కీర్తి సురేశ్ - మహానటి: జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్.. ఉత్తమ తెలుగు చిత్రంగా 'మహానటి' - #నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్

మహానటిలో కీర్తి సురేశ్

ఫొటో సోర్స్, KEERTHY SURESH/MAHANATI

ఫొటో క్యాప్షన్, మహానటిలో కీర్తి సురేశ్

జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా 'మహానటి’ ఎంపికైంది. 2018 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర పురస్కారాలను శుక్రవారం దిల్లీలో ప్రకటించారు.

మహానటి చిత్రంలో నటనకు కీర్తికి ఉత్తమ నటి పురస్కారం లభించింది.

‘కాస్ట్యూమ్స్’ విభాగంలోనూ మహానటి అవార్డు దక్కించుకొంది.

మరో మూడు తెలుగు చిత్రాలకు ఇతర విభాగాల్లో అవార్డులు లభించాయి.

మహానటి చిత్రంలో దుల్కర్ సల్మాన్, కీర్తి సురేశ్

ఫొటో సోర్స్, KEERTHY SURESH/MAHANATI

ఫొటో క్యాప్షన్, మహానటి చిత్రంలో దుల్కర్ సల్మాన్, కీర్తి సురేశ్

చి. ల. సౌ. చిత్రానికి స్క్రీన్ ప్లే (ఒరిజినల్) విభాగంలో రాహుల్ రవీంద్రన్ పురస్కారానికి ఎంపికయ్యారు.

‘అ’ చిత్రానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్టుగా రంజిత్ అవార్డు దక్కించుకున్నారు.

రంగస్థలం చిత్రానికి 'ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్ రీరికార్డిస్ట్‌’గా పనిచేసిన రాజాకృష్ణన్ ఎంఆర్ ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగంలో ఒక పురస్కారానికి ఎంపికయ్యారు.

మహానటి కోసం పనిచేసిన ఇంద్రాక్షి పట్నాయక్, గౌరంగ్ షా, అర్చనా రావ్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా పురస్కారం దక్కించుకున్నారు.

మరాఠీ చిత్రం 'నాల్' దర్శకుడు సుధాకర్ రెడ్డి యక్కంటి ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ నూతన దర్శకుడిగా ఇందిరాగాంధీ అవార్డుకు ఎంపికయ్యారు.

రాహుల్ రవీంద్రన్

ఫొటో సోర్స్, fACEBOOK/OfficialRahulRavindran

ఫొటో క్యాప్షన్, రాహుల్ రవీంద్రన్

ఉత్తమ నటులు ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా గుజరాతీ సినిమా 'హెలారో', ప్రజాదరణ పొందిన ఉత్తమ వినోదాత్మక చిత్రంగా హిందీ చిత్రం బధాయీ హో (హిందీ) ఎంపికయ్యాయి.

జాతీయ ఉత్తమ నటులుగా ఆయుష్మాన్ ఖురానా(అంధాధున్), విక్కీ కౌశల్(యూరీ-ద సర్జికల్ స్ట్రైక్) సంయుక్తంగా ఎంపికయ్యారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

యూరి- ద సర్జికల్ స్ట్రైక్ చిత్రానికిగాను ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా పురస్కారం దక్కించుకున్నారు. ఆయనకు రెండున్నర లక్షల రూపాయల నగదు, స్వర్ణ కమలం బహుమతిగా లభిస్తాయి.

ఉత్తమ నటికి రూ.50 వేల నగదు, రజత కమలం బహూకరిస్తారు. ఉత్తమ నటులకు ఇద్దరికీ కలిపి రూ.50 వేల నగదు, రజత పతకం బహూకరిస్తారు.

"సినిమాలో చాలా వరకు పాత్రలు రచయిత చేతిలో జన్మించి కాగితాలపై పుడతాయి. కానీ 'మహానటి' పాత్ర జీవితపు తెరపై వెలిగిన పాత్ర. ఆ నిజ జీవిత పాత్రని పోషించడం ఒక సాహసమే" అని కీర్తి సురేష్ తాను ఈ పాత్రని పోషించడానికి అంగీకరించే ముందు పడిన అంతర్మథనం గురించి నిరుడు మేలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

అలనాటి ప్రఖ్యాత నటి సావిత్రి జీవిత కథే మహానటి. సావిత్రి ఐదు భాషల్లో నటించారు.

మహానటి పోస్టర్

ఫొటో సోర్స్, Facebook

ఆమె ఒక నటి మాత్రమే కాదు, ఒక దర్శకురాలు, గాయని, కార్ రేసర్, ఫొటోగ్రాఫర్, ఒక మాతృమూర్తి కూడా.

ఆమె జీవితాన్ని తెరకెక్కించేందుకు చేసిన ప్రయత్నమే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'మహానటి' సినిమా.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రిగా, నాగ చైతన్య ఏఎన్నార్‌గా, సమంత జర్నలిస్ట్ మధురవాణిగా నటించారు.

కీర్తి సురేశ్

ఫొటో సోర్స్, KEERTHY SURESH/MAHANATI

సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ తనను ఈ పాత్రలో నటించమని అడిగినప్పుడు, ఒక నిర్ణయానికి వెంటనే రాలేక, ఆ పాత్రకి తగిన న్యాయం చేయగలనో లేదోనని చాలా సంశయానికి గురయ్యానని కీర్తి చెప్పారు.

ఈ పాత్ర తనని ఎలా వరించిందో వివరిస్తూ, తొడరి తమిళ సినిమాలో అమాయకత్వం ఉట్టిపడే తన నటన చూసిన అశ్విన్ సావిత్రి సినిమాలో నటించడానికి తనని సంప్రదించారని ఆమె తెలిపారు.

మహానటి కథ విన్న తరవాత కాదనలేకపోయానని, నటించాలని నిర్ణయం తీసుకున్న తరువాత ఆవిడ పాత్రకి నిజంగా న్యాయం చేకూర్చగలనో లేదోనని చాలా ఆలోచించాల్సి వచ్చిందని కీర్తి వివరించారు.

పోస్టర్

ఫొటో సోర్స్, twitter/@airnewsalerts

ఫొటో క్యాప్షన్, అంధాధున్’

ఇతర విభాగాల్లో విజేతలు వివరాలు

ఇవి 66వ జాతీయ సినిమా పురస్కారాలు.

సామాజిక అంశాలపై రూపొందిన ఉత్తమ చిత్రంగా ప్యాడ్‌మన్(హిందీ), పర్యావరణ పరిరక్షణపై తీసిన ఉత్తమ చిత్రంగా పానీ(మరాఠీ) అవార్డులు దక్కించుకున్నాయి.

జాతీయ సమగ్రతపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నర్గీస్ దత్ పురస్కారానికి కన్నడ చిత్రం 'ఒందల్లా ఎరడల్లా' ఎంపికైంది.

  • ఉత్తమ సహాయ నటుడు - స్వానంద్ కిర్‌కిరీ (చుంబక్ - మరాఠీ)
  • ఉత్తమ సహాయ నటి - సురేఖా సిక్రి (బధాయీ హో-హిందీ)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్)- రాహుల్ రవీంద్రన్ (చి.ల.సౌ. - తెలుగు),
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే (అడాప్టెడ్): శ్రీరామ్ రాఘవన్, అరిజిత్ బిశ్వాస్, యోగేశ్ చండేకర్, హేమంత్ రావ్, పూజా లాధా సూర్తి(అంధాధున్-హిందీ)
  • ఉత్తమ మాటల రచయిత: చుర్నీ గంగూలీ (తారిఖ్ -బెంగాలీ)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ - ఎంజే రాధాకృష్ణన్ (ఓలు- మలయాళం)
  • ఉత్తమ ఎడిటింగ్ - నాగేంద్ర కె.ఉజ్జయిని (నాతిచరామి-కన్నడ)
అరిజిత్ సింగ్

ఫొటో సోర్స్, Facebook/@ArijitSingh

ఫొటో క్యాప్షన్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఎంపికైన అరిజిత్ సింగ్
  • ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు) - సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
  • ఉత్తమ సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం) - శాశ్వత్ సచ్ దేవ్ (యూరి-ద సర్జికల్ స్ట్రైక్)
  • ఉత్తమ గేయరచయిత - మంజునాథ ఎస్ (‘మాయావి మానవే’ గీతం, నాతిచరామి)
  • ఉత్తమ నేపథ్య గాయిని - బిందు మాలిని(నాతిచరామి-కన్నడ)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు - అరిజిత్ సింగ్ (‘బిన్‌తే దిల్ మిస్రియా మే’ గీతం, పద్మావత్)
  • ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - సృష్టి క్రియేటివ్ స్టూడియో(‘అ’ చిత్రం- తెలుగు), యూనిఫై మీడియా (కేజీఎఫ్ చిత్రం- కన్నడ)
  • స్పెషల్ జ్యూరీ అవార్డ్ - హెలారో (గుజరాతీ)
  • ఉత్తమ సినిమా అనుకూల రాష్ట్రం- ఉత్తరాఖండ్

నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ చిత్రాలుగా విభా బక్షి దర్శకత్వంలో వచ్చిన 'సన్ రైజ్', అజయ్ బేడి, విజయ్ బేడి దర్శకత్వంలో రూపొందిన 'ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ ఫ్రాగ్స్' ఎంపికయ్యాయి.

ఉత్తమ సైన్స్ అండ్ టెక్నాలజీ చిత్రంగా ‘జీడీ నాయుడు: ది ఎడిసన్ ఆఫ్ ఇండియా’ ఎంపికైంది. దీనికి రంజిత్ కుమార్ దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)