గుర్రాలపై పోలీసులు.. నేలపై నల్లజాతీయుడు.. చేతులు కట్టేసి నడిపించుకుంటూ తీసుకెళ్లడంపై విమర్శలు

ఫొటో సోర్స్, TWITTER @ADRBELL / ANONYMOUS AUTHOR
"ఇది సిగ్గుపడాల్సిన చర్య."
ఈ మాటలన్నది టెక్సాస్‌లోని గాల్వెస్టన్ నగర పోలీస్ చీఫ్ వెర్నన్ హేల్.
ఇద్దరు పోలీస్ అధికారులు గుర్రాలపై వెళ్తూ ఓ నల్లజాతి వ్యక్తిని తాడుతో చేతులు వెనక్కి కట్టేసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెర్నన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఇంకా బానిసత్వాన్ని గుర్తుకుతెస్తోందంటూ సోషల్ మీడియాలో యూజర్లంతా ఈ ఫొటోపై విమర్శలు గుప్పించారు.
కొన్ని సందర్భాల్లో ఇలా చేయడం తప్పుకాదు అంటూ వెర్నన్ దీన్ని సమర్థించారు కానీ ఇలా ఎందుకు చేశారనేదానిపై ఆ ఫొటోలో ఉన్న పోలీసుల దగ్గర సరైన వివరణ లేదని వెల్లడించారు.
ఇది దురుద్దేశంతో చేసిన చర్య కాదన్న వెర్నన్ ఇలాంటి పద్ధతులు ఇకముందు అమలు చేయకుండా నిబంధనల్లో మార్పులు చేసినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసులేమన్నారు?
గుర్రాలపై ఉన్న పోలీస్ అధికారులిద్దరూ డొనాల్డ్ నీలీ అనే వ్యక్తిని ఓ ప్రైవేట్ ఆస్తిని ఆక్రమించారనే ఆరోపణలపై అరెస్టు చేశారని గాల్వెస్టన్ పోలీస్ విభాగం ప్రకటించింది. అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తుండగా తీసిన ఫొటో అది.
అయితే అతడిని తాళ్లతో కట్టలేదని, సంకెళ్లు వేసి, దానికి ఓ తాడు కట్టామని పోలీసులు స్పష్టం చేశారు.
"దీనిపై వచ్చే విమర్శలను అర్థం చేసుకున్నాం. ఇలాంటి విధానాలకు స్వస్తి చెప్పడం అవసరం. అతడిని తీసుకురావడానికి ఏదైనా వాహనం ఉపయోగించి ఉండాల్సింది" అని పోలీస్ అధికారులు తెలిపారు.
ఇకపై గుర్రాలపై తిరుగుతూ విధులు నిర్వహించే అధికారులకు సంబంధించిన శిక్షణ, విధివిధానాల్లో మార్పులు చేస్తామని పోలీస్ చీఫ్ తెలిపారు.
ఈ ఘటనపై డొనాల్డ్ నీలీకి వారు క్షమాపణలు చెప్పారు.
ఈ వ్యవహారంపై మాట్లాడటానికి బెయిల్‌పై విడుదలైన నీలీని సంప్రదించేందుకు ప్రయత్నించినా అతడు అందుబాటులోకి రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వ్యక్తి ఈ ఫొటోను తీశాడని గాల్వెస్టన్ కౌంటీ కొయిలేషన్ ఫర్ జస్టిస్ సంస్థ డైరెక్టర్ లియాన్ ఫిలిప్స్ బీబీసీతో చెప్పారు.
బానిసత్వ చరిత్ర ఉన్న గాల్వెస్టన్ నగర పౌరుడిగా ఈ ఘటనపై వ్యాఖ్యానించడం చాలా కష్టం. ఇదో మూర్ఖపు చర్య అని ఆయన అన్నారు. నీలీ స్థానంలో ఓ తెల్లజాతీయుడున్నా వారు అలానే ప్రవర్తించి ఉండేవారన్నారు.
నీలీ మానసిక వ్యాధిగ్రస్తుడని, ఎంత సమయమైనా ఓ వాహనం వచ్చేవరకు పోలీస్ అధికారులు వేచి ఉండాల్సిందని ఫిలిప్స్ అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ వ్యవహారంలో ఎలాంటి నిబంధనలూ ఉల్లంఘించలేదని చెప్పిన ఫిలిప్స్... అసలు అదుపులో తీసుకున్న వ్యక్తిని తరలించేందుకు ఉన్న విధివిధానాలేంటని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి.
- బానిసత్వంలో మగ్గిన నల్ల జాతీయులకు పరిహారమే పరిష్కారమా...
- గాంధీపై అంబేడ్కర్ చేసిన ఆరోపణల్లో నిజమెంత?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్... ఉత్తమ తెలుగు చిత్రంగా 'మహానటి'
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఆ 132 గ్రామాల్లో అసలు ఆడపిల్లలే పుట్టలేదా...
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








