార్థుల్లో 18 శాతం మంది జాతిపరమైన మైనారిటీ విద్యార్థులని వర్సిటీ చెప్పింది. 61 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారని వివరించింది.
సమాజంలోని అన్ని వర్గాలకూ అవకాశాలు కల్పించడం లేదని, పలు వర్గాలను విస్మరిస్తోందంటూ గతంలో బ్రిటన్ విద్యాశాఖ మాజీ మంత్రి డేవిడ్ లామీ నుంచి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం విమర్శలు ఎదుర్కొంది.

ఫొటో సోర్స్, Handout
అమెరికాలో మరింత మంది నల్లజాతి విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు తోడ్పడే కార్యక్రమానికి తాను నిధులు అందించనున్నానని, ఆక్స్‌ఫర్డ్ స్కాలర్‌షిప్ ఈ కార్యక్రమంలో భాగమని ఆర్లన్ హామిల్టన్ చెప్పారు.
ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోలేకపోయిన విద్యార్థులకు తాను అండగా నిలవాలనుకొంటున్నానని ఆమె తెలిపారు.
చదువుకునే రోజుల్లో అద్దె ఎలా కట్టాలి లాంటి సమస్యల గురించి తాను ఆలోచించేదానినని, అలాంటి పరిస్థితులు ఇప్పటి విద్యార్థులకు ఉండకూడదని, వారు చదువులపైనే దృష్టి కేంద్రీకరించాలని ఆర్లన్ హామిల్టన్ వ్యాఖ్యానించారు.
"ఈ విద్యార్థులు వారిని నడిపించే, వారికి జీవితాన్ని ఇచ్చే వాటిపైనే దృష్టి కేంద్రీకరించాలి" అని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు.
ఈ ఉపకారవేతనం కింద- ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకునేందుకు ప్రతి విద్యార్థికి మూడు వేల పౌండ్ల చొప్పున ఇంటర్న్‌షిప్ గ్రాంట్ కూడా అందిస్తారు.
నల్లజాతి ఆఫ్రికన్, కరీబియన్ విద్యార్థులు లేదా నల్లజాతి, మరో జాతి మిశ్రమ మూలాలున్న విద్యార్థులు ఈ ఉపకారవేతనానికి అర్హులు.
దరఖాస్తుదారుల సామాజిక ఆర్థిక స్థితిని, వారి ప్రాంతంలో విద్యార్థులు సాధారణంగా పైచదువులకు వెళ్తారా, లేదా లాంటి అంశాలను పరిశీలించి యూనివర్శిటీ స్కాలర్‌షిప్ ఇస్తుంది.
ఇవి కూడా చదవండి:
- నాడూ, నేడూ.. పొలాల్లోనే పాఠశాల... చెట్ల కింద స్పెషల్ క్లాసులు... ఎక్కడో కాదు ఆంధ్రాలోనే
- భారత ఆహారం ఘోరమన్న అమెరికా ప్రొఫెసర్.. సోషల్ మీడియాలో వాడివేడి చర్చ
- గూగుల్ పిక్సెల్ 4: 'రాడార్ ఫీచర్' కారణంగా భారతదేశంలో విడుదల రద్దు
- యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్... వీటి భవిష్యత్తు ఏమిటి?
- బంగారు నగలకు 'హాల్‌మార్క్' తప్పనిసరి చేసిన కేంద్రం... అసలు ఈ మార్క్ ఎందుకోసం?
- ‘దిశ’ అత్యాచారం: "నాకు చాలా బాధేసింది.. ఆ బాధితురాలు కూడా సాటి ఆడదే" - ఓ నిందితుడి భార్య
- యూజర్ల డేటాను రహస్యంగా సేకరించి చైనాకు పంపిందంటూ టిక్‌టాక్‌పై దావా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








